ఎమ్బీయస్: ఫేక్ న్యూస్ కాదు, విజయ్, రాంగ్ యాంగిల్

విజయ్ దేవరకొండ గ్రేట్ ఆంధ్రపై విరుచుకుపడుతూ చేసిన వీడియో చూశాను. చాలా చక్కగా మాట్లాడారు. తన పాయింట్లన్నీ కన్విన్సింగ్‌గా ప్రెజంటు చేశారు. అయితే దానికి ‘స్టాప్ ఫేక్ న్యూస్’ అని పేరు పెట్టడం రాంగ్ బ్రాండింగ్ అనిపించింది. గ్రేట్ ఆంధ్రా వ్యాసంలో రాసిన అంకెలలో తభావతు ఏదీ ఆయన ఎత్తి చూపించలేదు. ఆ అంకెలను వాడుకున్న విధానంతోనే విభేదించారు. ‘‘అబ్బే 2200లా? అనే బదులు అబ్బో 2200లా! అనవచ్చుగా’ అని ఆయన వాదన. నేనూ అలాగే అనుకుంటాను. ఇంతా చెప్పి ఆయన సినిమా రేటింగ్స్ గురించి మాట్లాడడంతో ఎప్పణ్నుంచో పేరుకుపోయిన కసిని అదను చూసి తీర్చేసుకున్నాడా అనిపించింది. లేకపోతే చారిటీ వర్క్‌కు, సినిమా రివ్యూలకు ముడిపెట్టడమేమిటి? 

విషయం పూర్వాపరాలు తెలియనివారికోసం క్లుప్తంగా  విజయ్ ఒక ట్రస్టు ప్రారంభించి, లాక్‌డౌన్ సమయంలో మధ్యతరగతి వాళ్లను ఆదుకుంటానన్నారు. ఆయనను అభిమానించేవారు కలిసి వచ్చారు. చాలా చక్కగా, ఆర్గనైజ్‌డ్‌గా, పారదర్శకంగా ఆయన నిర్వహిస్తున్నట్లున్నారు. అయితే గ్రేట్ ఆంధ్రాలో దానిపై ఓ కథనం వచ్చింది. ‘అలా ఎందుకు చేశారు, యిలా ఎందుకు చేయకూడదు? ఇంతమందికే యిచ్చారేం? ఈయన విడిగా సేవాకార్యక్రమం చేపట్టడమేం?’ అంటూ కొక్కిరాయి ప్రశ్నలతో ఆ వ్యాసం సాగింది. ఇక దానిపై విజయ్ మండిపడ్డారు. తను ఏ లక్ష్యంతో చేస్తున్నానో, కార్యక్రమం ఎంత బాగా సాగుతోందో వివరిస్తూ, దాన్ని తప్పుపట్టడాన్ని దుయ్యబట్టారు. అంతటితో ఆగలేదు. వెబ్‌సైట్లు తమ మీదే బతుకుతారని, ఇంటర్వ్యూలు అడిగి, యివ్వకపోతే తమ సినిమాలకు మంచి రేటింగ్స్ యివ్వరని ఆరోపించారు. దానికి ఎందరో నటులు మద్దతు యిచ్చారు. 

ఆ వీడియోలో అయన పట్టుకున్న ‘ఫాక్చువల్ ఎర్రర్’ ‘నేను 25 లక్షలిస్తే, నా ఫ్యాన్స్ 50 లక్షలిచ్చారన్నారు, వాళ్లు నా ఫ్యాన్స్ కాదు, కొందరు మధ్యతరగతి వారు సాటి మధ్యతరగతి వారికి యిచ్చారు’ అని విజయ్ చెప్పారు. ఫ్యాన్స్ అంటే సినిమా ఫ్యాన్సే కానక్కరలేదు. ఆయన చేసే పని మీద అభిమానం, ఆయన కిస్తే సద్వినియోగం అవుతుంది అనుకున్నవారూ కావచ్చు. లేకపోతే వాళ్లు పిఎం కేర్‌ే్సక యివ్వవచ్చుగా! విజయ్ తప్పు పట్టుకున్న యింకో పదం ఏమిటంటే  పర్సన్స్ అని రాశారు, ఫ్యామిలీస్ అనాలి అన్నారు. డబ్బు ఎవరో ఒక వ్యకిే్తక యిస్తారుగా! కుటుంబంలో అందరు సభ్యులకు పేరుపేరునా యివ్వరుగా! అంతకంటె మించి ‘ఫేక్’ ఏమీ లేదు. మెచ్చుకోవడం మానేసి, లోపాలు ఎంచడంతోనే సమస్య వచ్చింది. వెబ్‌సైట్ ఎందుకు పెట్టారు? సిటీలోనే ఓ రెండు జోన్లలో పంచేసి, చేతులు దులిపేసుకోకుండా, రెండు రాష్ట్రాల్లోనూ ఎందుకు పంచారు? వితరణలో యింత ఆలస్యమెందుకు అవుతోంది? ఇలాటి కొక్కిరాయి ప్రశ్నలకు విజయ్ మొహం బద్దలయ్యేలా సమాధానాలు యిచ్చారు. 

ఇక ఎంతమంది అప్లయి చేసుకున్నారు? ఎంతమందికి యిచ్చారు? అనే విషయంపై చూసే దృక్పథంలో తేడా వుంది. ‘బయట వర్షం కురుస్తున్నా సభ సగం నిండింది.’ అని ఒక పత్రిక రాస్తే, ‘సభ విజయవంతం కాలేదు, సభలో సగానికి సగం కుర్చీలు ఖాళీయే. ఉన్నవాళ్లయినా బయట వర్షం కారణంగా వెళ్లిపోలేక కూర్చోవలసి వచ్చింది.’ అని మరో పత్రిక రాస్తుంది. 75 వేల మంది అప్లయి చేస్తే కొంత మందికి యిచ్చి తక్కినవాళ్లను నిరుత్సాహ పరిచారు అని వ్యాసంలో రాస్తే, కొంతమందికైనా యిచ్చినందుకు హర్షించవచ్చుగా అని విజయ్ ఫిర్యాదు. ‘2200 మందికి మాత్రమే..’ అని రాశారు. ‘పోనీ విజయ్ వలన అంతకంటె కాదు, తక్కినవాళ్లకు మేం యిస్తాం’ అనవచ్చుగా అని ఛాలెంజ్ చేశారు. నిజమే కదా, రోడ్డు పక్కన పోలీసుకి ఒక మహిళ మజ్జిగ యిస్తే ఫోటోతో సహా ప్రచారం చేస్తూన్నాం కదా, యితను 25 లక్షలు స్వయంగా యిచ్చి, దానికి రెట్టింపు యితరుల చేత యిప్పించగలిగాడంటే గొప్పే కదా! దానికి మెచ్చుకోవచ్చుగా!

తక్కినవాళ్లతో కలవకుండా విడిగా యిచ్చాడు అని ఓ అనవసరమైన ఫిర్యాదు. దానికి విజయ్ చక్కని సమాధానం యిచ్చారు. పేదలకు ప్రభుత్వం ఎలాగూ యిస్తోంది, మధ్యతరగతి వేతన జీవుల మాటేమిటి? అని. విజయ్ తన పేరు మీద 25 యివ్వడం చేతనే అదనంగా 45/50 లక్షల విరాళాలు ఆ ట్రస్టుకి వచ్చాయి. ఏ ఆర్గనైజేషన్‌కో యిచ్చి వూరుకుంటే 25తో ఆగిపోయేది. నిజానికి ఏప్రిల్ 26న గ్రేట్ ఆంధ్రాయే ‘‘విజయ్ ఐడియా అదిరిందిగా’’ అంటూ మెచ్చుకుంటూ ఒక వ్యాసం వచ్చింది. 

దానిలో దీని గురించి చెప్పడంతో బాటు అతను నిరుద్యోగులకు శిక్షణా కార్యక్రమం మీద కోటి రూ.లు ఖర్చు పెడుతున్నట్లు, 660 మంది దరఖాస్తు చేసుకుంటే 3గ్గురికి వస్తున్నట్లు, దానికి 15 కార్పోరేటు సంస్థలు సహకరించినట్లు రాశారు. ఏప్రిల్ 14 నాటి మరో కథనంలో కరోనా వేళ విజయ్ మాటామంతీ అంటూ ప్రజల్లో కరోనాపై అవగాహన పెంచడానికి పోలీసులతో కలిసి అతను చేస్తున్న కృషిని హైలైట్ చేయడం జరిగింది. 

ఎడిటర్‌పబ్లిషర్ మాటల్లోనే గ్రేట్ ఆంధ్రాకు 40 మంది కథనాలు రాస్తున్నారు. రోజుకి 50 వ్యాసాలు వేస్తారు. ఒకటిలా, యింకోటి మరోలా వుంటోంది. అలాటప్పుడు ఏ వ్యాసం అసంబద్ధంగా వుందో దాని గురించే మాట్లాడాలి తప్ప, మొత్తం వెబ్‌సైట్‌ను తప్పుప్టడం, దానిలో అసందర్భంగా సినిమా సమీక్షల రేటింగ్స్ గురించి మాట్లాడమేమిటి? సిసిసికి తను ఎంత విరాళమిచ్చారో విజయ్ ప్రెస్ నోట్ యిచ్చి వుంటే, గందరగోళం ఉండేది కాదు. అది లేకపోవడం చేత తమకు దొరికిన సమాచారం వేశామని, పొరపాటు తమ దృష్టికి రాగానే వెంటనే సవరించుకున్నామని గ్రేట్ ఆంధ్ర నిన్న ఎడిటోరియల్ రాసింది. 

ఇలాటి పొరబాట్లు ప్రింటు మీడియాలో కూడా జరుగుతాయి. కానీ సవరించుకోవడానికి 24 గంటలు పడుతుంది. వెబ్‌సైట్‌లో వెంటనే సవరించుకునే అవకాశం ఉంది. వెబ్‌సైట్లలో మరో సంప్రదాయం ఏమిటంటే గాసిప్స్ అని హెడింగ్ పెట్టి మరీ రాయడం. ప్రింటు మీడియాలో వార్తలను, వ్యాఖ్యలను కలిపి రాసేస్తున్నారు. ‘పేరు చెప్పడానికి యిష్టపడనివారు చెప్పారు..’ అంటూ తామే కల్పించి రాసేస్తున్నారు.

ఇక వెబ్‌సైట్లలో వంకరచూపుతో రాసే ఆర్టికల్సే ఎక్కువ ఎందుకు వస్తున్నాయి? అనే దాని గురించి ఆలోచిస్తే  ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉంటే అది దినపత్రికల్లో వస్తోంది. దాన్లోంచి నెగటివ్ కోణాన్ని వెతికి తీసి వారపత్రికలు, వెబ్‌సైట్లు రాస్తున్నాయి. ‘ఫలానా సినిమా ప్రారంభోత్సవం జరిగింది .. క్లాప్ కొట్టారు, ... కెమెరా స్విచ్చాన్ చేశారు’ వంటి న్యూస్ దినపత్రిక సినిమా పేజీల్లో వస్తుంది. దాన్ని వెబ్‌సైట్‌లో వేసేటప్పుడు అదే రిపీట్ చేస్తే ప్రెస్ నోట్‌లా తోస్తుంది. సినిమా పిఆర్‌ఓ చెప్పి దగ్గరుండి రాయించినట్లు వుంటుంది. అందుకని చివరన ‘సునీల్ మాత్రం ఎక్కడా కనబడలేదు. వీరి గత సినిమా అతని వల్లనే ఆడిందని అందరికీ తెలుసు. మరి వాళ్ల మధ్య ఏం గొడవలు వచ్చాయో ఏమో’ అనే కొక్కిరాయి కూత ఒకటి చేరుస్తారు. 

అల్లు అరవింద్ తన వైవాహిక జీవితం గురించి చెప్పినది దినపత్రికలో ఫుల్‌పేజీ యింటర్వ్యూగా వస్తుంది. దాన్లోంచి ‘మా నాన్న నా కాపురంలో చిచ్చుపెట్టడానికి చూశాడు’ అనే ఒక్క మాట అసందర్భంగా విడగొట్టి వెబ్‌సైట్‌లో కథనంగా వస్తుంది. ఒక తెలుగు హీరోయిన్‌కు హిందీ సీమలో అవకాశం వచ్చింది అని దినపత్రికలో వస్తే, వారపత్రికలో బాక్స్ కట్టి ఆ వార్త వేసి, పైన ఆమె అర్ధనగ్న ఫోటో వేసి, హిందీసీమ ప్రవేశం గురించి రాసి, ‘అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయేమో పాపం’ అనో, ‘తెలుగు సినిమాల్లోనే అందాలు ఆరబోస్తోంది, యిక బొంబాయికి వెళితే ఏం చూపిస్తుందో ఏమో’ అని రాయి వేస్తారు. ఒక్కోప్పుడు మేటర్ ఏ మాత్రం స్పైసీగా వుండదు. కానీ కాప్షన్‌లో మాత్రం మసాలా దట్టిస్తారు. ‘దేనికైనా ఓకే అన్న హీరోయిన్ జాస్మిన్’ అని కాప్షన్. మీరా జాస్మిన్ అందేమో అనుకుంటూ లోపలకి వెళితే ఎవరో దక్షిణాఫ్రికా హీరోయిన్ జాస్మిన్ అని వుంటుంది. 

ఎందుకిలా? అంటే పాఠకులు అలా వున్నారు అనే సమాధానం వస్తుంది. సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఎందుకని అడిగితే దర్శకనిర్మాతలు ఏమంటారు? ప్రేక్షకులు కోరుకుంటున్నారు అంటారు. నెగటివిటీని ఆదరించినట్లు పాజిటివ్ యిమేజిని ప్రేక్షకులు ఆదరించటం లేదని విజయ్‌కూ తెలుసు. వింతగా, వికారంగా ప్రవర్తించిన అర్జున్‌రెడ్డి అందరికీ నచ్చాడు. సానుకూల దృక్పథంతో సమాజాన్ని సంస్కరించబోయిన ‘‘డియర్ కామ్రేడ్’’ నచ్చలేదు. పత్రికలలో కాలమిస్టులు కూడా ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతారు తప్ప, ఫలానా యింతమందికి మేలు చేసే పథకాన్ని ప్రవేశపెట్టింది అని రాయరు. దాని గురించి ప్రభుత్వం ఎలాగూ ఫుల్‌పేజి యాడ్స్ యిస్తుంది. నేను కూడా కరోనా వ్యాప్తి నిరోధించడానికి ఫలానా రాష్ట్రంలో యిది చేశారు అనే వార్త కన్నా, ఫలానా రాష్ట్రం యీ విధంగా విఫలమైంది అనే వార్తే చదువుతాను, దానిపై రాస్తాను. 

అంతెందుకు ఏ సినిమా ఆఫీసు చూసినా, నిర్మాణంలో ఉన్న, అప్పుడే రిలీజైన సినిమాల గురించి కాస్సేపు తిట్టుకున్నాకనే ఆ రోజు పని ప్రారంభం చేస్తారు. విజయ్ అది మర్చిపోయి కాబోలు, మా సినిమావాళ్లంతా ఒకటి, జర్నలిస్టులంతా ఒకటి అంటూ  విడదీసి మాట్లాడారు. అసలీ సినిమా జర్నలిస్టులకు, పొలిటికల్ జర్నలిస్టులకు వార్తలు ఎలా వస్తాయనుకుంటారు? విజయ్ అనుకుంటున్నట్లు కంప్యూటర్ ముందు ఖాళీగా కూర్చుంటే వార్తలు  పుట్టవు.  సినిమా వాళ్లే పక్క సినిమా గురించి న్యూస్ వ్యాపింపచేస్తారు. ‘ఫలానావాడు తను తీసినది పెద్ద కళాఖండం అనుకుని, ఫ్యాన్సీ రేటు చెప్తున్నాడు. కానీ బిజినెస్ కావటం లేదు. ఏదో ఒక రేటుకి యిచ్చేద్దామని చూస్తున్నాడు. మళ్లీ నేనన్నానని ఎవరితోనైనా అనేవు, బాగుండదు’ అని జర్నలిస్టును పిలిచి చెప్తారు. ఇతగాడు వెంటనే ‘బిజినెస్ కాలేదా?’ అని ప్రశ్నార్థకం జోడించి కథనం తయారుచేస్తాడు.

ఇలా ఎన్ని వున్నా విజయ్ ఫౌండేషన్ గురించి వెలువడిన వ్యాసాన్ని నేను జీర్ణించుకోలేను. అది కావాలని తప్పులు పట్టడానికి చేసిన ప్రయత్నంగా వుంది. అందులో రెండు స్టేట్స్ బిల్డప్ యిచ్చాడు, హంగామా చేశాడు, వెయ్యి రూపాయల కారట్ చూపించాడు  వంటి కువ్యాఖ్యలున్నాయి. విజయ్ దాన్ని ఎత్తి చూపి వదిలేసి వుంటే హుందాగా వుండేది. కానీ దాన్ని ఫేక్ న్యూస్ అన్నాడు. మొత్తం ఆ వెబ్‌సైట్, దానిలాటి మరి కొన్ని ఫేక్ న్యూసుల మీదే బతుకుతాయన్నాడు. 

అక్కణ్నుంచి సమీక్షల మీద పడ్డాడు. జనవరి 4న గ్రేట్ ఆంధ్రా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా టీజరుకు 4 లక్షల లైక్స్ వచ్చాయని న్యూస్ యిచ్చింది. ఫిబ్రవరి 14న సినిమా విడుదలయ్యాక 2/5 రేటింగు యిచ్చింది. దీనిలో ఏది ఫేక్? ఏది రియల్? అని అడిగితే విజయ్ రెండోదే, మొదటిది కరేక్ట అంటారు. ఎందుకంటే మొదటిది అబ్సల్యూట్. రెండోది పరసెప్షన్. కలక్షన్లు అబ్సల్యూట్ అవుతాయి కానీ సమీక్షలు కానేరవు. సమీక్షల గురించి గతంలో ఎప్పుడో రాసినట్లు గుర్తు. సందర్భం వచ్చింది కాబట్టి క్లుప్తంగా చెపుతాను.

సినిమా వాళ్లకు, ప్రేక్షకులకు మధ్య అసలు సమీక్ష లెందుకు? అని కొందరంటారు. అన్నవారే నా బోటివాణ్ని ఏ పుస్తకం చదవమంటారు, ఏ ెటల్‌కు వెళ్లమంటారు? టూరుకి ఏ వూరుకి వెళ్లమంటారు? ఏ ట్రావెల్స్ మంచిదంటారు? అని అడుగుతారు. ఎందుకు? కష్టార్జితాన్ని, టైమును వృథా చేసుకోవడం యిష్టం లేక! ఇటు అమ్మేవాడు ఊదరగొట్టేస్తూంటాడు. ఊరించేస్తూంటాడు. ఇది నిజమా? ఫేకా? అని వినియోగదారుడు తెలుసుకోవాలనుకుంటాడు. 

సినిమా నిర్మాత పెట్టిన 70 కోట్లు కూడా నా 100 రూ.లకు సమానం కాదు. నా వందా సద్వినియోగం అవుతోందా లేదా అని  ప్రేక్షకుడు రివ్యూ వైపు చూస్తాడు. సమీక్షకుడు సినిమావాళ్ల మనిషి కాదు. ప్రేక్షకుల ధనానికి సంరక్షకుడు. సగటు ప్రేక్షకుడిలాగానే ఆలోచిస్తాడు తప్ప, పెద్ద టెక్నీషియన్‌లాగ, మేధావిలాగ సినిమాలోని నిగూఢ విషయాలు పసిగట్టడు. తనలా ఆలోచించే సమీక్షకుణ్నే ప్రేక్షకుడు నమ్ముకుంటాడు. వాడు రాసే వెబ్‌సైట్‌ను ఆదరిస్తాడు. 

సమీక్షకుడిలో నిజాయితీ లోపించో, తనలా ఆలోచించే శక్తి లోపించో రాయడం మొదలెడితే పట్టించుకోడు. ఇక వెబ్‌సైట్‌కు ఆదరణ తగ్గుతుంది. యాడ్స్ రావడం మానేస్తాయి. వెబ్‌సైట్ పెట్టడం చాలా చౌకైన వ్యవహారం, దానికి యాడ్స్ ఎందుకు? అని వియ్ ఆశ్చర్యపడ్డారు. నడపడానికి ఖర్చవుతుందండీ, సినిమాకు టిక్కెట్టు పెట్టి వసూలు చేస్తారు కానీ వెబ్‌సైట్‌లు పాఠకుల నుండి డబ్బులు వసూలు చేయవు. ప్రకటనలపై వచ్చిన ఆదాయంతోనే గడవాలి. ‘మా యాడ్స్‌తో బతుకుతూ...’ అని సినిమావాళ్లు అహంకరించ నక్కరలేదు. ఏదైనా పాప్యులర్ వెబ్‌సైట్ చూస్తే దానిలో తక్కిన యాడ్స్ ఎన్నో వాటిలో సినిమా యాడ్స్ ఎంత శాతమో చూస్తే తెలిసివస్తుంది. 

సినిమా యాడ్స్ కూడా రివ్యూ రేటింగ్స్ బట్టి యివ్వరు. రీచ్ బట్టి యిస్తారు. అంతా పాజిటివ్ వార్తలే రాస్తూ, అన్ని సినిమాలకూ మంచి రేటింగ్స్ యిస్తూండే వెబ్‌సైట్లున్నాయి. వాటికి యాడ్స్ మరలించి యీ స్పైసీ వెబ్‌సైట్లకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించవచ్చుగా! అప్పుడు మేం పెట్టే ఖర్చు గిట్టుబాటు కావాలిగా అని మీరే వాదిస్తారు. ప్రేక్షకులుగా మాకూ యిక్కడ సేమ్ ఫీలింగ్. టిక్కెట్టు డబ్బులు గిట్టాలి. మీ మాయమాటలకు బోల్తా పడనీయటం లేదని సమీక్షకులపై మీకు గుర్రు. 

మాట్లాడితే సమీక్షకుడికి ఏం వచ్చు? ఏ కెమెరాతో తీశామో తెలుసా? ఎన్ని హాలీవుడ్ సినిమాలను, కొరియన్ సినిమాలను కలిపి వండితే స్క్రిప్టు తయారైందో తెలుసా? అంటే ప్రశ్నలు గుప్పిస్తారు. తిని బాగాలేదని చెప్పేవాడికి వంట తెలియనక్కరలేదు. ‘బాగాలేదు’ అని మీరనగానే మీ ఆవిడ ‘నేను పీకిన కోడి బొచ్చులో వెంట్రుకలెన్ని? వంకాయ ముచికకు కోణాలెన్ని? గసగసాలు నూరి వేశానా? నూరకుండా వేశానా?’ అని ప్రశ్నలు సంధిస్తే మీరేం చెపుతారు? నాకు నాలిక వుంది, బాగా లేదని చెప్పింది అంటారు. అలాగే ప్రేక్షకుడికి కళ్లూ, చెవులూ వున్నాయి. వాటికి నచ్చలేదు. మీరెంత శ్రమ పడితే వాడికేం? సమీక్షకుడు మొదటి వరస ప్రేక్షకుడు. దట్సాల్. అతనికి డిగ్రీలు అక్కరలేదు. ఎందుకంటే చూసే ప్రేక్షకులందరూ విద్యావంతులు కారు. రసాస్వాదన మాత్రమే తెలిసినవారు. 

విజయ్ తన విరాళాలపై వెక్కిరింతలను ఖండిస్తూ మొదలుపెట్టి, రివ్యూస్‌లోకి వెళ్లిపోయాడు. ఇక అక్కణ్నుంచి తక్కిన హీరోలూ వంతపాడారు. నిర్మాతల మండలి గ్రేట్ ఆంధ్రా వాళ్లు మంచి రివ్యూలకై లంచాలు అడుగుతున్నారని ఆరోపించేదాకా వెళ్లిపోయింది. మరి లంచాలిచ్చారా లేదా అన్నది చెప్పలేదు. ఇచ్చి వుంటే ఆధారాలు చూపితే, తన స్టాఫ్‌పై చర్యలు తీసుకుంటామని పబ్లిషర్ ప్రకటించారు. ఇక మండలిదే బాధ్యత.  ఈ వ్యవస్థలో చెడు ఏదైనా వుంటే ప్రక్షాళన అయిపోతుందని ఆశిద్దాం. ఈలోపుగా విజయ్‌కి నేను చెప్పేదేమిటంటే  దీనికి స్టాప్ ఫేక్ న్యూస్ అని పెట్టకుండా ‘స్టాప్ డిరైడింగ్ గుడ్‌డీడ్స్’ అని పెట్టి వుంటే బాగుండేది. 

ఇక ఫేక్ న్యూస్ అంటే ఎలాటిదంటే సినిమాకు 60 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లని చెప్పడం, థియేటర్లు ఖాళీగా వున్నా విజయవంతమైందని చెప్పుకోవడం  అలాటివన్నమాట. పెద్దపెద్ద కలక్షన్ ఫిగర్స్ పేపర్లలో తాటికాయలంత అక్షరాలతో వేసి, ఇన్‌కమ్ టాక్స్ వాళ్లు వచ్చి అడిగితే ‘అబ్బే పబ్లిసిటీ కోసం వేశాం, అంత రాలేదు’ అనడం  యిలాటివి ఫేక్ అన్నమాట. ఒక హీరో ‘ఈ సినిమా నా కెరియర్‌లో కల్లా బెస్ట్’ అని సినిమా రిలీజ్ ముందు చెప్పి, ప్రేమికుల దినం నాడు ఆ సినిమా రిలీజై, ఫ్లాపయిన రెణ్నెళ్ల తర్వాత ‘అదో చెత్త సినిమా. డైరక్టరు చెప్పినదొకటి, తీసినదొకటి, నా కెరియర్‌ను కొన్నేళ్లపాటు వెనక్కి తీసుకుపోయింది’ అని చెప్పాడనుకోండి. మొదటిది ఫేక్, రెండోది రియల్ అన్నమాట!   

ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2020) 

Show comments