లాక్ డౌన్ లాభమెంతంటే..?

లాక్ డౌన్ వల్ల కలిగే నష్టాల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రజలెవరూ బైటకు రాకుండా, పరిశ్రమలు ఆగిపోయి, వాహనాల రద్దీ తగ్గిపోవడంతో కలిగే లాభాలు మాత్రం లెక్కలేనన్ని ఉన్నాయి. ఇవి మన ఊహకందనివి, కోట్ల రూపాయలు కుమ్మరించినా ఇప్పటి వరకూ సాధ్యం కానివి. లాక్ డౌన్ తో కేవలం భారత్ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కాలుష్య ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. గాలి స్వచ్ఛత పెరిగింది, నీటి మలినాలు తగ్గాయి.

ముఖ్యంగా గంగానది 50శాతం కాలుష్యాన్ని తగ్గించుకుంది. 2015లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే ప్రాజెక్ట్ కోసం 20వేల కోట్లు కేటాయించింది. అది ఐదేళ్ల ప్రాజెక్ట్. అయినా గంగానది కాలుష్య కాసారం నుంచి బైటపడలేదు. కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా గంగానది మాత్రం ప్రక్షాళణ కాలేదు, ఇక కాబోదు అని నాయకులు, ప్రజలు అనుకుంటున్న వేళ, లాక్ డౌన్ గంగానదికి జీవం పోసింది.

ఐదేళ్లలో ప్రభుత్వాలు సాధించలేని గంగా స్వచ్ఛతను, కేవలం రోజుల వ్యవధిలోనే లాక్ డౌన్ తీసుకొచ్చింది. చైనాలో పుట్టిన కరోనా వైరస్.. భారత జీవనది గంగా ప్రక్షాళణకు ఉపయోగపడింది. పరిశ్రమల కాలుష్యం చేరకపోవడంతో పాటు.. ఘాట్ లలో జరిగే కర్మక్రతువులు కూడా లేకపోవడంతో గంగానది కొత్త జీవం పోసుకుంది.

గంగలో 50శాతం కాలుష్యం తగ్గిపోయిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గణాంకాలు చెబుతున్నాయి. అంటే 20వేల కోట్ల రూపాయల నిధులు, ఐదేళ్ల ప్రణాళిక కూడా సాధించలేని విజయాన్ని కేవలం 12రోజుల లాక్ డౌన్ చేసి చూపించింది. ఇది కేవలం గంగా నది లెక్క మాత్రమే. ఇలాంటి ఉదాహణలు భారత్ లో కోకొల్లలు. ఈ లాక్ డౌన్ కారణంగా ఢిల్లీలో కాలుష్యం 70శాతానికి పైగా తగ్గిపోయింది. మరో మూడేళ్ల పాటు ఢిల్లీ వాతావరణానికి ఎలాంటి ఢోకా లేదని చెబుతోంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్.

లాక్ డౌన్ తో వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధ పడుతున్నామే కానీ, అంతకంటే ఎక్కువ లాభం దీనివల్ల దేశానికి, దేశ జనాభాకూ జరిగిందనేది కాదనలేని వాస్తవం. డబ్బుతో చేయలేని పనుల్ని లాక్ డౌన్ చేసిపెట్టింది. ఆర్థిక వృద్ధి మందగించినా, ఈ కోణంలో వందల రెట్లు లాభం ప్రజలకు చేకూరిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

గుర్తుంచుకోండి ఈ ఆదివారం రాత్రి 9 గంటలకి

Show comments