ఎమ్బీయస్‌: ఓ గూఢచారిణి ప్రేమకథ 11

ఇప్పటికి 10 భాగాలైంది. అనేక పాత్రలు వచ్చాయి, వెళ్లాయి. ఎన్నిటిని గుర్తు పెట్టుకోవాలో అని బెంగపడేవారి కోసం యికపై ముఖ్యమైన వారెవరో ఒకసారి చెప్తాను. క్యారీ సిఐఏలో గూఢచారిణి. డేవిడ్‌, సాల్‌ ఆమె కొలీగ్స్‌, ఈ భాగంలో పీటర్‌ అనే అతను పరిచయమవుతాడు. ఇక అల్‌ఖైదా నాయకుడు నజీర్‌, అతని తరఫున బ్రాడీని హేండిల్‌ చేస్తున్నది రోయా అనే జర్నలిస్టు. నజీర్‌ బందీగా వుండే రోజుల్లో అతని కొడుకుతో అనుబంధం ఏర్పడి అతని చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి వైస్‌ ప్రెసిడెంటు వాల్డెన్‌ను చంపడానికి సిద్ధపడిన వ్యక్తి బ్రాడీ. అతని భార్య జెసికా, కూతురు డానా, కొడుకు క్రిస్‌. డానాకు, వాల్డెన్‌ కొడుకు ఫిన్‌కు మధ్య స్నేహం పెరుగుతోంది. జెసికా ప్రియుడు మైక్‌. బ్రాడీని అనుమానించే మెరీన్‌ లాండర్‌. వీళ్ల సంగతి గుర్తుంటే చాలు.

ఇక కథలోకి వస్తే - సాల్‌ క్యారీ యింటినుంచి సరాసరి డేవిడ్‌ యింటికి వెళ్లి బ్రాడీ వీడియో చూపించాడు. తాము యిన్నాళ్లూ తప్పుదోవన ఉన్నామనీ, తమ కంటె క్యారీయే తెలివైనదనీ, ఆమెను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలనీ డేవిడ్‌ కూడా అంగీకరించాడు. వీడియో ఆధారంగా బ్రాడీని అరెస్టు చేద్దామా అంటే సాల్‌ వద్దన్నాడు. మనం తెలియనట్లుగా నటిస్తేనే బ్రాడీని వెనకనుంచి ఆడించే నజీర్‌ మనుషులు తెలుస్తారు. వాళ్లు భవిష్యత్తులో చేయబోయే దాడుల గురించి తెలుస్తుంది. అరెస్టు చేస్తే ఆ కనక్షన్‌ కట్‌ అయిపోతుందన్నాడు.

ఈ సమాచారాన్ని డిపార్టుమెంటు వరకే పరిమితం చేసి, ఒక టీము ద్వారా బ్రాడీని గమనిద్దామన్నాడు. బ్రాడీని గతంలో క్యారీ యింటినుంచి గమనించిన వర్జిల్‌ని బ్రాడీపై నిఘాకై నియమించారు. క్యారీ మళ్లీ ఆఫీసుకి వచ్చింది. డేవిడ్‌ ఆమెకు పీటర్‌ (క్విన్‌) అనే ఎనలిస్టును పరిచయం చేశాడు. బ్రాడీ వ్యవహారాన్ని పర్యవేక్షించే టీముకి ఆధ్వర్యం వహిస్తాడని చెప్పాడు. ఎవరితను, ఎప్పుడూ చూడలేదే అంది క్యారీ. ఆరేళ్ల అనుభవం వుంది. ఈ బిల్డింగులోనే పని చేస్తూ వచ్చాడు, నువ్వు గమనించలేదేమో అన్నాడు డేవిడ్‌.

పీటర్‌ మాటదురుసుతనం క్యారీకి నచ్చలేదు. అతని కింద పనిచేయడమూ నచ్చలేదు. పైకి ఊరుకుంది కానీ ‘ఈ పీటర్‌ ఎవరో, ఏమిటో కాస్త పరిశోధించు.’ అని వర్జిల్‌ను కోరింది. ‘బ్రాడీని సిఐఏ ఆఫీసుకి పిలిపిస్తాం. అతను వచ్చే సమయానికి అనుకోకుండా కలిసినట్లు నటించి, స్నేహంగా మాట్లాడు. అతనికి భయం వేసి నీ గురించి ఎవరికైతే చెప్తాడో వాళ్లే నజీర్‌ మనుష్యులని మనకు అర్థమవుతుంది. అతని ఆఫీసులో కెమెరాలు పెట్టాం. అతని ఫోన్లు ట్యాప్‌ చేశాం.’ అన్నాడు పీటర్‌. క్యారీ సరేనంది.

సమావేశం రోజున కనబడకుండా పోయినందుకు బ్రాడీ మర్నాడుదయం క్షమాపణ చెప్పబోయాడు కానీ జెసికా వినలేదు. ‘‘నువ్వేదో దాస్తున్నావ్‌. నిజం చెప్పదలిస్తే లోపల ఉన్నదంతా కక్కేయ్‌. సగం చెప్పి.. సగం కప్పిపుచ్చి.. ఏమిటిదంతా?’’ అని కడిగేసింది. ‘‘చెప్పాలని వుంది కానీ చెప్పలేను’’ అన్నాడు బ్రాడీ. ‘‘ఈ నాటకాలు వద్దు, నిజం చెప్పేదాకా నువ్వు యింటికి రానక్కరలేదు.’’ అని నిర్మొగమాటంగా చెప్పేసింది. అతను ఏమీ మాట్లాడలేక ఒక బ్రీఫ్‌కేసులో బట్టలు సర్దుకుని, కారులో పెట్టుకుని ఆఫీసుకి బయుదేరాడు. కారులోపల టైలర్‌ సంఘటన తాలూకు దుర్గంధం పోవడానికి ఓ వర్క్‌షాపుకి వెళ్లి కారు యిచ్చాడు. ఆ షాపతను అరబ్‌ వాడు. బ్రాడీని వెంబడిస్తున్న వర్జిల్‌ సోదరులు యిది గమనించారు.

అక్కణ్నుంచి బ్రాడీ సిఐఏ ఆఫీసుకి వచ్చినపుడు పథకం ప్రకారం క్యారీ హఠాత్తుగా అతన్ని చూసి, ఆశ్చర్యపడుతున్నట్లు పలకరించింది. బ్రాడీ నిజంగా తెల్లబోయాడు. ఏమిటిక్కడ అంటే మళ్లీ ఉద్యోగంలో చేరాను. చిన్నదే అనుకో అంది. బ్రాడీ మర్యాదపూర్వకంగానే మాట్లాడాడు. కలుస్తూందాం అన్నాడు. ఆఫీసుకి వెళ్లగానే రోయా వచ్చి కలిసింది. ఆమెను ఓ కారిడార్‌లో కలిసి యాదాలాపంగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ టైలర్‌ విషయంలో జరిగినది చెప్పి, దానితో బాటు క్యారీ సిఐఏలోకి మళ్లీ వచ్చిందని చెప్పాడు.

‘నీ మీద అనుమానంతో కాదులే, నజీర్‌ గురించి అన్వేషించడానికి సమర్థురాలని పిలిచి వుంటారు. ఏది ఏమైనా తనతో స్నేహంగా వుంటే మంచిది. సిఐఏ వాళ్ల ఆలోచనావిధానం మనకు తెలుస్తూంటుంది.’ అంది రోయా. బిల్డింగులో ఆడియో సర్వయిలెన్స్‌ ఏర్పాటు యింకా చేసుకోలేదు కాబట్టి వాళ్లు మాట్లాడుకున్న దేమిటో పీటర్‌ బృందానికి తెలియలేదు కానీ, రోయా నజీర్‌ తాలూకు మనిషని అర్థమైంది. అందరూ క్యారీని అభినందించారు. ఆఫీసయ్యాక బ్రాడీ యింటికి వెళ్లే ధైర్యం చేయలేక, ఫోన్‌ చేశాడు. నువ్వు యింటికి రానక్కరలేదంది జెసికా. అది సిఐఏ వినేసింది. గత్యంతరం లేక బ్రాడీ ఏష్‌ఫోర్డ్‌ హోటల్‌కు వెళ్లి గది తీసుకున్నాడు. పీటర్‌ టీముకి అది తెలిసిపోయింది.

బ్రాడీ మెరీన్‌ కొలీగ్‌ ఐన లాడర్‌కు టామ్‌ మరణం గురించి సందేహాలు తీరలేదు. బ్రాడీని ముఖాముఖీ అడుగుతానని ఆ రాత్రి యింటికి వచ్చి కూర్చున్నాడు. తీరా బ్రాడీ యింట్లో లేడు. ఇతని గోల భరించలేక పోయింది జెసికా. మొగుడికి ఫోన్‌ చేస్తే ఎప్పటిలాగా అతను దొరకలేదు. అప్పుడు మైక్‌కు ఫోన్‌ చేసి యితన్ని యిక్కణ్నుంచి తీసుకుపొమ్మనమని కోరింది. మైక్‌ వచ్చి లాడర్‌ను తన కారులో తీసుకెళ్లి యింట్లో దింపేశాడు. దారిలో లాడర్‌ ‘‘టామ్‌, బ్రాడీ మెరీన్స్‌లో వుండగానే కలిసి పనిచేసేవారు. అక్కడ కూడా కలిసే పని చేసి వుంటారు.’’ అంటూ వాదించాడు. ‘‘బ్రాడీ గతంలోలా లేడన్నమాట నిజం. బహుశా యిద్దరూ సిఐఏ కోసం పనిచేస్తున్నారేమో’’ అన్నాడు మైక్‌.

వాళ్లు వెళ్లిన కాస్సేపటికి బ్రాడీ ఫోన్‌ చేశాడు ఏమైందంటూ. ‘‘గంట కితం నీ అవసరం పడింది. ఇప్పుడు లేదు. మైక్‌ వచ్చి నీ బదులు సాయపడ్డాడు. ’’ అని కసిగా చెప్పి, ఫోన్‌ పెట్టేసింది. బ్రాడీ తట్టుకోలేక పోయాడు. హోటల్లోనే వున్న బార్‌కి వెళ్లి తాగసాగాడు. అక్కణ్నుంచి క్యారీకి ఫోన్‌ చేసి బార్‌కు వస్తావా అని అడిగాడు. ఆ సమయానికి క్యారీ, పీటర్‌ యిద్దరూ ఆఫీసులో వాచ్‌రూమ్‌లో కూర్చుని బ్రాడీ కదలికలను మానిటార్‌ చేస్తున్నారు. ‘‘వెళ్లు. నీ బదులు సాల్‌ను రప్పిస్తాను. బ్రాడీతో తెలివిగా మాట్లాడి, పేర్లు కక్కించు’’ అన్నాడు పీటర్‌.

క్యారీ వెళ్లింది. ‘‘జరిగినది మర్చిపో. మళ్లీ స్నేహంగా వుందాం.’’ అన్నాడు బ్రాడీ. ‘‘తప్పకుండా. నీ జీవితంలో నుండి ఎనిమిదేళ్లు దొంగిలించిన టెర్రరిస్టును కొద్దికాలంలోనే పట్టుకోబోతున్నాం.’’ అంది క్యారీ, బ్రాడీని ఎలర్ట్‌ చేయాలని. చేస్తే బెదిరిపోయి అవతలివాళ్లకు ఫోన్‌ చేస్తాడు కదా అని ప్లాను. బ్రాడీ ‘‘సంతోషం’’ అంటూ అవీ యివీ మాట్లాడి ‘‘నీ చికిత్స ఎలా జరిగింది?’’ అని అడిగాడు. తర్వాత బిల్లు కట్టేటప్పుడు తన రూమ్‌ నెంబరు చెప్పి ఆ ఖాతాలో వేయమన్నాడు. గుడ్‌నైట్‌ చెప్పి వెళ్లిపోయాడు.

క్యారీ వెంటనే పీటర్‌కు ఫోన్‌ చేసింది - ‘నాకు చికిత్స జరిగిన సంగతి అతనికి ఎవరో చెప్పారు. నేను లెబనాన్‌లో చేసినదీ, అదీ కూడా తెలిసిపోయే వుంటుంది. అనుకోకుండా అతను వేసిన ప్రశ్న వలన నేను కంట్రోలు తప్పి కోపం ప్రదర్శించాను. అతనింక నన్ను నమ్మడు. మనకు ఏమీ చెప్పకపోగా మనం యితన్ని జారవిడుచుకుంటే నజీర్‌ సంగతి అస్సలు తెలియకుండా పోతుంది. ఇతను హోటల్‌ రూము నుంచి అవతలివాళ్లకు సిగ్నల్‌ పంపుతాడు చూడు.’ అని.

కానీ పీటర్‌, సాల్‌ ‘అబ్బే, అదేమీ లేదు, అతను మామూలుగానే అడిగి వుంటాడు. నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. వెనక్కి వచ్చేయ్‌.’ అని నచ్చచెప్పబోయారు. కానీ క్యారీకి నమ్మకం చిక్కలేదు. బ్రాడీని బంధిస్తేనే మంచిదనుకుంది. దానికి పీటర్‌ అనుమతి తీసుకోకుండా తనే స్టాఫ్‌కి ఫోన్‌ చేసి హోటల్‌ దగ్గరకు రమ్మనమంది. బ్రాడీ గది తలుపు కొట్టింది. అతను అప్పటికి మంచం మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. క్యారీని లోపలకి రమ్మన్నాడు.

‘నా ఎదురుగానే హోటల్‌ రూమ్‌ నెంబరు చెప్పడంలో ఉద్దేశం నన్ను గదికి ఆహ్వానించడమే అనుకుంటున్నా’ అని మాట్లాడుతూ అతను ఆజాగ్రత్తగా వుండగా హఠాత్తుగా ‘‘నువ్వు దేశద్రోహివి, టెర్రరిస్టువి, నీ సంగతంతా నాకు తెలుసు.’’ అని తిట్టిపోసింది. తెల్లబోయిన బ్రాడీ ‘‘నువ్వంటే ఎంతో యిష్టపడ్డాను..’’ అంటూ ఏదో చెప్పబోయాడు. ‘‘నేనూ నిన్ను ప్రేమించాను.’’ అంటూనే  క్యారీ తలుపు తెరిచి తన సిబ్బందిని రప్పించి, అతన్ని అదుపులో తీసుకోమంది. వాళ్లు అతని మొహానికి ముసుగు వేసి గదిలోంచి బయటకు యీడ్చుకుపోయారు. ఆ దృశ్యం చూసి క్యారీకి కన్నీళ్లు వచ్చాయి.

సిఐఏ ఆఫీసులో ఇంటరాగేషన్‌ గదిలో బ్రాడీకి సంకెళ్లేసి కుర్చీలో కూర్చోబెట్టారు. డేవిడ్‌ వచ్చి ఏం జరిగిందో తెలుసుకున్నాడు. క్యారీ చేసిన దూకుడు పని వలన యిప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిన ఘడియ వచ్చింది. ఇప్పటిదాకా క్యారీ ప్రేమలో ముంచి లాగుదామనుకున్న సమాచారాన్ని బెదిరించి లాగాలి. బెదిరిస్తే యితను బెదురుతాడా? అలా అని వదిలేస్తే అల్‌ ఖైదా వాళ్లు యితన్ని చంపేయవచ్చు. అప్పుడు తమకున్న ఏకైక మార్గం మూసుకుపోతుంది. అందువలన యితన్ని నయాన్నో, భయాన్నో లొంగదీసుకోవాలి అని టీము నిర్ణయించింది.

పీటర్‌ ముందుగా వెళ్లి బ్రాడీతో ‘చూడు, నువ్వు సిఐఏ కస్టడీలో వున్నావు, అది రికార్డుల్లో ఉండదు. నువ్వు కాంగ్రెస్‌మన్‌ అయినా మాకు ఖాతరు లేదు. లాయరును పిలుస్తానంటే యిక్కడ కుదరదు. ఉన్నదున్నట్లు చెప్పేయ్‌.’ అని మొదలుపెట్టాడు. బ్రాడీ తొణకలేదు. ఐసా ఎవరో తెలియదన్నాడు. నేను బాంబున్న జాకెట్‌ వేసుకోవడమేమిటన్నాడు. ఇలా అన్ని రకాల అబద్ధాలు ఆడనిచ్చి, అప్పుడు పీటర్‌ వీడియో చూపించాడు. ‘ఇప్పటికైనా అసలు సంగతి చెపితే మంచిది’ అని అతన్ని ఒంటరిగా వదిలిపెట్టి బయటకు వచ్చాడు. అతనికి నిద్ర లేకుండా హింసించసాగారు.  

ఈలోగా జెసికా బ్రాడీకి ఫోన్‌ చేయసాగింది. ఎవరూ తీయటం లేదు. పిల్లలతో ‘నాకూ, మీ నాన్నకూ గొడవ జరుగుతోంది. అందుకే యింటికి రావద్దన్నాను. కంగారు పడకండి’ అంది. డానా సరేలే అంది కానీ క్రిస్‌ బెంగపడ్డాడు. జెసికా బ్రాడీ సెక్రటరీకి ఫోన్‌ చేసి బ్రాడీ ఎక్కడున్నాడో కనుక్కోమంది. ఇలాటిది జరుగుతుందని ఊహించిన డేవిడ్‌ అతనికి ఫోన్‌ చేసి బ్రాడీకి ఫ్లూ వచ్చిందని, అందువలన హోటల్లోనే ఉంటున్నాడని వాళ్లావిడకు చెప్పు అన్నాడు.

కాస్సేపు పోయాక పీటర్‌ యింటరాగేషన్‌ రూముకి తిరిగి వచ్చేసరికి బ్రాడీ చెదిరాడు. ఐసా తెలుసని, వాల్డెన్‌పై తనకు కోపం వున్న మాట వాస్తవమని ఒప్పుకున్నాడు. చంపాలని అనుకుని వీడియో చేశాను తప్ప ఆత్మాహుతి జాకెట్‌ వేసుకోలేదు, అందుకే ఆ రోజు బంకర్‌లో ఏమీ జరగలేదు. నేను ఆ జాకెట్‌ వేసుకున్నట్లు మీ దగ్గర ఆధారం ఏమీ లేదు కదా అన్నాడు. ఆధారాలు కోర్టుకి కావాలి, ఈ విషయం నేను నీ భార్యాబిడ్డలకు చెపితే వాళ్లు నమ్ముతారో లేదో చూడు అని పీటర్‌ అన్నా చలించలేదు.

మర్యాదగా నజీర్‌ ప్లాను చేస్తున్న దాడి గురించి చెప్పు అని అడిగినా నాకేమీ తెలియదు అని అంటూ వచ్చాడు. బ్రాడీ నుంచి యింకేమీ రాబట్టలేనన్న కోపంతో పీటర్‌ హఠాత్తుగా ఒక చాకు తీసి అతని చేతి మీద బలంగా పొడిచాడు. రక్తం బొటబొటా కారింది. సాల్‌, క్యారీ వచ్చి పీటర్‌ని బయటకు లాక్కెళ్లారు. బ్రాడీ గాయానికి కట్టుకట్టారు.

పీటర్‌ అబ్జర్వేషన్‌ గదిలోకి రాగానే సాల్‌ ‘‘అదేమిటి, అంత ఆవేశపడ్డావ్‌?’’ అన్నాడు. ‘‘అదంతా కావాలని చేసిందే. ఇప్పుడు క్యారీని గుడ్‌ కాప్‌గా పంపాలంటే నేను బాడ్‌ కాప్‌ అవతారం ఎత్తాలి కదా’’ అన్నాడు పీటర్‌. నేరస్తుల నుంచి సమాచారం రాబట్టడానికి పోలీసులు అనాదిగా యిదే ట్రిక్కు ఉపయోగిస్తారు. ఒక ఆఫీసరు దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. మరొక ఆఫీసరు వచ్చి అనునయ వాక్యాలు చెప్పి, ‘నువ్వు నిజం చెప్పేయ్. యీ గొడవలు వదిలిపోతాయ్‌. నీకేం కాకుండా నేను చూసుకుంటాను.’ అని నచ్చచెపుతాడు. నేరస్తుడు కరిగిపోయి రెండోవాడికి నిజం చెప్పేస్తాడు. ఇప్పుడు క్యారీ అనునయ వాక్యాలతో బ్రాడీ నోరు విప్పేట్లు చేయాలని ప్లాను.

పీటర్‌ తర్వాత క్యారీ గదిలోకి వచ్చి కూర్చుని ‘‘నువ్వు నిజంగా దేశద్రోహం చేశావ్‌. అది కనిపెడుతున్నాను కదాని నాపై పిచ్చిదాని ముద్ర కొట్టి నా డిపార్టుమెంటులో నాకు చెడ్డపేరు వచ్చి, ఉద్యోగం ఊడేట్లు చేశావు. నా హృదయాన్ని ముక్కలు చేసి, నా మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీశావ్‌. నీ నాటకాలకు నేను బలై పోయాను. దాని గురించి గిల్టీగా ఎప్పుడైనా ఫీలయ్యేవా?’ అంటూ తిట్టిపోసింది. బ్రాడీ ‘నిజమే, నన్ను క్షమించు’ అన్నాడు. బాంబు జాకెట్‌ విషయంలో కూడా కొన్నాళ్లు పోయిన తర్వాత ఒప్పుకుంటావు కాబోలు అంది. కానీ బ్రాడీ నేను బాంబు పెట్టుకోలేదని చెప్తున్నాగా అన్నాడు.

ఇక యిలా కాదనుకుని, క్యారీ చూడు వీడియో కెమెరాలన్నీ ఆపేస్తున్నాను అంటూ వైర్లు పీకేసింది. అతని చేతి సంకెళ్లు విప్పేసింది. అయితే తన మైక్‌ మాత్రం ఆఫ్‌ చేయలేదు. అందువలన సాల్‌, పీటర్‌ పక్క గదిలోంచి మాటలు వినగలుగుతున్నారు. క్యారీ ‘నువ్వు ఎప్పుడూ అబద్ధాలు చెపుతూ వచ్చావు. నీ జీవితమే అబద్ధాలమయం అయిపోయింది. ఒక్కసారి నిజం చెప్పి చూడు, ఎంత హాయిగా వుంటుందో తెలుస్తుంది. ఉదాహరణకి నా మనసులో ఉన్న భావం ఏమిటో చెప్పనా- నువ్వు నీ భార్యాబిడ్డలను విడిచిపెట్టి వచ్చి నాతో జీవించా! అది జరుగుతుందో లేదో వేరే విషయం. కానీ మనసులో ఉన్నది పైకి చెప్పేస్తే మనసు తేలికపడుతుంది.

‘చూడు బ్రాడీ నువ్వు స్వతహాగా మంచివాడివి. ఇద్దరు రాక్షసుల మధ్య యిరుక్కున్నావు. వాల్డెన్‌ ఒకరకమైన రాక్షసుడైతే నజీర్‌ మరో రకమైనవాడు. వాడు వాల్డెన్‌ ఒక్కణ్నే చంపడు. అనేకమంది అమాయకులైన పౌరులనూ చంపుతాడు. వాళ్లల్లో జెసికాలు, డానాలు, క్రిస్‌లు కూడా వుంటారు. వాడు నీ అసలు వ్యక్తిత్వాన్ని శిథిలం చేసేసి, వాడికి తగినట్లు మళ్లీ నిర్మించాడు. నజీర్‌ చెప్పినట్లు నడుచుకుంటూ కూడా నువ్వు బాంబు మీట నొక్కలేకపోవడానికి కారణం నీ స్వతస్సిద్ధ స్వభావం. నీ కూతురు ఫోన్‌ చేయగానే నీలో మానవుడు మేలుకొన్నాడు. అనర్థం జరగకుండా కాపాడాడు. నేను ప్రేమలో పడినది ఆ బ్రాడీతో.’ అంటూ చెప్పుకొచ్చింది.

దాంతో బ్రాడీ కరిగిపోయాడు. ఏడ్చాడు. నువ్వు చెప్పినది నిజమే, బెల్ట్‌ బాంబు పెట్టుకుని కూడా ఆఖరి క్షణంలో మనసు మార్చుకున్నాను అని ఒప్పుకున్నాడు. తనకు తెలిసున్నదంతా విపులంగా చెప్పేశాడు. నజీర్‌ మనుషుల్లో తనకు తెలిసున్నవాళ్ల జాబితా చెపుతూండగా రోయా తప్ప తక్కిన అందరూ చచ్చిపోయారని గమనించాడు. నజీర్‌ భవిష్యత్‌ ప్రణాళిక తెలియదన్నాడు. అప్పుడు క్యారీ అతనికి చెప్పింది - ‘నీకు రెండు ఆప్షన్లున్నాయి. సిఐఏకు సహకరించి, నజీర్‌ను చంపడానికి వుపయోగపడు. అప్పుడు నీమీద ఏ కేసూ వుండదు. అయితే నువ్వు రాజకీయాల్లోంచి తప్పుకోవాలి. వైస్‌ ప్రెసిడెంటు పదవికి పోటీ చేయకూడదు. సిఐఏతో నాకేం  పని అంటావా, యీ వీడియో బయటకు విడుదల చేస్తాం. నీ కుటుంబం సిగ్గుతో చచ్చిపోతుంది.’ అని.

బ్రాడీ సిఐఏతో కలిసి పనిచేస్తానని ఒప్పుకున్నాడు. అంటే అతను యికపై డబుల్‌ ఏజంటుగా వుంటాడన్నమాట. అల్‌ఖైదా వార్తలు సిఐఏకు చెప్తాడు, సిఐఏ యిచ్చే ఉత్తుత్తి వార్తలు అల్‌ఖైదాకు చేరవేస్తాడు. అతని కుటుంబానికి ఆపద రాకుండా సిఐఏ రక్షిస్తుంది. ఇలా అతను ఒప్పుకోగానే సాల్‌ గదిలోకి వచ్చి బ్రాడీ చేతికి ఫోన్‌ యిచ్చి మీ ఆవిడతో మాట్లాడు, కంగారు పడుతోంది అన్నాడు.

జరిగిందేమిటంటే చాలా గంటలుగా జెసికా ఫోన్‌ చేసిచేసి విసిగి, బ్రాడీ హోటల్‌కు వెళ్లి అక్కడి స్టాఫ్‌తో మాట్లాడి గదిలోకి వెళ్లి చూసింది. అతనక్కడ లేడని గ్రహించింది. సెక్రటరీకి ఫోన్‌ చేసి అబద్ధమాడుతున్నావని నిందించింది. అతను డేవిడ్‌కు ఫోన్‌ చేసి యిదీ గొడవ అని చెప్పాడు. డేవిడ్‌ ‘అయితే బ్రాడీ చేతే వాళ్లావిడతో మాట్లాడిస్తానులే’ అని చెప్పాడు. బ్రాడీ ఫోన్‌ చేసే వేళకి యింట్లో డిన్నర్‌ చేస్తున్నారు. అదే సమయానికి వాళ్లమ్మాయి డానా డిన్నర్‌ అయ్యాక వాల్డెన్‌ కొడుకు ఫిన్‌తో కలిసి షికారుకి వెళతానంటోంది.

కొత్త స్కూల్లో చేరాక ఆమెకు ఫిన్‌ బాగా నచ్చడం మొదలెట్టాడు. తల్లితండ్రులు పోట్లాడుకోవడమనేది యిద్దరికీ ఉన్న ఉమ్మడి సమస్య. అతను వైస్‌ ప్రెసిడెంటు కొడుకే అయినా నెమ్మదస్తుడు. తండ్రికి హోదా ఉంది కాబట్టి కొన్ని సౌలభ్యాలుంటాయి. ఒక రోజు కొత్త బిఎమ్‌డబ్ల్యు కారులో వాషింగ్టన్‌ స్మారకచిహ్నానికి వెళ్లారు. మరమ్మత్తుల కోసం దాన్ని మూసేశారు కానీ యితన్ని అనుమతించారు. చుట్టూ ఉన్న సెక్యూరిటీ వాళ్లు కాస్త దూరంగా వున్న తరుణంలో ఫిన్‌ డానాను ముద్దాడాడు. పాత బాయ్‌ఫ్రెండ్‌ జాండర్‌కు గుడ్‌బై చెప్పనిదే మనం ముందుకు సాగడం భావ్యం కాదంది డానా. తర్వాత అతనికి చెప్పింది కూడా.

ఆ రోజు రాత్రి మళ్లీ కొత్త కారు వేసుకొస్తాను, షికారుకి వెళదాం అన్నాడు. ఆ ముక్క డానా తల్లికి చెపుతున్న సమయంలోనే బ్రాడీ ఫోన్‌ మోగింది.  బ్రాడీ ‘‘నేను ముఖ్యమైన పనిలో వున్నాను. పొద్దున్నే వస్తాను.’’ అన్నాడు. జెసికా నిట్టూర్చింది. డానా ‘‘అక్కడుండగా నాన్నను వాళ్లు మార్చేశారమ్మా’’ అని వాపోయింది. ఇంతలో ఫిన్‌ వచ్చి డానాను తీసుకెళ్లాడు. జెసికా సంతోషంగా పంపించింది. వాళ్లిద్దరూ ఊళ్లో తిరుగుతూండగా వెనక్కాల సెక్యూరిటీ వాళ్లు వేరే కారుల్లో వస్తున్నారు. వాళ్లను ఏమార్చలేమా అంది డానా. రెడ్‌ సిగ్నల్‌ పడిన చోట ఫిన్‌ కారు ముందుకు పోనిచ్చేసి, స్పీడు పెంచి, అటూయిటూ సందుల్లోకి పోనిచ్చి, వాళ్ల దృష్టి తప్పించాడు.

అది వీళ్లిద్దరికీ ఒక ఆటగా తోచింది. ఇంకా ఫాస్ట్‌గా పోనీయ్‌ అని ఉత్సాహపరచింది డానా. ఫిన్‌ రయ్యిరయ్యిమని సందుల్లోకి తిప్పేస్తున్నాడు. ఆ హడావుడిలో రోడ్డు దాటుతున్న ఒకామెను కారు గుద్దేసింది. ఆమె కుప్పకూలింది. పిల్లలిద్దరూ బిక్కచచ్చిపోయారు. దిగి చూద్దామంది డానా. ఆసుపత్రిలో చేరుద్దామంది. అమ్మో, మనం మామూలు వాళ్లమైతే చేయవచ్చు. దీన్లో నాన్న పేరు బయటకు వస్తే  అల్లరై పోతుంది, అయినా మన వెనక్కాల కారతను దిగి ఆమె దగ్గరకు వెళుతున్నాడుగా, అతను కాపాడతాడులే అంటూ ఫిన్‌ కారు ముందుకు పోనిచ్చేశాడు. డానాకు విపరీతమైన అపరాధభావన కలిగింది.

ఆమె యింటికి చేరే సమయానికి బ్రాడీ అప్పుడే యిల్లు చేరి జెసికాతో ‘‘నేను జాతీయభద్రతకు సంబంధించిన విషయంపై సిఐఏతో కలిసి పనిచేస్తున్నాను. అందుకే రహస్యంగా ప్రవర్తించవలసి వస్తోంది. నీతో అన్ని విషయాలూ చెప్పలేకపోతున్నాను.’’ అని చెప్పుకుంటున్నాడు. డానా వచ్చి తండ్రిని కౌగలించుకుని ఏడ్చింది తప్ప యాక్సిడెంటు సంగతి చెప్పలేదు. బ్రాడీ గతంలో కంటె యిప్పుడు మరింత క్లిష్టమైన పరిస్థితుల్లో యిరుక్కున్నాడు. అవసరం తీరాక సిఐఏ వాళ్లు మాట తప్పుతారేమో తెలియదు. సిఐఏతో చేతులు కలిపాడని తెలిస్తే నజీర్‌ ఎంత భయానకంగా ప్రవర్తిస్తాడో తెలియదు. (ఫోటో- పీటర్‌, ఇంటరాగేషన్‌ గదిలో బ్రాడీ)(సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2020)
mbsprasad@gmail.com

Show comments