ఆంధ్రాలో 300 దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఢిల్లీ ప్రార్థనల తర్వాత ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువైంది. తాజాగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 300 దాటినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సాయంత్రం 6 గంటల నాటికి రాష్ట్రంలో 303 మంది కరోనా పాజిటివ్స్ ఉన్నట్టు ప్రకటించింది.

ఊహించినట్టుగానే కర్నూలులో మరిన్ని కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఢిల్లీ మర్కాజ్ కు వెళ్లొచ్చిన వాళ్లలో ఎక్కువమంది ఈ జిల్లా నుంచి కూడా ఉండడంతో ప్రభుత్వం ముందే ఈ విషయాన్ని ఊహించింది. అనుకున్నట్టుగానే ఆదివారం ఒక్కరోజే 52 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈరోజు మరో 18 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మొత్తంగా కర్నూల్ లో కరోనా బాధితుల సంఖ్య ఒక్కసారిగా 74కు ఎగబాకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ జిల్లాలో ఈ స్థాయిలో కరోనా బాధితుల్లేరు.

అటు మిగతా జిల్లాల్లో కూడా ఈరోజు కొత్తగా కరోనా కేసులు బయటపడ్డాయి. నెల్లూరులో 8, పశ్చిమ గోదావరిలో 5, కడపలో 4, కృష్ణా-ప్రకాశం జిల్లాల్లో చెరో కేసు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. కృష్ణా జిల్లాలో ఈరోజు మరో పేషెంట్ ను డిశ్చార్జ్ చేశారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి బయటపడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6కు చేరింది.

ప్రస్తుతం కర్నూల్ (74), నెల్లూరు (42), గుంటూరు (32) జిల్లాల్లో కరోనా ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ జిల్లాల్లో ప్రభుత్వం ఇప్పటికే హై-ఎలర్ట్ ప్రకటించింది. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తోంది. రైతు బజార్లను విభజించి విస్తరించింది. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని గృహనిర్బంధంలో ఉంచి, ఇంటికి నోటీసులు అంటిస్తున్నారు అధికారులు. 

Show comments