తీవ్ర కరవు ప్రాంతమైన రాయలసీమ పాలిట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ ఉరితాడుగా తయారయ్యారు. జీవో 69 తీసుకురావడం ద్వారా సీమకు శాశ్వతంగా మరణశాసనం రాసిన బాబు...జన్మనిచ్చిన గడ్డ రుణాన్ని ఆ విధంగా తీర్చు కున్నారు. ఇప్పుడు తాపీగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పూర్తి చేసింది తానేనని ఏ మాత్రం సిగ్గు లేకుండా బాబు ప్రకటించు కున్నారు.
తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే పూర్తి చేశామని బాబు నేడు ప్రకటించు కోవడాన్ని చూసి..సీమ భూమి నవ్వుకుంటుందని భావించడం లేదు.
పోతిరెడ్డిపాడుతో టీడీపీకి ఏం సంబంధం?
రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు 1977లో పోతిరెడ్డిపాడు నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత 1982 లో 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన పోతిరెడ్డిపాడును నాటి సీఎం అంజయ్య ప్రారంభించారు. ఇదీ పోతి రెడ్డిపాడుకు సంబంధించిన అసలు సంగతి. పోతిరెడ్డిపాడు తూముల మొదటి లక్ష్యం శ్రీశైలం కుడి కాలువ ద్వారా 19 టీఎంసీల నికర జలాలను అవుకు, గోరకల్లు జలాశయాలు నింపి గండికోట జలాశయానికి తీసుకెళ్లడం.
టీడీపీని స్థాపించి, ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చింది కూడా అదే సంవత్సరం. మరి అలాంటప్పుడు పోతిరెడ్డిపాడును ఎన్టీఆర్ ఎలా రూపొందించారో, చంద్రబాబు ఎలా పూర్తి చేశారో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. అలాగే అన్నీ ఆయనే చేసి ఉంటే ఈ వేళ జీఓ 203 ద్వారా సీమ కోసం ఓ బృహత్తర ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఏంటి? కళ్లెదుట కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంటే, తగదునమ్మానంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఇది ఆయనకు మాత్రమే తెలిసిన విద్య.
ఎన్టీఆర్ చేసిందేంటంటే...
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్రాస్‌కు తాగునీటిని అందించే ఉద్దేశంతో, అది కూడా బకింగ్ కెనాల్‌ను పునరుద్ధరించి కృష్ణా నుంచి మద్రాస్‌కు నీళ్లను తరలించే అవకాశం ఉన్నా, దాన్ని పక్కకు తోసి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 15 టీఎంసీల నీటిని (ఆంధ్రా, కర్నాటక, మహారాష్ట్ర) కేటాయించారు. వెంటనే ఇందులో మోసాన్ని పసిగట్టిన అప్పటి టీడీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి తెలుగు గంగ నిజానిజాలను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో రాయలసీమకు జరుగుతున్న తీవ్రమైన అన్యాయం తెలిసి వచ్చింది.
సీమ ఉద్యమానికి శ్రీకారం
ఈ నేపథ్యంలో తెలుగు గంగ నీళ్లు రాయలసీమ భూభాగం మీదుగా మద్రాస్‌కు పోతున్నాయని, కావున ఆ నీళ్లను తమ ప్రాంత తాగు, సాగునీటికి వినియోగించాలనే గట్టి ఒత్తిడి చేసేందుకు రాయలసీమ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమంలోకి నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డాక్టర్ వైఎస్సార్, డాక్టర్ మైసూరారెడ్డి లాంటి వారు రంగంలోకి దిగారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలు పెట్టడంతో మనకు తెలుగు గంగలో 15 టీఎంసీల తాగు, సాగునీళ్లు పోగా, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో దాదాపు 5.5 లక్షల ఎకరాల భూమికి సాగునీళ్లు ఇచ్చే రకంగా నిర్ణయించారు.
సీమ ఉద్యమానికి తలొగ్గిన ఎన్టీఆర్
అయితే నిర్ణయాలు జరిగినంత సులభంగా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. నీటిని పెంపుదల చేశామని అన్నారే గానీ, ఆ నీళ్లు వచ్చే పోతిరెడ్డిపాడు ముఖద్వారపు తూములను వెడల్పు చేయాలనే ఆలోచన చేయలేదు. అప్పుడు 11 వేల క్యూసెక్కులకు సరిపడా నాలుగు తూములు మాత్రమే ఉన్నాయి. అవి మద్రాస్‌కు నీళ్లు తీసుకెళ్లడానికి మాత్రమే సరిపోతాయి. ఈ వాస్తవాలను గ్రహించి పోతిరెడ్డిపాడు ద్వారా మాత్రమే రాయలసీమకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది కావున, అప్పట్లో ఆ తూముల సామర్థ్యాన్ని 75 వేల క్యూసెక్కులకు పెంచాలని రాయలసీమలో అత్యద్భుమైన పాదయాత్రలు జరిగాయి.
అంతే కాకుండా హైదరాబాద్‌లో సెక్రటేరియట్ ఎదురుగా డాక్టర్ వైఎస్సార్ నేతృత్వంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను అడ్డుకుని సీమ నీళ్ల సంగతి తేల్చాలని ఒత్తిడి పెంచారు. దీంతో ఎన్టీఆర్ అక్కడే రోడ్డుపై పడుకున్నారు. అప్పట్లో ఇదో పెద్ద సంచలనం. ఇలాంటి నాటకాలను ఏ మాత్రం ఒప్పుకోమని రాయలసీమ వాసులు తీవ్రమైన ఒత్తిడి చేయడంతో ఇంజనీర్ రామకృష్ణ సలహా మేరకు గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులను రూపొందించారు. ఇవన్నీ రాయలసీమ ఉద్యమ ఫలితమే. కేవలం సీమ నేతల ఉద్యమాలకు తలొగ్గి ఎన్టీఆర్ నియమించిన ఇంజనీరింగ్ కమిటీ గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టుల డిజైన్‌కు శ్రీకారం చుట్టారు.
సీమకు బాబు తీరని ద్రోహం
శ్రీశైలంలో నీటి మట్టం 830 అడుగుల్లో ఉన్నప్పుడు మాల్యాల దగ్గర నుంచి నీళ్లను హంద్రీ నీవాకు ఎత్తిపోసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన తెలుగు గంగ, గాలేరు-నగరి, శ్రీశైలం కుడి కాలువలకు పోతిరెడ్డిపాడు తూముల నుంచే నీళ్లు రావడమే శరణ్యం. ఆ తూముల సామర్థ్యం పెంచకపోతే ఈ ప్రాజెక్టుల వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు. 1988లో ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే, శ్రీశైలంలో 854 అడుగుల ఎత్తులో నీళ్లు ఉంటే పోతిరెడ్డిపాడు తూములకు రోజుకు 7 వేల క్యూసెక్కుల నీటిని పారించుకోవచ్చు. 881 అడుగుల మట్టంలో ఉంటే 40 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్ల వచ్చు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే రాయలసీమ ద్రోహి చంద్రబాబునాయుడు 1997లో ఆ నీటి మట్టం తగ్గింపును 834 అడుగులకు మార్చాడు. అదే 69 జీవో. అదే సీమ పాలిట ఉరితాడు. దీంతో ఆ 834 అడుగుల ఎత్తులో ఉంటే కనీసం వెయ్యి క్యూసెక్కులు కూడా పారించుకోలేని దుస్థితి. సీమ శాశ్వతంగా ఏడారి కావడానికి బాబు కారణమయ్యారు.
వైఎస్సార్ హయాంలో సీమకు స్వర్ణ యుగం
డాక్టర్ వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే 2005లో పోతిరెడ్డిపాడు తూముల సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ జీవో ఇచ్చారు. పైగా ఏకపక్షంగా కాకుండా అఖిలపక్షం నిర్వహించి అందరి ఒప్పందంతోనే ఆ ఉత్తర్వు తీసుకొచ్చారు. అప్పుడే ఆ వరద జలాలను వినియోగించడంలో సీమతో పాటు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేలా నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు నీళ్లు తీసుకుపోయే అవకాశం ఇచ్చిన మహానుభావుడు వైఎస్సార్. ఇంత చేసినా తెలంగాణ వాళ్లు అప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వీళ్లకు తోడుగా కోస్తా ప్రాంత టీడీపీ నాయకుల వైఖరి కూడా పోతిరెడ్డిపాడుకు తీవ్రమైన వ్యతిరేకతను ప్రదర్శించింది. రాజశేఖరరెడ్డి దాన్ని లెక్క చేయకుండా అఖిలపక్ష నిర్ణయం కావున ఆ ప్రభుత్వ ఉత్తర్వును అట్లే కొనసాగించారు.
బాబు తప్పును సరిదిద్దేందుకు వైఎస్సార్ విఫలయత్నం
చంద్రబాబు తీసుకొచ్చిన దుర్మార్గపు జీఓ 69ని రద్దు చేసి 854 అడుగుల మట్టంలో నీళ్లను తీసుకెళ్లే ఏర్పాటు వైఎస్సార్ ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా చేశారు. కానీ ఈ 69 జీవో విషయంలో మొత్తం కోస్తాలోని అన్ని పార్టీల వాళ్లు , తెలంగాణ పార్టీల వాళ్లు తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో వైఎస్సార్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో ఆ జీవోను వెనక్కి తీసుకున్నారు. ఇది రాయలసీమకు సంబంధించిన పెద్ద ఘటన.
సీమకు కృష్ణా నీళ్లు వైఎస్సార్ పుణ్యమే
నేడు రాయలసీమ వాళ్లు కాసిన్ని కృష్ణా నీళ్లు కళ్ల చూస్తున్నారంటే అది వైఎస్సార్ పుణ్యమే. రామరావు లేదా చంద్రబాబు హయాంలో పథకాలకు పునాదులపైన పునాదులు వేయడం తప్పిస్తే నీటి పారుదల ప్రాజెక్టులకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. హంద్రీ నీవా నీళ్లు కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో అనంతపురం వరకు తీసుకెళ్లగలిగామనే సంగతిని మరిచిపోకూడదు.
చంద్రబాబునాయుడు గాలేరు-నగరిని తునాతునకలు చేసి గండికోట వరకే దాన్ని ఆపేసి , మిగిలిన కడప- చిత్తూరు జిల్లాల వాసులను ఎండగట్టారు. ఆ గండి కోట వరకైనా ఎందుకంటే పులివెందులకు నీళ్లు ఇచ్చానని చెప్పుకుంటూ రాజకీయ ప్రయోజనాలు పొందడానికి మాత్రమే చేశారు.
వైఎస్ జగన్ చిత్తశుద్ధి
ఇక వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడే కర్నూలు జిల్లా సహచర ఉద్యమకారులకి గుండ్రేవుల నిర్మాణం, పోతిరెడ్డిపాడు తూముల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచడం తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చారు. దాంతో పాటు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం గురించి ఆలోచిస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఆయన చేసిన అత్యద్భుతమైన పని 203 జీఓ తీసుకు రావడం. దీని ద్వారా మూడు శతకోటి ఘనపడుగుల నీళ్లు బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ మధ్య ఐదో కిలో మీటర్ వద్ద ఎత్తిపోస్తారు.
దీంతో పాటు ఆ కాలువల సామర్థ్యాన్ని పెంచి 8 శతకోటి ఘనపడుగుల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా రాబట్టుకునే కార్యక్రమం ఇది. ఇది రాయలసీమ వాడికి ప్రాణపదం. ఇది కొత్తగా చేశారనే అపవాదు న్యాయం కాదు. మనకు కేటాయింపుల్లో వచ్చిన 512 టీఎంసీలకు లోబడే తీసుకుంటున్న అంతర్గత సర్దుబాటు. ఇది కొత్త పథకం కాదు. కావున సీమకు నీళ్లు అందించేందుకు ఎక్కడి నుంచి సాధ్యమవుతుందో అక్కడి నుంచి తీసుకునేందుకు చేస్తున్న బృహత్తర భగీరథ యత్నం. ఇది ఏ రాష్ట్రానికి వ్యతిరేకం కాదు. ఎవరి నీళ్లు చుక్క కూడా తీసుకోవడం లేదు.
రాజశేఖరరెడ్డి హయాంలో మిగులు జలాలు మనకు అవసరం లేదని లిఖితపూర్వకంగా రాసిచ్చి, దిగువ రాష్ట్రంగా మన హక్కుల్ని పోగొట్టారని బాబు ఆరోపణలు పచ్చి అబద్ధం. అలాంటిది ఏదైనా ఉంటే బాబు సీమ సమాజానికి చూపి, వైఎస్సార్ తలపెట్టిన ద్రోహాన్ని నిరూపించాలి. వైఎస్సార్‌పై విమర్శలు చేసినంత మాత్రాన బాబు చేసిన ద్రోహాన్ని సీమ సమాజం ఎప్పటికీ మరిచిపోదని గుర్తించాలి. ఇప్పటికైనా తన తప్పును సరిదిద్దుకునే పెద్ద అవకాశం బాబుకు వచ్చింది. జగన్ సర్కార్‌కు అండగా నిలిచి జీఓ 203 ప్రకారం సీమకు న్యాయం చేసే ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి.
-సొదుం