సెల‌బ్రిటీలు ఎంత ఇచ్చిందీ ఎందుకు చెప్ప‌డం లేదో!

కుడిచేత్తో చేసిన దానం ఎడ‌మ‌చేతికి కూడా తెలీనీయ‌కూడ‌దు అనేది ఒక సామెత‌. అయితే మ‌నం అంత పుణ్య‌కాలంలో లేము. ప్ర‌త్యేకించి ఇలాంటి స‌మ‌యంలో దాత‌లు తాము ఎంత స్థాయిలో విత‌ర‌ణ చాటుకున్న‌దీ చాటి చెప్ప‌డ‌మే మేలు. ఎందుకంటే దాని వ‌ల్ల మిగతా వారిలోనూ స్ఫూర్తి ర‌గ‌ల‌వ‌చ్చు. వృత్తిలోనో, మ‌రో ర‌కంగానో వారితో పోటీలో ఉన్న వాళ్లు.. మ‌రింత‌గా దానం చేయ‌డానికి ముందుకు వ‌చ్చినా రావొచ్చు! అలాంటి స్ప‌ర్థ మంచిదే! పోటాపోటీగా దానం చేస్తే.. ఆ దానాన్ని తీసుకున్న వాళ్లకు మేలు క‌లుతుంది క‌దా!

అయితే క‌రోనా విప‌త్తు వేళ ఇండియాలో విత‌ర‌ణ చాటుకుంటున్న కొంత‌మంది సెల‌బ్రిటీలు తామెంత విరాళం ఇచ్చిన‌దీ అధికారికంగా ప్ర‌క‌టించ‌డం లేదు. ప్ర‌ధాని కేర్ కో, లేక రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల రిలీఫ్ ఫండ్ కో డ‌బ్బులు ఇస్తున్న వాళ్లు ఆ నంబ‌ర్ ఎంత‌నేది చెప్ప‌డం లేదు.  అలా చెప్పుకోవ‌డం వారికి ఇష్టం లేక‌పోవ‌చ్చు గాక‌!

కొంత‌మందికి గుప్త‌దానాలూ చేసే అల‌వాటూ ఉండొచ్చు. అది వేరే కేట‌గిరికి. వారు విరాళం ఇచ్చిన‌ట్టుగా కూడా ప్ర‌క‌టించుకోరు. అయితే తాము విత‌ర‌ణ చేసిన‌ట్టుగా ప్ర‌క‌టించుకుంటున్న కొంత‌మంది సెల‌బ్రిటీలు ఆ మొత్తం ఎంతో మాత్రం చెప్ప‌డం లేదు. ఎందుకు అలా? ఇచ్చిన విష‌యాన్ని చెప్పిన వాళ్లు, ఇచ్చిందెంతో ఎందుకు చెప్ప‌డం లేదో ఎవ‌రికీ తెలియ‌డం లేదు. అలా ఎంత ఇచ్చింది చెప్పుకోవ‌డంలో ఏమైనా నామూషీ ఉందా?  వాళ్ల రేంజ్ కు అంత త‌క్కువ డ‌బ్బులు ఇచ్చార‌ని జ‌నాలు ఏమైనా అనుకుంటార‌ని భ‌య‌మా? 

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ- ఆయ‌న భార్య అనుష్క‌ల విరాళం గురించి అధికారిక నంబ‌ర్ చెప్ప‌లేదు. ఆ నంబ‌ర్ ను మీడియాకు లీకు ఇచ్చార‌ట మూడు కోట్ల‌ని. ఇలాంటి వారు ఇప్పుడు మ‌రింత‌మంది తేలుతున్నారు. విరాళం ఇస్తున్న విష‌యాన్ని ప్ర‌క‌టించి, అదెంతో చెప్ప‌క‌పోవ‌డం.. క‌ర్రా విర‌గ‌కుండా, పాము చావ‌కుండా వీరు తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? 

Show comments