వ్యక్తిగత వాహనాలకు క్రేజ్ పెరుగుతోందా..?

ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, తలసరి ఆదాయం పెరగడంతో.. దేశవ్యాప్తంగా కొన్నేళ్లుగా వ్యక్తిగత వాహనాల క్రేజ్ కూడా బాగా పెరిగింది. బైక్ లేదా కారు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు, ఒక్కో సందర్భంలో అవసరానికి మించి కూడా కొన్ని కుటుంబాలకు వాహనాలుంటున్నాయి. కరోనా ప్రభావం తర్వాత ఈ క్రేజ్ మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు వాణిజ్య నిపుణులు.

కరోనా లాక్ డౌన్ సమయంలో వాహనాలు లేనివారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజా రవాణా పూర్తిగా స్తంభించడంతో ప్రతి చిన్న పనికీ వాహనం అవసరమైంది. అదే సమయంలో అత్యవసర విధుల్లో ఉన్న ఉద్యోగులు కూడా పూర్తిగా వ్యక్తిగత వాహనాలపై ఆధారపడ్డారు. ఉద్యోగుల్లో చాలామంది గతంలో ప్రజా రవాణాకే ఓటువేసినా, తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాలు నడపడం నేర్చుకోవాల్సి వచ్చింది, వాటిని ఉపయోగించడం నిత్యావసరం అయింది.

లాక్ డౌన్ ముగిసిన తర్వాత ప్రజా రవాణా మెల్లగా మొదలైనా వ్యక్తిగత దూరం పేరుతో.. సీటింగ్ కెపాసిటీ బాగా తగ్గించారు. మాస్క్ వాడాలి, ఆరోగ్య సేతు యాప్ వేసుకోవాలి, చిన్నపిల్లలు, పెద్దవారికి నో ఎంట్రీ, జ్వరం, దగ్గు ఉంటే తీసుకెళ్లి క్వారంటైన్లో పెడతారు.. ఇలా సవాలక్ష కండిషన్లు పెట్టారు. దీనికి తోడు టైమింగ్స్ తో మరో ఇబ్బంది.

ప్రత్యామ్నాయం లేనివాళ్లు మినహా మిగతావాళ్లు ప్రజా రవాణా వైపు చూడ్డంలేదని ఈ రెండు రోజుల్లోనే అర్థమైంది. ఇది ఒక్క రోజుతో పోయేది కాదు, మరికొన్ని నెలలు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆంక్షలు సడలించాక కూడా అందరూ వ్యక్తిగత వాహనాల వినియోగానికే ఇష్టపడుతున్నారు. పట్టణాలు, పల్లెల్లో ట్రాఫిక్ చూస్తే ఈ విషయం క్లియర్ కట్ గా అర్థమవుతోంది. బైక్ లు, కార్లు మునుపటి కంటే ఎక్కువగా రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి.

వాహనాల కొనుగోళ్లకు కూడా గిరాకీ పెరుగుతోందని అంటున్నారు షోరూమ్ నిర్వాహకులు. లాక్ డౌన్ సడలించిన 4 రోజుల్లోనే బైక్ లు, కార్లకు మునుపటి కంటే 20శాతం బుకింగ్ లు పెరిగాయని చెబుతున్నారు. కరోనాతో ఆర్థిక స్థితి కాస్త దిగజారినా, ఈఎంఐలు మధ్యతరగతి ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. ఇక షోరూమ్ లన్నీ పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే వాహనాల కొనుగోళ్లపై మరింత క్లారిటీ వస్తుంది. 

అపూర్వ ఘట్టానికి సంవత్సరం