విజయనగరం, శ్రీకాకుళం అలా తప్పించుకున్నాయి..?

ఏపీలో కరోనా కేసులు సెంచరీ దాటాయి. సగటున ప్రతి జిల్లాకూ 8 నుంచి 9 కేసులుండే పరిస్థితి. కానీ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.. ఉత్తరాంధ్ర సరిహద్దు రాష్ట్రం ఒడిశా కూడా దేశంలోనే కరోనా కేసుల్లో అట్టడుగు స్థాయిలో ఉంది. ఇంతకీ ఆ రెండు జిల్లాలు, వాటి పక్కనున్న ఒడిశా ఏం పుణ్యం చేసుకున్నాయి. పొరుగు జిల్లా విశాఖ సహా మిగతా ఏపీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంటే.. ఆ రెండు జిల్లాల ప్రజలు ఎందుకంత ధీమాగా ఉన్నారు? ఇప్పుడిదే అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.

మూడు రోజుల క్రితం వరకు ఏపీలో ఐదు జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదు. జీరో లిస్ట్ లో ఉన్న పశ్చిమగోదావరి, కడప, అనంతపురం.. తబ్లిగి జమాత్ కారణంగా కరోనా పాజిటివ్ లో బోణీ కొట్టాయి. కడప ఏకంగా 15కి చేరుకుంది. పశ్చిమగోదావరి 14తో తర్వాతి స్థానంలో ఉంది. అనంతపురంలో కేవలం 2 కేసులే ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం మాత్రం ఇంకా ధీమాగా కనిపిస్తున్నాయి.

వాస్తవానికి ఈ రెండు జిల్లాలకు కూడా కొంతమంది ఎన్నారైలు విదేశాల నుంచి వచ్చినా వారెవరికీ కరోనా లక్షణాలు లేవు, అక్కడితో సంతృప్తి చెందకుండా.. జిల్లా కలెక్టర్లు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. విదేశాలనుంచి వచ్చినవారందర్నీ పక్కాగా క్వారంటైన్ కి పరిమితం చేశారు. ఇక దేశంలో ఇతర ప్రాంతాలకు, వలస వెళ్లినవారు.. ఉత్తరాంధ్ర కొనకు చేరుకోవడం ఆలస్యమైంది. దీంతో ఎక్కడివారక్కడే ఉండిపోయారు. ఇతర జిల్లాలకు సరిహద్దుల్ని కట్టడి చేయడంలో కూడా ఆ రెండు జిల్లాలు పూర్తిగా విజయవంతమయ్యాయి.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. శ్రీకాకుళం నుంచి ఢిల్లీ తబ్లిగి జమాత్ కి వెళ్లినవారి సంఖ్య సున్నా. విజయనగరంలో కూడా ఈ సంఖ్య చాలా తక్కువ. అంటే ఢిల్లీ నిజాముద్దీన్ ఎఫెక్ట్ కూడా ఆ రెండు జిల్లాలపై లేదన్నమాట. అందుకే ఏపీలో ఆ రెండు జిల్లాలు ప్రత్యేకంగా నిలిచాయి. పక్క రాష్ట్రం ఒడిశాలో కూడా కరోనా ఎఫెక్ట్ పెద్దగా లేకపోవడం ఆ రెండు జిల్లాలకు కలిసొచ్చిన అంశం.

విదేశాల నుంచి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన వారు 34 మంది. వాళ్లందర్నీ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంచారు. కరోనా పరీక్షలు కూడా చేశారు. అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇక విజయనగరం జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన వారు ఆరుగురు. వీళ్లను కూడా స్వీయనిర్బంధంలో ఉంచారు. పరీక్షల్లో వీళ్లకు కూడా నెగెటివ్ వచ్చింది. అలా ఈ రెండు జిల్లాలు ప్రస్తుతానికి కరోనా బారిన పడకుండా తప్పించుకున్నాయి.

ఇతర దేశాలకు భారత్ ఆదర్శప్రాయం అవుతుంటే.. ఏపీకి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కరోనా కట్టడిలో రోల్ మోడల్ గా నిలుస్తున్నాయి.

తెలుగులో అద్భుతంగా మెసేజ్ ఇచ్చిన నవనీత్ కౌర్

Show comments