ఇంత కష్టపడి కూడా పోలీసులు ఇరుక్కున్నారా?

గురువారం నాడు విశాఖపట్టణం కేంద్రంగా జరిగిన పరిణామాల్లో  పోలీసులు చాలాసేపటి వరకు చంద్రబాబునాయుడును అడ్డుకుని, వెనక్కు పంపడానికే ప్రయత్నించారు. అయితే ఆయన కూడా చాలా మొండిపట్టు పట్టి.. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో... ఎందుకు వెనక్కు వెళ్లమంటున్నారో లిఖితపూర్వకంగా ఇస్తే తప్ప వెళ్లనంటూ రోడ్డుమీదే బైఠాయించారు. చాలాసేపు హైడ్రామా నడిచిన తర్వాత.. చివరికి పోలీసు అధికారులు చంద్రబాబుకు చేతిరాతతో కూడిన లేఖ ఇచ్చి సెక్షన్ 151 కింద ఆయన భద్రతకోసం అరెస్టు చేస్తున్నట్లుగా చూపించారు.

ఆ లేఖలో పేర్కొన్న సెక్షన్ వల్లనే ఇప్పుడు పోలీసులు ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది. ఆ సందర్భంలో చంద్రబాబును అరెస్టు చేయడానికి తగిన కారణాలు ఆ సెక్షన్ లో లేవని న్యాయనిపుణులు అంటున్నారు. శుక్రవారం నాడు.. తెదేపా మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా.. హైకోర్టు కూడా ఇదే విషయం ఆక్షేపించింది.

నిజానికి కోర్టుకు వెళ్లే ఉద్దేశంతోనే.. చంద్రబాబునాయుడు తొలినుంచి రాతపూర్వకంగా తనకు తెలియజేస్తే తప్ప.. పోలీసుల మాట విననంటూ భీష్మించుకున్నారు. లేఖ ఇచ్చే అవసరం లేకుండా ఆయనను వెనక్కు పంపడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చివరికి డీసీపీ ద్వారా లేఖ ఇప్పించి.. అప్పటికి గండం గడిపేస్తూ ఆయనను వెనక్కు పంపారు.

ఈ లేఖను, అందులో పేర్కొన్న సెక్షన్ ను కూడా పిటిషనర్ శ్రావణ్ కుమార్ కోర్టు ఎదుట ప్రస్తావించినప్పుడు.. కోర్టు అభ్యంతరాలు తెలిపింది. ఆ సెక్షన్ కింద నోటీసు ఇవ్వడం తప్పని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.  ఒక వ్యక్తి నేరం చేయకుండా ఉండేందుకు, అతన్ని ఆ రకంగా అదుపు చేసేందుకు మాత్రమే సెక్షన్ 151ని ఉపయోగించాలని... డీసీపీ ఇచ్చిన నోటీసు ప్రకారం చూస్తే వ్యవహారం అలా కనిపించడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం విశేషం. తమాషా ఏంటంటే.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ చేసిన వాదన కూడా చంద్రబాబుకే అనుకూలంగా మారింది. ఆయన తన వాదనలో చంద్రబాబు భద్రత దృష్ట్యానే ముందస్తు నోటీసు ఇచ్చి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. దాంతో పోలీసులు ఇరుక్కున్నారు.

దీనిపై పోలీసుల ఇప్పుడు మరో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాల్సిఉంది.  సోమవారం దీనిపై మళ్లీ విచారణ జరుగుతుంది. తనను నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేసి తన యాత్రను అడ్డుకున్నారని అనడం తప్ప.. చంద్రబాబుకు లాభించేదేమీ లేదని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం

అదంతా ప్రమోషనల్ జిమ్మిక్

Show comments