సినిమా రివ్యూ: అమృతరామమ్

సమీక్ష: అమృతరామమ్
రేటింగ్: 1.5/5
బ్యానర్: పద్మజ ఫిలింస్ ఇండియా ప్రై.లి. 
తారాగణం: రామ్ మిట్టకంటి, అమిత రంగనాధ్, శ్రీజిత్ గంగాధరిన్, జె.డి. చెరుకూరు తదితరులు
కూర్పు: కార్తీక శ్రీనివాస్
సంగీతం: ఎన్.ఎస్. ప్రసు
ఛాయాగ్రహణం: సంతోష్ షనమోని
నిర్మాత: ఎస్.ఎన్. రెడ్డి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సురేందర్ కొంటాడ్డి
విడుదల తేదీ: ఏప్రిల్ 29, 2020 (జీ5 ఇండియా)

సినిమా థియేటర్లు మూసివేసి నెల రోజులు దాటిపోయింది. మళ్లీ ఎప్పటికి తెరుచుకుంటాయనే దానిపై క్లారిటీ లోపించింది. థియేటర్లు మళ్లీ మామూలుగా ఆపరేట్ అవుతున్నా జనం మునుపటిలా భయం లేకుండా సినిమాలకి వెంటనే వచ్చేస్తారా అనేదానిపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక భార తట్టుకోగలిగిన నిర్మాతలు పరిస్థితులు మెరుగయ్యే వరకు వేచి చూస్తోంటే, చిన్న నిర్మాతలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. డిజిటల్ రిలీజ్ అనేది విదేశాల్లో ఇప్పటికే మామూలైపోయింది కానీ మనవాళ్లే ఇంకా థియేట్రికల్ రిలీజ్ మీదే ఆసక్తి చూపిస్తున్నారు. మన సినిమా బడ్జెట్లకి, ఓటీటీలు ఆఫర్ చేసే దానికి ఒక మాదిరి సినిమాకి కూడా పెట్టుబడి గిట్టుబాటు కాదు. అందుకే చిన్న సినిమాల వరకు విడుదలకి ఓటీటీ వేదికని ఆశ్రయిస్తున్నాయిపుడు. 

జీ5 ద్వారా ‘అమృతరామమ్’ తెలుగు సినీ ప్రియుల ముంగిట్లోకి వచ్చేసింది. ఓటీటీ నుంచి తొలిసారిగా విడుదలైన తెలుగు సినిమాగా ప్రచారం కూడా బాగానే దక్కింది. మరి విలువైన సమయాన్ని వెచ్చించి, జీ5 సబ్‌స్క్రిప్షన్ లేని పక్షంలో దానికి కాస్త ఖర్చు చేసి... ‘చూడదగ్గ’ స్టఫ్ ‘అమృతారామమ్’లో వుందా? ఒక కదిలించే ప్రేమకథా చిత్రం అందించాలనేది దర్శకుడి తపన అనేది క్లియర్‌గా తెలుస్తుంది. ప్రేమించడమంటే ఒకరితో ఒకరుండడం కాదు... ఒకరిలో ఒకరుండడం అనే తత్వాన్ని సినిమాటిక్‌గా చెబుతుంది. అయితే ఏ ప్రేమకథ అయినా అలరించాలన్నా, వారి త్యాగం కదిలించాలన్నా ముందుగా సదరు జంటతో ఎమోషనల్‌గా ట్రావెల్ చేయాలి. వారి భావోద్వేగాలని మనం ఫీల్ అవ్వాలి. వారికి ఎదురుపడే పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయగలగాలి. అలా చేయలేనపుడు సదరు జంట కథ ఎలా ముగిసినా కానీ పెద్ద పట్టింపు ఉండదు. 

ఒకబ్బాయిని ఓ అమ్మాయి పిచ్చిగా ప్రేమిస్తే అతని కోసం ఏం చేయడానికి సిద్ధపడుతుంది? తన ప్రేమకోసం ఎంతవరకు వెళుతుంది? అనేది చూపించిన ఈ చిత్రంలో అసలు ఆమె ప్రేమించేది ఎవరిని, అతడిని ప్రేమించేది ఎందుకు లాంటివి చాలా సిల్లీగా అనిపిస్తాయి. పోనీ ఆమె ప్రేమించిన అతడిలో ఏవైనా ఉత్తమ లక్షణాలుంటాయా అంటే అదీ లేదు. ఏదో అర్థంకాని ఫిలాసఫీ వినిపిస్తూ అర్థం లేకుండా ప్రవర్తిస్తూ వుంటాడు. ఆమె అతడికోసం అంతగా పరితపించిపోవడానికి అతడి గుణగణాలు కానీ ఆమెతో అతని ప్రవర్తనలో చూపించే సుగుణాలు కానీ మనకయితే కంటికి కనిపించవు. ‘నా కళ్లతో చూడాలి’ అనేది ఆమె సమాధానం కావచ్చు కానీ అమృత (అమిత) కళ్లకి రామ్ (రామ్) ఎలా కనిపిస్తున్నాడనేది మనెకప్పటికీ అంతు చిక్కని ప్రశ్నే అవుతుంది. అతడు పనీ పాటా లేకుండా అలా పడి వున్నా తనకి ఓకే అంటుంది అమృత. అతడిని తాను చూసుకుంటానని చెబుతుంది. అతను తనని బాధ పెట్టినా తానే సారీ చెబుతుంది. అతను ఎవరితో మాట్లాడినా కానీ తెగ ఇదైపోయి రాద్ధాంతం చేసేస్తుంటుంది. అతనికి తాగడం ఇష్టమంటే మందు బాటిల్ తీసుకెళ్లి తనే గ్లాస్‌లో పోసి ఇస్తుంది. 

ఆమె ‘కళ్లకి’ అతనెలా కనిపిస్తున్నాడు, అతడిలో ఆమె ఏమి చూస్తుందనేది తర్వాతి సంగతి. అసలు అతడిని ఆమె అంతగా ఆరాధించడంలో తప్పు లేదని మనకీ అనిపించాలి కదా? అతని బాగు కోసం ఆమె ప్రయత్నిస్తే అదేదో పెద్ద తప్పు చేసేసినట్టు ఆమెని వదిలేసి పోతాడు. నిజంగా నీది ప్రేమే అయితే మళ్లీ కనిపించకుండా వెళ్లిపోమని శాసిస్తాడు. అసలు అలాంటి వ్యక్తిని ప్రేమించిందా అని చూసేవాళ్లకి చిరాకొచ్చేస్తుంది. ‘నాది ప్రేమ కాదు పిచ్చి’ అని ఆమె పదే పదే అంటుంటే నిజమే కదా అని అరవాలనిపిస్తుంది. ప్రేమించిన వాడి కోసం ఆమె చేసే త్యాగం ఎక్కడైనా పేపర్లో చదివితే బాగానే అనిపిస్తుందేమో కానీ ‘అమృతరామమ్’లో మాత్రం కన్నీరు పెట్టించడం కాదు కదా కనీసం ‘అయ్యో పాపం’ అని కూడా అనిపించదంటే వీళ్ల ప్రేమ ఎంత బలంగా చూపించారనేది అర్థం చేసుకోండి. 

ఎలా ప్రేమలో పడ్డారనేది పక్కన పెడితే అసలు వారి ప్రేమలో ఒక్క ఫీల్ గుడ్ మూమెంట్ ఉండదు. అర్జున్‌రెడ్డి జమానా కాబట్టి అధర చుంబనాలకి లోటు లేదు. వీళ్ల ప్రేమ గోల అటుంచితే, సిడ్నీ నగర వీధుల్లో తెల్ల పంచెలు వేసుకుని, బంగారు గొలుసులు దిగేసుకుని కత్తులు, కొడవళ్లతో వీధుల వెంబడి తిరుగుతుంటాడొకడు. అక్కడున్న తెలుగు యువకుల పాస్‌పోర్టులు తీసుకుని అప్పులిస్తుంటాడట. తిరిగి ఇవ్వకపోతే వెనుక ఒక బ్యాచ్‌ని వేసుకుని వీధుల వెంట గాలిస్తూ వుంటాడట. కనీసం ఆస్ట్రేలియా బ్యాక్‌డ్రాప్ అనుకున్నపుడు అయినా ఇలాంటివి చూపిస్తే నవ్వుతారని అనిపించకపోవడమే వింత. విదేశాల్లో షూటింగ్ కనుక అక్కడ అందుబాటులో వున్న తెలుగు వారితోనే సినిమా తీసేసినట్టున్నారు. అందుకే సహాయ నటుల బృందమంతా ఎక్స్‌ప్రెషనే లేకుండా డైలాగులు అప్పజెప్పేస్తారు. 

హీరోగా నటించిన రామ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నటనలో అతనికి ‘త’ అంటే ‘తు’ రాదు. అమిత రంగనాధ్ మాత్రం తన పాత్ర తాలూకు భావోద్వేగాలని బాగానే పలికించింది. ఆమెకి డబ్బింగ్ చెప్పిన వాళ్లకి కూడా కొంత క్రెడిట్ దక్కుతుంది. సాంకేతికంగా చెప్పుకోతగ్గవి ఏమీ లేవు. చిన్మయి పాడిన ఒక పాట పల్లవి వినసొంపుగా వుంది. మిగిలిన వాటిలో మళ్లీ వినాలనిపించేవి లేవు. ఆస్ట్రేలియాలో చిత్రీకరించినా కానీ బడ్జెట్ పరిమితులు బాగా తెలిసిపోతుంటాయి. క్లయిమాక్స్ ఏడిపించేస్తుందనే ప్రగాఢ నమ్మకంతో దర్శకుడు కథనం మీద శ్రద్ధ పెట్టినట్టు లేడు. ఒక ఎమోషనల్ లవ్‌స్టోరీ తీయాలనే ఆలోచన తెలుస్తుంది కానీ అది తెరెకక్కే సరికి ఎమోషన్ మిస్ అయి ఫ్రస్ట్రేషన్ కలిగించింది. ఇక ఓటీటీలో థియేటర్లో లేని మరో సౌకర్యం ఏమిటంటే ఎప్పుడంటే అప్పుడు సినిమా ఆపేసి మళ్లీ కాస్త ఓపిక కూడగట్టుకున్నాక చూడొచ్చు. లేదా అంతటితో స్కిప్ చేసి మరో సినిమా కోసం సెర్చ్ చేసుకోవచ్చు. 

బాటమ్ లైన్: అమృత భారమ్!

గణేష్ రావూరి

Show comments