విభజన చట్టం : మరో ఆశకు తూట్లు!

ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ అనే రెండు ముక్కలుగా విడగొడుతూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి  మోడీ సర్కారు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదనడానికి ఇదొక తాజా తార్కాణం.ఆ చట్టం ద్వారా తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడడం మినహా.. ఆ చట్టంలోని.. ఉభయ రాష్ట్రాలకు ప్రకటించిన ప్రత్యేక హమీలు వరాలు ఏవీ అంత సులువుగా కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. పైగా... ప్రజలు చాలా ఆశలు పెట్టుకుంటున్న విభజన చట్టం ఆశల గురించి.. కేంద్రంలోని పెద్దలు చులకనగా మాట్లాడడం కూడా జరుగుతోంది.

విభజన చట్టంలోని కీలకాంశాల్లో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలు  పెరగడం కూడా ఒకటి. చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే.. అసెంబ్లీ సీట్లు కూడా పెరిగిపోతాయని.. ఇరు రాష్ట్రాల్లోనూ తొలి ముఖ్యమంత్రులు ఆశపడ్డారు.

ప్రజలందరూ, ఆశావహులైన ద్వితీయశ్రేణి నాయకులందరూ కూడా నిజమే అనుకున్నారు.ఎటూ సీట్ల సంఖ్య పెరుగుతుంది కదా.. అని, అవసరం ఉన్నా లేకపోయినా.. ప్రతిపక్షాలనుంచి పలువురు నాయకులను ఫిరాయింపజేసి తమలో కలిపేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఆ ఊసెత్తడంలేదు.

తాజాగా అసెంబ్లీ సీట్ల పెంపు అనేది అంత ఈజీ సంగతేమీ కాదని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేసేశారు. ఢిల్లీలో ఏర్పాటుచేసిన ఒక ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. సీట్ల గురించి చాలా మంది నాయకులు పెంచుకుంటున్న ఆశలపై నీళ్లు చిలకరించారు. 2019లోగా జరుగుతుందని అందరూ ఎదురుచూసినా.. 2023 లోగా ఖచ్చితంగా అవుతాయనే ఆశతో ఉన్నారు.

అయితే కిషన్ రెడ్డి కూడా ఇదమిత్థంగా ఏదీ తేల్చి చెప్పకుండా... రెండు తెలుగు రాష్ట్రాల కోసం విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్లు పెంచడం సాధ్యం కాదని.. దేశమంతా ఎప్పుడు జరిగితే.. ఇక్కడ కూడా అప్పుడే జరుగుతుందని అనేశారు.

విభజన చట్టంలోని ప్రత్యేకహోదా దగ్గరినుంచి.. అనేక అంశాల్లో కేంద్రం మాట తప్పింది. తాజాగా కిషన్ రెడ్డి ఆ చట్టాన్నే చులకన చేస్తూ.. ఇష్టం వచ్చినట్లుగా అందులో అంశాలు పెట్టారంటూ వ్యాఖ్యానించడం విశేషం. ఆ చట్టం ద్వారా ఇంకాస్త మంచి జరుగుతుందనే ఆశలు మిగిలిఉన్న వారెవరైనా ఉంటే.. వారంతా ఇక నిశ్చింతగా ఆశలు వదిలేసుకోవచ్చు.

సీన్ రివర్స్ అయింది..! 

Show comments