చంద్రబాబు హీరో అయిపోయారంతే!

పోలీసు యంత్రాంగం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విశాఖపట్నం కార్యకర్తలు, వారికి పురిగొల్పి మార్గదర్శనం చేసిన నాయకులు అందరూ కలిసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును హఠాత్తుగా హీరో చేసేశారు. ఇవాళ రాష్ట్రం మొత్తం ఆయన గురించే మాట్లాడుకుంటోంది. కొందరు తిట్టుకోవచ్చు... కొందరు అయ్యోపాపం అనొచ్చు.. కొందరు కీర్తించవచ్చు.. ఏది ఏమైనా సరే.. ఇవాళ టాక్ ఆఫ్ ది స్టేట్ గా చంద్రబాబు వెలుగుతున్నారంటే.. అది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమూ, కార్యకర్తల పుణ్యం మాత్రమే.

చంద్రబాబునాయుడు ప్రజా చైతన్య యాత్రలు అనుమతి లేని ఉద్యమాలు కావు. వాటికి ప్రభుత్వ అనుమతి ఉంది. ఆయన వాటిని ప్రారంభించి కొన్ని రోజులు గడిచింది. ప్రతిపక్షాల పోరాటాలకు అనుమతులు ఇవ్వడం వరకు వైకాపా ప్రభుత్వం సబబుగానే వ్యవహరించింది. నిజానికి ఆయన పోరాటాలు, యాత్రల వల్ల ప్రభుత్వానికి జరిగే నష్టమేమీ లేదు కూడా. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల యాత్రకు కూడా తెలుగుదేశం పార్టీ పోలీసు అనుమతి తీసుకుంది.

అనుమతి విషయంలో చాలా జాప్యం చేసిన పోలీసులు బుధవారం రాత్రి అనుమతి ఇచ్చారు. చంద్రబాబు వెంట 50 మందికి మించి నేతలు ఉండకూడదన్నారు. ఏదోరకంగా అనుమతులైతే వచ్చాయి. కానీ.. గురువారం చంద్రబాబు విమానం దిగేసమయానికి  పరిస్థితి మొత్తం మారిపోయింది. వైకాపా కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. పోలీసులు నగరంలోకి వెళ్లడానికి అనుమతించలేదు. ఆయన ఎయిర్ పోర్ట్ ఎదుట బైఠాయించి హంగామా చేశారు. పోలీసులు కూడా ససేమిరా అంటూ నగరంలోకి అనుమతించలేదు.

మరోవైపు వైకాపా  కార్యకర్తలు కోడిగుడ్లు చెప్పులు విసురుతూ ఒక తెదేపా ఎమ్మెల్యే కారు అద్దం పగలగొట్టి ఇంకోరకం హంగామా చేశారు. ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో ఇరుపార్టీల వారు మోహరిచండంతో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో రాతపూర్వకంగా ఇవ్వాలంటూ చంద్రబాబు పట్టుపట్టారు.

అయితే కమిషనర్ ముందురోజు అనుమతి ఇచ్చిన తర్వాత.. చంద్రబాబును అడ్డుకోవడం వివాదంగానే మారింది. చివరికి 151 సెక్షన్ కింద భద్రత నిమిత్తం ముందుజాగ్రత్తగా అరెస్టు చేస్తున్నట్లు నోటీసు ఇచ్చి.. ఆయనను అరెస్టు చేసి.. ఎయిర్ పోర్ట్ లాంజ్ కు తరలించారు. మొత్తానికి ఈ విశాఖ హైడ్రామా ఎపిసోడ్ లో చంద్రబాబు హీరో అయిపోయారు. చంద్రబాబును అనుమతించేసి ఉన్నప్పటికీ.. ఆయన చేయగలిగే నష్టం ఏదీ ఉండదనే సంగతిని వైకాపా నాయకులు ఎందుకు గుర్తించలేదో మరి.

చెప్పులతో చంద్రబాబుకి ఉత్తరాంధ్రుల ఘన స్వాగతం

Show comments