చిత్తూరు జిల్లాలో ఆ నాయకుడు ఎమ్మెల్యేగా పని చేశాడు. ఆ తర్వాత కాలంలో కూడా రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చాడు. అయితే అతని మానసిక స్థితిపై అనుచరుల్లో ఎక్కడో అనుమానం. ఏదో తేడా చూపుతోందని అనుచరులు పరస్పరం చెవులు కొరుక్కోవడం మొదలు పెట్టారు. అనుచరుల అనుమానాలకు బలమైన కారణాలు లేకపోలేదు. ఒక రోజు ఏమైందంటే...అనారోగ్యం తో బాధపడుతున్న సదరు నాయకుడు తిరుపతి స్విమ్స్‌కు వెళ్లాడు. డాక్టర్ గారి చెవిలో ఆ నాయకుడు మెల్లిగా..."సార్ ఇంతకూ నన్ను వెంటపడుతున్నాడే ఎవరితను?" అని అడిగాడట.
అప్పుడు అతనికి ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండానే జబ్బు ఏంటో ఆ డాక్టర్ నిర్ధారణకు వచ్చాడట! ఇంతకూ ఆ నాయకు డిని వెంటపడుతున్న సదరు వ్యక్తి అతని కారు డ్రైవర్ అట. ఆ తర్వాత కాలంలో ఆ నాయకుడు రాజకీయాలకు పూర్తిగా దూర మయ్యాడు. ఎందుకంటే అతను అల్జీమర్స్ అనే మతిమరుపు జబ్బుతో బాధపడడమే కారణం. ఆ నాయకుడికి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడితో ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే.
ప్రస్తుతానికి వద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి మానసిక స్థితి మానసిక వైద్యులకు సవాల్‌గా మారిందంటే అతిశయోక్తి కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. అసలు చంద్రబాబు అంటేనే మేధావులకే మేధావి. ఈ విషయాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక సార్లు అసెంబ్లీ వేదికగా చెబుతూ... అంతటి మేధావి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం గర్వకార ణమని ప్రశంసించారు కూడా.
రాష్ట్రపతి, ప్రధానులను గద్దెనెక్కించిన అపరమేధావి, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన అద్భుత జ్ఞాన సంపన్నుడైన చంద్రబాబునాయుడి గురించి ఎంత పొగిడినా తక్కువే. ఇదంతా గత వైభవంగానే మిగిలిపోనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
చంద్రబాబు సామాన్యుడు కాదు, ఆయన చివరి క్షణంలోనైనా రాజకీయాలన్నింటిని మార్చేసే గొప్ప చాణక్యుడు అని సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా గత ఏడాది ప్రశంసించినట్టు గుర్తు. కానీ ఇప్పుడు మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ విషయంలోనూ, ఇటీవల వైజాగ్‌లో ఎల్జీ పాలిమర్స్ ఘనటలో బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంలో కావచ్చు... బాబు ఆరోపణలు దేనికి సంకేతం? నిజంగా ఒకప్పటి బాబుకు, ఇప్పటి బాబుకు తేడా కనిపించడం లేదా? తప్పకుండా కనిపి స్తోంది. ఆ తేడా నక్కకు, నాగలోకానికి ఉన్నంత అని చెప్పక తప్పదు.
డాక్టర్ సుధాకర్ విషయాన్నే తీసుకుందాం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైద్యుడు సుధాకర్‌తో పోలీసులు వ్యవహరించిన తీరు అనాగరికమని, ఇది పౌరసమాజానికి మాయని మచ్చ అని చంద్రబాబు ట్వీట్ చేశాడు. సుధాకర్ దొంగా? పోలీసులు ఎం దుకు కొట్టారు? ఆయన చేతుల్ని తాళ్లతో ఎందుకు కట్టేశారు? గత వారం నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ ఎందుకు వస్తు న్నాయ్? లాఠీ ఉపయోగించకుండా , తాడుతో చేతులు కట్టకుండా సుధాకర్‌ని అదుపులోకి తీసుకోవచ్చు కదా? వీటి అన్నిటికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని బాబు ట్వీట్ చేశాడు.
మరోవైపు డాక్టర్ సుధాకర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి తెలిపారు. "ఎక్యూట్ హ్యాండ్ యాడ్ కామెంట్ సైకోసిస్" సమస్యతో బాధపడుతున్నారని ఆమె వెల్లడించారు.
అల్జీమర్స్‌తో బాధపడుతున్న నారా రామ్మూర్తినాయుడిని ఇంట్లో నిర్బంధించారని, ఈ తీరు అనాగరికమని, సభ్య సమాజం తలదించుకోవాలని, పౌరసమాజానికి మాయని మచ్చ అని ...దీనికి చంద్రబాబు సమాధానం చెప్పా ల్సిందేనని జగన్ డిమాండ్ చేస్తే ఎలా ఉంటుంది? అడిగిన వాళ్లకే పిచ్చి పట్టిందేమోనని అనుకునే ప్రమాదం ఉంది. మరిప్పుడు మానసిక వైద్యుల పర్యవేక్ష ణలో చికిత్స పొందుతున్న రోగి గురించి ప్రశ్నలు వేస్తున్న బాబును జనం ఏమనుకుంటున్నారో....ఒకసారి విచారిస్తే మంచిది.
ఎల్జీ పాలిమర్స్ మృతులకు సంబంధించి ఒక్కో బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా కింద రూ.కోటి ఇస్తే....బాబు అన్న మాట లేంటి? ఎంత డబ్బు ఇస్తే మాత్రం చనిపోయిన వాళ్లు తిరిగి వస్తారా? అని బాబు ప్రశ్నించడం దేనికి సంకేతం? మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ల నుంచి ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందా? జస్ట్, తెలియక అడుగుతున్న ప్రశ్న ఇది. ఇదే బాబు తాను అధికారంలో ఉండగా రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో...అది కూడా తన ప్రచార యావతో జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోతే...ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. అప్పట్లో ఆయన ఇచ్చిన ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు.
అలాగే కమీషన్ పెంచాలని బాబును వేడుకున్న పాపానికి తోకలు కత్తెరిస్తానని నడిరోడ్డుపై క్షురకులను హెచ్చరించి, అవమానించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కరోనాపై హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్న మాటలు బాబు మానసిక స్థితిపై ఆందోళన కలిగించడం లేదా? ఇలా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత బాబు తానేం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి. అడ్డగోలు మాటలతో రోజురోజుకూ జనాల్లో బాబు పలుచన అవుతున్నారు. మొత్తానికి ఒకప్పటి బాబుకు, ఇప్పటి బాబుకు స్పష్టమైన తేడా ఆయన మాటలే ప్రతిబింబిస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు అంటే మేధావితనానికి పర్యాయపదం. మరిప్పుడు ఆయన డాక్టర్ సుధాకర్ స్థాయికి దిగజారారంటే జాలి చూపడం తప్ప చేయగలిగేదేమీ లేదు. ఇంకా మున్ముందు బాబును ఏ స్థితిలో చూడాల్సి వస్తుందోననే ఊహే భయపెడుతోంది.