సుప్రీం తీర్పుతో బాధిత కుటుంబానికి భారీ ప‌రిహారం

విమాన ప్ర‌మాదంలో మృతి చెందిన ప్ర‌యాణికుడి కుటుంబానికి సుప్రీంకోర్టు తీర్పుతో భారీ ప‌రిహారం అంద‌నుంది. మృతుడి కుటుంబానికి రూ.7.64 కోట్లు ప‌రిహారంగా చెల్లించాల‌ని ఎయిరిండియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప‌రిహారం కోసం బాధిత కుటుంబం న్యాయ‌పోరాటం చేయాల్సి వ‌చ్చింది. చివ‌రికి న్యాయ‌మే గెలిచింది. అస‌లేం జ‌రిగిందంటే...

దుబాయ్ నుంచి 166 మంది ప్ర‌యాణికుల‌తో బ‌య‌ల్దేరిన ఎయిరిండియా విమానం 2010లో మంగ‌ళూరు వ‌ద్ద ప్ర‌మాదానికి గురైంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 158 మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో యూఏఈకి చెందిన ఓ సంస్థ రీజిన‌ల్ డైరెక్ట‌ర్ మ‌హేంద్ర కొడ్క‌నీ (45) ఉన్నాడు. కొడ్కనీ కుటుంబానికి రూ.7.35 కోట్లు పరిహారంగా చెల్లించాలని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) అప్పట్లో ఎయిరిండియాను ఆదేశించింది.

అయితే అనేక కార‌ణాలు చూపుతూ ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ఎయిరిండియా నిరాక‌రించింది. ఈ నేప‌థ్యంలో బాధిత కుటుం బం న్యాయ‌పోరాటంలో భాగంగా  సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను గురువారం కోర్టు విచారించింది. ఈ సంద‌ర్భంగా  కీల‌క వ్యాఖ్యానాలు చేసింది.

‘ఒక సంస్థ తమ ఉద్యోగుల ఆదాయాన్ని అనేక కారణాలతో వేర్వేరు కేటగిరీల కింద విభజించవచ్చు. అయితే, ఆ ఉద్యోగికున్న స్థాయి ఆధారంగా అతని ఆదాయాన్ని అంచనా వేయాలి. అతని మరణంతో సంభవించిన నష్టాన్ని నిర్ణయించేటప్పుడు అతని అర్హతలను పరిగణనలోకి తీసుకోవాలి’అని సుప్రీంకోర్టు పేర్కొంది.

అంతేకాదు, ఎన్‌సీడీఆర్‌సీ పేర్కొన్న రూ.7.35 కోట్ల నష్టపరిహారంలో ఇప్పటి వరకు చెల్లించని మొత్తానికి ఏడాదికి 9 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని ఎయిరిండియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒక వేళ అంతకంటే ఎక్కువగా చెల్లించినా పిటిషన్‌దారుల నుంచి రాబట్టేందుకు వీల్లేద‌ని ఎయిరిండియాకు కోర్టు స్పష్టం చేసింది. మ‌హేంద్ర కొడ్క‌నీ కుటుంబం సాగించిన న్యాయ‌పోరాటం స్ఫూర్తిదాయ‌క‌మ‌ని చెప్పొచ్చు. 

మావాడిని టీడీపీ వాళ్ళు తట్టుకోలేరు

Show comments