అమరావతికి అక్కడ జై కొట్టించండి బాబూ!

చంద్రబాబునాయుడు తన ప్రజాచైతన్య యాత్రను 13 జిల్లాల రాష్ట్రానికి మధ్యలో.. అంటే ప్రకాశం జిల్లాలో ప్రారంభించారు. అక్కడ కాస్త టచ్ చేసిన తర్వాత.. ఒక మూల అయిన కుప్పం ప్రాంతానికి తరలి వెళ్లారు. అది ఆయన సొంత నియోజకవర్గం. ఆ వెంటనే మరొక మూల- విశాఖకు వెళుతున్నారు. విశాఖ తర్వాత అదేరోజున విజయనగరం జిల్లాలో కూడా ఆయన పర్యటించి ప్రజలను చైతన్య పరుస్తారు.

అయితే ఇక్కడ ప్రజల్లో కలుగుతున్న సందేహం ఏంటంటే... అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల కాన్సెప్టుకు విశాఖ, విజయనగరం జిల్లాల్లో కూడా చంద్రబాబు ప్రజలతో జేజేలు కొట్టించగలరా? అనేది! ఈ ప్రతిపాదన వలన గరిష్టంగా లబ్ధిపొందుతున్నది ఆ ప్రాంతాలే. అక్కడ కూడా ప్రజలను చంద్రబాబు చైతన్య పరచి.. మా ప్రాంతానికి అసలు రాజధాని వద్దే వద్దు.. అది అమరావతిలో ఉంటేనే మాకు ముద్దు.. అని విశాఖ, విజయనగరం ప్రజలతో చెప్పించారంటే గనుక.. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సక్సెస్ అయినట్లే. కాకపోతే పెయిడ్ఆర్టిస్టులతో కాకుండా.. స్వచ్ఛందంగా, స్వచ్ఛంగా పలికే ప్రజాగళంలో ఆ డిమాండును వినిపించగలగాలి.

నిజానికి చంద్రబాబునాయుడు అమరావతి రాజధాని కాన్సెప్టును కొన్నాళ్ల కిందటే పక్కన పెట్టేశారు. అమరావతిలో మాత్రమే ఏకైక రాజధాని ఉండాలనే సంకుచిత డిమాండును వినిపిస్తున్న వారికి మద్దతుగా.. విరాళాలు సేకరిస్తూ జోలె పడుతూ.. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో సభలు నిర్వహించినప్పుడే ఆయనకు తన డిమాండు ఎంత బలహీనమైనదో అర్థమైపోయింది. ఆయన జోలెపట్టడానికి వచ్చిన ప్రజాస్పందన, వచ్చిన కలెక్షను ఆయనకు కనువిప్పు  కలిగించాయి.

కుప్పం తర్వాత విశాఖ, విజయనగరం వెళ్తున్న చంద్రబాబు.. తన డిమాండులో సహేతుకత ఉందని నిజంగా భావిస్తే గనుక.. ఈ ప్రాంతాలనుంచి వినిపించాలి. విశాఖలో రాజధాని వద్దే వద్దు అని అక్కడి ప్రజలందరితో చెప్పించగలగాలి. ఏదో ఒకచోట సభ పెట్టడమూ.. అక్కడకు డబ్బులిచ్చి తరలించిన ప్రజలఎదుట అమరావతిని ప్రస్తావించడమూ, వారితో చప్పట్లు, జేజేలు కొట్టించుకోవడమూ వంటి గిమ్మిక్కులకు ఇవాళ విలువలేదు.

చంద్రబాబు ప్రజల్లో చైతన్యం తెచ్చినట్లు నమ్మడానికి రుజువేంటంటే.. ఆయన తన పర్యటన ముగించుకుని వెళ్లిపోయిన తర్వాత.. కూడా విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో తమకు రాజధాని వద్దనే ప్రజా ఉద్యమాలు రావాలి. అలా చేయగలిగితే చంద్రబాబు సక్సెస్ అయినట్లే. లేకపోతే.. జగన్మోహన రెడ్డి తీసుకున్న అధికార వికేంద్రీకరణ నిర్ణయమై శెభాషైనదని భావించి.. ఆయన తన యాత్రలను చాలించుకోవాలి.

తనని కాపీ కొట్టాను అందుకే ఇంత పెద్ద హిట్ అయ్యింది