ఎమ్బీయస్‌: ‘‘నిధి తెచ్చే సుఖం’’ కథ -` 2/2

పోలీసులు వచ్చారు. మృతుని కోటు జేబులు వెతికి అతని అడ్రసు, వివరాలు అన్నీ తెలుసుకున్నారు. సాధారణంగా వీళ్లు ఓ మ్యాప్‌ పట్టుకుని తిరుగుతూంటారే, మీకేమైనా కనబడిందా? అని అడిగారు. లేదన్నారు అమ్మాయిలు. కేట్‌ దాన్ని ముందే జాగ్రత్త పరచింది. ‘‘మ్యాప్‌ పోయి వుంటుంది. దాన్ని వెతికే ప్రయత్నంలో నిరాశ చెంది గుండె ఆగిందేమో’’ అంది ఇన్‌స్పెక్టర్‌తో. ఆ రాత్రి యిద్దరూ ఇన్‌కు దూరంగా ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లి హుషారుగా డిన్నర్‌ చేశారు. అనుకోకుండా పాల్‌, హేరీ అక్కడ కనబడ్డారు. వాళ్లిద్దరి మూడ్‌ బాగాలేదు. ‘వచ్చిన పని ఏమైంది?’ అంది రీటా పాల్‌తో. ‘ఎందుకు వచ్చామో చెప్పేశావా?’ అన్నాడు హేరీ పాల్‌కేసి ఉగ్రంగా చూస్తూ. ‘‘చెప్తే మాత్రం ఏమౌతుంది? నువ్వూ నీ తొక్కలో మ్యాపూనూ’’ అన్నాడు పాల్‌ అంతకంటె కోపంగా.

జరిగినదేమిటంటే హేరీ దగ్గరున్న మ్యాప్‌ బోగస్‌ది. హెలికాప్టర్‌ పైలట్‌ దాన్ని చూస్తూనే చెప్పాడు, ఇదే మ్యాప్‌ వందలసార్లు చూశానని. చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైంది. అందుకే వాళ్ల మధ్య రుసరుసలు, బుసబుసలు. తమ వద్ద ఉన్న మ్యాప్‌ గురించి ఎవ్వరికీ చెప్పకూడదని ఒట్టేసుకున్నా, దాన్ని తీసి గట్టున పెట్టి కేట్‌ ‘‘మా దగ్గరున్న మ్యాప్‌ అలాటిది కాదు.’’ అనేసింది. హేరీ దాన్ని పరీక్షించి యిది నిజమైన మ్యాపే అని సర్టిఫై చేశాడు. కాస్సేపటికే వాళ్ల నలుగురి మధ్య ఒక రాతపూర్వకమైన ఒప్పందం కుదిరింది. నలుగురూ కలిసి గని కోసం వెతికేట్లు, ఖఱ్చులన్నీ పాల్‌ భరించేట్లు, దొరికిన బంగారంలో పదో వంతు చనిపోయిన ముసలాయన స్కూలుకి,  మూడో వంతు ఆయన చెల్లెలికి పోగా తక్కినదాన్ని రెండు సగాలు చేసి, ఒక భాగాన్ని పాల్‌-హేరీ టీముకి, రెండో భాగాన్ని కేట్‌-రీటా టీముకి యిచ్చేట్లు రాసుకుని అందరూ సంతకాలు పెట్టారు.

మర్నాడు తెల్లవారక ముందే హెలికాప్టరు పైలట్‌ను మళ్లీ రప్పించారు. వాళ్లు దిగబోతూ ఉండగా అప్పటికే అక్కడున్న సాటి వేటగాళ్లు తుపాకులు కాల్చారు. కాల్పులు తప్పించుకుంటూ, పరుగులు పెట్టుకుంటూ ఓ కొండ చాటుకి వెళ్లి దాగునేసరికి రీటాకు విరక్తి కలిగింది. ‘‘నేను యింటికి వెళ్లిపోతా’’ అంది. ‘‘మనందరం ఎవరింటికి వాళ్లం వెళ్లిపోతాం, బంగారం మూటలు భుజాన వేసుకుని..’’ అని పాల్‌ ఆమె భుజం మీద చెయ్యి వేసి ఊరడించాడు. హేరీ పక్కనే గుడారం వేశాడు. సూర్యుడు పైకి వస్తూండగా మనం కొండెక్కాలి అన్నాడు. కానీ పాల్‌ వారించాడు. ‘‘వెలుతురులో వెళితే మనం తుపాకీగుళ్లకు బలై పోతాం. రేపు   తెల్లవారుఝామున 4 గంటల కల్లా బయలుదేరితే గంటలో ఆ గని చేరతాం.’’ అన్నాడు పాల్‌.

‘‘అమ్మో, తుపాకీగుళ్లా?’’ అంది రీటా చేతులు గుండెల మీద పెట్టుకుంటూ. ‘‘ఏం ఫర్వాలేదు, డియర్‌’’ అంటూ పాల్‌ ఆమె భుజం మీద చెయ్యివేసి మళ్లీ ఊరడించాడు. ఈ ప్రేమకలాపం కేట్‌ చూడలేకపోయింది. ‘‘నేను యిప్పుడే పైకి వెళతా’’ అంది. ‘‘నేనూ వస్తా’’ అన్నాడు హేరీ. కానీ పాల్‌ ఒప్పుకోలేదు. ‘‘రాత్రుళ్లు వంతులవారీగా కాపలా కాయాలి. అమ్మాయిలూ, బండ నీడలో మీ యిద్దరూ కాస్సేపు పడుక్కోండి.’’ అన్నాడు పాల్‌. హేరీ తుపాకీ ఒళ్లో పెట్టుకుని బండకు వాలి, అరమోడ్పు కన్నులతో వాళ్లని గమనిస్తూ కూర్చున్నాడు.

కాస్సేపు పోయాక రీటా లేచి పాల్‌ దగ్గరకు వెళ్లి ‘‘అతన్ని వేరే వైపు చూడమను. నాకు యిబ్బందిగా ఉంది.’’ అంది. పాల్‌ ఆమెను ముద్దుపెట్టుకుని ఏం ఫర్వాలేదు, మనవాడే అన్నాడు. సరిగ్గా అప్పుడే కేట్‌కు మెలకువ వచ్చింది. చికాగ్గా మొహం పెట్టి, కళ్లు బలవంతంగా మూసుకుని పాల్‌, తను గుఱ్ఱాలెక్కి ఎక్కడికో వెళ్లిపోయినట్లు, ఆ తర్వాత విశృంఖల శృంగారం నెరపినట్లు అర్జంటుగా ఓ కల కనేసింది. కళ్లు తెరిచి చూసేసరికి, హేరీ ఆమెకేసి చూసి చిరునవ్వు నవ్వాడు - ‘నీ ఊహలేమిటో నాకు తెలిసిపోయాయిలే’ అన్నట్లు. ఆమెకు ఒళ్లు మండిపోయింది.

రాత్రి ఎనిమిదిగంటల మొదటి షిఫ్ట్‌ పాల్‌ది, తర్వాతి రెండేసి గంటల షిఫ్టు రీటా, కేట్‌, హేరీవి. పాల్‌ షిఫ్ట్‌లో అందరూ మెలకువగానే ఉన్నారు. రీటా అతని భుజం మీద తలపెట్టుకుని కూర్చుంది. వాళ్లిద్దరూ ఏ అఘాయిత్యం చేసేసుకుంటారోననే బెంగతో కేట్‌ కూర్చుంది. ఆమె ఉరోజాలను చూసి లొట్టలేస్తూ హేరీ కూర్చున్నాడు. రీటా షిఫ్ట్‌లో ఆమెకు తోడుగా పాల్‌ కూర్చున్నాడు. 12 గంటలకు రీటా వెళ్లి కేట్‌ను లేపింది యిప్పుడు నీ వంతు అంటూ. కేట్‌ కళ్లు కూడా తెరవకుండా ‘ఈ షిఫ్ట్‌ కూడా నువ్వే చేసేయ్‌. పాల్‌తో ఎక్కువసేపు గడిపే ఛాన్సు వస్తుంది.’ అంది వెటకారంగా. సరే, అలా ఐతే అని రీటా అంటూండగానే లేచి కూర్చుని ‘ఏం అక్కరలేదులే, పడుక్కో’ అంటూ లేచి కూర్చుంది. రీటా ఉడుక్కుని ‘‘మా యిద్దరికీ ఒకరంటే మరొకరకి యిష్టమని నువ్వేం ఏడవనక్కరలేదు.’’ అంది. ‘‘ఏడిశావులే’’ అంది కేట్‌.

ఆమె తన షిఫ్ట్‌ చేయడానికి కూర్చోగానే పాల్‌, రీటా యిద్దరూ పడి నిద్రపోయారు. హేరీ మాత్రం మధ్యాహ్నం నుంచి వున్న పోజులోనే కూర్చుని, ఆమె కేసే చూస్తున్నాడు. ఓ గంట గడిచాక, లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. ఏం కావాలంది. ముద్దు అన్నాడతను. పోరా సన్నాసీ అందామె. మీద పడ్డాడు. బలమైన తన చేతులతో ఆమె చొక్కాను పరపరా చింపేశాడు. జీన్స్‌ జిప్‌ను తెంపేశాడు. కేట్‌ కూడా అంగసౌష్టవం ఉన్నదే కానీ అతని ముందు ఆగలేకపోయింది. అతనామెను యిష్టం వచ్చినట్లు నలిపివేస్తూ బలాత్కారం చేయబోయాడు. ఆమెను నేలమీద పడేసి, గొంతు పట్టుకుని ఒక చేత్తో జీన్స్‌ను కిందకు లాగుతూండగా పాల్‌కు మెలకువ వచ్చింది. బలవంతాన అతన్ని ఆమె మీద నుంచి లేపాడు. ఇద్దరూ కొట్టుకున్నారు. చివరకు నోటి నుంచి రక్తం కారుతూ హేరీ కింద పడిపోయాడు. వీళ్లందరి కేసి కోపంగా చూశాడు. అంతలోనే అతని కళ్లల్లో అప్పటివరకు ఎవరూ చూడని ఆనందం కనబడింది.

రీటా ఆశ్చర్యపడుతూ కేట్‌ కేసి చూసింది. ఈ గొడవ వలన కేట్‌ శరీరం పూర్తిగా బహిర్గతమై పోయింది. ఘనమైన ఆమె స్తనాలు, సన్నని నడుము, పొత్తి కడుపు నగ్నంగా దర్శనమిచ్చాయి. ‘‘కేట్‌, చూసుకో, ఏదైనా కప్పుకో’’ అని అరిచింది రీటా. ఆమె అరుపులకు పాల్‌ తల తిప్పి కేట్‌ వైపు చూశాడు. చూస్తూనే నోరు వెళ్లబెట్టి ‘‘అసలెవరికైనా యింత...’’ అనబోయి, మాటలు తట్టక ఆగిపోయాడు. అతని అవస్థను చూసి కేట్‌ మురిసిపోయింది. అందుకే కప్పుకోమంటూ రీటా అందించిన దుప్పటిని భుజాన జాలువారుగా వేసుకుంది. పాల్‌ ఆమె ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఎగాదిగా చూస్తూ ‘ఏం అందం! పై నుంచి కిందవరకు.. నేనెన్నడూ చూడలేదిలాటి శరీరం.’ అంటున్నాడు. కేట్‌ చిరునవ్వు నవ్వుతూ తన భుజాలను కొద్దిగా కదిలించింది. పాల్‌ ముగ్ధుడై పోయి, దాదాపు మూర్ఛపోయాడు.

‘‘బట్టలేసుకో’’ అరిచింది రీటా. పాల్‌ వెంటనే తన కోటు తీసి కేట్‌ కిచ్చాడు. కేట్‌ నె..మ్మ..ది..గా కోటు తొడుక్కుంది, రీటా అసహనం చూసి నవ్వుకుంటూ. పాల్‌ హేరీ కేసి చూస్తే అతను స్పృహతప్పి వున్నాడు. ‘‘ఇతనికి మెలకువ వచ్చేలోగా మనం పైకి వెళ్లి వచ్చేద్దాం. తక్షణమే బయలుదేరాలి. లేచాడంటే పిచ్చెక్కిపోతాడు.’’ అన్నాడు. ‘‘తనకి బంగారంలో వాటా దక్కకపోతే యింకా పిచ్చెక్కిపోతాడు.’’ అంది రీటా. ‘‘తన వాటా తనకు యిచ్చేద్దాం.’’ అంది కేట్‌. పాల్‌ మెచ్చుకున్నాడు ` ‘‘నీ ఛాతీయే కాదు, హృదయం కూడా విశాలమైందే. అతను అంత ఘోరం చేసినా..’’ అంటూ. అతని కారణంగానే పాల్‌ తనవైపు తిరిగిపోయాడన్న కృతజ్ఞతను మనసులోని ఉంచుకుని పైకి ‘‘పొరపాట్లు చేయడం మానవసహజం.’’ అంది కేట్‌. దెబ్బకి పాల్‌ దాసోహమన్నాడు.

వాళ్లు పైకి ఎక్కి, చిన్న టార్చ్‌ సహాయంతో మ్యాప్‌ను చూసుకుంటూ చివరకు గని ఉన్న చోటికి చేరారు. అక్కడ చిన్న కంత ఉంది. ఒక అడుగు ఎత్తు, ఒక అడుగు వెడల్పు. లైటు వేసి చూస్తే లోపల విశాలంగానే కనబడింది. కానీ వెళ్లడం ఎలా? ‘నేను పట్టడం అసాధ్యం’ అన్నాడు పాల్‌. ‘నా సైజులతో లోపలకి దూరితే యిరుక్కుపోతాను’ అంటూ కేట్‌ నవ్వింది. వెళ్లగలిగేది రీటా ఒక్కతే. కానీ తను వెళ్లనంది. కేట్‌ను అలా చూడగానే పాల్‌ పార్టీ ఫిరాయించడం ఆమెను దహించి వేస్తోంది.  లోపల పాములు, తేళ్లు, మండ్రగబ్బలు వీటిలో కొన్ని కానీ, అన్నీ కానీ ఉండవచ్చంది.

చేతిదాకా వచ్చిన బంగారం నోటిదాకా రాకుండా పోతోందని అందరూ బాధపడ్డారు. చివరకు రీటా తెగించింది. కష్టపడి లోపలకి దూరి, బయటకు వచ్చేసరికి ఆమె చేతిలో ఓ కాన్వాస్‌ బ్యాగ్‌ ఉంది. ‘‘పాల్‌, ఒళ్లంతా చీరుకుపోయింది తెలుసా’’ అంటున్న రీటా మాటలు పట్టించుకోకుండా పాల్‌, కేట్‌ ఆ బ్యాగ్‌ తాడు విప్పారు. పాల్‌ లోపలకి చెయ్యిపెట్టి ‘నాణాలు, బంగారు నాణాలు’ అంటూ గుప్పిట్లో కొన్ని బిగించి బయటకు లాగాడు.

‘‘చాలా సంతోషం’’ అని వినబడింది వెనక్కాల నుంచి. ముగ్గురూ తిరిగి చూస్తే హేరీ కనబడ్డాడు. తుపాకీ పాల్‌ తలకు గురి పెట్టి అతను చెప్తున్నదేదీ వినకుండా బ్యాగ్‌ లాక్కున్నాడు. ఎడం చేత్తో బ్యాగ్‌ తెరిచి ఒక కాయిన్‌ తీసి వీళ్లవైపు విసిరి, ‘ఇది చాలు మీ ముఖాలకు’’ అన్నాడు. పాల్‌ దాన్ని అందుకుని లైటు వేసి చూసి ‘‘ఇది బంగారపుది కాదు, యిత్తడిది’’ అని కెవ్వున అరిచాడు. ‘‘కబుర్లాపు’’ అని గద్దించాడు హేరీ. ‘‘కావాలంటే నువ్వే చూసుకో’’ అంటూ పాల్‌ ఆ నాణాన్ని తిప్పి చదివాడు. కొలరాడోలోని డెన్వెర్‌లో సిల్వర్ డాలర్‌ హోటల్‌ లో వేశ్యాగృహం నడిపే మేడమ్‌ రూత్‌ అనే ఆమె యిచ్చిన టోకెన్లు అవి. ఒక కాయిన్‌ యిస్తే ఆమె దగ్గరున్న అమ్మాయిల్లో ఒకర్ని ఒక రాత్రి అనుభవించవచ్చు. ‘‘ఇదెక్కడి గోల?’’ అని అరిచాడు హేరీ. బాగ్‌లో వెతికితే ఓ ఉత్తరం దొరికింది.

1915లో లూసియస్‌ అనే అతను రాసిన ఉత్తరమది. అతను తనకు దొరికిన బంగారమంతా మార్చేసి యిలాటి టోకెన్లు 2 వేలు కొన్నాడు. బంగారం, డబ్బు, మరేదైనా కానీ సమకూర్చే సుఖం లైంగిక సుఖం కంటె గొప్పగా ఉండదని అతని స్వానుభవం. 2వేల కాయిన్లంటే శేషజీవితానికి సరిపోతాయని లెక్కవేశాడు. వాడినంతకాలం వాడి అంత్యకాలంలో మిగిలినవాటిని యిక్కడ పాతిపెట్టాడు. ఎవరికి దొరికితే వాళ్లు వాటిని వాడుకోవచ్చని ఉదారంగా విల్లు రాసి పెట్టాడు. అలా వెళ్లినపుడు అక్కడున్న ముగ్గురు అమ్మాయిలను తన పేరు చెప్పుకుని ప్రత్యేకంగా అనుభవించమన్నాడు. ముఖ్యంగా భారీస్తనాలున్న హెన్నాను అనుభవించినప్పుడు తను బంగారాన్ని యిలాటి బాండ్లగా లేదా టోకెన్లగా మార్పిడి చేయడం మూర్ఖపు పని కాదని వారే గ్రహిస్తారన్నాడు.

ఇది చదివి అందరూ బిత్తరపోయారు. దీనిలో పదోవంతు చనిపోయిన ముసలాయన స్కూలుకి, మూడో వంతు చెల్లెలికి పంపితే వాళ్లేం చేసుకుంటారని కేట్‌ అడిగింది. హేరీ నిరాశతో తల విదిలించి, తుపాకీ భుజాన వేసుకుని కొండ దిగి వెళ్లిపోయాడు. ‘మా ఆడవాళ్లం మేమేం చేసుకుంటాం? నీకు పనికి వస్తాయేమో, ఇప్పటికీ ఆ వేశ్యాగృహం నడుస్తోందేమో. 50 ఏళ్ల క్రితం నాటివైనా ఆ టోకెన్లు యిప్పుడు పనికి రావచ్చు.’ అంది రీటా పాల్‌తో. కేట్‌ పాల్‌ను వాటేసుకుని ‘హెన్నా గురించి అతను రాసినది చదివేవుగా, గత జన్మలో నేనే హెన్నాననుకో. ఇక పాల్‌కు టోకెన్లతో పనేముంది? బంగారంతో పనేముంది?’ అంది. ‘నిజం, నిజం’ అన్నాడు పాల్‌ నవ్వుతూ ఆమెను దగ్గరతీసుకుని.

తర్వాతి సంఘటనలు త్వరగానే జరిగిపోయాయి. హెలికాప్టర్‌ పైలట్‌  సిల్వర్ డాలర్‌   హోటల్‌ యింకా అదే వ్యాపారంలో వుందని చెప్పి పది టోకెన్లు పుచ్చుకున్నాడు. తమ సాహసానికి గుర్తుగా వీళ్లు తలోటీ ఉంచుకున్నారు. తక్కినవి కొండ మీద వెదజల్లారు. పాల్‌ కేట్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా పంపింది. రీటా స్టూగా కొనసాగుతూనే తమ కథను ఒక పత్రికకు పంపి పారితోషికంగా మూడు వేల డాలర్లు సంపాదించింది... ఇదీ కథ. నిజంగానే ఉన్న లాస్ట్‌ డచ్‌మాన్స్‌ గోల్డ్‌మైన్‌ చుట్టూ అల్లిన యీ రచనలో కనబడే ఎడ్వెంచర్‌, కొంటెతనం, ఆడవాళ్ల అసూయలు, మగవాళ్ల వెకిలితనాలు, బలహీనతలు (చనిపోయే ముసలాడి ప్రవర్తన చూడండి) - యివి నాకు నచ్చాయి. అందుకే యీ కథ చెప్పా. మీకు నచ్చిందో లేదో తెలియదు. (ఫోటో - సీక్వెల్స్‌, రెండో పుస్తకంలోదే యీ కథ) 

(సమాప్తం) - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020)
 mbsprasad@gmail.com

Show comments