ప్ర‌జాకోర్టు తీర్పుపై మ‌హానాడులో చ‌ర్చ లేదా?

రాజ‌కీయ నాయ‌కులు, రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్‌ను తేల్చేది ప్ర‌జాకోర్టులే. ఎందుకంటే ప్ర‌పంచంలోనే అతి గొప్ప ప్ర‌జాస్వామ్య దేశం మ‌న‌ది. రాజ‌కీయ పార్టీలు, నాయ‌కుల త‌ల‌రాత మార్చేది ప్ర‌జ‌లే. అందుకే ఓట‌ర్ల‌ను దేవుళ్ల‌తో పోలుస్తారు. ప్ర‌జాతీర్పుతో అధికార పీఠం నుంచి టీడీపీ గ‌ద్దె దిగి ఏడాదైంది. ప్ర‌జాకోర్టులో ఘోర ఓట‌మి త‌ర్వాత మొట్ట మొద‌టిసారిగా టీడీపీ వార్షిక మ‌హానాడు నిర్వ‌హించ‌నుంది. రెండు రోజుల పాటు మ‌హానాడు స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి.

లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను దృష్టిలో పెట్టుకుని అన్‌లైన్‌లో మ‌హానాడు సమావేశాలు నిర్వ‌హించేందుకు ప్ర‌తిప‌క్ష టీడీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొంది. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సమావేశాలు నిర్వ‌హిం చ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రెండురోజుల పాటు నిర్వ‌హించే స‌మావేశాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చించే అంశాల గురించి పార్టీ వివ‌రాలు వెల్ల‌డించింది. ప్ర‌ధానంగా జ‌గ‌న్ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌పై చ‌ర్చించేందుకు నిర్ణ‌యించారు.

ఎంతో న‌మ్మ‌కంతో విభ‌జిత రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబును ఏపీ ప్ర‌జ‌లు ఎన్నుకున్నారు. త‌న పాల‌నానుభ‌వంతో ఏపీని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తార‌ని ఏపీ ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆశ‌ల‌ను అడియాస‌లు చేశారు. దాని ప‌ర్య‌వ‌సాన‌మే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేవ‌లం 23 అసెంబ్లీ, 3 పార్ల‌మెంట్ స్థానాల‌కు ప్ర‌జ‌లు ప‌రిమితం చేశారు. ప్ర‌జా ఆకాంక్ష‌ల‌కు విరుద్ధంగా ప‌ని చేసిన చంద్ర‌బాబుకు ఏపీ ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఓట‌మిపై మేధోమ‌థ‌నం, అంత‌ర్మ‌థ‌నం చేసుకో వాల్సిన టీడీపీ...ఇప్ప‌టికీ ఆ దిశ‌గా ఆలోచించ‌కుండా అధికార పార్టీపైనే నిందారోప‌ణ‌ల‌కు కార్యాచ‌ర‌ణ చేప‌ట్టింది.

జ‌గ‌న్ అరాచక పాలనకు ఏడాది-ప్రమాదంలో ప్రజాస్వామ్యం, అన్నదాత వెన్నువిరిచిన సర్కార్‌, విద్యుత్‌ చార్జీల పెంపు-మాట తప్పిన జగన్‌, సంక్షోభంలో సాగునీటి రంగం-తమ వారికే కాంట్రాక్టుల పట్టం, అక్రమ కేసులు- ఆస్తుల విధ్వంసం-పోలీసువ్యవస్థ దుర్వినియోగం, ప్రజా రాజధాని అమరావతి-మూడు ముక్కలాట, బలిపీఠంపై బడుగుల సంక్షేమం-34 పథకాల రద్దు, టీటీడీ ఆస్తుల అమ్మకం అంశాలపై తొలి రోజు చర్చ ఉంటుంద‌ని టీడీపీ వెల్ల‌డించింది.

టీడీపీ, దాని అనుబంధ ఎల్లో మీడియా జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఎన్ని విమ‌ర్శ‌లైనా చేయొచ్చు కానీ, జ‌గ‌న్ త‌న మ్యానిఫెస్టోను ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. క‌రోనా లాంటి విప‌త్తు స‌మ‌యంలోనూ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు శ్రీ‌కారం చుట్టిన ఏకైక రాష్ట్రం ఏపీనే అంటే అతిశ‌యోక్తి కాదు. ఇదే జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కాన్ని పెంచింది. మాట ఇస్తే క‌ట్టుబ‌డి ఉంటాడ‌నే భ‌రోసాను ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ క‌ల్పించారు.

అలాగే ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తి-మూడు ముక్క‌లాట అనే టాపిక్‌పై చ‌ర్చించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. మ‌రి మిగిలిన ప్రాంతాల ఆకాంక్ష‌ల మాటేమిటి? ఇక్క‌డే టీడీపీ అట్ట‌ర్ ప్లాప్ అవుతోంది. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఆశల‌ను, అభిప్రాయాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే అక్క‌డి ప్ర‌జ‌లు ఎన్నిక‌ల్లో ఆద‌రించ‌లేద‌ని ఇప్ప‌టికీ గుర్తించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. టీటీడీ నిర‌ర్థ‌క ఆస్తుల గుర్తింపు, వాటి అమ్మ‌కానికి త‌మ పాల‌న‌లోనే నిర్ణ‌యాలు, తీర్మానాలు చేసిన సంగ‌తి జ‌నానికి తెలియ‌ద‌నుకుని, మ‌ళ్లీ వాటిపై చ‌ర్చేంత ఆత్మ‌వంచ‌న‌, ప‌ర నింద మ‌రొక‌టి ఉండ‌దు.

రెండోరోజు స‌మావేశంలో సాగునీటి ప్రాజెక్టుల‌పై తీర్మానం, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఛిన్నాభిన్నం, ఎల్జీ పాలిమ‌ర్స్ దుర్ఘ‌ట‌న, విద్య‌. వైద్య రంగాలు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. రాయ‌ల‌సీమ‌తో పాటు నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌కు సాగు, తాగునీటిని అందించే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని చేప‌ట్టిన జ‌గ‌న్ స‌ర్కార్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా ఎన్ని మాట్లాడినా బాబుకు రాజ‌కీయంగా క‌లిసి వ‌చ్చే అవ‌కాశాలు లేవు. ఇప్ప‌టికే జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకొచ్చిన జీవో 203పై ప్ర‌తిప‌క్ష నేత‌గా మౌనం పాటించడంతో సీమ‌తో పాటు ఆ రెండు జిల్లాలు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నాయి. ఎల్జీ పాలిమ‌ర్స్ దుర్ఘ‌ట‌న బాధితుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ క‌నీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక సాయం అందించింది.

దీనిపై రాజ‌కీయం చేయాల‌నుకున్న బాబు...గ‌తంలో తాను చేసిన పాపాల‌ను మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రించి అభాసుపాల‌య్యారు. కోటి రూపాయ‌లు ఇస్తే చ‌నిపోయిన వాళ్లు వ‌స్తారా అని అన‌డంతో బాబుపై ఏపీ స‌మాజం భ‌గ్గుమంది. పుష్క‌రాల్లో బాబు ప్రచార యావ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన 29 మందికి ఏమిచ్చావ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా నిల‌దీశారు. అలాగే ఏపీలో ఆంగ్ల విద్య‌ను ప్ర‌వేశ పెట్టాల‌నే స‌ర్కార్ ప్ర‌య‌త్నాన్ని అడ్డుకోవ‌డం ద్వారా ద‌ళితులు, గిరిజ‌న‌లు, మైనార్టీ, వెనుక‌బ‌డిన కులాల ఆగ్ర‌హానికి గురైన విష‌యాన్ని విస్మ‌రించొద్దు. అలాగే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ప‌థ‌కం కిందికి దాదాపు 800 రోగాలు అద‌నంగా చేర్చి పేద‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ అండ‌గా నిలిచిన వైనాన్ని విస్మ‌రించొద్దు.

అస‌లు మ‌హానాడులో తమ ఓట‌మిపై  ప్ర‌ధానంగా చ‌ర్చించాల్సి పోయి, ఇత‌ర‌త్రా అంశాల‌ను తెర‌పైకి తేవ‌డం వృథా ప్ర‌యాసే. ఎందుకంటే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి ఏడాదే అయింది. ఈ ఒక్క ఏడాదిలోనే అద్భుతాలు సృష్టించ‌లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించ‌డం వ‌ల్ల జ‌గ‌న్ స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త లేదా టీడీపీపై సానుకూల‌త వ‌చ్చే అవ‌కాశాలు ఎంత మాత్రం లేవు. ఎందుకంటే వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మాదిరిగానే ఆయ‌న త‌న‌యుడు కూడా ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళుతాడ‌నే అభిప్రాయం జ‌నాల్లో బ‌లంగా ఉంది. ఆ న‌మ్మ‌కాన్ని పోగొట్టుకునే శ‌క్తి సామ‌ర్థ్యాలు ఒక్క జ‌గ‌న్‌కే ఉన్నాయి. ఎందుకంటే న‌వ‌ర‌త్నాల పేరుతో రూపొందించిన మ్యానిఫెస్టో అమ‌లు  ఏ రోజైతే అట‌కెక్కుతుందో, ఆ క్ష‌ణం నుంచి జ‌గ‌న్ ప‌త‌నం ప్రారంభ‌మ‌వుతుంది.

ఇప్ప‌టి వ‌ర‌కైతే 90 శాతం సంక్షేమ ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ అమ‌లు చేశార‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు, ఎల్లో మీడియా నుంచే ప్ర‌శంస‌లు అందుకున్న విష‌యం తెలిసిందే. అలాంట‌ప్పుడు జ‌గ‌న్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌ల కోసం విమ‌ర్శ‌లు చేశామ‌నే ఆత్మ సంతృప్తి త‌ప్ప‌, టీడీపీ గ‌త వైభ‌వాన్ని తెచ్చుకునేందుకు ఎంత మాత్రం ప‌నికి రావు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో టీడీపీ బ‌ల‌మైన ఓటు బ్యాంకు అయిన బీసీల‌ను జ‌గ‌న్ త‌న వైపు తిప్పుకున్నార‌నే వాస్త‌వాన్ని టీడీపీ విస్మ‌రించ‌వ‌ద్దు.

ఇంకో ప్ర‌ధాన విష‌యం గురించి ఈ మ‌హానాడులో చ‌ర్చించాల్సి ఉంది. చంద్ర‌బాబు వ‌య‌సు 71 ఏళ్లు. రోజురోజుకూ వ‌య‌సు పైబ‌డ‌డ‌మే త‌ప్ప త‌గ్గేది కాదు. బాబు త‌ర్వాత టీడీపీ ర‌థ‌సార‌థి ఎవ‌ర‌నేది భేతాళ ప్ర‌శ్న‌లాగా త‌యారైంది. మంచోచెడో లోకేశ్‌కు పార్టీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. బాబు త‌న అనుభ‌వాన్నంతా రంగ‌రించి వెనుక నుంచి స‌ల హాలు, సూచ‌న‌లు ఇస్తూ లోకేశ్‌ను మంచి నాయ‌కుడిగా తీర్చిదిద్దాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఎంతో మంది నాయ‌కుల‌ను స‌మా జానికి అందించిన పార్టీకి భ‌విష్య‌త్ లీడ‌ర్ ఎవ‌రనే ప్ర‌శ్న రావ‌డం శ్రేయ‌స్క‌రం కాదు.

కావున రెండు రోజుల పాటు నిర్వ‌హించే మ‌హానాడులో స్వ‌యం స్తుతి, ప‌ర‌నింద‌ల‌కు పోకుండా నిర్మాణాత్మ‌క ఆత్మ శోధ‌న జ‌ర‌గాలి. ఆత్మ వంచ‌న ఆత్మ‌హ‌త్యా స‌దృశ్యం. ప్ర‌జాకోర్టులో ప్ర‌జ‌ల్ని మేనేజ్ చేయ‌డం అంత సుల‌భం కాదు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల చేతిలో ఘోర ఓట‌మి పాలైన చంద్ర‌బాబుకు ఈ విష‌యం బాగా తెలుసు. ఇత‌ర‌త్రా విష‌యాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీని ఎన్ని ఇబ్బందుల‌కు గురి చేసినా అవి టీడీపీకి రాజ‌కీయంగా కలిసిరావు. ప్ర‌జాకోర్టులో విజ‌యమే అస‌లుసిస‌లు విజ‌యం. అక్క‌డ గ‌ట్టెక్కుతేనే రాజ‌కీయంగా మ‌రికొంత కాలంపాటు మ‌నుగ‌డ సాగించొచ్చు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఓట‌మి పాలైతే టీడీపీ భ‌విష్య‌త్‌,,,,చ‌రిత్ర పుట‌ల్లో ఓ పేజీకి ప‌రిమిత‌మ‌వుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

-సొదుం

మన పాలన-మీ సూచన, 2వ రోజు

దేవుడి ఆస్తులను కాజేసింది చంద్రబాబు

Show comments