బాలకృష్ణతో పవన్ కి పోలికేంటి..?

రాజకీయాల్లోఉంటూ సినిమాలు చేసుకుంటున్న బాలయ్యకి ఒక న్యాయం, పవన్ కి మరో న్యాయమా అంటూ కొన్నిరోజులుగా సోషల్ మీడియా హోరెత్తుతోంది. "బాలకృష్ణను ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజలు, అయినా కూడా అసెంబ్లీ సమావేశాలకంటే ముందే ముఖానికి రంగేసుకున్న ఆయన్నిఎవరూ పల్లెత్తు మాట అనడంలేదు. ఆమాటకొస్తే పవన్ ని రెండు నియోజకవర్గాల ప్రజలూ ఓడించారు. పదవిలేని పవన్ ఎవరికీ జవాబుదారీ కాదు, అయినా మా కల్యాణ్ బాబుని మాత్రం టార్గెట్ చేస్తున్నారం"టూ వాపోతున్నారు జనసైనికులు.

నిజమే.. బాలయ్యని ఈ విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదు, కేవలం పవన్ ని మాత్రమే అందరూ మోసగాడిలా చూస్తున్నారు. ఎందుకంటే.. పవన్ చెప్పిన మాటలు అలాంటివి, పవర్ స్టార్ కొట్టిన ఫోజులు అలాంటివి. మాటలు కోటలు దాటించి, కాలు గడప దాటకుండా చేస్తున్న ఓవర్ యాక్షన్ చూసే పవన్ ని అందరూ తప్పుపడుతున్నారు. మూడ్ వచ్చినప్పుడు చేయడానికి రాజకీయం ఏమీ సంసారం కాదు. మరి పవన్ కల్యాణ్ తనకు కాల్షీట్లు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే రోడ్లపైకి వచ్చి నిరసనలు చేసి, షూటింగ్ ఉన్నప్పుడు పత్తాలేకుండా పోవడం ఎంతమాత్రం అభినందనీయం కాదు.

బాలయ్య వ్యవహారమే తీసుకుందాం. పవన్ లా నేను అది చేస్తా, ఇది చేస్తా.. అని చెప్పేరకం ఆయన కాదు. సొంత తండ్రికి వెన్నుపోటు పొడిచినా.. తిరగబడలేని నందమూరి నాయకుడు ఆయన. బావ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిసినా ఎదురుచెప్పలేని పిరికితనం. నందమూరి బ్రాండ్ తో, తెలుగుదేశం ఓటు బ్యాంక్ తో గెలుస్తున్నారే తప్పితే.. సొంత బలం ఆయనకు ఏమాత్రం లేదు. అందుకే బాలకృష్ణను ఎవరూ పట్టించుకోవడంలేదు, పట్టించుకున్నా నియోజకవర్గానికి కానీ, రాష్ట్రానికి కానీ ఒరిగేదేం లేదని వారికి తెలుసు.

పవన్ పరిస్థితి అది కాదు కదా, జగన్ పై ఒంటికాలుమీద లేస్తారు. నాకు అధికారం ఇస్తే.. రాష్ట్రం రూపురేఖలే మారుస్తానంటారు, స్వచ్ఛ రాజకీయాలంటారు, పాతికేళ్ల స్వప్నం అంటారు.. కట్ చేస్తే నాకు డబ్బుల్లేవు, జీవనోపాధి కోసం సినిమాలు చేసుకుంటానంటూ బీద అరుపులు అరుస్తుంటారు. అందుకే పవన్ అందరికీ టార్గెట్ అయ్యారు.

ఇకనైనా పవన్ ఫ్యాన్స్ ఇలాంటి పోలికలు పెట్టుకోవడం ఆపి, అసలు వ్యవహారంపై దృష్టిపెట్టడం మంచిది. సీజనల్ పాలిటిక్స్ కాకుండా పవన్ సిన్సియర్ పాలిటిక్స్ చేసినప్పుడే నిజంగా జనం ఆయన్ను సేనానిగా అంగీకరిస్తారు, జనసేనానిని చట్టసభలకు పంపిస్తారు.

దేన్నీ ఎవరూ ఆపలేరు

Show comments