టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజకీయ తప్పటడుగులు వేస్తున్నారు. ఆ అడుగులు తనకు తానుగా రాజకీయ మరణ శాసనాన్ని రాసుకుంటున్నట్టుగా ఉంది. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టుకు ప్రాణం పోసే జీఓ 203పై చంద్రబాబు వ్యతిరేక వైఖరి ప్రదర్శించడం ద్వారా ఆరు జిల్లాల్లో రాజకీయంగా సమాధి కట్టుకోవడమే అని చెప్పక తప్పదు. మానసిక జబ్బుతో బాధపడుతున్న డాక్టర్ సుధాకర్‌కు ఇస్తున్న ప్రాధాన్యంలో కరవుతో అల్లాడుతున్న సీమతో పాటు మరో రెండు జిల్లాలకు చంద్రబాబు ఇవ్వడం లేదు.
తనకు జన్మనిచ్చిన రాయలసీమ గడ్డపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కక్ష కట్టినట్టు వ్యవహ రిస్తున్నారు. తనకు జన్మనివ్వడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పించి, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సీమ రుణాన్ని బాబు తీర్చుకోకపోగా, ఆ ప్రాంతానికి నష్టం కలిగించేందుకు కక్షతో వ్యవహరిస్తుండటం సీమ ప్రజల్ని ఆశ్చర్యపరుస్తోంది, ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాదు, సీమ పుండుపై కారం చల్లినట్టు మాట్లాడుతున్న బాబుపై ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహానికి లోనవు తున్నారు.
సీమకు ప్రయోజనం కలిగించే జీవో 203 విషయంలో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతగా, రాయలసీమ బిడ్డగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అండగా నిలబడడానికి బదులు, పరోక్షంగా తెలంగాణకు బాబు సహకరిస్తుండటంపై సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు మండిపడుతున్నారు.
తాజాగా పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో బాబు మాట్లాడారు. ఆ మాటల్లో మరోసారి సీమతో పాటు ఆ రెండు జిల్లాల ప్రజలపై పరోక్షంగా బాబు తన అక్కసును వెళ్లగక్కారు. అలాగే మతిస్థిమితం కోల్పోయిన ఇష్టానుసారం వ్యవహరిస్తున్న డాక్టర్ సుధాకర్‌కు విపతీరమైన ప్రాధాన్యం ఇవ్వడాన్ని చూస్తే....బాబుకు కరవుతో అల్లాడుతున్న ప్రాంతాల కంటే, రాజకీయాలే ముఖ్యమని తేలిపోయింది.
‘కరోనా సమయంలో ఆస్పత్రుల్లో వైద్యులకు మాస్కులు లేవన్నందుకు సస్పెండ్ చేశారు. ఇప్పుడు నడిరోడ్డుమీద పెడరెక్కలు విరిచి కట్టి లాఠీలతో కొట్టి పిచ్చాడని ముద్రవేసి మానసిక వైద్యశాలలో చేర్పించారు. ఏమి అమానుషం ఇది? ఒక దళిత డాక్టర్‌ను ఇంత ఘోరంగా అవమానించడాన్ని సమాజం తీవ్రంగా ఖండించాలి. సుధాకర్‌పై తప్పుడు కేసులు ఎత్తివేయాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇదే సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం కలిగించే జీఓ 203పై అదే వీడియో కాన్ఫరెన్స్‌లో బాబు స్పందన ఏంటో చూద్దాం.
‘తెలంగాణ భూభాగం మీద నుంచి నీళ్లు నడవడానికి ఒప్పు కొన్నారని, ఇద్దరం కలిసి రెండు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని జగన్మోహన్రెడ్డి సినిమా డైలాగులు చెప్పారు. ప్రజల దృష్టి మళ్లిం చడానికి ఇప్పుడు ఉత్తుత్తి జీవోలు ఇచ్చి నాటకాలు ఆడుతు న్నారు’ అని బాబు ఆరోపించారు. సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్ల విషయానికి వస్తే మాత్రం సినీ డైలాగ్‌లు, ఉత్తుత్తి జీవోలు, నాటకాలు అంటూ కరవు ప్రాంత ఆకాంక్షలను హేళన చేసేలా బాబు సరికొత్త వాదనలు ముందుకు తెస్తున్నారు.
అంటే సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు ఇచ్చే ఏ ఒక్క పనిని బాబు అంగీకరించరని ఆయన మాటలతో మరోసారి తేలిపోయింది. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాల్లో టీడీపీకి నామమాత్ర పట్టు ఉంది. అంతోఇంతో బలం ఉన్న ప్రకాశం జిల్లాలో బాబు తాజా వైఖరి వల్ల ఈ దఫా అది కూడా పోయేలా ఉంది.
రాయలసీమలో 52, నెల్లూరులో 10, ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలున్నాయి. అలాగే సీమలో 8 పార్లమెంట్ స్థానాలు న్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 49 అసెంబ్లీ, 8కి 8 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అలాగే నెల్లూరులో 10కి 10 అసెంబ్లీ, నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ స్థానాల్లోనూ వైసీపీనే గెలుపొందింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ ఓ మోస్తారు ఫలితాలను సాధించింది. మొత్తం మీద ఘోర పరాజయాన్ని చవి చూసిన టీడీపీ ఏపీలో తిరిగి అధికారంలోకి రావాలంటే, అన్ని ప్రాంతాల్లో బలాన్ని పెంచుకోవాలి. ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు నడుచుకోవాలి.
కానీ 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలి ఆ దిశగా ఆలోచించడం లేదు. జీవో 203ని వ్యతిరేకించడం ద్వారా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ ప్రాంత రైతాంగానికి, ఇతర ప్రజలకు సాగు, తాగునీరు అందించే పథకానికి జగన్ శ్రీకారం చుడితే, బాబు వ్యతిరేకించడం ద్వారా ఆ ప్రాంతాల ఆగ్రహానికి గురి కాక తప్పదు. ఏ ఎన్నికలొచ్చినా బాబు ప్రజావ్యతిరేక నిర్ణయంపై ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో రాజకీయ దాడి తప్పక చేస్తారు.
మరోవైపు అమరావతిలో 19 గ్రామాల ప్రజల కోసం బాబు జోలే పట్టడం కళ్లెదుట కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్‌పై కోపంతో ఆయన చేపట్టిన తాగు, సాగునీటి ప్రాజెక్టుకు అడ్డుపడటం వల్ల అంతిమంగా బాబుకే రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తనకు తానుగా రాజకీయ భవిష్యత్‌కు మరణ శాసనం రాసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.
-సొదుం