సమయం కుదింపు మరింత నష్టం కదా జగన్‌జీ!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన నిర్ణయం తీసుకున్నారు. కరోనా దెబ్బకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రజలు తమ నిత్యావసరాల కోసం.. ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు ప్రభుత్వాలు నిర్దీణ వేళలను నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఏపీలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇన్నాళ్లూ ప్రజలను వీధుల్లోకి వచ్చేందుకు అనుమతిస్తూ వచ్చారు. ఏమీ పనిలేకుండా.. రోడ్లపైకి వస్తే గనుక.. వాహనాలు సీజ్ చేసేలా కూడా ఉత్తర్వులున్నాయి. అయితే ఈ అనుమతి వేళల్ని ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఉండేలా కుదిస్తూ.. జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇలాటి ఏర్పాటు వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకునే పోరాటానికి మేలు కంటే చేటు ఎక్కువ జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్ల మీదకు రావడానికి అనుమతి ఉంటే గనుక.. ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క వేళల్లో రోడ్ల మీదకు రావడమూ.. తమ పనులు చక్కబెట్టుకుని పోవడమూ జరుగుతుంటుంది. అదే ఈ కుదింపు వలన.. ప్రతి కాలనీల్లో కూడా ప్రజలందరూ 6-11 గంటల మధ్య మాత్రమే రోడ్ల మీదికి వచ్చేస్తారు. కిరాణా కొట్టులు కావొచ్చు. ఇతర కూరగాయల దుకాణాలు కావచ్చు.. ఆ పరిమితమైన సమయంలో చాలా పెద్ద సంఖ్యలో జనంతో కిటకిటలాడుతూ ఉంటాయి. నిజానికి సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అని అంటున్న నేపథ్యంలో ఇది నష్ట దాయకం.

తెలంగాణలో ఇప్పటికీ ఉదయంనుంచి సాయంత్రం వరకు ప్రజలకు అనుమతి ఉంది. అలా ఉంటే కూడా ఆదివారం నాడు రెండు రాష్ట్రాల్లో ప్రతి చికెన్, మటన్ దుకాణాల వద్ద జనం కిటకిట లాడారంటే అతిశయోక్తి కాదు. అలాంటి అనుమతి సమయాల్ని కుదిస్తే అది మరింత జనసమ్మర్దం పెరగడానికి కారణం అవుతుంది. ప్రాక్టికల్ గా ఎదురుకాగల ఇలాంటి అన్ని రకాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నీ ఆస్థి ఐశ్వర్యం ఆంధ్ర ప్రజల బిక్ష అని మర్చిపోకు

Show comments