ఇది జస్ట్ శాంపిల్: బాబు నీకు అర్థమౌతోందా

విశాఖపట్నం ఎపిసోడ్ తో రాష్ట్రవ్యాప్తంగా సింపతీ పవనాలు వీస్తాయని ఆశించారు చంద్రబాబు. పర్యటనకు ముందే అక్కడ గొడవ అవుతుందని ఆయనకి తెలుసు, దాన్ని అడ్డు పెట్టుకుని తనపై కక్షసాధిస్తున్నారంటూ డ్రామాలాడి, జనాల్లో చర్చకు తెరతీసి రాజకీయ లాభం పొందాలని అనుకున్నారు. అనుకున్నదే అయింది, అది పరాభవమని తెలిసినా కూడా.. అసహ్యాన్ని జయించిన బాబుకి అలాంటివి లెక్కలేదు.

ఆనాడు జగన్ ని కేవలం బాబు ఒత్తిడి మేరకు పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబుని జనం ఛీకొట్టారు. చెప్పులు, కోడిగుడ్లు వేసి సన్మానం చేశారు. మొత్తానికి బాబు అనుకున్నదంతా చేసి హైదరాబాద్ వెళ్లారు కానీ ఆయనలో తెలియని భయం మొదలైంది. ప్రజా చైతన్య యాత్రల పేరుతో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని మరీ బస్సుయాత్ర చేస్తున్న బాబుకి, నాడు రాజధాని ప్రాంతంలో జరిగిన పరాభవానికి కొనసాగింపుగా, అంతకంటే రెట్టింపు స్థాయిలో విశాఖ వాసులు బుద్ధి చెప్పారు.

ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగితే తన పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారాయన. చివరకి కుప్పంలో కూడా వైసీపీ భారీ బహిరంగ సభలు పెట్టే స్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తన బస్సుయాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురైతే ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు బాబు. విశాఖ వాసులు, అక్కడి వైసీపీ కార్యకర్తలు చేసిన పనిని ఆదర్శంగా తీసుకుని.. మిగతా చోట్ల కూడా బాబుని అడుగు పెట్టనీయకుండా చేస్తే అప్పుడు రాష్ట్రం చీదరించుకున్న నేతగా మిగిలి పోవాల్సిందేనా అనే సంశయంలో పడ్డారు.

ఇలాంటి పరిణామాలు ఒక్కరోజుకి పరిమితం కావు, ఇదో ట్రెండ్ లా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. అమరావతిలో అధికార పార్టీ నేతల్ని తిరగనీయకుండా టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ లు ఎలాంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. వాళ్లు కేవలం అమరావతిలోనే తమ మందబలం చూపించగలరు, మరి మిగతా ప్రాంతాల్లో వైసీపీ ప్రజాబలాన్ని టీడీపీ నేతలు తట్టుకోగలరా.

వైజాగ్ లో జరిగిన శాంపిల్ సత్కారాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. మిగతా చోట్ల పర్యటనలకు భయపడుతున్నారు. ఆ ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం బాబు తట్టుకోవడం కష్టమే. మరి ఇక బాబుకి దిక్కేముంది. పార్టీ ఆఫీసే ఆయనకు సేఫ్ ప్లేసా, లేక తిరిగి హైదరాబాద్ పారిపోతారా.. వేచి చూడాలి.

దేన్నీ ఎవరూ ఆపలేరు

Show comments