వైద్యులపై దాడులు.. మూర్ఖత్వానికి పరాకాష్ట

దేవుళ్లలాంటి వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల సరైన సదుపాయాలు లేక.. ఐసోలేషన్ వార్డుల్లో సేవలందించడానికి వెనకాడుతున్నారు డాక్టర్లు, నర్సులు. ఉత్తర ప్రదేశ్ లో ఏడు నెలలుగా జీతాలివ్వకపోయినా ఝాన్సీ మెడికల్ కాలేజీ సిబ్బంది కిక్కురుమనకుండా తమ సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా అరకొర వసతులున్నా.. నిబద్ధతతో పనిచేసుకుంటూ పోతున్నవారు చాలామంది ఉన్నారు. అలాంటివారిపైనే ఇప్పుడు కరోనా వ్యాధిగ్రస్తులు, అనుమానితులు తిరగబడుతున్నారు.

హైదరాబాద్ లో ఓ పేషెంట్ చనిపోవడంతో బంధవులు డాక్టర్ పై దాడికి దిగారు. బెంగళూరులో ఓ ఆశావర్కర్ పై ఢిల్లీ వెళ్లొచ్చినవారు తిరగబడ్డారు. తమిళనాడులో ఢిల్లీ నుంచి వచ్చినవారికి పరీక్షలు చేయబోగా.. నాకంటే ముందు 100 దేశాలు తిరిగొచ్చిన మోడీకి చేయండి అంటూ.. వారిని తిప్పి పంపించాడో మూర్ఖుడు.

నెల్లూరు జిల్లాలో పోలీసుల కట్టడి మధ్య నలుగురు అనుమానితుల్ని బలవంతంగా ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి. ఇండోర్ లోనైతే పరీక్షల కోసం వెళ్లిన వైద్య సిబ్బందిని తరిమికొట్టింది ఓ సామాజిక వర్గం. ఇక హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న దారుణాలకు లెక్కలేదు. వైద్య పరీక్షల కోసం ఇంటింటికీ వస్తున్న సిబ్బందిపై స్థానికులు తిరగబడుతున్నారు. రాళ్లు, కర్రలతో దాడికి దిగుతున్నారు. వైద్యులపై ఉమ్మివేయడం, వారిని భయభ్రాంతులకు గురిచేయడం వంటి దారుణాలు కూడా జరుగుతున్నాయి.

కొన్నిచోట్ల పోలీసుల్ని కూడా లెక్కచేయడం లేదు. నిన్నటికినిన్న హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో మాస్క్ పెట్టుకోవడానికి, ప్రత్యేక దుస్తులు ధరించడానికి ఓ కరోనా అనుమానితుడు నిరాకరించాడు. రోడ్డుపైనే మాస్క్, దుస్తులు విసిరేసి నానా వీరంగం సృషించాడు. చివరికి స్థానిక నేతల చొరవతో అంబులెన్స్ ఎక్కాడు ఆ మూర్ఖుడు.

ఇంత లెక్కలేనితనం వారిలో ఎందుకొచ్చింది. పరీక్ష చేయించుకోండి.. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని రక్షించుకోండి.. అని మంచిగా చెబుతుంటే ఎవరికీ తలకెక్కడం లేదు. తామేదో దైవాంశ సంభూతుల్లాగా, కరోనా తమ జోలికి రాదన్నట్టుగా.. వచ్చినా తమకేదీ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొందరు. సమాజంపై బాధ్యత ఉండక్కర్లేదు, కనీసం ఎవరి ప్రాణాలపై వారికి, ఎవరి కుటుంబంపై వారికి బాధ్యత ఉండాలి కదా.

కరోనా పక్కనే ఉన్నా.. ధైర్యంగా, బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న దేవుళ్లు డాక్టర్లు. అలాంటి వైద్యులపై దాడులు ఇలాగే కొనసాగితే.. రేపు ప్రాణాలు పోతున్నా ఎవరూ పట్టించుకోరు. కరోనా ఆఖరి స్టేజ్ అంటే ఇదే. ఎవరూ పట్టించుకోక కుక్కచావు చావడం. అనివార్యంగా భారత్ ఆ దశలోకి వెళ్లబోతోంది.

దీన్ని ఆపడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు, ఏ పోలీసుల వల్లా కాదు. ఎవరికి వారు సంయమనం పాటించాలి. మూఢ నమ్మకాలు, మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి వైద్యులకు, ప్రభుత్వానికి సహకరించాలి. అలా చేయకపోతే.. వైరస్ కంటే ముందే నిర్లక్ష్యం భారతీయుల్ని నాశనం చేస్తుంది.

సీతారామ కళ్యాణం

తెలుగులో అద్భుతంగా మెసేజ్ ఇచ్చిన నవనీత్ కౌర్

Show comments