లాక్‌డౌన్‌తో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంటే, మరోవైపు సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నారు? వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో....ప్రతి సామాన్యుడిని వేధిస్తున్న ప్రశ్న. నిజమే...ఎవరికీ అంతు చిక్కని సమాధానం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు జగన్ కనబరుస్తున్న చిత్తశుద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే. సహజంగా ఏదైనా విపత్తు సంభవిస్తే సంక్షేమ పథకాలను ఎలా ఎగ్గొట్టాలని కుయుక్తులు పన్నే పాలకులను చూసిన వాళ్లకు...అందుకు విరుద్ధంగా కష్ట కాలంలో మ్యానిఫెస్టో అమలుకు ఏకంగా ఓ క్యాలెండర్‌నే విడుదల చేయడం ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు.
మ్యానిపెస్టోలోని పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందజేసేందుకు తేదీల వారీగా ప్రకటించిన క్యాలెండర్‌ను జాగ్రత్తగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లపై ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఎకానమీని ఎలా పునరుద్ధరించాలి.. తిరిగి ఎలా పునరుత్తేజం తీసుకురావాలి...అనే ఆలోచనతో ఈ క్యాలెండర్ తయారు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ క్యాలెండర్‌పై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.
ఇంత వరకూ అంతా బాగుంది. ఏ ఆకాంక్షలతో జగన్‌ను సీఎంగా గెలిపించుకున్నారో, ఇప్పుడు ఇంత కష్టకాలంలో కూడా వాటిని నెరవేరుస్తున్న జగన్ అంటే జనాల్లో మరింత నమ్మకం, అభిమానం పెరిగాయంటే అతిశయోక్తి కాదు. అయితే జగన్ సర్కార్‌పై ఓ చిన్న అసంతృప్తి కూడా లేకపోలేదు. దాన్ని కూడా జగన్ పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఆయన తిరుగులేని శక్తిగా ఎదుగుతారు.
ఆ అసంతృప్తి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందజేయకపోవడంపైనే. నిజానికి లాక్డౌన్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుదేలైంది. ఇక మన రాష్ట్ర పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. దీంతో గత రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగుల్లో రెండుమూడు డిపార్ట్మెంట్లకు తప్ప మిగిలిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధించారు. ఆ కోతల్లో కూడా రకరకాల స్థాయి లున్నాయి. అయితే కరోనా విపత్తును ఎవరూ ఊహించలేదు.
ప్రతి నెలా వివిధ కమిట్మెంట్లకు పోనూ వేతనాన్ని పొదుపుగా వాడుకుంటున్న ఉద్యోగులకు సగం జీతంతో ఇబ్బందులు తప్పడం లేదు. అయితే కరోనాతో ఆర్థిక ఇబ్బందులని సరిపెట్టుకుంటున్నా....మరోవైపు సంక్షేమ పథకాలను యధావిధిగా జగన్ సర్కార్ అమలు చేస్తుండటం ఉద్యోగ వర్గాల్లో ఓ రకమైన అసంతృప్తికి కారణమవుతోంది.
ఎందుకంటే రాష్ట్రానికి ఆర్థిక కష్టాలున్నప్పుడు సంక్షేమ పథకాలను మాత్రం పకడ్బందీగా ఎలా అమలు చేయగలుగుతున్నారనే ప్రశ్న ఆ వర్గాల నుంచి వినవస్తోంది. నిజానికి దీన్ని సీరియస్‌గా ఆలోచించాల్సిందే. ఉద్యోగుల ప్రశ్నను తీసిపారేయడానికి లేదు. సంక్షేమ పథకాల అమలును వాళ్లు వ్యతిరేకించడం లేదు. వాళ్ల డిమాండల్లా తమ సంక్షేమాన్ని కూడా పట్టించుకోమని. ఎందుకంటే ప్రభుత్వ పెద్ద అన్ని వర్గాల ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాలి. ఉద్యోగుల వేతనాన్ని కనీసం ఈ నెల నుంచైనా పూర్తిగా చెల్లించగలిగితే జగన్ సర్కార్ ఎంతోకొంత వాళ్ల అసంతృప్తిని చల్లార్చినట్టవుతుంది. లేదంటే ఉద్యోగులు అదును చూసుకుని వాత పెడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల సమయంలో ఉద్యోగుల పాత్ర కూడా చాలా కీలకమని జగన్ సర్కార్ గుర్తించి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-సొదుం