ఎమ్బీయస్‌: విడివిడే తారకమంత్రమంటున్న కోవిదులు

కోవిడ్‌ కోవిదులు చెప్తున్న హితవు ఏమిటి? విడివిడిగా ఉండండి. వ్యక్తుల మధ్య సామాజిక దూరం పాటించండి అని. దానివలన రోగాన్ని నియంత్రించే మా ప్రయత్నాలు సఫలమవుతాయి అంటున్నారు. దీన్నే కాస్త విస్తరిస్తే - పరిపాలన కానీ అభివృద్ధి కానీ వికేంద్రీకరిస్తేనే పరిస్థితిని అదుపులోకి తేవడం సులభం అనే సందేశం ఉంది. ఆవు కథలా అటుతిప్పి, యిటుతిప్పి వికేంద్రీకరణ గురించే మాట్లాడుతున్నారే అనవచ్చు మీరు. కానీ ఎంత చెప్పినా పాలకుల బుర్రలకు ఎక్కటం లేదు. గతంలో ఎంతమంది వద్దు మొర్రో అన్నా వినకుండా మరో హైదరాబాదును సృష్టిస్తా అంటూ బాబు అమరావతిని మెసప్‌ చేశారు. ఇప్పుడు జగన్‌ వికేంద్రీకరణ అంటూనే వైజాగ్‌ను ఐదేళ్లలోనో, పదేళ్లలోనో హైదరాబాదుకి పోటీగా తయారుచేస్తా అంటున్నారు. అసలు హైదరాబాదు కాన్సెప్టే వద్దు అంటే ఆయన కర్థం కావటం లేదు.

ఇప్పుడీ కోవిడ్ 19 సమస్య వచ్చిన తర్వాతైనా వికేంద్రీకరణలో ఉండే మేలు అర్థమై ఉండాలి. ఎప్పుడైనా సరే, అన్నీ ఒక చోట పోగుపడితే సర్వానర్థాలు కలుగుతాయి. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్‌ అని పరితపించారు. గ్రామాలను స్వయంసమృద్ధి గల యూనిట్లగా తయారు చేసినపుడు అందరికీ మేలు కలుగుతుందన్నారు. ఎవరైనా విన్నారా? క్రమేపీ గ్రామాలను పాడుపెట్టి, అందర్నీ నగరాల వైపు తరిమారు. 1947లో మనకు నాలుగు మహానగరాలు ఉంటే, యిప్పుడు దాదాపు పది ఉన్నాయి. ఓ పాటి నగరాలు మరో పాతిక ఉన్నాయి.

నగరం అనగానే అనేక సమస్యలు. నీటి కొరత, గృహవసతి కొరత, రవాణా సమస్య, ట్రాఫిక్‌, వాతావరణ కాలుష్యం, డ్రైనేజి సమస్య, చెత్తకుప్పలు పేరుకుపోవడం, నిరుద్యోగం, డబ్బు చాలక దొంగతనాలు, మురికివాడలు, కొట్లాటలు, అనారోగ్యం, గ్రామాల్లో ఉన్న కుటుంబాలకు దూరంగా వుండటం చేత వేశ్యావాటికలు, లైంగికపరమైన నేరాలు.. యిలా సవాలక్ష సమస్యలు. వీటిని అదుపు చేయడానికి ఎంత యంత్రాంగమూ చాదు, ఎంత పోలీసు బలగమూ చాదు.

ఒక గ్రామంలో కానీ, తగుపాటి పట్టణంలో కానీ ఒకరి గురించి మరొకరికి తెలుస్తూ వుంటుంది. స్థానికంగా ఉన్న పోలీసులకు తమ పరిధిలోని వ్యక్తుల గురించి కొద్దో గొప్పో సమాచారం ఉంటుంది. వారి ఆర్థిక స్తోమత ఎలాటిది, రేషన్‌కు అర్హులా కాదా, ఉచిత యిళ్లస్థలాలకు అర్హులా కాదా యిలాటివన్నీ సులభంగా తెలుసుకోవచ్చు. వారింటికి తరచుగా ఎవరు వస్తూ పోతూ వుంటారు, ఇటీవల ఎవరైనా కొత్తవారు వచ్చివెళ్లారా, హఠాత్తుగా వీళ్లు డబ్బు ఎక్కువగా ఖఱ్చు పెడుతున్నారా, వారి మాటల్లో, ప్రవర్తనలో మార్పు వస్తోందా - యిలాటివి కొద్దిపాటి ప్రయత్నంతో రెండు మూడు రోజుల్లో కూపీ లాగవచ్చు.

నగరాలకు వచ్చేసరికి అది సాధ్యం కాదు. ఎవరైనా తమ వద్దకు వస్తే తప్ప అలాటి వ్యక్తి ఒకడు తమ పరిధిలో ఉన్నాడని పోలీసు స్టేషన్‌ సిబ్బందికి తెలియనే తెలియదు. పక్కింటివాళ్లు ఫిర్యాదు చేస్తే తప్ప ఎవరి గురించి వాకబు చేయరు. ఎక్కణ్నుంచైనా సమాచారం వచ్చి, అనుమానం కలిగి, వెళ్లి వాకబు చేయబోతే యిరుగుపొరుగు ఏ సమాచారమూ యివ్వలేక పోతారు. పక్కవాళ్లు ఎవరు, ఏ ఊర్నించి వచ్చారు, వాళ్ల భాష ఏమిటి, ఆర్థికస్థితి ఏమిటి, యీ మధ్య వచ్చిన మార్పు ఏమిటి - ఏమీ చెప్పలేకపోతారు. వాళ్లకు వ్యక్తిగతంగా స్నేహం ఉంటే తప్ప!

స్నేహం ఉన్నా, వాళ్లు చెప్పినవే నమ్మాలి తప్ప, క్రాస్‌చెక్‌ చేసుకునే అవకాశం ఉండదు. టైము ఉండదు కాబట్టి యివతలివాళ్లు అవసరం ఫీలవరు. ఎప్పుడైనా వాళ్ల కుటుంబసభ్యులు వచ్చినా వీళ్లకు పరిచయం చేయడం జరగదు. నగరజీవనం యిలా వుంటుంది కాబట్టే టెర్రరిస్టులు అక్కడే దాగుంటారు. నిరుద్యోగులు ఎక్కువమంది ఉంటారు కాబట్టి, జీవనవ్యయం ఎక్కువ కాబట్టి, రిస్కు తీసుకుని నేరం చేయడానికి సిద్ధపడతారు. వాళ్లను అండర్‌వరల్డ్‌లోకి కానీ, టెర్రరిజంలోకి కానీ లాగడం సులభం.

మహానగరాల్లో ఎంత జీతం యిచ్చినా చాలని పరిస్థితి. పట్టణాల్లో పరిశ్రమలు స్థాపిస్తే తక్కువ జీతాలకే ఉద్యోగులు దొరుకుతారు. దూరాలు తక్కువ, ఇళ్ల స్థలాల రేట్లు తక్కువ, సమీపంలోనే సొంత గ్రామం ఉంటే అక్కణ్నుంచి ధాన్యాలు, పప్పు, కూరగాయలు తెప్పించుకోవచ్చు. పిల్లలను స్కూలు బస్సులో పంపేబదులు సైకిలుపై దింపవచ్చు. ఇలా చెప్పుకుపోతే ఎన్నో సౌలభ్యాలున్నాయి.

అయినా నగరీకరణ ఎందుకు జరుగుతోంది అంటే, పాలకులు ప్రభుత్వ సంపదంతా అక్కడే కుమ్మరిస్తున్నారు. అక్కడే కళ్లు చెదిరే భవనాలు నిర్మిస్తున్నారు. విలాసంగా బతికేందుకు ఏర్పాట్లు సమకూరుస్తున్నారు. ప్రయివేటు పెట్టుబడిదారులను సైతం అక్కడే పెట్టమంటున్నారు. రాష్ట్రానికి ఏ కొత్త ప్రాజెక్టు వచ్చినా అక్కడికే పట్టుకెళుతున్నారు. ప్రథమస్థాయి విద్య, వైద్య సౌకర్యాలు అక్కడే కల్పిస్తున్నారు.

ఇవన్నీ చూసి పట్టణ, గ్రామ ప్రజలు అటువైపు ఆకర్షితులవుతున్నారు. అక్కడైతే తమ ప్రతిభకు తగిన అవకాశం లభిస్తుందని, తన భార్య/భర్తకు కూడా ఉద్యోగం దొరుకుతుందని, సౌఖ్యకరమైన జీవితాన్ని అనుభవించవచ్చని, పిల్లలకు ఉత్తమవిద్య, పెద్దలకు ఉత్తమవైద్యం అందించవచ్చని ఆశ పడుతున్నారు. ఉన్నచోటే ఉంటే ఎదుగుదల ఉండదని, నూతిలో కప్పలా ఉండవలసి వస్తుందని ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ పరిగణించ దగిన అంశాలే.

కానీ దురదృష్టమేమిటంటే ఎన్నో ఆశలతో నగరానికి చేరిన వారిలో ఐదో వంతు మంది మాత్రమే తమ కలలను సఫలం చేసుకోగలుగుతున్నారు. వారికి నాలుగు రెట్ల మంది దుర్భరజీవితం గడపవలసి వస్తోంది. వారిని ఉద్ధరించడానికి, సంస్కరించడానికి, శిక్షించడానికి ప్రభుత్వ ఆదాయంలో చాలా భాగం ఖర్చవుతోంది. అందువలన నగరీకరణ మంచిది కాదని భావించవలసి వస్తోంది. ఏం మాకు ఉత్తమవిద్య, ఉత్తమ వైద్యం అందకూడదా? అని పట్టణప్రజలు అడగవచ్చు. వారికే కాదు, అందరికీ అందాలి. దాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావనేదే ప్రశ్న.

రాజస్థాన్‌లో పిలానీ ఏమంత పెద్ద ఊరని బిట్స్‌ వెలిసింది? ఉత్తమ విద్య కోసం అక్కడకు వెళుతున్నారుగా! లేదు, జయపూర్‌లో ఉంటేనే వెళతాం అని అనలేదు కదా. తమిళనాడులోని వెల్లూరు ఏమంత పెద్ద ఊరు? కానీ ఉత్తమవైద్యం కావాంటే అక్కడకు వెళతారుగా! అనేక రుగ్మతలకు ఆయుర్వేద చికిత్సకోసం కేరళలోని నోరు తిరగని పల్లెటూళ్లకు వెళ్లి చేయించు కుంటున్నాంగా! అందువలన రాష్ట్ర రాజధానిలోనే అన్ని ఉత్తమ సంస్థలు పెట్టకుండా జిల్లాకి ఒకటి చొప్పున పెట్టుకుంటూ వస్తే, ఎవరికి ఏది ముఖ్యమనుకుంటే అక్కడికే వెళతారు. మంచి వైద్యుడు వెల్లూరు వెళ్లి సంపాదిస్తాడు. ప్రతిభ ఉన్న ఉపాధ్యాయుడు బిట్స్‌ కెళ్లి సంపాదిస్తాడు.

తిరుపతి పెద్ద ఊరేమీ కాదు, కానీ వెంకటేశ్వరుడు వెలసిన కారణంగా పెద్ద సెంటరుగా ఎదిగింది. దేవుడు ఎక్కడ వెలవాలో  నిర్ణయించే శక్తి ప్రభుత్వం చేతిలో లేదు. సముద్రం ఎక్కడ ఉండాలో, పర్వతాులు ఎక్కడ ఉండాలో, అడవులు ఎక్కడ ఉండాలో, ప్రకృతి ఎక్కడ అందంగా ఉండాలో నిర్ణయించే శక్తీ లేదు. కానీ సంస్థలు ఎక్కడ పెట్టాలో నిర్ణయించే శక్తి ఉంది. ఐఐటిని తిరుపతిలో బదులు చిత్తూరు జిల్లాలోనే మరో చోట, వేరేరకంగా అభివృద్ధి జరిగే అవకాశం లేని చోట పెట్టి వుండవచ్చు.

వైజాగ్‌ ఉంది. పక్కన సముద్రం, దాని కారణంగా మత్స్య పరిశ్రమ, నౌకాశ్రయం కారణంగా వాణిజ్యం ఎలాగూ ఉన్నాయి. దగ్గర్లో ఉన్న అరకు హిల్‌స్టేషన్‌, సింహాచలం పుణ్యక్షేత్రం కారణంగా టూరిజమూ ఉంటుంది. గొప్ప విద్యాయాలు ఎప్పణ్నుంచో ఉన్నాయి. ఇక అక్కడే సినిమా స్టూడియోలు ఎందుకు? ఐటీ పరిశ్రమ ఎందుకు? ఔషధ పరిశ్రమ ఎందుకు? ప్రకృతి ఉన్నచోటే సినిమాలు తీస్తారు కాబట్టి వైజాగ్‌లో ఉండాలని ఎవరైనా వాదిస్తే హైదరాబాదులో, మద్రాసులో ఏం ప్రకృతి వుందని అడుగుతాను. కొండల్లో, బండల్లో స్టూడియోలు కట్టారు. పోనీ ఔట్‌డోర్‌లో తీద్దామనుకుంటే రాజమండ్రి పరిసరాల్లోనే బోలెడు సినిమాలు తీశారు కదా, అక్కడే స్టూడియోలు కట్టమనవచ్చుగా!

ఇక ఐటీ అంటారా, ఎక్కడైనా పెట్టవచ్చు. ఇంటర్నెట్‌ స్పీడు ఉంటే చాలు, అడవుల్లో, ఎడారుల్లో, కొండల్లో ఎక్కడైనా పెట్టవచ్చు. ప్రస్తుతం కరోనా సంక్షోభంలో చూడండి, ఐటీ వాళ్లందరూ వర్క్‌ ఫ్రమ్‌ హోమేగా! ప్రకృతి కరుణించని చోట ఐటీ పరిశ్రమ పెట్టి జనాలను ఆకర్షించవచ్చు. ఔషధ పరిశ్రమ కూడా రసాయనాలతో తయారు చేసే పరిశ్రమే కాబట్టి ముడిసరుకు కోసం అక్కడ పెట్టాం అనక్కరలేదు. పక్క జిల్లాలోనైనా పెట్టవచ్చు. వైజాగ్‌లో యింకా ఏం పెడతారో తెలియదు. ప్రస్తుతానికి సెక్రటేరియట్‌ అంటున్నారు. దాని వలన జరిగే అభివృద్ధి ఏమీ లేదు. కొందరు ఉద్యోగుల ఆవాసాలు వస్తాయి తప్ప. అది వైజాగ్‌కు కాస్త దూరంగా పెడితే నగరానికి ఆ తాకిడి ఉండదు. తక్కినవన్నీ వేరే జిల్లాలకు తరలించేయాలి.

ఇవన్నీ అందరికీ తెలిసినా మళ్లీ వైజాగ్‌లోనే అన్నీ కేంద్రీకరిస్తున్నట్లు కనబడుతోంది. హైదరాబాదు లాటి నగరం అని జగన్‌ అనడంతో యిక వైజాగ్‌ చుట్టూ భూము ధరలు పెరుగుతాయి. గత కొన్నేళ్లగా ఆంధ్రలో నడుస్తున్న ఏకైక పరిశ్రమ లేదా వ్యాపారం ఏదైనా ఉందా అంటే రియల్‌ ఎస్టేటు మాత్రమే. భూముల ధరలు పెరిగితే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నట్లు బిల్డప్. తగ్గితే కుప్పకూలినట్లు, పెట్టుబడులు ఏమీ రాక రాష్ట్రప్రజలంతా అడుక్కుతింటున్నట్లు చిత్రీకరిస్తారు. మీడియాకు తక్కిన పెరామీటర్స్‌ ఏవీ పట్టవు. విద్య, వైద్యం, విద్యుత్‌, ఇరిగేషన్‌, యిలాటి ఎన్నో మౌలికాంశాలపై గణాంకాలే యివ్వరు. ఎంతసేపూ ఎకరా ఎంత రేటుంది, యిదే గోల.

గత ఐదేళ్లగా అమరావతి చుట్టూ కథలల్లారు. ఇక వైజాగ్ చుట్టూ అల్లుతారు. మెట్రో రైలు యీ సందులోంచి వస్తోందని వీళ్లు, ఆ సందులోంచి వస్తోందని వాళ్లు స్థలాలు అమ్మేస్తారు. అసలు మెట్రో అవసరమా? మెట్రో గురించి అడుగుతున్నావంటే మహానగరాన్ని నిర్మిద్దామనే ఆలోచనలో ఉన్నట్లే లెక్క. దాని టిక్కెట్టు కొనేటంత స్తోమత ప్రజలకు కల్పించే స్తోమత నా ప్రభుత్వానికి ఉందా? అని ఆలోచించాలి. ప్రత్యామ్నాయంగా తక్కువ ధరకు రవాణా సౌకర్యాలున్నపుడు మెట్రో ఎందుకు ఎక్కాలి? మెట్రో స్టేషన్లలో షాపింగ్‌ మాల్స్‌ కట్టి దోచుకోకపోతే మెట్రో నిర్వహణ ఆ కంపెనీకి భారమౌతుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచకుండా, ఎందుకొచ్చిన అట్టహాసాలివి?

పంజాబ్‌ అన్ని విధాలా మెరుగైన రాష్ట్రమని అందరం ఒప్పుకుంటాం. అక్కడ ఏ నగరమూ 10 లక్షల జనాభాకు మించి లేదు. ఏ వూళ్లో ఉన్నా సకలసౌకర్యాలు వుంటాయి. మనకు ఏ యిండస్ట్రీతో సంబంధం ఉంటే అక్కడకు వెళతాం. అంతే కదా! హోల్‌సేల్‌ ప్రింటింగు చౌకగా చేయించాలంటే లేదా బాణసంచా టోకున కొనాలంటే శివకాశి వెళతాం. అది తమిళనాడులో చిన్న వూరు, చెన్నయ్‌లో అయితేనే కొంటాం అనము కదా! తెంగాణ కావాలని ఉద్యమం నడిచినంత కాలం అభివృద్ధి కావాలంటే రాష్ట్రాలు చిన్నగా వుండాలి అంటూ పంజాబ్‌, హరియాణాలను చూపించేవారు. తెలంగాణ ఏర్పడ్డాక వికేంద్రీకరణ జరిగిందా?

ఇప్పటికీ అన్నీ హైదరాబాదు పరిసరాల్లోనే పెడుతున్నారు. హైదరాబాదుపై ఒత్తిడి మరింతగా పెరుగుతోంది. మేనేజ్‌ చేసేందుకు వీలుంటుంది అంటూ జిల్లాలను కూడా విడగొట్టేశారు. కానీ హైదరాబాదును అడ్డదిడ్డంగా పెరగనిస్తున్నారు. ఇప్పుడు విదేశాల నుంచి కరోనాను అంటించుకుని వచ్చినవారిని గుర్తించడానికి, మానిటర్‌ చేయడానికి నానా అవస్థలూ పడుతున్నారు. నగరం పెద్దదైన కొద్దీ మానిటారింగ్‌ కష్టం. ఊహాన్‌ కోటికి పైగా జనాభా గల నగరం కాబట్టే వ్యాధి త్వరగా సోకి అంతమంది చనిపోయారు. న్యూయార్కు యిప్పటిదాకా అదుపులోకి రాలేదు. అక్కడ యిల్లూ వాకిలి లేనివారు చాలా ఎక్కువమందిట. రోగం సోకినా, యిన్సూరెన్సు లేక డాక్టరు దగ్గరకు వెళ్లక, యితరులకు ప్రమాదకారులుగా మారినవారు ఎక్కువట.

దిల్లీ నగరం చూడండి. అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వలసకూలీలందరూ అక్కడే ఉన్నారు. లాక్‌డౌన్‌ చేయగానే స్వరాష్ట్రాలకు బయలు దేరారు. గుంపులుగా, గుంపులుగా నడుస్తూ వెళ్లిపోతున్నారు. వ్యాధి ఏ స్థాయిలో ప్రబలిందో యిప్పుడిప్పుడే చెప్పలేం. మన ఇండియాలో అందరికీ పరీక్షలు నిర్వహించి చూస్తే తప్ప యిప్పుడు చెప్తున్న అంకెను నమ్మాలని లేదు. మహానగరాల్లో మురికివాడలు ఎక్కువనే కాదు, ఇళ్లు కూడా పక్కపక్కనే వుంటాయి. గాలి చొరబడేందుకు కూడా వీలుండదు. పట్టణాల్లో ఇండిపెండెంట్‌ యిళ్లు ఎక్కువ కాబట్టి పరిస్థితి చాలా మెరుగు. గ్రామాల్లో అయితే దూరం మేన్‌టేన్‌ చేయడం అతి సులభం.

దిల్లీకి అంతమంది వలస వచ్చి ఉండకపోతే యింత అనర్థం జరిగేది కాదు.  వీళ్లందరికీ తమ స్వస్థలాలలోనో, దరిదాపుల్లోనే ఉపాధి దొరికి వుంటే యీ దుస్థితి వచ్చేది కాదు కదా! రాష్ట్రం విడిపోయినా తెలుగువారందరికీ  హైదరాబాదే గమ్యంగా ఉంది. అందుకే హైదరాబాదు నుంచి వెళ్లిపోవచ్చు అనగానే వేలాది మంది ఆంధ్ర సరిహద్దు చేరి రోజంతా అల్లరిపడ్డారు. వాళ్లు రానివ్వలేదు కాబట్టి ఆగింది కానీ, లేకపోతే ఆ వేలు లక్షలుగా మారేది. ఇదంతా కేంద్రీకరణ వలన జరిగిన నష్టం.

ఇవన్నీ తెలిసి కూడా మీడియా వారు ఒక మహానగరం నిర్మించి వదిలేస్తే, అన్నీ అక్కడే పెట్టేస్తే దాని మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రమంతా బతికేయవచ్చు అనే ఫిలాసఫీని జనాలకు అమ్ముతూంటారు. నిర్మాణానికి అయ్యే వ్యయం గురించి మాట్లాడరు. ఇన్ని చెప్పేవాళ్లు తాము జిల్లాల వారీగా ఆఫీసు ఎందుకు పెట్టారో చెప్పరు. అవి కూడా ఊరవతల పెట్టారు కానీ ఊరికి మధ్యలో ఉండాలి అనే సిద్ధాంతం అప్లయి చేయలేదు. జిల్లాల వారీగా విడగొడితే మార్కెటింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌, సిబ్బంది జీతాలు, యితరవ్యయాలు తగ్గుతాయి, మేనేజ్‌ చేయడం సులభం అని చెప్తారు. కానీ ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికి వేరేలా మాట్లాడతారు.

తెలంగాణ అయితే హైదరాబాదుని మేన్‌టేన్‌ చేయక తప్పదని వాదించవచ్చు. ఆంధ్ర అయితే అది కొత్త పలక. ఎలాగైనా రాసుకోవచ్చు. అక్కడికక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే చిన్నచిన్న పట్టణాలు అనేకం వెలిసేట్లు రూపొందించుకోవచ్చు. ఇంతకుముందు యీ వాదనను సమర్థించినా సమర్థించకపోయినా, కరోనా అనుభవం తర్వాత దీన్ని ఒప్పుకుని తీరాల్సిందే. లాక్‌డౌన్‌ కారణంగా రోజువారీ ఆదాయంపై బతికేవారి పని దుర్భరం అయిపోయింది. వారికి నిత్యావసర వస్తువులు యింటికి చేరుస్తాం అని తెలుగు ముఖ్యమంత్రు లిద్దరూ అంటున్నారు. ఆ వ్యవస్థను కెసియార్‌ యిప్పటికిప్పుడు ఏర్పాటు చేసుకోవాలి. ఎలా నడుస్తుందో తెలియదు.

కానీ జగన్‌ ముందంజలో ఉన్నాడు. ఊరూరా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడింది. గ్రామ సచివాయాలు ఏర్పడ్డాయి. సామాన్యుడికి ప్రభుత్వాన్ని ఎప్రోచ్‌ కావడం అతి సులభం అయిపోయింది. దిల్లీ జమాతేకి వెళ్లినవారికి కరోనా సోకిందంటున్నారు. వాలంటీర్ల కారణంగా ఏ వూరినుంచి ఎవరు అక్కడకు వెళ్లారో ఆంధ్రలో సులభంగా కనుక్కోవచ్చు, మానిటార్‌ చేయవచ్చు. సరుకు అందించవచ్చు. సామాజిక దూరం పాటించేట్లు పర్యవేక్షించవచ్చు. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక, బతుకు జరుగుబాటు కాక, దొంగతనాలు పెరిగితే, శాంతిభద్రతల సమస్య వచ్చినా తక్కిన రాష్ట్రాల కంటె ఆంధ్రలో అదుపు చేయడం సులభం.

కరోనా విషయంలో ఒక మృతి జరిగిందంటే 800 మందికి ఆ వ్యాధి సోకి ఉంటుందని రకరకా లెక్కలు వేసి చెప్పారు. మన ఇండియాలో యిప్పటివరకు 32 మంది చనిపోయారు. అంటే దాని అర్థం 25,600 మందికి సోకి, వివిధ స్థాయిలలో వుందన్నమాట. కానీ యిప్పటిదాకా ప్రభుత్వానికి కంటపడిన వారు 1353 మంది మాత్రమే. అంటే కరోనా సోకిన దాదాపు 24 వేల మంది తెలిసో, తెలియకో ఎక్కడో దాగుని వున్నారు. అలాటివారిని గుర్తించడానికి తక్కిన రాష్ట్రాల కంటె వాలంటీరు వ్యవస్థ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ వెసులుబాటు ఉంది. చైనాలో గతంలో ఉన్న బేర్‌ఫుట్‌ డాక్టర్ల వ్యవస్థ లాటిది యిప్పుడుంటే చికిత్స కూడా సులభమయ్యేది.

ఇంట్లో కూర్చోబెట్టి ఉత్తినే నిరుద్యోగ భృతి యివ్వడం కంటె వారిని చిరుద్యోగులుగా మార్చి వాలంటరీ వ్యవస్థ ఏర్పరచడం తెలివైన పని. అలాగే వృద్ధాప్య పెన్షన్లు కూడా ఊరికే యిచ్చేబదులు, వారికి శారీరక శ్రమ లేని, వాలంటీర్లను పర్యవేక్షించే పనులు అప్పగించడం మేలు. 60 ఏళ్లకే జవసత్త్వాలు ఉడిగిపోవు. కరోనా అదుపులోకి వచ్చాక ఏ రాష్ట్రం ఎలా అదుపు చేసింది అనేది సమీక్షకు వచ్చినపుడు ఆంధ్రలోని వాలంటరీ వ్యవస్థకు మెప్పు లభిస్తే జగన్‌ అధికార వికేంద్రీకరణ లాభాలను కళ్లారా చూసినట్లే. ఆయన పైకి అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అంటున్నాడు తప్ప అమరావతి స్థానంలో వైజాగ్‌ను నిలబెడుతున్నట్లు నాకు అనుమానంగా వుంది. ఈ కరోనా అనుభవం తర్వాత వైజాగ్‌ ప్రాజెక్టును కూడా రాష్ట్రం నాలుగు చెరగులా పంచేస్తే ఆ అనుమానం తొలగిపోతుంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2020)
mbsprasad@gmail.com

Show comments