పరోక్షంగా జగన్ ను మెచ్చుకున్న పవన్-బాబు

కరోనా దెబ్బకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కి కాస్త జ్ఞానోదయం అవుతోంది. గతంలో జగన్ ఆలోచనల్ని ఏకపక్షంగా విమర్శించిన వీరిద్దరూ.. ఇప్పుడిప్పుడే ఆయన దూరదృష్టిని అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నంలో పరోక్షంగా ప్రశంసిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ కేవలం వైసీపీ కార్యకర్తలకే ఉపయోగం, వారికే ఉద్యోగాలిచ్చారు, అసలు వారి వల్ల ఎవరికి ప్రయోజనం, పైపెచ్చు అవినీతి పెరిగిపోతుందంటూ.. విమర్శించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎట్టకేలకు వాలంటీర్ వ్యవస్థ ఉపయోగాన్ని గుర్తించారు.

ఏపీలో ఉచిత రేషన్ పంపిణీ ఆదివారం మొదలైంది. అయితే కొన్నిచోట్ల ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదు, మరికొన్ని చోట్ల దూరం పాటించడంతో ఎండలో ఇబ్బందులు పడ్డవారు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా.. వాలంటీర్ల వ్యవస్థను సమర్థంగా ఉపయోగించుకోవాలని, వారితో రేషన్ సరుకులు ఇంటింటికీ పంపిణీ చేయాలని సూచించారు చంద్రబాబు.

బూబు ట్వీటిన కాసేపటి తర్వాత పవన్ కల్యాణ్ కూడా వాలంటీర్లకు ట్విట్టర్లో సుద్దులు చెప్పారు. వేలమంది లబ్ధిదారులు రేషన్ షాపుల ముందు క్యూలు కడుతున్నారు, వైసీపీ ప్రభుత్వం తామిచ్చిన మాట ప్రకారం వాలంటీర్లతో రేషన్ ఇంటింటికీ పంపిణీ చేయాలి, ఇలాంటి కష్టకాలంలో వాలంటీర్లు మరింత సమర్థంగా పనిచేస్తే ప్రధాని ప్రకటించిన లాక్ డౌన్ ని సార్థకం చేసినవారు అవుతారు... అని ట్వీట్ చేశారు పవన్.

మొత్తమ్మీద ప్రభుత్వానికి, వాలంటీర్లకు ఉచిత సలహాలిచ్చే పనిలో భాగంగా.. అసలు వాలంటీర్ వ్యవస్థ ప్రయోజనాన్ని వీరిద్దరూ గుర్తించారు. గతంలో వాలంటీర్ వ్యవస్థే అనవసరం అంటూ విమర్శించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. కరోనా సమయంలో వారి అవసరాన్ని ఇలా గుర్తించారన్నమాట. అంటే జగన్ ముందు చూపుని, ఆయన ఆలోచనల్ని వీరు పరోక్షంగా మెచ్చుకున్నట్టే. నిజానికి వాలంటీర్ల ద్వారా రేషన్ ను ఇంటింటికి అందించే ప్రక్రియ ఇంకా ప్రారంభదశలోనే ఉంది. అయినప్పటికీ ఈ వ్యవస్థ ఆవశ్యకతను పవన్-బాబు గుర్తించడం సంతోషించదగ్గ విషయం.

కేవలం రేషన్ సరుకుల్ని అందించడంలోనే కాదు.. కరోనాకు సంబంధించి చేపట్టిన సర్వేలో, క్వారంటైన్ కేంద్రాల నిర్వహణకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందించడంలో వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. ఈ సమయంలోనే కాదు.. రాబోయే రోజుల్లో మున్ముందు ఈ వాలంటీర్ వ్యవస్థ మరింత ఉపయోగకరంగా మారుతుంది. పవన్ కల్యాణ్, చంద్రబాబు అది కూడా చూస్తారు. 

ఏప్రిల్ 7వ తేదీకి కేసులన్నీ ఖతం

ఏప్రిల్ 14 తో అయిపోతుంది అనుకోవద్దు

Show comments