టీటీడీ ఆస్తులు స‌రే....హిందుత్వాన్ని అమ్ముకుంటున్న‌దెవ‌రు?

ఏపీలో నిత్యం ఏదో ఒక ర‌చ్చకు తెర‌లేస్తే త‌ప్ప కొంద‌రికి నిద్ర ప‌ట్ట‌డం లేదు. దీనికి కార‌ణం ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కావ‌డ‌మే. ఆయ‌నంటే అభిమానించే వాళ్లు ఎంత మంది ఉన్నారో, గిట్ట‌ని వాళ్లు కూడా త‌క్కువేం కాదు. ఈ నేప‌థ్యంలో తాజాగా టీటీడీ నిరర్థ‌క ఆస్తుల విక్ర‌యంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దుమారం చెల‌రేగుతోంది. మ‌రీ ముఖ్యంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని రాజ‌కీయంగా దెబ్బ‌తీసేందుకు ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా ప్ర‌తిప‌క్షాలు వ‌దిలి పెట్ట‌డం లేదు. ఏమీ లేకుండానే ఏదైనా సృష్టించ‌గ‌ల శ‌క్తిమంత‌మైన ప్ర‌తిప‌క్షాలున్న ఏపీలో...ఎంతోకొంత ఉంటే నానా యాగీ చేయ‌డానికి పెద్ద ఆయుధం దొరికిన‌ట్టే.

2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి నిర్దేశించిన బ‌డ్జెట్‌లో నిర‌ర్థ‌క ఆస్తుల విక్ర‌యం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని స‌మ‌కూర్చు కోవాల‌ని ప్ర‌తిపాదించారు. ఈ మేర‌కు త‌మిళ‌నాడులోని 23 చోట్ల ఉన్న నిర‌ర్థ‌క ఆస్తుల‌ను వేలం వేయాల‌ని ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో భూముల ధ‌ర‌లను నిర్ణ‌యించింది. భూముల అమ్మ‌కానికి టీటీడీ ఆదేశాలు గ‌త నెల 30న ఆదేశాలు ఇచ్చింద‌నేది ప్ర‌తిప‌క్షాల వాద‌న‌. అయితే టీటీడీ నిర్ణ‌యాల‌కు, ఏపీ స‌ర్కార్‌కు సంబంధం ఉండ‌దు. కానీ ఈ మొత్తం ఎఫిసోడ్‌లో జ‌గ‌న్‌ను దోషిగా నిల‌బెట్టాల‌ని ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున అవాస్త‌వాల ప్ర‌చారానికి తెర‌లేపాయి.

త‌మిళ‌నాడులోని 23 చోట్ల ఉన్న నిరర్థ‌క ఆస్తుల‌ను అమ్మ‌డం వ‌ల్ల టీటీడీకి ద‌క్కేది కేవ‌లం రూ.1.54 కోట్లు మాత్ర‌మే. కానీ ఈ ఆస్తుల అమ్మ‌కం వ‌ల్ల జ‌గ‌న్ స‌ర్కార్‌కు, టీటీడీకి వ‌చ్చే న‌ష్టం వెల‌క‌ట్ట‌లేనిది. ఈ మాత్రం కూడా ఆలోచించ‌కుండా టీటీడీ పాల‌క మండ‌లి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే ఈ మాత్రం దానికి ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప‌నికి ఎందుకు శ్రీ‌కారం చుట్టారో అర్థం కావ‌డం లేదు. ప్ర‌తిపక్షాలు, ఎల్లో మీడియాకు ఆస్తుల ఆమ్మ‌కం అనే ఆయుధాన్ని టీటీడీ చేజేతులా ఇస్తోంద‌ని అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో బ‌లంగా ఉంది.

ఆస్తుల‌కు సంబంధించి వాస్త‌వాలేంటో ఒక‌సారి చూద్దాం.

2014లో చంద్ర‌బాబు సీఎం అయిన త‌ర్వాత టీటీడీ పాల‌క మండ‌లి అధ్య‌క్ష ప‌ద‌విని మాజీ ఎమ్మెల్యే చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తికి క‌ట్ట‌బెట్టారు. ఆయ‌న అధ్య‌క్ష‌త‌న 2015, జూలై 28న తీర్మానం నంబ‌ర్ 84 మేర‌కు ఓ తీర్మానం చేశారు. అదేంటంటే...టీటీడీకి ఏ రకంగానూ ఉప‌యోగ‌ప‌డ‌ని ఆస్తుల‌ను గుర్తించి బ‌హిరంగ వేలం ద్వారా వాటిని విక్ర‌యించ‌డానికి గ‌ల అవ‌కాశాల‌ను ప‌రిశీలించేం దుకు స‌బ్ క‌మిటీని నియ‌మించ‌డం. ఈ క‌మిటీలో నాటి పాల‌క మండ‌లి స‌భ్యులు జి,భానుప్ర‌కాశ్‌రెడ్డి, జె.శేఖ‌ర్‌, డీపీ అనంత‌, ఎల్ల సుచ‌రిత‌, సండ్ర వెంక‌ట వీర‌య్య‌ల‌కు స్థానం క‌ల్పించారు.

ఆ స‌బ్ క‌మిటీ అధ్య‌య‌నం, ప‌రిశీల‌న చేసి టీటీడీ బోర్డుకు నివేదిక స‌మ‌ర్పించింది. ఈ నివేదిక ఆధారంగా 2016, జ‌న‌వ‌రి 30న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు ఇత‌ర ప్రాంతాల్లో స‌బ్ క‌మిటీ గుర్తించిన 50 నిర‌ర్థ‌క ఆస్తుల‌ను బ‌హిరంగ వేలం ద్వారా విక్ర‌యించ‌డానికి చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి అధ్య‌క్ష‌త గ‌ల పాల‌క‌మండ‌లి ఆమోదం తెలుపుతూ ఓ తీర్మానం చేసింది. ఆ తీర్మానం నంబ‌ర్ 253. ఈ తీర్మానం మేర‌కే  50 నిరర్థ‌క ఆస్తుల విలువ‌ను రూ.23.92 కోట్లుగా ప్ర‌స్తుత పాల‌క మండ‌లి గుర్తించింది. అలాగే  2020, ఫిబ్ర‌వ‌రి 29న భూముల ధ‌ర నిర్ణ‌యిస్తూ గ‌త పాల‌క మండ‌లి నిర్ణ‌యాల‌ను అమ‌లు చేయ‌డానికి ఆమోదం తెలుపుతూ ఓ తీర్మానం చేసింది. ఈ తీర్మానం నెంబ‌ర్ 309.

ఈ విష‌యాల‌న్నీ టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివ‌రించారు. అయితే టీటీడీ ఆస్తుల అమ్మ‌కాన్ని వ్య‌తిరేకించే హ‌క్కు ప్ర‌జ‌ల‌కు వంద‌కు వంద‌శాతం ఉంది. కానీ ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ఏ మాత్రం లేదు. ఎందుకంటే నాటి టీటీడీ బోర్డులో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంగా ప‌ద‌వులు పంచుకున్నాయి. స‌బ్ క‌మిటీలో బీజేపీ నేత భానుప్ర‌కాశ్‌రెడ్డి ఉన్నారు. అలాగే ఆ బోర్డు స‌భ్యుడిగా జ‌న‌సేన‌కు చెందిన హ‌రిప్ర‌సాద్ కూడా ఉన్నారు.

వాస్త‌వంగా జ‌రిగిన తతంగం అది. కానీ నేడు నిర‌ర్థ‌క ఆస్తుల అమ్మ‌కానికి టీటీడీ పాల‌క మండ‌లి నిర్ణ‌యం తీసుకుంటే బీజేపీ, టీడీపీ నేత‌లు రాద్ధాంతం చేస్తుంటే ఆశ్చ‌ర్యం వేస్తోంది. మ‌రీ ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ ఏమ న్నారో చూద్దాం. రాష్ట్ర ప్ర‌భుత్వం హిందూ మ‌తాన్ని నాశ‌నం చేయాల‌ని చూస్తోంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారా య‌ణ విమ‌ర్శించారు. త‌మిళ‌నాడులో టీటీడీ ఆస్తుల‌ను విక్ర‌యించాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యం దారుణ‌మ‌ని, దాన్ని విర‌మించు కోవాల‌ని ఆయ‌న సీఎంకు లేఖ రాశారు. కోట్లాది మంది హిందువులు ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతార‌ని ఆ లేఖ‌లో హెచ్చ‌రించారు.

నాటి స‌బ్ క‌మిటీ స‌భ్యుడు, బీజేపీ తిరుప‌తి నేత భాను ప్ర‌కాశ్‌రెడ్డి స్పందిస్తూ....శ్రీవారి ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే భక్తులతో కలసి పెద్దఎత్తున ఉద్యమిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఇప్పటికే దీనిపై టీటీడీకి, ప్రభుత్వానికి బీజేపీ తరపున లేఖ రాశామ‌న్నారు.  నాడు ఇచ్చిన నివేదిక గురించి భాను ఏం చెబుతారు? అలాగే టీటీడీ పాల‌క మండ‌లి మాజీ అధ్య‌క్షుడు చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి భార్య‌, విద్యాసంస్థ‌ల అధినేత చ‌ద‌ల వాడ సుచ‌రిత కూడా స్పందిస్తూ.... టీటీడీ ఆస్తుల విక్రయ నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందద‌ని సుచ‌రిత అన్నారు. ఆ స్తులను పరిరక్షించుకోలేక అమ్మేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు.

నిర‌ర్థ‌క ఆస్తుల‌ను ఎందుకు తేల్చార‌ని, అమ్మేందుకు ఎందుకు సిద్ధం చేశార‌ని ఇంట్లో భర్త‌ను ఏనాడైనా అడ‌గాల‌నిపించ‌లేదా? ఇంకా హిందూ మ‌నోభావాలు దెబ్బ తింటున్నాయ‌ని దేవాదాయ‌శాఖ మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాల రావు అన్నారు. వీళ్లంద‌రికీ హిందువుల‌పై ప్రేమ లేదు. రాజ‌కీయంగాఎదిగేందుకు హిందుత్వం ఓ నిచ్చెన‌లా ఉప‌యోగించుకుంటూ ఉంటారు. లాక్‌డౌన్‌లో కోట్లాది వ‌ల‌స కార్మికులు రోడ్ల వెంబ‌డి న‌డిచి వెళుతుంటే, వాళ్ల‌లో హిందువులు లేరా? మ‌రి అప్పుడు హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌లేదా? వ‌ల‌స కార్మికులు ఆక‌లితో అల‌మ‌టిస్తుంటే ఈ దేశ భ‌క్త నాయ‌కులంతా ఏ క‌లుగులో దాక్కున్నారో చెప్పాలి.

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌త విశ్వాసాల ప‌రంగా క్రిస్టియ‌న్‌. అందుకే ఆయ‌న్ని దెబ్బ‌కొట్ట‌డానికి రాజ‌కీయంగా టీటీడీ ఆస్తుల అమ్మ‌కం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు సంబ‌ర‌ప‌డుతున్నాయి.  క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ,  మాణిక్యాల‌రావు ఇత‌ర‌త్రా చిన్నాపెద్దా బీజేపీ, ఇత‌ర పార్టీల నాయ‌కుల మాట‌ల‌ను ప‌రిశీలిస్తే  హిందుత్వాన్ని అమ్మ‌కానికి పెట్టి ల‌బ్ధి పొందాల‌నే యావ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఏదో ర‌కంగా హిందు అనే సెంటిమెంట్‌ను రెచ్చ‌గొట్టి మ‌న రాష్ట్రంలో కూడా బ‌ల‌ప‌డాల‌నే కుట్ర వాళ్ల మాట‌ల్లో ప్ర‌తిబింబిస్తోంది.

ఇప్ప‌టికే ఇదే ఎజెండాతో దేశంలో బీజేపీ స‌క్సెస్ అయింది. దాన్ని ఏపీలో కూడా అమ‌లు చేయాల‌ని ఎప్ప‌టి నుంచో బీజేపీ శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నా....వాళ్ల ప‌ప్పులు ఇక్క‌డ ఉడ‌క‌లేదు. కానీ వాళ్ల ప్ర‌య‌త్నాలు మాత్రం ఆగ‌డం లేద‌నేందుకు తాజా ఉదంత‌మే నిద‌ర్శ‌నం. బీజేపీకి మ‌రిన్ని పార్టీలు తోడై హిందుత్వాన్ని తెర‌పైకి తెచ్చి, ల‌బ్ధి పొందేందుకు ఏం చేయ‌డానికైనా వెనుకాడర‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏపీ స‌ర్కార్‌, టీటీడీ పాల‌క‌మండ‌లి జాగ్ర‌త్త‌గా నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అన‌వ‌స‌ర వివాదాల‌కు , పంతాలు, ప‌ట్టింపుల‌కు వెళ్లేందుకు ఇది స‌మ‌యం కాద‌ని గ్ర‌హిస్తే మంచిది.

-సొదుం

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు

Show comments