సిరీస్ రివ్యూ: పాతాళ్ లోక్

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోన్న టాపిక్... ‘పాతాళ్ లోక్’. అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అందరి మన్ననలు అందుకుంటోంది. ఇండియన్ సిరీస్‌లో బెస్ట్ అని కితాబులు అందుకుంటోంది. అది కేవలం హైపేనా... లేక నిజంగానే పాతాళ్ లోక్ అంత అద్భుతంగా వుందా? 

ఎన్‌హెచ్ 10, ఉడ్తా పంజాబ్ లాంటి చిత్రాలకి రచన చేసిన సుదీప్ శర్మ ఈ సిరీస్ సృష్టికర్త. తరుణ్ తేజ్‌పాల్ రచించిన ‘ది స్టోరీ ఆఫ్ మై అసాసిన్స్’ అనే పుస్తకర ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌కి అవినాష్ అరుణ్, ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. అనుష్క శర్మ కోహ్లీ స్థాపించిన ‘క్లీన్ స్లేట్ ఫిలింస్’ ఈ సిరీస్ నిర్మించింది. 

కథలోకి వెళితే... చిన్నా చితకా కేసులు తప్ప తన ఇరవయ్యేళ్ల కెరీర్‌లో ఒక్క హై ప్రొఫైల్ కేస్ కూడా హ్యాండిల్ చేయని ఇన్స్‌పెక్టర్ హాతీరామ్ చౌదరి (జైదీప్ అహ్లావత్) చేతికి ఒక పెద్ద కేస్ వస్తుంది. ఒక పాపులర్ జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రా (నీరజ్ కాబి) హత్యకి పథకం పన్నిన నలుగురు క్రిమినల్స్‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ కేస్ హాతీరామ్ తన సబ్‌ఆర్డినేట్ అన్సారీ (ఇష్వక్ సింగ్) సాయంతో ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. ఆ హంతకుల బృందానికి నాయకుడు అయిన విశాల్ త్యాగి అలియాస్ ‘హతోడా’ త్యాగి (అభిషేక్ బెనర్జీ) గురించిన భయంకరమైన వాస్తవాలు తెలుస్తాయి. చిన్న చిన్న ఆధారాలని పట్టుకుని పెద్ద వాళ్ల వరకు వెళ్లిపోతున్న హాతీరామ్‌ని ఒక సాకు చూపించి సస్పెండ్ చేసి కేసు సిబిఐకి అప్పగిస్తారు. సస్పెండ్ అయినా కానీ హాతీరామ్ తన ఇన్వెస్టిగేషన్ మాత్రం ఆపడు. ఆ ఇన్వెస్టిగేషన్‌లో ఆ హంతకుల గురించిన చేదు నిజాలతో పాటు పెద్ద రాజకీయ కుంభకోణమే బయట పడుతుంది. అసలు సంజీవ్ మెహ్రాని చంపడానికి పథకం ఎందుకు వేసినట్టు? కంటికి కనిపిస్తున్నవన్నీ నిజాలేనా లేక అసలు నిజాన్ని కప్పి పెట్టడానికి పెట్టిన డైవర్షన్లా? 

ఏ సిరీస్ సెక్సస్ అయినా ఆపకుండా చూసేలా చేయడంలోనే వుంటుంది. ఒక ఎపిసోడ్ పూర్తయ్యాక వెంటనే మరో ఎపిసోడ్ చూసి తీరాలనిపించేలా చేయడంలోనే సదరు సిరీస్ క్రియేటర్ టాలెంట్ తెలుస్తుంది. ప్రతి ఎపిసోడ్ నలభై నిమిషాలకి పైగానే వున్న ‘పాతాళ్ లోక్’లో మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్ వున్నాయి. మొదటి ఎపిసోడ్ చూసాక ఇక తొమ్మిది ఎపిసోడ్లు పూర్తయ్యే వరకు చూసేలా చేస్తుంది. అంతే కాదు, తొమ్మిది ఎపిసోడ్స్ చూసేసిన తర్వాత కూడా ఈ షో ఇంకా కొన్ని ఎపిసోడ్స్ వుంటే బాగుండనిపిస్తుంది. దానిని బట్టి ఇది ఎంత బాగుండి వుంటుందనేది మీరే ఊహించుకోవచ్చు. 

కథలో లేయర్స్ వుండడమే కాదు... ప్రతి ముఖ్య పాత్రకీ లేయర్స్ వుండడం ఈ సిరీస్ స్పెషాలిటీ. రచయితలు ఈ కథపై, పాత్రచిత్రణపై ఎంత శ్రద్ధ పెట్టి తీర్చిదిద్దారనేది సిరీస్ ఆసాంతం తెలుస్తూనే వుంటుంది. ప్రతి ఎపిసోడ్ నలభై నిమిషాలకి పైగా వున్నపుడు, అది కూడా సుదీర్ఘంగా తొమ్మిది ఎపిసోడ్స్ అయినపుడు ఆసక్తి సన్నగ్లికుండా నడిపించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఊహించని మలుపులు, ప్రతి ఎపిసోడ్ చివర వెంటనే తెలుసుకుని తీరాలనే సస్పెన్స్... ఒక్కో పాత్ర తాలూకు గతం, లేదా పరిస్థితులకి అనుగుణంగా మారే వాటి గుణాన్ని బట్టి సదరు పాత్రలపై మారుతూ పోయే అభిప్రాయాలు... పాతాళ్ లోక్ ఒక గొప్ప రచనకి తార్కాణం అంటే అతిశయోక్తి కాదు. 

చూపించేది చీకటి రాజ్యమన్నపుడు అక్కడ భయంకరమయిన వాస్తవాలుంటాయి. పసిపిల్లలపై జరిగే దారుణాలుంటాయి. ఆడవాళ్లపై చేసే అఘాయిత్యాలుంటాయి. స్వీట్ కోటింగ్ ఇవ్వడం కానీ, లేదా ఆ హింసని దాచి పెట్టి ‘ఊహించుకోమనడం’ కానీ దర్శకులు చేయలేదు. ఆ దారుణాలని కళ్లకి కట్టి చూపించేసారు. సాటి మనిషి ప్రాణాన్ని తృణప్రాయంగా చూసే పాత్రలు జంతు ప్రేమ చూపించడం, ఈ కథలో అది కీలకాంశం కావడం ఆశ్చర్యంగా, అదే సమయంలో అర్థవంతంగా కూడా అనిపిస్తుంది. ఒక సాధారణ మర్డర్ అటెంప్ట్‌ని టెర్రరిస్ట్ ప్లాట్‌గా సిబిఐ తన స్వలాభం కోసం ఎలా చిత్రీకరించగలదో, తాము ‘హీరో’ అవడం కోసం ఫేక్ న్యూస్‌ని మీడియా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలదో, స్వర్గ్ లోక్‌లో (ధనిక వర్గం) జరిగే ఏ దారుణంలో అయినా పావులయ్యేది, బలయ్యేదీ పాతాళ్ లోక్ (నిరుపేద వర్గం) వాసులేననే క్లియర్ జడ్జిమెంట్‌ని ఈ సిరీస్ అందరితో ఒప్పించేలా పాస్ చేస్తుంది. 

మైనారిటీలపై జరిగే అకృత్యాలని కళ్లకు కట్టిన ‘పాతాళ్ లోక్’లో ముస్లిమ్‌లని ఈజీగా టెర్రరిస్టులుగా ఎలా ముద్ర వేసేస్తారనేది కూడా నిర్భయంగా చూపించారు. ‘‘మా వాడిని నేను ముస్లిమ్‌లానే పెంచలేదు. వాడిని ఏకంగా తీవ్రవాదిని చేసేసారా?’’ అంటూ అడిగే ఒక ముస్లిమ్ తండ్రి ప్రశ్న సూటిగా తాకుతుంది. నిమ్న వర్గానికి చెందిన ఒకడు అగ్ర వర్ణానికి ఎదురు తిరిగితే... ‘‘మా నాన్న మీ అమ్మని చెరుస్తాడని నా కొడుకు నీ కొడుకుతో చెప్పాడట. వాడి మాట నిలబెట్టడానికి నేనే కాదు నాతో వున్న పది మందీ నిన్ను చెరుస్తారు’’ అంటూ ఆమెని ఆరుబయట తన కుబుంబం ముందే బలాత్కారం చేయడం లాంటి దృశ్యాలని చిత్రీకరించడానికి ఏమాత్రం సంశయించలేదు. వీధుల్లో పెరిగే పిల్లలకు ఎదురయ్యే పరిస్థితులని కళ్లకి కట్టారు. 

స్వర్గ్ లోకంలో అంతా సంతోషం, శాంతియేనా? అక్కడి వారికుండే యాంగ్జయిటీ ఇబ్బందులు, భర్త అఫైర్లకి గుండె పగిలిన భార్యలు, వీధి కుక్కలని దగ్గర తీసి పొందే సాంత్వన, వయసు తారతమ్యం లేకుండా ఏర్పడే శారీరిక సంబంధాలు, అవి చేసే మానిపోని గాయాలు, ఒక అవకాశాన్ని అదనుగా వాడుకుని నిచ్చెన ఎక్కే ప్రభావిత వ్యక్తులు... మనకు తెలిసిన పాపులర్ వ్యక్తుల పాపులారిటీ వెనుక ఎన్ని నెత్తుటి మరకలు... ‘పాతాళ్ లోక్’ మన సిస్టమ్‌కి అద్దం పడుతుంది. 

ఇండియన్ పాపులర్ సిరీస్‌లో లీడ్ క్యారెక్టర్ ‘అండర్‌డాగ్’ పోలీస్ కావడం రొటీన్ ఫీచర్ అవుతోంది. ఫ్యామిలీ మ్యాన్, స్పెషల్ ఆప్స్‌లో మాదిరిగా ఇక్కడ హీరోకీ ఫ్యామిలీ యాంగిల్ కథలో భాగంగా జోడించారు. తన భార్యని బురిడీ కొట్టించే బావ, దారి తప్పిన టీనేజ్ కొడుకుతో హాతీరామ్ చౌదరికి వచ్చే అదనపు తలపోట్లు కూడా ‘పాతాళ్ లోక్’ కథలో ఎంచక్కా ఇమిడిపోయాయి. హాతీరామ్‌కి తన భార్యతో (గుల్ పనాగ్) వున్న అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారు. ఒకానొక సందర్భంలో భార్యపై హాతీరామ్ చేయి చేసుకుంటే... అతను తిరిగి రాగానే రోడ్డు మీదే లాగి చెంపమీద కొడుతుంది. అంతే. ఇక రియాక్షన్లు, పర్యవసానాలు వుండవు. 

ఈ సిరీస్‌కి అతి పెద్ద ఎస్సెట్ స్టార్ కాస్ట్. జీవితంలో ఒక్కసారి లభించే అవకాశం లాంటిదానిని జైదీప్ అహ్లావత్ అద్భుతంగా వినియోగించుకున్నాడు. అతడు ఏదైనా సమస్యకి దగ్గరగా వెళుతున్నపుడు కానీ, అతను నిజంగా ప్రమాదంలో పడినపుడు కానీ ఎలాగైనా తప్పించుకోవాలని తపించిపోయేంతగా హాతీరామ్ మనసుకి హత్తుకుపోతాడు. నీరజ్ కాబి తన పాత్రకి కావాల్సిన డిగ్నిటీతో పాటు అలాంటి గ్రే క్యారెక్టర్‌కి వుండే దుర్లక్షణాలని కూడా చాలా ఈజ్‌తో చూపించాడు. హథోడా త్యాగిగా అభిషేక్ బెనర్జీకి వున్న సీన్లు తక్కువే కానీ... కర్కోటకుడైన హంతకుడు ఎలా వుంటాడనేది కళ్లకి కట్టాడు. గుల్ పనాగ్, స్వస్తికా ముఖర్జీ, నిహారిక లైరా దత్ మూడు భిన్నమైన లేడీ క్యారెక్టర్స్‌లో తమ నటనతో ఈ సిరీస్‌కి అదనపు బలంగా నిలిచారు. 

డార్క్ మూడ్‌కి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్... పాతాళ్ లోక్ టెక్నికల్‌గా ఏ బాలీవుడ్ సినిమాకీ తీసిపోదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇండియన్ సిరీస్ హవా ఇప్పుడిప్పుడే మొదలవుతోంటే... పాతాళ్ లోక్ మన సిరీస్ ప్రపంచ స్థాయి రచనలని, చిత్రీకరణని ఛాలెంజ్ చేసే లెవల్లో వుంది. పాతాళ్ లోక్ చూడాలనుకుంటే ఒక ఆరేడు గంటల సమయం మరే పనీ పెట్టుకునే పని లేదంటేనే మొదలు పెట్టండి. సిరీస్ ఆపకుండా చూసే అలవాటున్న వారికయితే అమెజాన్ ప్రైమ్ నుంచి ఇది క్వారంటైన్ గిఫ్ట్ అనుకోండి. 

బాటమ్ లైన్: ఈ లోకం చూసి తీరాల్సిందే!  

గణేష్ రావూరి

Show comments