వైసీపీ రాజ్య‌స‌భ సీట్లు.. ఆ జిల్లాకి మూడోదా!

ఇప్ప‌టికే ఇద్ద‌రు నెల్లూరు పెద్ద‌మ‌నుషులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఉన్నారు. వారిలో మొద‌టి వ్య‌క్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున తొలి సారి రాజ్య‌స‌భ‌లోకి ఎంటరైంది.. వి.విజ‌యసాయిరెడ్డి. ఈయ‌న‌కు వైఎస్ కుటుంబంతో ఉన్న బంధం ఏమిటో వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. విజ‌య‌సాయి రెడ్డి విష‌యంలో మ‌రో ఆలోచ‌న లేకుండా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజ్య‌స‌భ‌కు పంపారు. అది మంచి నిర్ణ‌యం అని వివిధ సంద‌ర్భాల్లో రుజువు అయ్యింది కూడా.

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ద‌క్కిన రెండో రాజ్య‌స‌భ సీటు కూడా నెల్లూరు రెడ్డిగారికే ద‌క్క‌డం గ‌మ‌నార్హం. ఆయ‌నే వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి. ఈ బిగ్ షాట్ ను జ‌గ‌న్ రెండో ఎంపీగా రాజ్య‌స‌భ‌కు పంపారు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్ప‌టి వ‌ర‌కూ ద‌క్కిన రెండు రాజ్య‌స‌భ సీట్లూ నెల్లూరు వాళ్ల‌కే ద‌క్కాయి. ఇప్పుడు విశేషం ఏమిటంటే నెల్లూరు జిల్లాకే చెందిన మూడో పేరు వినిపిస్తూ ఉంది. ఈ సారి బీసీ కోటాలో బీద మ‌స్తాన్ రావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ల‌భిస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది.

ఆయ‌న ఇటీవ‌లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అది కూడా ఎన్నిక‌లు అయ్యాకా. కాబ‌ట్టి ఇంత‌లోనే రాజ్య‌స‌భ సీటు ద‌క్కుతుందా.. అనేది అనుమాన‌మే! ప్ర‌చారం మాత్రం జ‌రుగుతూ ఉంది. మ‌రి అదే జ‌రిగితే నెల్లూరు  జిల్లాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మూడో రాజ్య‌స‌భ సీటు ద‌క్కిన‌ట్టుగా అవుతుంది. కానీ... ఇప్పుడు లెక్క‌లు మారాయాని, మండ‌లి ర‌ద్దుతో ఇద్ద‌రు బీసీ నేత‌లు మంత్రి ప‌ద‌వులు కోల్పోతున్న నేప‌థ్యంలో.. వారిలో ఒక‌రిని రాజ్య‌స‌భ‌కు పంప‌నున్నార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో బీద‌కు అవ‌కాశాలు త‌గ్గాయ‌నే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

Show comments