బాబు రాజ‌కీయం...ఇక గ‌త‌మే!

క‌రోనా విప‌త్తులో టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌కీయ భ‌విష్య‌త్ సంక్షోభంలో ప‌డింది. నిజానికి ఇది బాబుకు ఊహించ‌ని ప‌రిణామం. ఒక ర‌కంగా ఇది టీడీపీకి ఆగ‌స్టు సంక్షోభం కంటే తీవ్ర‌మైంద‌ని చెప్పొచ్చు. క‌రోనాకు వృద్ధులంటే ప్రీతిపాత్రం కావ‌డం, చంద్ర‌బాబుకు 71 ఏళ్లు రావ‌డం, వైర‌స్‌కు టీడీపీ అధినేత అంటే లెక్క‌లేక‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాలు టీడీపీని వ‌ణికిస్తున్నాయి.

ఇంత త్వ‌ర‌గా, ఈ విధంగా బాబు రాజ‌కీయానికి క‌రోనా చ‌ర‌మ‌గీతం పాడే రోజులొస్తాయ‌ని టీడీపీ నేత‌లు ఏ మాత్రం ఊహిం చ‌లేదు. జీవితమంటే అదే క‌దా! టీడీపీ నేత‌లు పైకి ఎన్ని మాట్లాడుతూ బాబుతో పాటు టీడీపీ రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ఆ పార్టీలో తీవ్ర అంత‌ర్మ‌థ‌నం జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. లాక్‌డౌన్ కార‌ణంగా రెండు నెల‌లుగా బాబు హైద‌రాబాద్‌లో ఉంటూ త‌న ఎల్లో మీడియా ద్వారా ఏదో విధంగా హైలెట్ అవుతూ వ‌స్తున్నారు. ఈ నెలాఖ‌రుతో లాక్‌డౌన్‌ను ముగించే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో చంద్ర‌బాబులో ఆందోళ‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది.

క‌రోనా వైర‌స్‌ను పూర్తిగా క‌ట్ట‌డి చేయ‌క‌ముందే లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇవ్వ‌డాన్ని బాబు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డాన్ని మ‌నం చూశాం. దీని వెనుక బాబు భయాందోళ‌న‌లు వేరు. ఇంత కాలం లాక్‌డౌన్ పేరు చెప్పి ఇంటి నుంచి బ‌య‌ట అడుగు పెట్ట‌ని చంద్ర‌బాబు...వ‌చ్చే నెల ఒక‌టి నుంచి అలా ఉండ‌టానికి వీల్లేదు. ఇన్నాళ్లు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు, అనుమ‌తుల సాకుతో బాబు షో చేసుకుంటూ వ‌చ్చారు. కానీ లాక్‌డౌన్ త‌ర్వాత త‌న ఆరోగ్యంపై ఆయ‌న ఆందోళ‌న చెందుతున్నారు. ఎందుకంటే క‌రోనా వైర‌స్ వృద్ధుల‌కు, పిల్ల‌ల‌కు అటాక్ అవుతుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిస్తోంది. అలాగే క‌రోనా గురించి కొన్నింటి గురించి తెలుసుకుందాం.

"రాబోయే కాలంలో క‌రోనా రానివారు ఎవ‌రూ ఉండ‌రు. అది వ‌స్తుంది, పోతుంది. దాంతో క‌లిసి జీవించాల్సి ఉంటుంది. ఈ వ్యాధి ప‌ట్ల ప్ర‌జ‌ల్లో భ‌యాన్ని తొల‌గించి అవ‌గాహ‌న, చైత‌న్యాన్ని పెంచాలి" అని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్ స‌మావేశంలో అన్నారు.

అలాగే ఈ నెల 21 నుంచి ఏపీ స‌ర్కార్ ఆర్టీసీ బ‌స్సుల‌ను తిప్ప‌నుంది. ఈ నేప‌థ్యంలో కొన్ని నిబంధ‌న‌లు పెట్టింది. వాటిలో ముఖ్యంగా 65 ఏళ్ల‌కు మించిన వారిని, గ‌ర్భిణుల‌ను ఎక్కించుకోరు. అలాగే ప‌దేళ్ల లోపు ప్ర‌యాణికుల‌ను అనుమ‌తించ‌రు. అలాగే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా 60 ఏళ్లు దాటిన వాళ్లు, ప‌దేళ్ల లోపు పిల్ల‌లు ఇంటి నుంచి బ‌య‌ట‌కి ఎట్టి ప‌రిస్థితుల్లో రాకూడ‌ద‌ని హెచ్చ‌రిస్తోంది. వృద్ధులు, పిల్ల‌లకు క‌రోనా వ‌స్తే...కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌ని హెచ్చ‌రిస్తోంది.

ఇట‌లీ, అమెరికా త‌దిత‌ర దేశాల్లో 60 ఏళ్ల‌కు పైబ‌డిన క‌రోనా వ్యాధిగ్ర‌స్తుల‌కు అస‌లు వైద్యం అందించేందుకు ఏ మాత్రం ఆస‌క్తి చూప‌లేద‌ని విన్నాం. ఎందుకంటే ఆ వ‌య‌సు వారికి వైద్యం అందించినా కోలుకోలేర‌ని ఆ దేశాలు భావించాయి. అందుకే వైద్యం అందిస్తే కోలుకుంటార‌నే న‌మ్మ‌కం ఉన్న యువ‌కులు, మ‌ధ్య వ‌య‌స్కుల వారికి మాత్ర‌మే ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాలు ట్రీట్‌మెంట్ ఇచ్చాయి. క‌రోనాకు సంబంధించి వాస్త‌వ ప‌రిస్థితి ఇది.

సీఎం జ‌గ‌న్‌తో పాటు ప్ర‌పంచ దేశాధినేత‌లు, ప్ర‌ధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌...ఇలా ఒక్క‌రేమిటి అనేక మంది వైద్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం క‌రోనాతో మ‌నమంతా స‌హ‌జీవ‌నం చేయాల్సిదే. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయం ఇక కరోనాకు ముందున్న రోజుల్లో మాదిరిగా ఉండ‌దు.

అలాగ‌ని కేవ‌లం జూమ్‌లో, వీడియో కాన్ఫ‌రెన్స్‌లు, టెలీకాన్ఫ‌రెన్స్‌ల‌తో రాజ‌కీయాలు చేస్తే కుద‌ర‌దు. ఇదే ఇప్పుడు బాబుకు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అధికారం లేక‌పోతే బాబు అంత పిరికివాడు మ‌రొక‌రు ఉండ‌రు. బాబు కేవ‌లం మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తుంటారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు ప్ర‌ధాని మోడీకి తొడ‌గొట్టిన చంద్ర‌బాబు....ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత పిల్లిలా మారిపోవ‌డాన్ని చూస్తున్నాం క‌దా!

గ‌త రెండు నెల‌లుగా బాబు హైద‌రాబాద్‌లోని ఇంటికే ప‌రిమిత‌మై క‌రోనా రాజ‌కీయాలు చేస్తున్నారు. అయితే బాబు రాజ‌కీ యాలు ఎల్లో మీడియాలో ప‌తాక శీర్షిక‌లు కావ‌చ్చు. కానీ జ‌నంతో సంబంధం లేకుండా చేసే రాజ‌కీయాలు బాబు ప‌లుకుబ‌డిని పెంచ‌లేవు. అలాగ‌ని ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలంటే క‌రోనా వైర‌స్ నీడ‌లా వెంటాడుతోంది. క‌నీసం బ‌స్సుల్లో కూడా 65 ఏళ్లు పైబ‌డిన వాళ్ల‌ని ఎక్కించుకోవ‌ద్ద‌ని నిబంధ‌న విధించారు. అలాంట‌ప్పుడు 71 ఏళ్ల చంద్ర‌బాబు అంటే క‌రోనాకు ముద్దేం కాదు క‌దా?

మ‌రోవైపు చేతికంది వ‌చ్చిన చెట్టంత కొడుకు లోకేశ్ ఉన్న‌ప్ప‌టికీ...రాజ‌కీయంగా అత‌ను స‌మ‌ర్థ‌వంతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ఇదే ఇప్పుడు బాబుకు తీవ్ర మాన‌సిక క్షోభ క‌లిగిస్తోంది. చంద్ర‌బాబు రాజ‌కీయానికి క‌రోనా క‌ళ్లెం వేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందే హం లేదు.  క‌రోనా కాలంలో బాబు రాజ‌కీయం...ముందుకు పోతే నుయ్యి, వెన‌క్కిపోతే గొయ్యి అనే సామెత మాదిరి త‌యారైంది. ఈ ప‌రిస్థితుల్లో బాబు రాజ‌కీయం ఇక గ‌తంగానే మిగిలిపోనుందనే వాద‌న వినిపిస్తోంది.  

-సొదుం

జన్మనిచ్చిన గడ్డపైనే కక్ష

Show comments