ఉమా డైరీలో ఎవరెవరి పేర్లున్నాయో?

వారు మాజీలు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేక ప్రజల తిరస్కారాన్ని చవిచూసిన వారు. తమ నియోజకవర్గంలోని ప్రజల వద్దనే.. వారికి ఇదివరకు దక్కిన గౌరవం ఇప్పుడు దక్కే పరిస్థితి లేదు. అలాంటప్పుడు.. తాము అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో వెలగబెట్టిన దర్పాన్ని, ప్రదర్శించిన అహంకారాన్ని ఇప్పుడూ కొనసాగించాలంటే ఎలా సాధ్యం? కుదరకపోయేసరికి, ఆ పరిణామాలను వారు జీర్ణం చేసుకోలేక, కుతకుతలాడిపోతున్నారు.

అవును ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకుల గురించే. అమరావతిలో ఎంపీ కారుమీద దాడిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రిమాండువిధించడంతో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కలవడానికి వెళ్లిన తెలుగుదేశం నాయకులు... అక్కడి అధికారులు నిబంధనల ప్రకారం నడుచుకోమని అన్నందుకు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పేర్లు డైరీలో రాసుకుంటున్నాం... అంటూ హెచ్చరిస్తున్నారు.

గుంటూరు జిల్లా జైల్లో ఉన్న రాజధాని రైతులను పరామర్శించేందుకు మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు వెళ్లారు. వారిని లోపలకు అనుమతించిన జైలు అధికారులు గ్రిల్స్ గేట్ ఇవతలి వైపునుంచే రాజధాని రైతులతో మాట్లాడి వెళ్లాల్సిందిగా సూచించారు. అందుకే దేవినేని ఉమాకు కోపం వచ్చేసింది. తమను వారితో నేరుగా కలవడానికి, కూర్చుని మాట్లాడడానికి అనుమతించలేదని ఆగ్రహం పట్టలేకపోయారు.

‘ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పేర్లన్నీ డైరీలో రాసుకుంటున్నాం.. ఈ ప్రభుత్వం ఎణ్నాళ్లుంటుందో తెలియదు.. అది గుర్తు పెట్టుకుని మసలుకోవాలి’ అంటూ దేవినేని ఉమా హెచ్చరించారు. అంటే.. తిరిగి తమ సర్కారు రాగానే.. ఈ అధికారులందరిమీద కక్ష తీర్చుకుంటాం అని పరోక్షంగా హెచ్చరించడం అన్నమాట. నిబంధనలను పాటిస్తూ.. నిబంధనలను గౌరవించాల్సిందిగా చెప్పే అధికారులందరి మీద తెదేపా నాయకులు కక్ష తీర్చుకోదలచుకుంటే.. వారి ప్రభుత్వం వచ్చే సమయానికి రాష్ట్రంలో అన్ని శాఖలకు అందరు అధికారుల్ని.. ఇతర రాష్ట్రాలనుంచి తెచ్చుకోవాల్సి వస్తుందని ఉమా తీరుపై జోకులు పేలుతున్నాయి.

జైళ్లు కూడా జగన్ కనుసన్నల్లో నడుస్తున్నాయంటూ నిప్పులు చెరుగుతున్నారు గానీ.. జగన్ రాష్ట్రానికి ప్రభుత్వాధినేత అయినప్పుడు ఒక జైళ్లేమిటి.. ప్రతి వ్యవస్థ కూడా ఆయన ఆదేశాల ప్రకారం నడవకుండా.. చంద్రబాబు కనుసన్నల్లో నడవాలా... అని ప్రజలు జోకులేసుకుంటున్నారు.

సీన్ రివర్స్ అయింది..! 

Show comments