ఆప్- భాజపా మధ్య అదీ తేడా!

విలువలు ప్రవచించడం కాదు... పాటించడం నేర్చుకోవాలి. ఆచరించి చూపించాలి.. అందరినీ అనుసరించాలని డిమాండ్ చేయాలి. కానీ నేటితరం రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు ఎదుటివారికి చెప్పేప్పుడు ఒకరకంగా, తాము చేసేప్పుడు మరో రకంగా మార్చుకుంటూ ఉండడం మామూలైపోయింది. ఢిల్లీలో హ్యాట్రిక్ విజయాల్ని నమోదుచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం... అంతో ఇంతో విలువల్ని పాటించింది. ప్రధానంగా.. ప్రవచించడం ఎక్కువైన  భారతీయ జనతా పార్టీతో పోలిస్తే.. ఆ పార్టీ గొప్పగా స్పందించింది. తమ పార్టీ నాయకుడిపై ఆరోపణలు రాగానే, సస్పెన్షన్ వేటు వేసి.. ఆరోపణలు తప్పు అని తేలేదాకా ఆ సస్పెన్షన్ కొనసాగుతుందని తేల్చి చెప్పింది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో సీఏఏ పుణ్యమాని చెలరేగిన అల్లర్ల సంగతి అందరికీ తెలిసిందే. ఈ అల్లర్లలో మొత్తం 38 మంది ఇప్పటికే మరణించారు. అల్లర్లు చెలరేగడం వెనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం చాలా స్పష్టంగా బయటపడింది. రాజకీయంగా అల్లర్లకు బాధ్యత ఎవరిదనే విషయంలో భాజపా మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఆప్ ప్రభుత్వ వైఫల్యం మీద కూడా నిందలున్నాయి. అమిత్ షా రాజీనామాకు కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఈ అల్లర్లలో ఒక ఐబీ అధికారి అంకిత్ శర్మ కూడా మరణించారు. అయితే తన కొడుకు అంకిత్ శర్మ మరణానికి, ఆప్ పార్టీకి చెందిన కౌన్సిలర్ తాహిర్  హుసేన్ కారణం అంటూ మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై హత్యానేరం కింద కేసు కూడా నమోదు అయింది. తాహిర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే.. తన కొడుకును చంపేశారనేది అంకిత్ శర్మ తండ్రి ఆరోపణ. అయతే తాహిర్ మాత్రం.. తన ప్రమేయం అస్సలు లేదని.. నిష్పాక్షిక విచారణ జరిపి దోషులపై చర్య తీసుకోవచ్చునని స్వయంగా అంటున్నారు.

ఆ సంగతి ఎలా ఉన్నా.. తాహిర్ పై హత్యానేరం కింద కేసు నమో దు కాగానే.. ఆప్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసు విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ ఉంటుంది. పార్టీగా ఆప్ చొరవను అభినందించాలి. ఎందుకంటే.. ఇదే అల్లర్లకు అసలు మూలకారకుడిగా, సూత్రధారిగా భాజపా నాయకుడు కపిల్ మిశ్రా మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. సాక్షాత్తూ భాజపా ఎంపీ గౌతం గంభీర కూడా తప్పుపట్టారు. అయితే ఇప్పటిదాకా కపిల్ మిశ్రాపై ఎలాంటి చర్య తీసుకోవడానికి భాజపా ప్రయత్నించలేదు. ఆ ఊసు కూడా వారి చెవికెక్కలేదు. మోడీ లాంటి నాయకులు ట్విటర్ లో విలువలను ప్రవచించడం కాదు.. ఆచరించడం నేర్చుకోవాలనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సీన్ రివర్స్ అయింది..!

Show comments