రేషన్ కష్టాలకు చెల్లుచీటీ ఎప్పుడు..?

ప్రస్తుతం కరోనా కష్టకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రేషన్ సరకుల పంపిణీ క్లిష్టంగా మారింది. ఉచితంగా ఇచ్చే అదనపు సరుకుల కోసం చాలా మంది తొలిరోజే క్యూలైన్లలోకి వచ్చి చేరారు. కానీ వారం అవుతున్నా కొన్ని ప్రాంతాల్లో ఈ కష్టాలు కొలిక్కి రాలేదు. సర్వర్ సమస్యతో రేషన్ సరకుల కోసం వచ్చిన లబ్ధిదారులు, వీఆర్వోలు, రేషన్ డీలర్లు ఇబ్బందులెదుర్కుంటున్నారు. సర్వర్ బాగున్న సమయంలో.. ఈపోస్ మిషన్లు సరిగా పనిచేయక అదో నరకం.

అసలు ఈపోస్ మిషన్లపై ఆధారపడటం తెలివితక్కువ పని అనే స్థితికి వచ్చేశారు ప్రజలు, అధికారులు కూడా. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సరిగా అందక, సర్వర్ పనిచేయక గంటల తరబడి రేషన్ కోసం వేచి చూస్తున్నారు లబ్ధిదారులు. అయితే విధాన పరమైన నిర్ణయం తీసుకునే వరకు జనాలకు ఈ తిప్పలు తప్పవు.

ఏపీలో కోటీ 30 లక్షల రేషన్ కార్డులున్నాయి. ప్రతినెలా ఠంచనుగా వీరికి రేషన్ అందివ్వాల్సిన అవసరం ఉంది. ఊరిలో లేకపోయినా పోర్టబులిటీ కింద.. ఎక్కడ్నుంచైనా రేషన్ అందుకునే సౌకర్యం ఒక్కటే ప్రస్తుతం ప్రజలకు కాస్త వెసులుబాటుగా ఉంది. ఇక షాపుకి వెళ్తే.. ఎప్పుడు పని పూర్తవుతుందో తెలియని పరిస్థితి. కూలీ పనులకు వెళ్లేవారు ఓరోజు పూర్తిగా పని మానుకుని రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.

సర్వర్ సమస్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఏదో అలా నెట్టుకొస్తున్నారు అధికారులు. వాలంటీర్ వ్యవస్థను సమర్థంగా ఉపయోగించుకోగలిగితే మాత్రం దీనికి పరిష్కారం సులభంగా దొరికినట్టే. రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దుచేసే ఆలోచనపై ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో ఈ పరిష్కారం కూడా వాయిదా పడింది. కనీసం ఈపోస్ మిషన్ల విషయంలో అయినా సరైన నిర్ణయం తీసుకోగలిగితే సర్వర్ కష్టాలు తీరే అవకాశం ఉంది.

పింఛన్ల పంపిణీకి, తాజాగా రేషన్ కార్డుదారులకు వెయ్యిరూపాయల కరోనా సాయం అందించే విషయంలో కూడా వాలంటీర్లు మొబైల్ ఫోన్లనే నమ్ముకున్నారు. మారుతున్న టెక్నాలజీ ప్రకారం.. రేషన్ పంపిణీకి కూడా మొబైల్ యాప్ తయారు చేసి, వాలంటీర్లకు లాగిన్ ఇస్తే.. ఇప్పటిలాగా సరకుల కోసం వేచి చూసే సమయం తగ్గిపోతుంది. సర్వర్ కష్టాలు, సిగ్నల్ కష్టాలు కూడా ఉండవు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే రేషన్ కష్టాలపై విమర్శల నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు.

గుర్తుంచుకోండి ఈ ఆదివారం రాత్రి 9 గంటలకి

Show comments