నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో హై అలెర్ట్

ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి ఆంధ్రాలో కేసుల సంఖ్య 194కు చేరింది. ఈరోజు ఇది కచ్చితంగా 200 మార్క్ అందుకుంటుందని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ఎందుకంటే.. ఇంకా 300కు పైగా శాంపిల్స్ కు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఊహించని విధంగా కేసుల సంఖ్య పెరగడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

మొన్నటివరకు ప్రభుత్వం ఎక్కువగా విశాఖ, పశ్చిమ, గుంటూరు జిల్లాల పైనే దృష్టిపెట్టింది. ఎఁదుకంటే ముందుగా కేసులు అక్కడ్నుంచే బయటపడ్డాయి. కానీ ఢిల్లీ ప్రార్థనల తర్వాత ఎక్కువమంది నెల్లూరు, కృష్ణా జిల్లాలకు వెళ్లడంతో ఇప్పుడక్కడ్నుంచి కేసుల సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ రెండు జిల్లాల్లో చెరో 32 మందికి (నిన్న రాత్రికి) కరోనా సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికే విజయవాడలోని 2 ఆస్పత్రుల్ని పూర్తిగా కరోనా హాస్పిటల్స్ గా మార్చిన ప్రభుత్వం.. అటు నెల్లూరులోని ప్రధానమైన 2 హాస్పిటల్స్ ను కూడా పూర్తిగా కరోనా హాస్పిటల్స్ గా మార్చాలని నిర్ణయించింది. ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా అనుమానం వచ్చిన ప్రతి ఒక్కర్ని ఐసోలేషన్ లో పెట్టాలని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు జారీచేసింది.

మరోవైపు కరోనా కేసులు పెరగడంతో నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ ఊరికి సంబంధించి ఆ ఊరి జనాలు సరిహద్దుల్లో కంచె వేసుకోవడంతో గ్రామాల మధ్య తగాదాలు ప్రారంభమయ్యాయి. తమ గ్రామంలోకి వేరే ప్రజలు రాకూడదంటూ లక్ష్మీపురం, కొత్తూరు, విడవలూరు గ్రామవాసులు సరిహద్దులు మూసేసుకున్నారు. అయితే దీనిపై కొంతమంది అభ్యంతం వ్యక్తంచేశారు. దీంతో 3 గ్రామాల ప్రజలు రాళ్లదాడి చేసుకునే వరకు పరిస్థితులు వెళ్లాయి. తాజా ఘటనతో సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించి ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటుచేశారు పోలీసులు.

గుర్తుంచుకోండి ఈ ఆదివారం రాత్రి 9 గంటలకి

Show comments