వ‌కీల్‌సాబ్‌కు రెడ్‌ సిగ్నల్‌

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకోవాల‌నుకున్నారు. తిరుమ‌ల‌కు వెళ్లాల‌ని సంక‌ల్పించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ నుంచి రాయ‌ల‌సీమ ఎక్స్‌ప్రెస్‌కు రిజ‌ర్వేష‌న్ చేసుకున్నార‌ని అనుకుందాం. మీర‌నుకున్న స‌మ‌యానికి సికింద్రాబాద్ నుంచి రాయ‌ల‌సీమ ఎక్స్‌ప్రెస్ బ‌య‌ల్దేరారు. ఆ ఎక్స్‌ప్రెస్ మార్గ‌మ‌ధ్యంలో అనేక స్టేష‌న్ల‌ను దాటుకుని రాయ‌ల‌సీమ‌లో ఎంట‌ర్ అవుతుంది. తాడిప‌త్రి, ఎర్ర‌గుంట్ల‌, క‌డ‌ప‌, రాజంపేట‌, రైల్వేకోడూరు స్టేష‌న్లు దాటుకుని నిర్దేశిత స‌మయానికే ప్ర‌యాణిస్తూ ఉంటుంది. ఇక ఒకే ఒక స్టేష‌న్ రేణిగుంట దాటిన వెంట‌నే గ‌మ్య స్థాన‌మైన తిరుప‌తి చేరుకుంటారు.

దీంతో ప్ర‌యాణికులు త‌మ సామాన్లు స‌ర్దుకుంటూ ఉంటారు. రైల్లో చిన్న‌పాటి అలికిడి మొద‌లువుతుంది. రేణిగుంటకు రెండు కిలో మీట‌ర్ల బ‌య‌ట రెడ్ సిగ్న‌ల్ ప‌డ‌టంతో రైలును నిలిపేస్తారు. ప్ర‌యాణికుల్లో అస‌హ‌నం. 10, 15, 30 నిమిషాలు గ‌డిచి పోతోందే కానీ, అటు వైపు గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. దీంతో కొంద‌రు ప్ర‌యాణికులు తీవ్ర ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు.

ఇదంతా మ‌న జన‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి మాట్లాడుకునే ముందు చెప్పాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఏపీ స‌ర్కార్ జారీ చేసిన జీఓ 203 వేడెక్కించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే పార్టీకి చెందిన నాయ‌కులు వేర్వేరు స్టాండ్స్ తీసుకోవాల్సిన ప‌రిస్థితి. ప్రాంత ప్ర‌యోజ‌నాల త‌ర్వాతే రాజ‌కీయాలు అనే ఆలోచ‌న వాళ్ల ప్ర‌క‌ట‌న‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

అయితే జీఓ 203పై ఏ అభిప్రాయం లేక‌పోవ‌డ‌మే త‌మ పార్టీ అభిప్రాయంగా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇదే పంథాను జ‌న‌సేనాని ప‌వ‌న్‌కల్యాణ్ కూడా అనుస‌రిస్తుండ‌టం గ‌మనార్హం. అయితే ఇక్క‌డ ప్ర‌ధానంగా ఏపీలో బీజేపీ-జ‌న‌సేన మిత్ర‌పక్షాలు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 16న విజ‌య‌వాడ‌లో రెండు పార్టీల ముఖ్య నాయ‌కులు స‌మావేశ‌మై పొత్తు కుదుర్చుకున్నారు.

ఈ సంద‌ర్భంగా జాతీయ‌, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం క‌లిసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు రెండు పార్టీల నేత‌లు ప్ర‌క‌టించారు. అలాగే రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నుంచి 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కు క‌లిసి క‌ట్టుగా ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ ఆచ‌ర‌ణ‌కు వ‌చ్చే సరికి పొత్తు ఒప్పందాలు అమ‌లు కావ‌డం లేదు.

ప్ర‌స్తుతానికి వ‌స్తే శ్రీ‌శైలం నుంచి రాయ‌ల‌సీమ‌కు నీటి త‌ర‌లింపుపై ఏపీ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యంపై తెలంగాణ స‌ర్కార్‌తో పాటు అక్క‌డి అన్ని ప్ర‌తిప‌క్షాలు అభ్యంత‌రం చెబుతున్నాయి. జ‌గ‌న్ స‌ర్కార్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యం లో ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మౌనం పాటించి...ప‌రోక్షంగా తెలంగాణ‌కు వ‌త్తాసు ప‌లుకుతున్న‌ద‌నే విమ‌ర్శ‌లున్నాయి.

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ మాత్రం జ‌గ‌న్ స‌ర్కార్‌కు గ‌ట్టి మ‌ద్ద‌తు ఇస్తోంది. ఎట్టి  ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ స‌ర్కార్ సీమ‌కు శ్రీ‌శైలం నీళ్లు తీసుకెళ్ల‌డంలో వెన‌క్కి త‌గ్గ‌వ‌ద్ద‌ని చెబుతూ కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. అంతేకాదు, త‌మ పార్టీ త‌ర‌పున కేంద్రంతో మాట్లాడుతామ‌ని కూడా ఆ పార్టీ నాయ‌కులు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన నాయ‌కులు ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారో తెలుసుకుందాం.

తెలంగాణ ప్ర‌భుత్వంతో న్యాయ‌పోరాటం చేసైనా రాయ‌ల‌సీమ‌కు నీళ్లు ఇవ్వాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కన్నా ల‌క్ష్మినారాయ‌ణ డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయ‌న విలేకరుల‌తో మాట్లాడుతూ కృష్ణా మిగులు జ‌లాల‌ను రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించాల‌నేది రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌య‌మ‌న్నారు. అలాగే జీఓ 203 విష‌యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గ‌వ‌ద్ద‌ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు డాక్ట‌ర్ పార్థ‌పార‌థి వాల్మీకి అన్నారు.

సీఎం జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా, వ్య‌క్తిగ‌తంగా బ‌ద్ద శ‌త్రువైన క‌డ‌ప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత ఆదినారాయ‌ణ‌రెడ్డి మాట్లాడుతూ సిద్దేశ్వ‌రం నుంచి 3 టీఎంసీల నీటిని తెచ్చేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి 203 జీవో తీసుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. త‌మ ప్రాంతానికి నీళ్లు కొచ్చే విష‌య‌మై రాజ‌కీయాల‌ను, వ్య‌క్తిగత విభేదాల‌ను కూడా ఆదినారాయ‌ణ‌రెడ్డి ప‌క్క‌న పెట్టి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, రాయ‌ల‌సీమ హ‌క్కుల ఉద్య‌మ‌కారుడైన టీజీ వెంక‌టేష్ మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ భూభాగంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుపై తెలంగాణకు ఎలాంటి హ‌క్కులు లేవ‌ని, జీవో 203పై ఆ రాష్ట్రం మూర్ఖంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విరుచుకుప‌డ్డారు. జీవో 203పై సీఎం జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గొద్ద‌ని, అవ‌స‌ర‌మైతే కేంద్రానికి బీజేపీ త‌ర‌పున‌ విన్న‌విస్తామ‌ని ఆయ‌న అన్నారు.

జ‌న‌సేన మిత్ర‌ప‌క్ష మైన బీజేపీ ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌చ్చే స‌రికి రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి ఏపీ స‌ర్కార్‌కు నైతికంగా ఎంతో గొప్పగా మ‌ద్ద‌తు ఇస్తూ అండ‌గా నిలుస్తోంది. బీజేపీ నేత‌ల మాట‌లు వింటుంటే వైసీపీకి మిత్ర‌ప‌క్ష పార్టీనా అనే అనుమానాలు క‌లిగేలా ఉన్నాయి. కానీ అధికారికంగా పొత్తు కుదుర్చుకున్న బీజేపీ - జ‌న‌సేనలు ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి త‌లో దారిలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. పొత్తు ధ‌ర్మాన్ని జ‌న‌సేన విస్మ‌రిస్తోంద‌ని కొంత కాలంగా ప్ర‌చారంలో ఉంది. అదిప్పుడు నిజ‌మ‌ని రుజువ‌వుతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అధికారికంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న‌ప్ప‌టికీ, అన‌ధికారికంగా మాత్రం టీడీపీతో జ‌న‌సేన వ్య‌వ‌హారాలు న‌డుపుతోంది. పోతిరెడ్డిపాడు విష‌యంలో టీడీపీ ఏ వైఖ‌రి అవ‌లంబిస్తోందో, అదే మార్గంలో జ‌న‌సేన కూడా ప్ర‌యాణిస్తుండ‌టం గ‌మ‌నార్హం. జీఓ 203పై ఇంకా నాలుగు రోజులు చూసి స్పందిస్తాన‌ని తెలంగాణ టీడీపీ నేత‌లతో చంద్ర‌బాబు అన్నారు. బ‌హుశా బాబు స్పందించే వ‌ర‌కు ప‌వ‌న్ కూడా మాట్లాడ‌ర‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే పైన రైలు క‌థ చెప్పుకున్న‌ట్టు వ‌కీల్‌సాబ్ (ప‌వ‌న్‌)కు బాబు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేంత వ‌ర‌కు నోరు మెద‌ప‌రు కాక మెద‌ప‌రు. ప్ర‌స్తుతం  రెడ్ సిగ్న‌ల్ వేయ‌డంతో వ‌కీల్‌సాబ్‌లో ఉలుకూ ప‌లుకూ లేదు.

-సొదుం

ఈనాడు తప్పుడు రాతలు రాస్తోంది

Show comments

Related Stories :