ఐసొలేష‌న్ టైమ్ః రిలేష‌న్ షిప్ కు ఇది రీచార్జింగ్!

ఇన్నాళ్లూ భార్యాభ‌ర్త క‌లిసి మాట్లాడుకోవ‌డానికి కూడా స‌మ‌యం ఉండేది కాదు! న‌వీన త‌రం జాబ్స్ లో, భార్యాభ‌ర్త ఇద్ద‌రూ ఉద్యోగ‌స్తులు అయిన వాళ్లు క‌లిసి గ‌డ‌ప‌డానికి త‌గిన స‌మయం లేక ఇబ్బంది ప‌డుతూ వ‌స్తుండ‌వ‌చ్చు. ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లాలి. భారీ ట్రాఫిక్ లో చొచ్చుకుపోవాలి. సాయంత్రం కూడా అదే స్థాయి ట్రాఫిక్. ఇంటికి చేరే స‌రికి ఏ ఎనిమిదో, తొమ్మిదో కావొచ్చు. వ‌చ్చాకా చేసుకోవ‌డం, తిన‌డం.. ఏ వారంతంలోనో స‌మ‌యం దొరికితే అదే ఎక్కువ‌! అందునా ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రికి శ‌నివారం కూడా ప‌ని ఉందంటే, అంతే సంగ‌తులు. క‌ళ్లు మూసి తెరిచే లోగా ఆదివారం ఐపోతుంది!

ఒక‌వైపు ఈ త‌రంలో భిన్న‌మ‌న‌స్త‌త్వాల గ‌ల‌వాళ్లు భార్యాభ‌ర్త‌లుగా మెల‌గ‌డ‌మే క‌ష్టం. ఆ పై వ‌ర్క్ ప్రెజ‌ర్స్, క‌లిసి మాట్లాడుకోవ‌డానికి కూడా ఖాళీ దొర‌క‌క‌పోవ‌డం ఇవ‌న్నీ స‌మ‌స్య‌లే. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్వారెంటైన్ టైమ్ న‌డుస్తోంది, ఇళ్ల‌కే ప‌రిమితం అయి గ‌డ‌పాల్సి వ‌స్తోంది. అంతా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం! భార్య‌భ‌ర్త‌ల క‌మ్యూనికేష‌న్ గ్యాప్ ను ఫిల‌ప్ చేసుకోవ‌డానికి ఇది త‌గిన స‌మ‌యం అని అంటున్నారు రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్!

ఒక‌వైపు వివిధ దేశాల్లో కూడా ఇలాంటి ఐసొలేష‌న్ టైమే న‌డుస్తూ ఉంది. భార్యాభ‌ర్త‌లు ఇళ్ల‌కు ప‌రిమితం అయి ప‌ని చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇది కొన్ని చోట్ల విక‌టించిన దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. క‌రోనా పుట్టిళ్లు చైనాలో విడాకుల రేటు భారీగా పెరిగింద‌ట‌. చైనాలో క‌ట్టుదిట్టంగా లాక్ డౌన్ అమ‌లు చేసి, జ‌నాల‌ను ఇళ్ల‌కు ప‌రిమితం చేయ‌డంతో.. చాలా మంది దంప‌తులు గొడ‌వ ప‌డి విడాకుల కోసం కోర్టుల‌కు ఎక్కార‌ట‌. గ‌తంతో పోలిస్తే క్వారెంటైన్ టైమ్ లో చైనాలో విడాకుల అప్లికేష‌న్ల స్థాయి చాలా పెరిగింద‌ని అక్క‌డి ప‌రిశీల‌కులు పేర్కొన్నారు.

అలాగే ఆస్ట్రేలియాలో గృహ‌హింస త‌ర‌హా కేసులు పెరిగాయ‌ట ఈ స‌మ‌యంలో. అలాంటి ఉదంతాల‌ను గుర్తెర‌గాలి. ఇద్ద‌రూ ఇంట్లో కూర్చుంటే కొత్త‌గొడ‌వ‌లు త‌లెత్తే అవ‌కాశాలు లేక‌పోలేదు. దానికి ఇండియా కూడా మిన‌హాయింపు కాక‌పోవ‌చ్చు. కాబ‌ట్టి.. ప్ర‌స్తుత స‌మ‌యాన్ని ఎవ‌రికి వారు త‌గిన‌ట్టుగా ఉప‌యోగించుకోవ‌డం గురించి ప్రిపేర్ కావాల‌ని, ఇంట్లో కూర్చున్న స‌మ‌యం కొత్త గొడ‌వ‌లు త‌లెత్త‌డానికి కాకుండా, పాత వ్య‌వ‌హారాల‌ను ప‌రిష్క‌రించుకోవడానికి ఉప‌యోగించుకోవాల‌ని.. ఈ విష‌యంలో ఎవ‌రికి వారే మెంట‌ర్లు అని రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్ అంటున్నారు.

తమన్నా చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో చూడండి

Show comments