ఎమ్బీయస్‌: అఫ్గన్‌ శాంతి ఒప్పందంలో తొలి అపశ్రుతి

మార్చి 31. నెల్లాళ్ల క్రితం జరిగిన అఫ్గనిస్తాన్‌ శాంతి ఒప్పందంలో తొలి అడుగు పడవలసిన రోజు. తాలిబన్‌, అఫ్గన్‌ ప్రభుత్వం తమ అధీనంలో ఉన్న ఖైదీలను మార్పిడి చేసుకోవలసిన రోజు. కానీ అది జరగలేదు. ఎందుకంటే తాలిబన్‌ తరఫున రావలసిన డెలిగేషన్‌ ప్రభుత్వం వద్దకు రాలేదు. రెండు రోజుల క్రితం ప్రభుత్వంతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో పంపుతామని చెప్పిన తాలిబన్‌ మాట తప్పింది. దీనికి కారణం ఏమిటంటే 5 వేల మంది ఖైదీలను ఒకేసారి విడుదల చేయాలన్న దాని డిమాండ్‌ ప్రభుత్వానికి సమ్మతంగా లేదు.ఫిబ్రవరి 29న కుదిరినది అఫ్గనిస్తాన్‌ ప్రభుత్వంతో కూడిన త్రైపాక్షిక ఒప్పందమై ఉంటే అమలుపై ఆశులుండేవి. కానీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి అమెరికా, తాలిబన్‌తో నేరుగా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వం తరఫున తనే హామీలు యిచ్చేసింది. వాటి అమలుపై ప్రభుత్వం, తాలిబన్‌ తలోవిధంగా మాట్లాడుతున్నాయి.

1000 మంది అఫ్గన్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ సైనికులు తాలిబన్ల వద్ద, 5 వేల మంది తాలిబన్లు ప్రభుత్వం వద్ద బందీలుగా ఉన్నారు. వారిని వీరు, వీరిని వారు విడుదల చేయాలి. ముందుగా 1500 మందిని విడుదల చేసి చూస్తాం, వాళ్లు ఆయుధాలు తిరిగి చేపట్టకుండా ఉన్నారో లేదో చూసి తక్కినవాళ్లను విడుదల చేస్తాం అంటోంది ప్రభుత్వం. అదేం కుదరదు, 5 వేల మందినీ ఒక్కసారిగా విడుదల చేయాల్సిందే అంటోంది తాలిబన్‌. కతార్‌ రాజధాని దోహాలో జరిగిన శాంతి ఒప్పందం 18 సం.ల ఘర్షణకు తెర దించిందనుకున్నారు కానీ ఈ తెర మళ్లీ లేస్తుందేమోనన్న భయాలు లేకపోలేదు. ఎందుకంటే యిరుపక్షాల నుంచి చిత్తశుద్ధి పెద్దగా కనబడటం లేదు. చాలా విషయాలపై స్పష్టత లోపించింది.

అఫ్గన్‌ సాహసం మరో వియత్నాంలా తయారైందని అమెరికా ప్రజలు చాలాకాలంగా అనుకుంటున్నారు. 2011లో ప్రారంభమైన చర్చలు ఎప్పటికీ ఫలప్రదం కావటం లేదు. అది గమనించి ట్రంప్‌ ఎన్నికలలో అఫ్గనిస్తాన్‌ యుద్ధాన్ని అంతమొందించి ఖఱ్చు తగ్గిస్తానని వాగ్దానం చేశాడు. కానీ అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. 2019 సెప్టెంబరులో కుదిరేస్తుందని అనుకుంటే తాలిబన్‌ అమెరికా సైన్యాలపై విరుచుకుపడడంతో ఆగిపోయింది. ఇప్పుడింక తన టెర్మ్‌ పూర్తయిపోతోంది కాబట్టి, నవంబరులో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ట్రంప్ తొందరతొందరగా ఎలాగోలా ఒప్పందం చేసేసి, అయిందనిపించుకున్నాడు. నిజానికి తాలిబన్‌ నుంచి తీసుకున్న దాని కంటె ట్రంప్‌ యిచ్చినది ఎక్కువ. ఒప్పందం తర్వాత అమెరికన్లు గంతులేయటం లేదు కానీ తాలిబన్లు పండగ చేసుకుంటున్నారు. దాని మీడియా ప్రతినిథి దీన్ని వైట్‌హౌస్‌ అహంకారానికి ఓటమిగా అభివర్ణించాడు.

ముందుగా అమెరికాకు తాలిబన్లకు మధ్య ఘర్షణ ఎందుకు ఏర్పడిందో గుర్తు చేసుకోవాలి. 1979 డిసెంబరులో అఫ్గనిస్తాన్‌ను రష్యా ఆక్రమించి అక్కడ కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పరచడంతో పాక్‌ అధ్యక్షుడు జియా ఉల్‌ హక్‌ రష్యన్లు బెలూచిస్తాన్‌పై కూడా దండయాత్ర చేస్తారని భయపడి సౌదీ అరేబియా, అమెరికన్‌ గూఢచారి సంస్థ సిఐఏల సహకారంతో రష్యన్లను ప్రతిఘటిస్తున్న 90 వేల ఇస్లామిక్‌ ముజాహిదీన్‌ సభ్యులకు ఐఎస్‌ఐ ద్వారా తర్ఫీదు యిప్పించాడు. రష్యాది సంస్కరణవాదం కాబట్టి దానికి ప్రతిగా మతఛాందసం పేరుతో ప్రజల్ని సమీకరించాడు. అమెరికా యిచ్చిన ఆయుధాలతో, తర్ఫీదుతో వారు ఉగ్రవాద పంథాలో అఫ్గనిస్తాన్‌ ప్రభుత్వాన్ని అవస్థలపాలు చేశారు.

ఇంతలో రష్యాలో గోర్బచేవ్‌ శకం ప్రారంభమైంది. విదేశాల్లో జోక్యం చేసుకోవడం అనవసరమనే లైను తీసుకుని, 1989 ఫిబ్రవరిలో రష్యా సైన్యాన్ని వెనక్కి పిలిపించేశాడు. కానీ 1992 వరకు తమకు మద్దతుదారైన నజీబుల్లా ప్రభుత్వం కొనసాగేట్లు చూశాడు. అది పడిపోయాక అఫ్గనిస్తాన్‌లో అరాచకం ప్రబలింది. అప్పణ్నుంచి యిప్పటిదాకా అక్కడ రాజకీయ సుస్థిరత నెలకొనలేదు. అనేక పార్టీలు ఆధిపత్యం కోసం హింసాతక్మకంగా పోరాడాయి. వారిలో అందరి కంటె మతమౌఢ్యం ఉన్న తాలిబాన్ల (విద్యార్థులు అని అర్థం)ది పై చేయి అయింది.

వాళ్లు 1994 నుంచి 1996 వరకు సాయుధదళాలుగా వుండి 1996లో దేశంలో నాలుగింట మూడు వంతుల ప్రాంతాన్ని ఐదేళ్ల పాటు పాలించారు. తమ పాలనలో మతం పేర నానా రకాల అఘాయిత్యాలు చేశారు. సాటి ముస్లింలనే చంపారు. పాకిస్తాన్‌ను, అమెరికాను లక్ష్యపెట్టడం మానేశారు. ప్రపంచ ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి అఫ్గనిస్తాన్‌ను బలమైన స్థావరంగా చేశారు. అమెరికా, పాక్‌లు తయారుచేసిన తాలిబన్‌ భూతం వారినే కబళించసాగింది. 2001లో సెప్టెంబరు 11న అమెరికాలో జంట టవర్స్‌ను కూల్చివేయించిన ఒసామా బిన్‌ లాడెన్‌ కావడానికి సౌదీ వాడయినా అతనికి ఆశ్రయం యిచ్చి రక్షించినది తాలిబన్లే.

దాంతో అమెరికా వాళ్లకు బుద్ధి చెప్పడానికి నెల లోపునే తాలిబన్లపై దాడి జరిపింది. తనకు సహకరించే నాటో దేశాల సైన్యాలతో సహా అక్కడ విడిది చేసి, తాలిబన్‌ ప్రభుత్వాన్ని తొలగించి, తమ మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పరచసాగింది. ప్రభుత్వసైన్యాలకు ఆయుధాలిస్తూ, తర్ఫీదు యిస్తోంది. ఒబామా 2009లో ఇది తప్పనిసరిగా చేసి, గెలవవలసిన మంచి యుద్ధంగా వర్ణించి అక్కడున్న తమ సైనికుల సంఖ్యను లక్షకు పెంచాడు. ఇప్పటివరకు అమెరికా 2 ట్రిలియన్‌ డాలర్లను అక్కడ ఖర్చు పెట్టింది. మొత్తం 3550 మంది నాటో సైనికులు మరణించగా దానిలో 2400 మంది అమెరికన్‌ సైనికులే. 58 వేల మంది అఫ్గన్‌ ప్రభుత్వ సైనికులు, దాదాపు లక్ష మంది అఫ్గన్‌ పౌరులు మరణించారు.

ఇంత జరిగినా అఫ్గన్‌ పౌరులు దారిద్య్రంలో మగ్గుతున్నారు. వారికి శాంతీ లేదు, అభివృద్ధీ లేదు. తాలిబన్లు తిరుగుబాటు చేస్తూ అమెరికా సమర్థిస్తూ వచ్చిన ప్రభుత్వాలను సవ్యంగా నడవనీయకుండా చేశారు. ప్రజాస్వామ్య నాయకులమని చెప్పుకునేవారిలో ఒకరితో మరొకరికి పడటం లేదు. 2014 నుంచి, తక్కిన దేశాలన్నీ అఫ్గనిస్తాన్‌ నుంచి తప్పుకోసాగాయి. ఇప్పటికీ 12 వేల మంది నాటో సైనికులు అక్కడే ఉన్నారు. వారిలో అమెరికా వారే ఎక్కువ. ఏం చేసినా తాలిబన్ల ప్రాబల్యం తగ్గలేదు. బిబిసి 2018లో వేసిన అంచనా ప్రకారం దేశంలో 70% భాగంలో తాలిబన్లు చురుగ్గా ఉన్నారు. మరో అంచనా ప్రకారం ప్రస్తుతం 40% భూభాగంలో వాళ్ల అధికారం చెల్లుతోంది. అయినా పూర్తిగా అధికారంలోకి రావాలంటే చర్చలు తప్పవని తాలిబన్లు అనుకుంటూ వచ్చారు. దీనికి తోడు అఫ్గన్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ సంస్థ ఐసిస్‌ బలపడడం వారికి యిబ్బందిగా వుంది. అది యిటీవల అత్యంత రక్తసిక్తమైన దాడులు చేస్తూ తాలిబన్లలోని అతివాదులను ఆకర్షిస్తోంది. అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలు దానివైపు మొగ్గితే తమ ఉనికికి ప్రమాదం అని తాలిబన్‌కు తోచింది.

ప్రస్తుత ఒప్పందంలో తాలిబన్లు అంగీకరించిన అంశాలేమిటంటే - అల్‌ఖైదా కానీ మరే యితర ఉగ్రవాద సంస్థను కానీ తమ ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో అనుమతించం. అఫ్గన్‌లోని వివిధ వర్గాలతో సంప్రదింపు జరిపి శాశ్వత శాంతి నెలకొనేట్లా కృషి చేస్తాం అని. రాబోయే 14 నెలల్లో మొత్తం సైన్యాలను వెనక్కి పిలిపిస్తామని అమెరికా అంగీకరించింది. మొదటి 135 రోజుల్లో 8,600 మందికి తగ్గిస్తుంది. తక్కిన దేశాలు కూడా అదే నిష్పత్తిలో తమ సైన్యాలను ఉపసంహరించుకుంటాయి. అమెరికా తాలిబన్‌పై పెట్టిన ఆంక్షలు తొలగించడమే కాక, యునైటెడ్‌ నేషన్స్‌ విధించిన ఆంక్షలు కూడా ఎత్తివేయించడానికి ప్రయత్నిస్తుంది. ఇద్దరూ ఒకరిమీద మరొకరు దాడి చేయకూడదని ఒప్పుకున్నారు. కానీ తాలిబన్లు అఫ్గన్‌ ప్రభుత్వంపై దాడి చేయమని ఎక్కడా చెప్పలేదు.

వారి ప్రకటనలో అధికప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం ఏర్పరచేందుకు ప్రయత్నిస్తామని, ఇస్లామిక్‌ నియమాలకు లోబడి మానవహక్కులను కాపాడతామని చెప్పారు. విభిన్న భావాల రాజకీయ పార్టీలు పాల్గొనగల ఎన్నికలు నిర్వహిస్తామని కాని, మహిళలకు సమానహక్కు యిస్తామని కానీ కమిట్‌ కాలేదు. తాలిబన్లకు మళ్లీ ప్రాధాన్యం రావడం ఆఫ్గన్‌ మహిళలకు నచ్చలేదని గ్రహించి, తాలిబన్లు ‘గతంలోలా మేం మహిళల చదువుకు, ఉద్యోగాలకు అడ్డు చెప్పం.’ అంటున్నారు తప్ప డ్రెస్‌ కోడ్‌ గురించి మాట్లాడలేదు.

ఈ ఒప్పందంపై సంతకాలు చేసినది అమెరికన్‌ ప్రత్యేక రాయబారి జల్మే ఖాలిజాద్‌, తాలిబన్ల రాజకీయ విభాగం అధినేత ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌. సాక్షిగా అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో హాజరయ్యారు. తాలిబన్లలో వివిధ వర్గాలను కూడగట్టి, అమెరికాతో మాట్లాడి అందర్నీ ఒకచోటకి కూర్చిన పాకిస్తాన్‌ తరఫున దాని రక్షణమంత్రి షా మొహమ్మద్‌ ఖురేషీ అక్కడ ముఖ్యమైన అతిథి. ఆ ఫంక్షన్‌లో ఉజ్బెకిస్తాన్‌, కతార్‌, టర్కీ, ఇండోనేసియా, తజికిస్తాన్‌ తరఫున ప్రతినిథులు కూడా ఉన్నారు. ఇండియా తరఫున కతార్‌లో ఉన్న రాయబారి హాజరయ్యారు కానీ తాలిబన్లతో మనకు ప్రత్యక్ష సంబంధాలు లేవు కాబట్టి అధికారికంగా ఒప్పందాన్ని ఆహ్వానించలేదు. అఫ్గన్‌ ప్రభుత్వానికి, పౌరులకు కావలసిన సహకారాన్ని అందిస్తామని ప్రకటించి ఊరుకుంది.

ఒప్పందం జరిగేవేళ అమెరికా డిఫెన్స్‌ సెక్రటరీ మార్క్‌ ఎస్పెర్‌, నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ అఫ్గన్‌ రాజధాని కాబూల్‌కి వెళ్లి అఫ్గన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘని, అతని ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లాతో  కలిసి ఫోటోలు దిగారు. వారిని చల్లార్చే ప్రయత్నం చేశారు. ‘ఇది ఆరంభం మాత్రమే. అందరూ కలిసి వస్తే తప్ప శాంతి నెలకొనదు’ అని ప్రకటన చేశారు. అఫ్గన్‌ సేనకు ఆయులు సమకూర్చి, తర్ఫీదు యిచ్చే కార్యక్రమం కొనసాగుతుందని హామీ యిచ్చారు. ఇన్నాళ్లూ మేము వేలాది టెర్రరిస్టులను చంపాం. ఇప్పుడు ఆ పని వేరేవాళ్లు చేస్తారు. అనుకున్న విధంగా శాంతి నెలకొనకపోతే అప్పుడు కనీవిని ఎరగనంత సైన్యంతో మళ్లీ అక్కడకు వెళతాం అన్నాడు ట్రంప్‌.

అఫ్గన్‌ ప్రభుత్వంతో వచ్చిన చిక్కేమిటంటే దానికి లెజిటమసీ లేదు. బోగస్‌ ఎన్నికలు జరిపి, తమను తామే పాలకులగా ప్రకటించుకుంటున్నారని అభియోగం. తాలిబన్లు వాళ్లను పాలకులగానే గుర్తించరు. రెండేళ్ల క్రితం దేశాధ్యక్షుడు మీతో షరతులు లేకుండా చర్చలకు కూర్చుంటాం అని ఆఫర్‌ చేస్తే తాలిబన్‌ పోవోయ్‌ అనేసింది. కితం ఏడాది అధ్యక్ష ఎన్నికలు ప్రకటిస్తే అవి జరగకుండా దేశమంతా అల్లర్లు చేసింది. కోటిదాకా మంది ఓటర్లుంటే వారిలో ఐదోవంతు మంది మాత్రమే ఓటేశారు. శాంతిభద్రతల సమస్యకు తోడు, రాజకీయ నాయకుల ప్రవర్తనపై విసుగేసిన ఓటర్లు పోలింగు బూతులకు వెళ్లలేదు. దాంతో అధికారపక్షం యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడింది.

దాంతో ఎన్నిక కమిషన్‌ ఆడిట్‌ నిర్వహించి, నాలుగు నెలల కసరత్తు తర్వాత పడిన ఓట్లలో 10 లక్షలు బోగస్‌వని, సరైన వాటిలో 50.6% ఓట్లు తెచ్చుకున్న ప్రస్తుత అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘని మళ్లీ గెలిచాడని, అబ్దుల్లాకు 40% వచ్చాయని ప్రకటించింది. ఒకప్పుడు ఘని వద్ద ప్రధానమంత్రిగా చేసి, యిప్పుడు ప్రత్యర్థిగా మారిన అబ్దుల్లా ఈ ఫలితాలను అంగీకరించలేదు. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాలను కూడా అతను నిరాకరించాడు. అప్పుడు ఒబామా ప్రభుత్వం ఘనిపై ఒత్తిడి తెచ్చి అబ్దుల్లా కోసం సిఇఓ పదవిని సృష్టింపచేసింది. ఘని రెండోసారి అధ్యక్షుడిగా ఫిబ్రవరి 29న ప్రమాణస్వీకారం చేయాల్సి వుంది. అదే రోజున తను పోటీ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించి దేశాధ్యక్షుడిగా పదవిని చేపడతానని అబ్దుల్లా ప్రకటించాడు.

ఓ పక్క తాము తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకుంటూ వుంటే అదే రోజున కాబూల్‌లో యీ ప్రహసనం నడిస్తే బాగుండదని భావించి, అమెరికా ఆ ఫంక్షన్‌ను వాయిదా వేయించింది. ప్రత్యర్థులిద్దరినీ కాబూల్‌లో పక్కపక్కన నిలబెట్టి, ప్రకటన చేసింది. చివరకు మార్చి 9న ఆ ప్రహసనం జరిగే జరిగింది. అబ్దుల్లాకున్న సిఇఓ పదవిని ఘని రద్దు చేయగా, అబ్దుల్లా తనే అధ్యక్షుణ్నని ప్రకటించుకున్నాడు. వాళ్లిద్దరూ కలిసి పనిచేయటం లేదు కాబట్టి తాము యిస్తున్న సహాయంలో బిలియన్‌ డాలర్ల కోత విధిస్తున్నామని అమెరికా ప్రకటించింది. ఇప్పటికైనా కలిసి రాకపోతే యింతా తగ్గిస్తామని బెదిరించింది. అసలీ యుద్ధం యిన్నాళ్లు కొనసాగడానికి కారణాలు వెతికితే, అమెరికా తన దండయాత్రను పెంచినప్పుడల్లా తాలిబన్లు పాక్‌కి వెళ్లి తలదాచుకోవడం ఒక కారణం కాగా,  అమెరికా నిలబెట్టిన కీలుబొమ్మ ప్రభుత్వాల వైఫల్యం ప్రధాన కారణం!

ఆఫ్గన్‌ ప్రభుత్వం యింత బలహీనంగా వుండగా తాలిబన్‌ వారికి మర్యాద యిస్తుందని, శాంతి ఒప్పందం షరతులన్నీ పాటిస్తుందని అనుకోవడం అత్యాశే. ఘనీ, అబ్దుల్లాలలో ఎవరో ఒకరు తాలిబన్లతో చేతులు కలిపి, ప్రత్యర్థిని కూల్చే ప్రయత్నం చేయవచ్చు. ఇది అమెరికా గ్రహించలేదనుకోలేము. తన భారం దింపుదామనుకుంది, దింపుకుంటోంది. అంతే! కావాలంటే అఫ్గనిస్తాన్‌-పాకిస్తాన్‌ వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తానని ట్రంప్‌ ఆఫర్‌ యిచ్చాడు. ‘నో, థ్యాంక్స్‌’ అంది పాకిస్తాన్‌. అఫ్గన్‌లో మళ్లీ అశాంతి పెచ్చురేగితే అక్కడ నడుస్తున్న మన భారతీయ ప్రాజెక్టులు ఏమవుతాయోనన్న ఆందోళన మనకు కలగడం సహజం. (ఫోటో - ఓ పక్క ఒప్పందం, మరో పక్క అఫ్గన్  ప్రభుత్వనేతలు ఎడమొహం, పెడమొహం. అబ్దుల్లా, ఘని మధ్యలో మార్క్ ఎస్పెర్) 
 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020) 
 mbsprasad@gmail.com

Show comments