ఇదీ జగన్ ఘనత.. నీకు అర్థమౌతోందా 'సాక్షి'

2019 బ్యాచ్ కి చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్ లు సీఎం జగన్ ని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా కామన్ గా "యువ ఐఏఎస్ లకు జగన్ దిశా నిర్దేశం, ప్రజలకు మెరుకైన సేవలందించాలని సూచన" అంటూ వార్తలు రాసుకొచ్చింది, సాక్షితో సహా. వాస్తవానికి అంతకంటే అక్కడ పెద్ద పాయింటే ఉంది.  

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన పథకాల గురించి ట్రైనింగ్ పీరియడ్ లో తమకు పాఠాలు చెప్పారని, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై చాలాసార్లు చర్చ జరిగిందని యువ ఐఏఎస్ లు మీడియాతో చెప్పారు. అంటే జగన్ విజన్ ముస్సోరీకి కూడా చేరిందన్నమాట. ఐఏఎస్ లు దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి.. వారికి ప్రత్యేకంగా ఫలానా రాష్ట్రంలో ఫలానా పథకాలు అమలవుతున్నాయని చెప్పరు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారినవి, ఎక్కువ ప్రజాదరణ పొందిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తారు. అలాంటి పథకాలతో ప్రజలకు జరుగుతున్న మేలు, ఉద్యోగంలో చేరిన తర్వాత వినూత్నంగా ఆలోచించి ప్రజలకు అభివృద్ధి ఫలాలను మరింతగా ఎలా చేరువ చేయాలనే విషయాలపై చర్చిస్తారు. ముస్సోరిలోని ఐఏఎస్ శిక్షణలో కూడా అదే జరిగింది.

ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పనితీరుపై ఐఏఎస్ లకు వివరించారు ఫ్యాకల్టీ. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి ఏపీలో మొదలైన ఈ పథకం వల్ల ప్రజలకు కలుగుతున్న మేలు గురించి చర్చించారు. దీన్నే మన యువ ఐఏఎస్ అధికారులు మీడియా వద్ద ప్రస్తావించారు. సహజంగా జగన్ గొప్పని పొగడటం ఇష్టంలేని పచ్చపాత మీడియా దీన్ని తొక్కేసింది, అది వారి సహజ గుణం. కానీ "సాక్షి" కూడా దీన్ని హైలెట్ చేయకపోవడమే ఇక్కడ విచారించాల్సిన విషయం.

రాజకీయ నాయకుల్ని రాజకీయ నాయకులు పొగడ్డం వేరు, హైటెక్ సిటీ నేనే కట్టా, అమరావతి సృష్టికర్త నేనేనంటూ బాబులాంటి వారు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం వేరు, వాటిల్నెవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ అత్యున్నత పరిపాలనా వ్యవస్థ ఒక రాష్ట్ర సీఎం చేసిన పనుల్ని మెచ్చుకోవడం, వాటి అమలు తీరుని కొత్తగా వస్తున్న అధికారులకు వివరించడం అంటే మామూలు విషయం కాదు.

దేశవ్యాప్తంగా ముస్సోరిలో శిక్షణ తీసుకుంటున్న, తీసుకోబోయే ఐఏఎస్ అధికారులందరికీ ఈ విషయాలు చర్చనీయాంశాలుగా మారాయంటే ఆ పథకాల గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు. సొంత మీడియా కూడా ఇలాంటి విషయాల్లో కాస్త అలర్ట్ గా ఉంటే మరీ మేలు. 

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు

Show comments