‘మీ వెంట ఉంటాం’ అంటే రెచ్చగొట్టడమా?

ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో తమ పార్టీ పరువు కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ నానా పాట్లు పడుతోంది. జరిగిన సంఘటన క్రమానికి అనేక వంకర భాష్యాలు చెబుతోంది. దిల్లీ అల్లర్లో ఇప్పటికే 38 మంది చనిపోయారు. ఈ పాపం మొత్తం భాజపా మెడకు చుట్టుకుంది. కేంద్ర హోం మంత్రిగా తన వైఫల్యానికి పూర్తి బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో షాకు కవచంగా ఉపయోగపడడంతోపాటు, రాజకీయ ప్రద్యర్థుల మీదకే నెపం నెట్టివేయడానికి భాజపా నాయకులు కుస్తీలు పడుతున్నారు. అందులో భాగంగానే.. కేంద్రం మంత్రి ప్రకాష్ జవదేకర్.. అల్లర్లకు బాధ్యత మొత్తం సోనియా కుటుంబం మీదికే నెట్టివేస్తున్నారు.

ఇది రెండు రోజులు జరిగిన అల్లర్లు కాదు.. రెండు నెలల కిందటినుంచి జరిగిన కుట్రలు అని అభివర్ణిస్తున్న ప్రకాష్ జవదేవకర్.. రెండునెలల కిందట ఢిల్లీలో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలో సోనియా ప్రసంగాన్ని ప్రస్తావించి.. ఆమె ఆరోజున రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే..  ఇవాళ అల్లర్లు జరిగాయంటున్నారు.

జవదేకర్ భాష్యం ప్రకారం.. సోనియా అన్న మాటలు.. ‘ఆర్ పార్ కీ లడాయీ హై’ ను తప్పుపడుతున్నారు. వీటి అర్థం ‘అంతం చేసేవరకు పోరాటం’అని అర్థం. అయితే సీఏఏ చట్టాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాడాలని దాని ఉద్దేశం. ఒక చట్టానికి వ్యతిరేకంగాపోరాడే పార్టీ అంతకంటె భిన్నంగా ఏం పిలుపు ఇస్తుంది. ఈ మాటల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమున్నాయో జవదేకర్ మాత్రమే చెప్పగలరు. ఆ మాట అన్న వెంటనే ఆరోజున సోనియా.. ‘ఈ గట్టున ఉండాలా ఆ గట్టున ఉండాలా తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని’ అన్నారు. ఇది పార్టీలకు సంబంధించింది. ఈ మాటల్ని జవదేకర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా ఇప్పుడు నెపం వారిమీదకు నెడుతున్నారు. ప్రకాష్ జవదేకర్ అక్కడితో ఆగడం లేదు.

‘వందల మందిని జైళ్లలో పెడతారు’ అని ప్రియాంక అనడం కూడా వక్రీకరించడమేనట. ‘భయపడకండి.. మీ వెంట మేం ఉంటాం’ అని రాహుల్ అన్న మాటలు కూడా రెచ్చగొట్టడమేనట. కనీసం ఆ మాట కూడా చెప్పకుండా.. ఆందోళన చెందుతున్న ఒక వర్గానికి ఒక రాజకీయ పార్టీ ఎలా భరోసా ఇవ్వగలదు?

కపిల్ మిశ్రా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అల్లర్లకు కారణం అని అందరూ అంటూనే ఉన్నారు. ఆ నేరం నుంచి తమ పార్టీని  కాపాడుకోవడానికి, వైఫల్యాలనుంచి అమిత్ షా ను కాపాడుకోవడానికి భాజపా నాయకలు ఇలాటి బుకాయంపు మాటలు చెబుతూ వంచిస్తున్నారని అర్థమవుతోంది.

సీన్ రివర్స్ అయింది..!

Show comments