ఎమ్బీయస్‌: మధ్యప్రదేశ్‌ మెసప్

కోవిడ్‌ 19పై పోరాటంలో దేశమంతా ఒకే రీతిలో సాగటం లేదు. ఒక్కో రాష్ట్రం ఒక్కో రకంగా వ్యవహరిస్తోంది. కేరళలో ఒకలా వుంటే బెంగాల్‌లో మరోలా ఉంది. మహారాష్ట్రలో ఒకలా వుంటే, యుపిలో యింకోలా వుంది. అన్నిటికన్నా విచిత్ర పరిస్థితి మధ్యప్రదేశ్‌ది. ఎందుకంటే అక్కడి రాజకీయాలు అలా అఘోరించాయి. ఇలాటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రులతో సహా, మంత్రులందరూ విపరీతంగా శ్రమించాలి. అనేక విభాగాలు సమన్వయం చేసుకుంటూ వేయికన్నులతో పనులు చక్కబెట్టాలి. అయితే దురదృష్టమేమిటంటే మధ్యప్రదేశ్‌లో సరిగ్గా ప్రభుత్వం మారినపుడే యిది వచ్చి పడింది. అది కూడా ఫిరాయింపుదార్లతో ఏర్పడిన ప్రభుత్వం కావడంతో, వారికీ, మొదటి నుంచి పార్టీలో వున్నవారికి మధ్య రాజీ కుదరక, మంత్రి పదవుల కేటాయింపులో చిక్కులు వచ్చాయి.

అందువలన ముఖ్యమంత్రి శివరాజ్‌ చౌహాన్‌ ఒక్కరే పదవి చేపట్టారు. వేరే ఏ శాఖకూ మంత్రులు లేరు. ఇక చౌహానే అన్ని శాఖలూ  చూసుకోవలసి వచ్చింది. ఈ రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చేటప్పటికి దాదాపు నెల పట్టింది. అయిదుగురు వచ్చి చేరారు. మే3 న మరింతమంది చేరతారని అన్నారు కానీ చేరలేదు. ముఖ్యమంత్రి మీదే భారమంతా పడింది. ఆయన అధికారంలోకి వచ్చే ముందే అన్నీ సవ్యంగా వుండి వుంటే, మరీ అంత డామేజి కాకపోయేదేమో! అంతకుముందు పదిహేను రోజులుగా కమల్‌ నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడి, అధికారం నిలబెట్టుకోవడంలోనే కాంగ్రెసు తలమునకలు కావడంతో పరిపాలన మూలపడి వుంది.

అన్నిటికన్నా పెద్ద అనర్థమేమిటంటే కరోనా వ్యవహారాన్ని పర్యవేక్షించవలసిన ఆరోగ్యశాఖామాత్యుడు సింధియా అనుచరుడు. అందువలన సెక్రటేరియట్‌కు రావడం మానేసి, ఎక్కడో దూరాన బెంగుళూరు క్యాంపుల్లో తిరుగుతూన్నాడు. అందువలన అంటువ్యాధుల నివారణకు ప్రభుత్వం తరఫు నుంచి తీసుకోవసిన చర్యలు తీసుకోవడం వీలు పడలేదు. పైగా చౌహాన్‌ పదవిలోకి వచ్చిన వారం లోపునే వచ్చి చేసిన పనేమిటంటే హెల్త్‌ కమిషనర్‌గా ఉన్న ప్రతీక్‌ హజేలాను తీసేయడం! దాంతో అప్పటిదాకా ఏం చేశారో తెలుసుకునే లింకు పోయింది.

నిజానికి సింధియా ఆర్నెల్ల క్రితమే తిరుగుబాటు బావుటా ఎగరేశాడు. అప్పణ్నుంచి బిజెపిలోకి ఎప్పుడు వస్తాడా, కమల్‌ నాథ్‌ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూలుస్తాడా అనుకుంటూ వచ్చాం. అయితే సింధియా-బిజెపిల బేరసారాలు ఒక పట్టాన కుదరలేదు. జాప్యం జరుగుతూ వచ్చి చివరకు ముహూర్తం కుదిరేపాటికి కరోనా దేశంలోకి వచ్చిపడింది. కరోనా వచ్చినా ఏమొచ్చినా యీ ముహూర్తం దాటిపోతే మళ్లీ పెళ్లి కాదనుకున్నట్లు బిజెపి మధ్యప్రదేశ్‌లో అధికారపు మార్పిడికి ప్రాధాన్యత యిచ్చి, దేశంలో జనాల కదలికలపై ఆంక్షలు విధించడంలో ఆలస్యం చేసింది.

తేదీలవారీగా చెప్పాంటే మార్చి 9న సింధియా కాంగ్రెసుకు రాజీనామా చేసి, 19 మంది తన ఎమ్మెల్యేలను బెంగుళూరుకి చార్టెర్డ్‌ విమానాల్లో పంపించాడు. వారితో పాటు అతని వర్గానికి చెందని మరో ముగ్గురు కాంగ్రెసు ఎమ్మేల్యేలు తోడుగా వెళ్లారు. మార్చి 11కి అతను బిజెపిలో చేరాడు, ఈ 22 మంది ఎమ్మేల్యేలుగా రాజీనామా చేశారు. మార్చి 15కి గవర్నరు కమల్‌నాథ్‌ను అసెంబ్లీలో తన ఆధిక్యతను చూపించుకోమన్నాడు. బలపరీక్ష ఎలాగైనా ఎగ్గొట్టాలని కమల్‌ నాథ్‌ ఎత్తేశాడు. మార్చి 16న అతని తాలూకు స్పీకరు దేశంలో కరోనా వ్యాపిస్తోంది కాబట్టి మార్చి 26 వరకు అసెంబ్లీ సమావేశం లేదన్నాడు.

అధికారాన్ని పట్టుకుని వేళ్లాడడానికి మరీ తీవ్రంగా లేని కరోనాను వాడుకుంటున్నారని  బిజెపి విమర్శించింది. ఆ రోజుకి దేశంలోని 13 రాష్ట్రాలలో 126 మందికి కరోనా సోకింది, ఇద్దరు మరణించారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో కూడా కరోనా కనబడింది. మార్చి 19న మోదీ గారు దేశప్రజలంతా సోషల్ డిస్టన్సింగ్ పాటించాలని 22 ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపు నిచ్చారు. అంటే అప్పటికే కరోనా తీవ్రత దేశమంతా ఫీలవుతోంది. మర్నాడే కమల్‌ నాథ్‌ రాజీనామా చేశాడు. రాష్ట్రంలోని జబల్‌పూర్‌ జిల్లాలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. 

అయినా భోపాల్‌లో వేలాది బిజెపి నాయకులు, కార్యకర్తలు ఒక్కచోట చేరి చౌహాన్‌ ముఖ్యమంత్రి కావాలని నినాదాలిచ్చారు. మార్చి 22న దేశమంతా జవతా కర్ఫ్యూ పాటిస్తున్న సమయంలో ఇందోర్‌ వీధుల్లో వందలాది మంది బిజెపి కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. మార్చి 23న చౌహాన్‌ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ పుణ్యకార్యం సమాప్తమైంది కాబట్టి ఆ రాత్రే మోదీగారు మర్నాటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ అని ప్రకటించేశారు.  

మార్చి 20 నాటి కమల్‌నాథ్‌ పత్రికా సమావేశానికి హాజరైన పాత్రికేయుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతని కూతురికి సోకి, ఆమె ఇందోర్‌లో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన మొదటి పేషంటుగా నమోదైంది. తాజాకలం ఏమిటంటే మధ్యప్రదేశ్‌లో ఇందోర్‌, భోపాల్‌, ఉజ్జయిన్‌ లు హాట్‌స్పాట్స్‌గా తేలాయి. ఇది రాసే నాటికి 7.35 కోట్ల జనాభా వున్న మధ్యప్రదేశ్‌లో కరోనా సోకినవారు 2942 కాగా, మరణాలు 165. తెలుగు రాష్ట్రాలు రెండూ కలిపితే జనాభా 8.50 కోట్లు. మరణాలు 65. ఇందోర్‌లోనే 1500కి పైగా కేసులున్నాయి.

తబ్లిగీ వారి వలననే వ్యాపించింది అనేశారు చౌహాన్‌ చులాగ్గా. మరి ఆయన వచ్చిన తీసుకున్న చర్యలేమిటో చూద్దాం. బజెట్‌ సమర్పించేందుకు ముందే కమలనాథ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టారు కాబట్టి, ఏ శాఖకు ఎంత కేటాయించాలన్న దానిపై స్పష్టత లేదు. తోచినట్లు ఖర్చు పెడుతూ పోతున్నారు. ప్రజారోగ్యం చూసుకోవలసిన పబ్లిక్‌ హెల్త్‌ డిపార్టుమెంటు జబ్బు పడింది. దానిలో పని చేసే అనేకమంది అధికారులు కోవిడ్‌ పాలన పడి చాలాకాలం క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. హెల్త్‌ కార్పోరేషన్‌ చీఫ్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో సీనియర్‌ అధికారుల నుంచి జూనియర్ల‌ దాకా దాదాపు 100 మందికి పాజిటివ్‌ వచ్చింది. వారి కుటుంబసభ్యులను కూడా కలిపితే యీ అంకె ఎంకా ఎక్కువుంది.

పాత ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి వారధిగా వుండవలసిన హెల్త్‌ కమిషనర్‌ ప్రతీక్‌ చౌహాన్‌ను ఏప్రిల్‌ 1న తీసేశారు. అంతకు ముందురోజే ఆయన ఒక మెడికల్‌ బులెటిన్‌ విడుదల చేశాడు. దాని ప్రకారం భోపాల్‌, ఇందోర్‌, జబల్‌పూర్‌, గ్వాలియర్‌, రేవా, సాగర్‌లలో ఉన్న ఆరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను కరోనా రోగుల చికిత్సకు గుర్తించారు. మొత్తం వీటి ఐసియుల కెపాసిటీ 394, వెంటిలేటర్లు 319. వీటితో బాటు 418 ఐసియులు, 132 వెంటిలేటర్లు ఉన్న 8 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలలో కూడా చికిత్స చేయిస్తామన్నాడు.

ఇది చౌహాన్‌కు నచ్చినట్లు లేదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వ ఆసుపత్రులను పక్కన పెట్టి, ప్రయివేటు ఆసుపత్రులను ప్రోత్సహిద్దామనుకున్నాడు. ఇది తక్కిన ప్రభుత్వాలు చేస్తున్న దానికి విపర్యంగా వుంది. కొత్త కేసులనే కాదు, భోపాల్‌ ఎయిమ్స్‌లో వున్న పేషంట్లను కూడా చిరాయు హాస్పటల్‌కు తరలించమని ఆదేశాలు జారీ చేశాడు. అలాగే ఇందోర్‌లో శ్రీ అరబిందో హాస్పటల్‌ అనే ప్రయివేటు ఆసుపత్రిని ఆదరించడం జరిగింది. ఈ రెండిటిని నడిపేవాళ్లు వ్యాపమ్‌ కేసులో చౌహాన్‌తో బాటు ఆరోపణలు ఎదుర్కుంటున్నవారే. తాజాగా కాంగ్రెసు ఫిరాయింపుదార్లను ఆకర్షించడానికి పెట్టుబడి పెట్టారేమో మరి, తెలియదు.

కానిపక్షంలో సక సౌకర్యాలున్న ఎయిమ్స్‌ను, హమీదియా, భోపాల్‌ మెమోరియల్‌ హాస్పటల్‌ వంటి ప్రభుత్వ ఆసుపత్రులను కాదని ప్రయివేటు ఆసుపత్రులను ప్రోత్సహించడానికి మరో అజ్ఞాత కారణం వుండాలి. ఏ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నా ఆయష్మాన్‌ భారత్‌ స్కీము కింద ప్రభుత్వం ఖర్చు భరిస్తుందని కూడా చౌహాన్‌ ప్రకటించారు. అంతేకాదు, కోవిడ్‌ రోగుల కారణంగా చిరాయు ఆసుపత్రికి యితరత్రా వచ్చే ఆదాయం పోతుంది కాబట్టి దాన్ని ప్రభుత్వం భర్తీ చేస్తుందట!

ఆరోగ్యశాఖ సిబ్బంది, ఐఏఎస్‌ల తర్వాత కోవిడ్‌ పాలిట పడినవారిలో మధ్యప్రదేశ్‌ పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. తమకు పిపిఇలు యివ్వకపోవడం వలననే యీ ఉపద్రవం వచ్చిందని వారు వాపోతున్నారు. తన ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలన్నీ బయటకు వచ్చేస్తూ వుండడంతో ‘ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా కోవిడ్‌ గురించి పత్రికా విలేకరులతో చర్చించే అధికారులపై చర్యలు తీసుకుంటామ’ని చౌహాన్‌ ఏప్రిల్‌ 10న ఒక ఆర్డర్‌ జారీ చేశాడు.

మధ్యప్రదేశ్‌లో వ్యవసాయం పరిస్థితి చాలాకాలంగా బాగా లేక రైతులు బిజెపిపై కోపంగా వున్నారు. అది గమనించి, రైతు ఋణమాఫీ చేస్తామని హామీ యిచ్చి కాంగ్రెసు గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచింది. ఇప్పటికి రెండు విడతలు విడుదల చేసింది. తక్కినది యిచ్చే భారం చౌహాన్‌పై పడింది. ఇప్పుడీ కరోనా దెబ్బతో అనేక రాష్ట్రాలలో లాగానే వ్యవసాయం దెబ్బ తింది. దీనికి తోడు మధ్యప్రదేశ్‌ నుంచి అనేకమంది వలస కార్మికులు యితర రాష్ట్రాలలో పని చేస్తున్నారు. ఇప్పటికి 35 వేల మంది వెనక్కి వచ్చేశారు. వారికి పని కల్పించకపోతే సమాజంలో అశాంతి తథ్యం. ఇవన్నీ చౌహాన్‌ ఒక్కడూ నెత్తిన వేసుకుని భరించాడు.

చివరకు 29 రోజుల తర్వాత ఏప్రిల్‌ 21న కాబినెట్‌ విస్తరించాడు, అది కూడా పూర్తిగా కాదు. కేవం ఐదుగురు వచ్చి చేరారు. వీరిలో యిద్దరు సింధియా మనుషులే కానీ అతనికి పట్టున్న గ్వాలియర్‌-రేవా ప్రాంతానికి చెందినవారు కారు. ఆ విధంగా సింధియాకు పగ్గాలు వేశారు. బేరసారాలు పూర్తి కాకపోవడం చేత పూర్తి కాబినెట్‌ ఏర్పడలేదు. మే3న మరింత విస్తరిస్తామని అన్నారు కానీ అది జరగలేదు. ఇంకా మల్లగుల్లాలు  పడుతున్నారులా వుంది. కరోనా కట్టడిలో చౌహాన్‌ విఫలం కావడంతో యిప్పుడు కాంగ్రెసు కాలరెగరేస్తోంది.

‘‘మేం ఉండివుంటే యిలా జరిగేది కాదు. చూడండి, మార్చి 4 నాటికే కమలనాథ్‌ కరోనాపై సెక్రటరీ స్థాయి మీటింగు పెట్టారు. మర్నాడే హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. ఇండోర్‌లో జరగాల్సిన ఐఐఎఫ్‌ఏ (ఫిల్మ్‌ ఎకాడమీ) ఎవార్డు ఫంక్షన్‌ను రద్దు చేశారు. మార్చి 7నుంచి స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. ఇంత చక్కగా నియంత్రిస్తున్న సమయంలో చౌహాన్‌ అధికారదాహంతో మొత్తమంతా సర్వనాశనం చేశాడు. ప్రజులు ఆరోగ్యం కోసం అలమటిస్తూ వుంటే, అతను పదవి కోసం అలమటించి, లాక్‌డౌన్‌ విధించడంలో పది రోజుల జాప్యానికి కారకుడై, దేశానికి ఎంతో నష్టం కలిగించాడు. లాక్‌డౌన్‌ విధించి వుంటే వివిధ ప్రాంతాల్లో దాచిన ఫిరాయింపు ఎమ్మెల్యేలను విమానాల్లో రాష్ట్రానికి తీసుకురావడం కుదిరేది కాదు. అందుకే ఆలస్యం చేశారు.’’ అని రాష్ట్ర కాంగ్రెసు వర్కింగ్‌ ప్రెసిడెంటు జీతూ పట్వారీ అన్నాడు.

గద్దె కెక్కాక కూడా చౌహాన్‌ ప్రాధాన్యతలు వేరే వున్నాయి. అప్పటికి రాష్ట్రంలో కరోనా కేసులు 7కి చేరాయి. దానికోసం ఏం చేయాలి అనేది పక్కన పెట్టి చేసినదేమిటంటే - సింధియాపై ఉన్న ఆర్థికనేరం ఫైలు మూసివేయడం, కాంగ్రెసు హయాంలో అనేక కమిషన్లకు నియమించినవారిని తీసేయడం, రాజగఢ్‌ జిల్లా కలక్టరును తీసివేయడం! కోవిడ్‌ 19 టాస్క్‌ ఫోర్స్‌ అని పెట్టాడు కానీ దానికి అధినేతగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు వి.డి. శర్మను నియమించాడు. మహారాష్ట్ర యిలాటి టాస్క్‌ ఫోర్స్‌లో ఆరోగ్యనిపుణులను వేస్తే, యిక్కడ మాత్రం రాజకీయ నాయకుల్నే నియమించారట.

అధికారులు కూడా చిత్రంగా ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్‌ హెల్త్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి పాజిటివ్‌ వస్తే ఆసుపత్రిలో చేరడానికి ఆమె ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఇలాటి పరిస్థితుల్లో కరోనా కట్టడి కష్టమని సులభంగా అర్థమవుతుంది. ఇక బెంగాల్‌లో పరిస్థితేమిటో వచ్చేసారి చూదాం. (ఫోటో - సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని మార్చి 19న మోదీ పిలుపు నివ్వగా మార్చి 23న చౌహాన్ ప్రమాణస్వీకారోత్సవం నాటి దృశ్యం)

- ఎమ్బీయస్ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020) 
mbsprasad@gmail.com