అందుకే నారా రోహిత్ హీరో... లోకేశ్ జీరో

నారా రోహిత్‌....నారా చంద్ర‌బాబునాయుడు త‌మ్ముడైన రామ్మూర్తినాయుడి కుమారుడు. తెలుగు సినీరంగంలో ఒక మోస్తారుగా రాణిస్తున్న హీరో. చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే టికెట్‌ను అన్న చంద్ర‌బాబును కాద‌ని, ఎన్టీఆర్ ఆశీస్సుల‌తో రామ్మూర్తినాయుడు అప్ప‌ట్లో తెచ్చుకున్నాడు. త‌న ప్ర‌త్య‌ర్థి గ‌ల్లా అరుణ‌కుమారిపై గెలుపొంది ఎన్టీఆర్ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాడు.

ఎన్టీఆర్ మ‌ర‌ణానంత‌రం త‌న‌ను కాద‌న్న త‌మ్ముడిని బాబు అణ‌గ‌దొక్కాడు. అప్ప‌ట్లో సోనియా స‌మ‌క్షంలో వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్‌లో రామ్మూర్తినాయుడు చేరాడు. అయితే రామ్మూర్తి ఊహించిన‌ట్టుగా చంద్ర‌గిరి టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వ‌లేదు. 2004లో టీడీపీ ఓట‌మిపాలు కావ‌డంతో అన్న‌ద‌మ్ముళ్ళిద్ద‌రూ తిరిగి ఒక్క‌ట‌య్యారు. కానీ అల్జీమ‌ర్స్ కార‌ణంగా త‌ర్వాత కాలంలో రామ్మూర్తినాయుడు మ‌నుషుల‌ను గుర్తు ప‌ట్ట‌లేని ప‌రిస్థితి. అందుకే ఆయ‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు క‌ద‌ల్లేని ప‌రిస్థితి.

రామ్మూర్తినాయుడు కుమారుడు రోహిత్ హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో రోహిత్ రూ.30 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించి త‌న హీరోయిజాన్ని ప్ర‌ద‌ర్శించాడు.  ఈ మొత్తంలో ఏపీ, తెలంగాణ  ప్రభుత్వాల సీఎం సహాయ నిధుల‌కు చెరో రూ.10 లక్షలు, ప్రధాన మంత్రి సహాయ నిధికి మరో రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్న‌ట్లు తెలిపాడు. అందరం సమష్టిగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమి కొడదాం అని ఆయ‌న పిలుపునిచ్చాడు.

త‌న‌ది 40 ఏళ్ల రాజ‌కీయ ఇండ‌స్ట్రీ అని, 14 ఏళ్లు సీఎంగా ప‌నిచేశాన‌ని చెప్పుకునే రోహిత్ పెద‌నాన్న చంద్ర‌బాబునాయుడు ఇంత‌టి క‌ష్ట‌కాలంలో కేవ‌లం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చాడు. రోహిత్ అన్న నారా లోకేశ్ కేవ‌లం ట్విట‌ర్‌లో పోస్టింగ్‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.

బాబు  కంటే మూడు రెట్టు అధికంగా ఇచ్చిన రోహిత్ ఆర్థిక ప‌రిస్థితి...లోకేశ్‌తో పోల్చుకుంటే న‌క్క‌కు, నాగ‌లోకానికి ఉన్నంత తేడా. కానీ స‌మాజం ఓ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స‌మ‌యంలో రోహిత్ త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నాడు. క‌నీసం త‌మ్ముడిని చూసైనా లోకేశ్ ఒఠ్ఠి మాట‌లు క‌ట్టిపెట్టి...గ‌ట్టిమేలు త‌ల‌పెట్టాల్సింది. కానీ లోకేశ్ ఆ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో జీరో అయ్యాడ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కుక్ గా మారిన ప్రదీప్

క‌రొనా పై చిరు-నాగ్ పాట చూశారా?

Show comments