ఎమ్బీయస్‌: రిజర్వేషన్‌ హక్కెలా అవుతుంది?

రిజర్వేషన్‌ అనేది ఒక ప్రత్యేక వర్గానికి యిస్తారు. బస్సుల్లో ఆడవాళ్లకు, దివ్యాంగులకు, వయోవృద్ధులకు.. యిలా. కొన్ని ఉద్యోగాల్లో మిలటరీ సర్వీసు చేసినవారికి లేక మరేదైనా వర్గానికి. ఇవి దేశమంతటా ఒకేలా ఉండదు. ఒక్కో రాష్ట్రంలో మహిళలకు వేరే సీట్లు వుండవు. ఒక్కో రాష్ట్రం వీటిపై తమకు తోచినట్లు  ఆయా వర్గాలకు సౌకర్యం యిస్తుంది. పక్క రాష్ట్రంలో యిచ్చారు, యిక్కడెందుకు యివ్వరు? అని ప్రభుత్వాన్ని నిలదీయలేరు. ఎస్సీ రిజర్వేషన్‌ వద్దకు వచ్చేసరికి యీ లాజిక్‌ మిస్సవుతారెందుకో! వాళ్లకు రిజర్వేషన్‌ ప్రాథమిక హక్కు అనుకుని, వాళ్లడిగినంత యివ్వకపోతే దానికి భంగం కలిగిందనుకుని వాదిస్తారు.

ఈ నెల 7న సుప్రీం కోర్టు రిజర్వేషన్‌ ప్రాథమిక హక్కు కాదు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎలా కావాలంటే అలా చేయవచ్చు అని చెప్పడంతో గగ్గోలు పెడుతున్నారు. 2012లో ఉత్తరాఖండ్‌లో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కల్పించకుండా ప్రభుత్వోద్యాగాలను భర్తీ చేయడంతో కొందరు కోర్టుకి వెళ్లారు. హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం అప్పీలు కెళితే సుప్రీం కోర్టు చెప్పినదిది. తీర్పు రాగానే అన్ని పార్టీలూ - కాంగ్రెసుతో సహా-  బిజెపి రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటూ ప్రకటనలు దంచేస్తున్నారు తప్ప కోర్టు చెప్పిన వివరణ ఏమిటి అనేది పట్టించుకోవటం లేదు.

కులం ప్రకారం రిజర్వేషన్లు యివ్వడం స్వాతంత్య్రానికి ముందు నుంచీ ప్రారంభమైంది. స్వాతంత్య్రం తర్వాత పదేళ్లపాటు అన్నారు. తర్వాత పొడిగిస్తూ పోయారు. మొదట్లో ఎస్సీ, ఎస్టీలన్నారు, తర్వాత ఒబిసిలు తోడయ్యారు. చివరకు ఎలా తయారైందంటే ప్రతిభ కొలబద్దగా కేటాయించే సీట్లు, ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఒకసారి రిజర్వేషన్‌ ప్రారంభించాక వాటిని ఎత్తేయడం కానీ, కనీసం కుదించడం కానీ జరగటం లేదు. రిజర్వేషన్లు యిచ్చినందు వలన వారి స్థితిగతుల్లో మార్పు వచ్చిందా లేదా అని సమీక్ష కూడా చేయటం లేదు. గతంలో కంటె వాళ్ల పరిస్థితి మెరుగుపడకపోతే రిజర్వేషన్‌ కల్పించడం మార్గం కాదన్నమాట, వేరే మార్గం చూడాలేమో అని కూడా ఆలోచించటం లేదు.

ఎస్సీ/ఎస్టీ/ఒబిసి కులాలలో కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్‌ ఫలితాలు అందుకుంటున్నా యంటున్నారు, పోనీ కొద్దికాలం పాటు వాళ్లను మినహాయించి, తక్కిన కులాలకు యిద్దాం అని కూడా అనుకోవటం లేదు. గుడ్డిగా పొడిగిస్తూ పోతున్నారంతే. కోర్టు దీన్నే తప్పుపడుతోంది. కొనసాగింపును సమర్థించుకోవడానికి అవసరమైన డేటా యిచ్చి, మీ చర్యను జస్టిఫై చేసుకోండి అంటోంది. ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వమూ అది చేయటం లేదు. పైగా ఉద్యోగ నియామకాల్లోనే కాదు, ప్రమోషన్లకు కూడా రిజర్వేషన్లను వర్తింప చేసేస్తున్నాయి. అంతేకాదు, ఉన్నత విద్యాలయాలలో కూడా విపరీతంగా రిజర్వేషన్లు పెట్టేస్తున్నాయి.

కులవివక్షత కారణంగా పోటీపరీక్షల్లో యితర వర్ణాలతో ఒక ఎస్సీ లేదా బిసి కాండిడేటు పోటీ పడలేకపోతున్నాడు కాబట్టి ఉద్యోగం తెచ్చుకోలేడు అనుకుంటే అతనికి ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేకమైన తర్ఫీదు యిప్పించి వారితో సమానమైన స్థాయికి తేవడం సబబు. అంతేకానీ ప్రతిభ తక్కువగా ఉన్నవాడిని, కేవలం కులం కారణంగా యితరులతో సమానంగా కూర్చోబెట్టడంలో అర్థం లేదు. ఎందుకంటే స్వయంప్రతిభతో ఉద్యోగం తెచ్చుకున్నవాడు ఆఫీసులో పొందే  గౌరవం వీళ్లకు ఎప్పుడూ దక్కదు. దానివలన మరింత వివక్షత చూపే ప్రమాదం ఉంది. ఇదే అనర్థమనుకుంటే ప్రమోషన్లలో కూడా కులప్రాతిపదికపై రిజర్వేషన్‌ యివ్వడం మరీ దారుణం. దీనివలన యితర వర్ణాలకు వీళ్లపై ద్వేషం పెరుగుతుంది.

ప్రమోషన్‌ అనేది ప్రతిభ, పనితీరు, టీము స్పిరిట్‌, ఏటిట్యూడ్‌ యిత్యాది అనేక అంశాలపై ఆధారపడి వుంటుంది. పైకి వెళుతున్నకొద్దీ పోటీ చిక్కనవుతుంది. అలాటి పరిస్థితుల్లో రిజర్వ్‌డ్‌ కులమనే నిచ్చెన వేసుకుని ఎవడైనా పైకి ఎగబాకి మన నెత్తిన కూర్చుంటే హర్షించగలమా? భరించగలమా? ‘అబ్బే, అన్ని చోట్లా ప్రతిభ చూడనవసరం లేదు. ఎస్సీలకు రిజర్వేషన్లు యివ్వడం సామాజిక న్యాయం, అవసరం’ అని వాదించే నాయకులు జబ్బు పడినపుడు ‘సార్‌ మీకు ఆపరేషన్‌ అవసరం. చేసే డాక్టరు గారు మీరు చెప్పిన కేటగిరీయే. కాలేజీలో సీటు, ఆసుపత్రిలో ఉద్యోగం, ఆ పై ప్రమోషన్‌ అన్నీ స్వయంప్రతిభతో కాకుండా కులం సర్టిఫికెట్టు ద్వారా తెచ్చుకున్నవాడే. అతని అసిస్టెంట్లు కూడా ఆ బాపతే’ అని చెప్తే ఏమంటారు? ‘అందుకే నేను ఇండియాలో చేయించుకోను. ప్రజాధనంతో ఫారిన్‌ వెళ్లి చేయించుకుంటాను’ అంటారేమో!

ప్రభుత్వ స్కూళ్లల్లో రిజర్వేషన్‌ ద్వారా వచ్చిన టీచర్లు ఉంటారని తమ పిల్లలను ప్రయివేటు స్కూళ్లల్లో చేర్చేది వీరే! అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల జోలికి పోకుండా, కార్పోరేట్‌ ఆసుపత్రులకు వెళ్లేదీ వీరే! రిజర్వేషన్‌ ద్వారా ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేసి, ప్రభుత్వోద్యోగుల సామర్థ్యం పెరగాలి అని ఉపన్యాసాలు యిచ్చేదీ వీరే! ఏ కులం వారైనా సరే, సామర్థ్యం ఉన్నవాడికే ఉద్యోగం, పదోన్నతి అని చాటిచెప్పిన రోజున అలాటి ఉపన్యాసాలు యిచ్చే అర్హత వస్తుంది. వెనుకబడిన, అణగారిన కులాల వారికి అనేక సౌకర్యాలు కల్పించవచ్చు, వారిపై అదనంగా ఖర్చు పెట్టవచ్చు కానీ ప్రతిభ విషయంలో రాజీ పడితే సహజంగానే వ్యవస్థ సామర్థ్యం దెబ్బ తింటుంది. మన దేశంలో మెరిట్‌పై యిచ్చే ప్రభుత్వ స్కాలర్‌షిప్పులు 0.7% మాత్రమే అని చదివాను. తక్కినవన్నీ కులప్రాతిపదిక పైనేట. నమ్మబుద్ధి కాలేదు. కానీ కేంద్ర నిధులతో నడిచే ఉన్నత విద్యాలయాల సీట్లలో మాత్రం ప్రతిభ కారణంగా యిచ్చేవి 50.5% మాత్రమే అని తెలుసు. ఒబిసిలకు 27% ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, రిజర్వేషన్‌ పోగా మిగిలేది అంతే!

ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్ల గురించి చెప్పుకోవాలంటే - 1993లోనే సుప్రీం కోర్టు ప్రమోషన్లలో రిజర్వేషన్లు రాజ్యాంగవిరుద్ధం అని రూలింగు యిచ్చింది. సరే ఐదేళ్ల పాటు కొనసాగించి అప్పుడు ఆపేయండి అంది. ఆ ఐదేళ్లు పూర్తయ్యేలోగా 1995లో రాజ్యాంగానికి 77వ సవరణ చేసి, ప్రమోషన్లను కొనసాగించేశారు. ఇంకొన్నాళ్లకు 85వ సవరణ ద్వారా రిజర్వేషన్ల ద్వారా ప్రమోషన్‌ పొందిన ఎస్సీ/ఎస్టీలకు కాన్సీక్వెన్షియల్‌ సీనియారిటీ కూడా యిచ్చేశారు. ఇది తన దృష్టికి వచ్చినపుడు సుప్రీం కోర్టు 2006లో సరే యిస్తే యిచ్చారు కానీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో (కంపెల్లింగ్‌ రీజన్స్‌) మీరు చెప్పితీరాలి అని స్పష్టంగా చెప్పింది. ఆ కారణాల్లో ‘వెనకబాటుతనం’, ‘ఉండవలసినంతమంది ఉండకపోవడం’, ‘ఓవరాల్‌ ఎడ్మినిస్ట్రేటివ్‌ ఎఫిషియన్సీ’ కూడా ఉండాలి అని చెప్పింది.

ఉండవలసినంత మంది ఉండకపోవడం అనే క్లాజ్‌ కూడా వింతగా ఉంది. ఏ రంగాలలోనైనా జనాభా నిష్పత్తి ప్రకారం యింతమంది ఉండి తీరాలి అని చెప్పగలమా? ఎస్సీలు 20% ఉన్నారు కాబట్టి, వ్యవసాయదారుల్లో, వ్యాపారస్తుల్లో, ప్రొఫెషనల్స్‌లో, ముఖ్యమంత్రుల్లో, సైనికుల్లో, సినిమా హీరోల్లో, హీరోయిన్లలో, విలన్లలో అంత శాతం మంది ఉండితీరాలి అని నియమం పెట్టగలమా? అలాటప్పుడు ప్రభుత్వోద్యోగుల్లో మాత్రం ఎందుకు యీ రూలు పెట్టాలి? ప్రయివేటు సెక్టార్‌పై యీ రూలు విధిస్తే వాళ్లు ఒప్పుకోరు కాబట్టి, ఆ భారమంతా ప్రభుత్వమే మోయాలా? అలాటప్పుడు అది ప్రయివేటు రంగంతో ఎలా పోటీ పడగలదు?

బిసి నాయకులు కూడా యిలాటి వాదనలే చేస్తారు - కేంద్ర సెక్రటేరియట్‌లో 100 మంది సెక్రటరీలుంటే వారిలో 25% శాతమే బిసిలున్నారు, మా జనాభా సంఖ్య ప్రకారం 35% ఉండాలి అని వాదిస్తారు. స్త్రీవాదులు వచ్చి 10% మంది స్త్రీలే వున్నారు, లెక్క ప్రకారం 49% మంది ఉండాలి అంటారు. మరొకళ్లు వాళ్లని ఉత్తరాది, దక్షిణాది గీత గీసి విడగొడతారు. ఇంకోళ్లు తూర్పు, పడమరలగా! ఉత్తరాది వాళ్లలో కూడా పంజాబీలు ఎక్కువ ఉన్నారని, దక్షిణాది వాళ్లలో తమిళులు ఎక్కువున్నారని యిలా ఆ 100 మందిని రకరకాల తూనికరాళ్లతో తూచి, ఎవరికి వారు వారికి అన్యాయం జరిగిందని వాపోతూ పోవచ్చు. అంటే ఎవరి సామాజిక స్థితినైనా కొలవాలంటే ప్రభుత్వోద్యోగులలో వారు ఎంత శాతం ఉన్నారనేది ఒక్కటే కొలబద్దా? వ్యవసాయం, వ్యాపారం, వృత్తి, కళారంగం.. ఏ రంగంలోనైనా డబ్బు గడించడమే ముఖ్యం. ఆస్తి బట్టే వారి సామాజిక స్థితి తెలుసుకోవచ్చు. అది వదిలేసి ప్రభుత్వోద్యోగాల మీద పడితే యిలాగే ఉంటుంది.

ప్రమోషన్లలో రిజర్వేషన్‌ పెట్టకపోతే ఎస్సీ, ఎస్టీలపై వైషమ్య భావం ఉన్న అధికారి ప్రతిభ లేదంటూ వారిని యింటర్వ్యూలో ఫెయిల్‌ చేయవచ్చు అని కొందరు వాదించవచ్చు. కులభావన వలన నష్టపోయేవారు ఎస్సీ, ఎస్టీలే కాదు అందరూ ఉంటారు. నేను గమనించినంత వరకు కాస్ట్‌ ఫీలింగ్‌ పూర్తిగా వ్యక్తిగతం. జనరలైజ్‌ చేయలేం. మనలో ఎవర్నయినా కదిలించి చూడండి ‘మా వాళ్లలో యూనిటీ లేదండి, అదే ఫలానా వాళ్లయితే, అన్నీ వాళ్లవాళ్లకే యిచ్చుకుంటారు’ అంటారు. ఆ ఫలానా వాళ్ల నడిగితే వాళ్లు యింకోళ్ల పేరు చెప్తారు. మనం అరవ్వాళ్లకు ఫీలింగు ఎక్కువంటాం, వాళ్లు మలయాళీ వాళ్లకు ఎక్కువంటారు, వాళ్లు నార్త్‌ వాళ్లకు అంటారు.. యిది అనంతం. నిజమేమిటంటే వీళ్లందరిలో కొందరికి మాత్రమే ఆ ఫీలింగు ఉంటుంది. చాలామంది టేలంట్‌ ఉందా తమకు నప్పుతారా లేదా అనేదే చూసుకుంటారు.

నేను 1972లో వెయిట్స్‌ అండ్‌ మెజర్స్‌ ఆఫీసులో ఉద్యోగానికి యింటర్వ్యూకి హాజరయ్యాను. రాత పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూ. అదీ ఒకే ప్రశ్న. పేరూ వగైరా అడిగాక కులం ఏమిటి? అని. నేను తెల్లబోయాను. ఇదేమీ రిజర్వ్‌డ్‌ సీటు కాదు, యిక కులంతో పనేముంది? అనుకుని ఏమీ చెప్పకుండా బ్లాంక్‌గా చూశాను. మళ్లీ అడిగారు. తప్పలేదు. చెప్పాను. ఉద్యోగం రాలేదు. తర్వాత ఎవరో చెప్పారు. ఉద్యోగాలిచ్చే ఉన్నతాధికారి ఎస్సీట. జనరల్‌ కాటగిరీలో కూడా వాళ్లకే యిద్దామనుకున్నాట్ట. ఇలా కులం ఒక్కోప్పుడు ఎడ్వాంటేజిగా, మరోసారి డిజడ్వాంటేజిగా మారుతుంది. దానికి మనమేమీ చేయలేం. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎందరో ప్రతిభామూర్తులు ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులుగా రాణిస్తున్నారు. ఎన్ని అవకాశాలిచ్చినా దుర్వినియోగం చేసుకునేవారూ ఉన్నారు. అందువలన ప్రమోషన్లలో రిజర్వేషన్‌ అన్ని సమస్యలకు పరిష్కారం కానేరదు.

2007లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రమోషన్లలో రిజర్వేషన్‌ ప్రవేశపెడితే, దానికి మద్దతుగా ఏ డేటా యివ్వకపోవడంతో పైన చెప్పిన సుప్రీం కోర్టు తీర్పు ఉటంకిస్తూ ఇలహాబాద్‌ హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వం సుప్రీం కోర్టు కెళితే 2012లో అదీ కొట్టేసింది - డేటా ఏది బాబూ? అంటూ! డేటా యిచ్చినా రిజర్వేషన్‌ యివ్వండి అని కోర్టు ప్రభుత్వాలను ఆదేశించలేదు. ఇస్తే సరేలే అని ఊరుకుంటుంది. ఈ విషయం కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రభుత్వాలేవీ డేటా యివ్వటం లేదు. నిజానికి ఒక్కో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో రకమైన కోటా వుంది. జనాభా లెక్క బట్టి యిస్తున్నారు. అదే నియోజకవర్గాల కేటాయింపులో కూడా వర్తింపచేస్తున్నారు. జనాభా లెక్కలు ఒక్కటే సూచికగా తీసుకోకూడదు. వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అవి కూడా రాష్ట్రరాష్ట్రానికీ మారతాయి.

ఎస్సీల పట్ల వివక్షత చూపడం బిహార్‌లో ఉన్నంతగా బెంగాల్‌లో లేదు, యుపిలో ఉన్నంతగా కేరళలో లేదు. ఝార్ఖండ్‌ లేదా ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న వాళ్లలో ఎస్టీలు అత్యధికంగా ఉన్నపుడు వారిపై వివక్షత చూపగలిగేవారెవరు? ఇక విద్యార్జన బాగా పెరిగిన రాష్ట్రాలో ఆ వర్గాల్లోనూ పెరుగుతుంది. ఆదాయమార్గాలూ పెరుగుతాయి. సహజంగా వారి సామాజిక స్థితి, తక్కిన కులస్తులు వారిని చూసే దృష్టి మెరుగుపడతాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు లెక్కలోకి తీసుకుంటూ, రిజర్వేషన్‌ పెంచడమో, తుంచడమో, తగ్గించడమో చేయాలి. ఇది రాష్ట్రం పరిధిలో తీసుకోవసిన నిర్ణయం. దేశమంతా ఒకే విధానం అమలు చేయడం తప్పు. బిసిలున్నారు. ఒక రాష్ట్రంలో దాన్ని అగ్రకులం అంటారు, పక్క రాష్ట్రంలో వెనకబడిన కులం అంటారు. అదేమంటే మా దగ్గర అలాగే చూస్తాం అంటారు. అలాగే దళితుల స్థితిగతులు కూడా రాష్ట్రం ప్రకారం చూసి నిర్ణయాలు తీసుకోవాలి.

ఇక ఆర్థికపరమైన పారామీటరు కూడా చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. బిసిల్లో క్రీమీ లేయరు గురించి మాట్లాడతారు తప్ప ఎస్సీ/ఎస్టీ విషయంలో మాట్లాడటం లేదు. కుటుంబంలో ఒకసారి రిజర్వేషన్‌ సౌకర్యం పొందాక మళ్లీ వీళ్లకే యివ్వకుండా, యింకో కుటుంబానికి యివ్వడం ద్వారా సామాజిక పురోగతి త్వరితమౌతుంది. తండ్రి ఐఏఎస్‌ అయినా, కోటీశ్వరుడైనా, ముఖ్యమంత్రి ఐనా కొడుక్కి పాపం అని రిజర్వేషన్‌ యిచ్చేస్తున్నారు. వాళ్లకు కూడా క్రీమీ లేయరు వర్తింపచేయాలంటూ సుప్రీం కోర్టు 2018లో చెప్పింది. దానిమీద రివ్యూ పిటిషన్‌ వేశారు. అదింకా కోర్టులో పెండింగులో ఉంది. ప్రభుత్వం తను చేసే నిర్ణయాలను సమర్థించుకోవడానికి సమాచారం సేకరించాలి, సమర్పించాలి. దానికి గాను సమగ్ర సర్వే లాటిది నిర్వహించాలి. కులం ప్రకారం జనాభా సేకరణ చేయాలి. ఎస్సీ, ఎస్టీలది మాత్రమే కాదు, బిసిలది కూడా తీసుకోవాలి.

ఎందుకంటే ఏ బిసి నాయకుణ్ని అడిగినా, మా కులం వాళ్లు జనాభాలో యింత శాతం మంది ఉన్నారు, అంత శాతం మంది ఉన్నారు అని క్లెయిమ్‌ చేస్తారు. అవన్నీ కలిపితే ఏ 200%కో చేరుతుంది. వాళ్లతో బాటు ఒసిల లెక్క కూడా తీసుకోవాలి. ఎందుకంటే యివాళ్టి ఒసిని రేపు ఓట్ల కోసం బిసిల్లో చేర్చవచ్చు. పౌరసత్వం తేలుస్తామంటూ అనవసరమైన వివరాలు అడుగుతున్న మోదీ సర్కారు అది మానేసి యిది తీసుకోవడం మన దేశభవిష్యత్తుకి ఎంతో ఉపకరిస్తుంది. ఎందుకంటే యీ రిజర్వేషన్‌ సమస్య సమాజంలో చిచ్చు రేపుతోంది. ఎవరికీ నొప్పి కలగకుండా ఇబిసి రిజర్వేషన్లు అమలు చేసిన మోదీ ప్రభుత్వం గట్టిగా తలచుకుంటే యిదీ చేయగలదు.

సుప్రీం కోర్టు మార్గదర్శకత్వం యిచ్చింది కాబట్టి ప్రభుత్వాలు యికనైనా ఆ డేటా సేకరణ పని చేపట్టాలి. అది జరగటం లేదు కానీ కోర్టు తీర్పుని ఎలా కాలరాయాలా అన్నదానిపైనే చర్చ జరుగుతోంది. ఎన్‌డిఏ భాగస్వామ్యపక్షాలైన పాశ్వాన్‌ పార్టీ ఎల్‌జెపి, రామదాస్‌ అఠావాలే పార్టీ ఆర్‌పిఐ రివ్యూకి వెళ్లాలంటున్నాయి. ఈ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలంటున్నాయి. ప్రతిపక్షా గోల సామాన్యంగా లేదు. ఒక కాంగ్రెసు నాయకుడైతే ‘‘ఇదంతా బిజెపిని నడిపించే బ్రాహ్మణ నాయకత్వం కుట్ర. రిజర్వేషన్లు ఎత్తివేయాలంటే ముందు కులవ్యవస్థను కూలదోసి అప్పుడు మాట్లాడమనండి.’’ అన్నాడు. ఇది చాలా ఫన్నీగా ఉంది. ఎస్సీ మాట రాగానే బ్రాహ్మణులు, మనువాదులు వాళ్లను తొక్కేస్తున్నారని స్టేటుమెంట్లు యిచ్చేస్తారు. బ్రాహ్మలు నేటి సమాజగమనాన్ని శాసించే స్థితిలో ఉన్నారా! అనే ఆలోచన కూడా వీళ్లకు తట్టదు పాపం.

ఇక బిజెపికి వస్తే దానిలో బ్రాహ్మణ నాయకత్వం ఉందా? బ్రాహ్మణ-బనియా నాయకులు, రైటిస్టు మేధావులు బహుళసంఖ్యలో ఉండే రోజుల్లో జనసంఘ్ దీపం (దాని ఎన్నికల గుర్తు) మిణుకుమిణుకు మంటూ ఉండేది. భూస్వామ్య, ధనిక శూద్రులు చేరాకనే అది బలపడింది. బిజెపిగా మారాక క్రమంగా బిసిలలో కొన్ని వర్గాలను కూడా ఆకర్షించింది. ఇటీవల అనేక రాష్ట్రాలలో ఎస్టీలు వారికి ఓటేస్తున్నారు. చాలా ఎస్సీ నియోజకవర్గాలలో కూడా బిజెపి గెలుస్తోంది. ప్రస్తుతం దాన్ని అగ్రకులాల మద్దతున్న సర్వకుల ప్రతినిథిగానే చూడాలి. కేంద్ర కాబినెట్‌లో ముఖ్య పదవులలో ఉన్న బ్రాహ్మలెందరు? నిర్మలా సీతారామన్‌, గడ్కరీ, ప్రకాశ్‌ జావడేకర్‌ కనబడుతున్నారు. ఆ మాత్రానికే బ్రాహ్మల పార్టీ అయిపోతుందా? ఆలోచించకుండా ముద్రలు కొట్టడం మనకు అలవాటై పోయింది, ఏం చేస్తాం?

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2020)
  mbsprasad@gmail.com

Show comments