క‌రోనా బారిన‌ప‌డ్డ ఆంధ్ర‌జ్యోతి

ది గ్రేట్ జ‌ర్న‌లిస్ట్ ఆర్‌కే నేతృత్వంలో న‌డుస్తున్న అత్య‌ద్భుత తెలుగు దిన‌ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతి క‌రోనా వైర‌స్ బారిన ప‌డింది. పేరులో జ్యోతి నింపుకున్న ఆ ప‌త్రిక ...అక్ష‌రం మాత్రం అంధ‌త్వంతో చీక‌టిని కౌగిలించుకుంది. త‌న వార్తా క‌థ‌నాల్లోనే ప‌ర‌స్ప‌రం పొంత‌న లేక రోజురోజుకూ ఆ ప‌త్రిక పాఠ‌కుల విశ్వాసం చూర‌గొన‌డంలో అథఃపాతాళానికి దిగిజారిపోతోంది. ఒకే పేజీలో పైన‌ , దాని కింద రాసిన వార్త‌ల్లో ఒకే అంశంపై భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌డం ఆ ప‌త్రిక‌కే చెల్లింది. దానికి ఈ వేళ (25వ తేదీ) ప్ర‌చురించిన రెండు క‌థ‌నాలే నిద‌ర్శ‌నం. వాటి క‌థాక‌మామీషూ ఏంటో చూద్దాం.

ఆంధ్ర‌జ్యోతి ఫ‌స్ట్ పేజీలో ‘బాబు విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు’, ‘త‌గ్గ‌ని ఉధృతి’ శీర్షిక‌ల‌తో రెండు వేర్వేరు వార్తాంశాల‌కు సంబంధించి ఇండికేష‌న్లు ఇచ్చారు. ఆ రెండు వార్త‌ల‌ను  ఏడో పేజీలో క్యారీ చేశారు. ఏడో పేజీలో ముందుగా త‌గ్గ‌ని ఉధృతి వార్తా క‌థ‌నాన్ని ఇచ్చారు. దానికి ఉప శీర్షిక‌లుగా ‘రాష్ట్రంలో మ‌రో 66 మందికి క‌రోనా’, ‘2,627కి చేరిన పాజిటివ్ కేసులు’ అని రాసుకొచ్చారు. ఇక వార్త‌లోకి వెళితే...

‘రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉద యం వరకూ 11,357మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా 66 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 2,627కు చేరింది. ఆదివారం 29 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వీరితో కలిపి వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,807కు చేరింది. మరో 764మంది చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల్లో కోయంబేడు లింకులతో చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ఎనిమిది మందికి వ్యాధి సంక్రమించిందని ఆరోగ్యశాఖ ప్రకటించింది’ అని సాగుతూ పోయింది.

ఇక ‘బాబు విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు’ వార్త‌ను రెండో ప్రాధాన్యం కింద పైన పేర్కొన్న క‌థ‌నానికి కిందే ఇచ్చారు. ఆ వార్త‌లో క‌రోనాపై ఏం రాశారో చూడండి. ‘మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది, తమిళనాట కూడా కేసుల విజృంభణ కొనసాగుతోంది. దీంతో సోమవారం నుంచి విమానాల రాకపోకలను అనుమతించేది లేదని ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో కరోనా ఉధృతి తీవ్రంగా లేదు. అయినప్పటికీ జగన్‌ ప్రభుత్వం ఎందుకు విమానాల రాకపోకలను వాయి దా వేయాలని కోరిందనేది ప్రశ్న’ అని రాసుకొచ్చారు.

త‌మ ఆరాధ్య దైవం చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే మాత్రం మ‌న రాష్ట్రంలో క‌రోనా ఉదృతి తీవ్రంగా లేద‌ని రాసి ఆంధ్ర‌జ్యోతి త‌న నైజం ఏంటో చెప్ప‌క‌నే చెప్పింది. ఇదే ప‌త్రిక అదే పేజీలో త‌గ్గ‌ని ఉధృతి అంటూ రాయ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఎక్క‌డైనా రెండు నిజాలుంటాయా? హైద‌రాబాద్ నుంచి విశాఖ‌తో పాటు గ‌న్న‌వ‌రం వెళ్లే విమాన స‌ర్వీసుల‌ను కూడా కేంద్ర విమాన‌యాన సంస్థ ర‌ద్దు చేసింది. కానీ విశాఖ వెళ్లాల్సిన బాబుకు చిన్న ఇబ్బంది త‌లెత్త‌గానే ఆంధ్ర‌జ్యోతి క‌రోనాపై వాస్త‌వాల‌ను క‌క్కేసింది. త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌తో పోలిస్తే మ‌న రాష్ట్రంలో క‌రోనా ఉధృతి లేద‌ని వాదిస్తోంది. ఇదో విచిత్ర ప‌రిస్థితి. అస‌లు కరోనా క‌ట్ట‌డి గురించి సీఎం జ‌గ‌న్ ఏ మాత్రం ప‌ట్టించుకోలేద‌నే క‌దా ఇంత కాలం ఆంధ్ర‌జ్యోతి ఏడ్పు.

విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దైనందుకు చంద్ర‌బాబు కంటే ఆంధ్ర‌జ్యోతే ఎక్కువ శోకాలు పెడుతోంది. త‌మ సౌక‌ర్యానికి అనుగుణంగా క‌రోనాపై వార్త‌ల‌ను వండ‌టంలో ఆంధ్ర‌జ్యోతికి సాటి వ‌చ్చే మీడియా క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌డం లేదు. ఆంధ్ర‌జ్యోతి క‌రోనా బారిన ప‌డి చిక్కి శిథిల‌మ‌వుతోంది. ఆంధ్ర‌జ్యోతి కాస్తా ...అంధ‌జ్యోతిగా మారింది. 

ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు

Show comments