చెప్పేందుకేనా ప‌వ‌న్ నీతులు

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాలా విచిత్ర‌మైన మ‌నిషి. ఒక ప‌ట్టాన ఆయ‌న ఎవ‌రికీ అర్థం కాడు. ప‌వ‌న్ మాట‌ల‌కు, చేత‌ల‌కు ఎక్క‌డా పొంత‌న ఉండ‌దు. అదే ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. నిన్న ఢిల్లీలో విజ్ఞాన్ భ‌వ‌న్‌లో ఇండియ‌న్ స్టూడెంట్స్ పార్ల‌మెంట్ స‌ద‌స్సులో విద్యార్థుల‌నుద్దేశించి ప‌వ‌న్ ప్ర‌సంగించారు. స‌హ‌జంగా తెలుగు అగ్ర‌హీరో కావ‌డంతో ప‌వ‌న్ అంటే విద్యార్థుల్లో ఓ ఇమేజ్ ఉంది. అందుకే ఆయ‌న ప్ర‌సంగాన్ని వినాల‌నే ఆస‌క్తి విద్యార్థుల్లో ఉండ‌టం స‌హ‌జం.

‘సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. దేశం కోసం నా జీవితాన్ని ధారపోస్తా. సమాజసేవలో నావంతు పాత్రను త్రికరణ శుద్ధితో నిర్వహిస్తా. యువతలోని ఆవేశాన్ని అర్థం చేసుకున్నా. అందుకే మీతో మాట్లాడేందుకు వచ్చా’ అని జనసేనాని పవన్‌ కల్యాణ్ త‌న ఉద్దేశాన్ని చెప్పారు.  అంతే కాదు అధికారం కోసం చేస్తున్న రాజకీయాలను చూసి విసుగు చెందానని, భగత్ సింగ్‌ స్ఫూర్తితో దేశానికి ఎంతో కొంత సేవ చేయాలన్న తపనతో రాజకీయ పార్టీని 2014లో స్థాపించానన్నారు.

‘నేడు యువ‌త పార్టీల‌కో, ప‌బ్‌ల‌కో వెళుతున్నారు.  యువ‌త తాత్కాలిక ప్ర‌ణాళిక‌ల‌తో ఉండ‌కూడదు. ప‌దేళ్లో, ఇర‌వై ఏళ్లో స‌మ యం కేటాయించాలి. అప్పుడే దేశానికో ఏదైనా చేయ‌వ‌చ్చు’ అని ప‌వ‌న్  అన్నారు.

ప‌వ‌న్ ఇత‌రుల‌కు చెప్ప‌డమేనా, తాను ఆచ‌రించేది లేదా? స‌మాజంలో మార్పు కోసం వ‌చ్చాన‌ని, అధికారం కోసం చేస్తున్న రాజకీయాలను చూసి విసుగు చెందానని గొప్ప‌గొప్ప అభ్యుద‌య మాట‌లు చెబుతున్న ప‌వ‌న్‌కు మాత్రం ఎందుకు ఓపిక లేక‌పోయింది? ప‌దేళ్లో, ఇర‌వై ఏళ్లో స‌మ‌యం కేటాయించాల‌ని యువ‌త‌కు హిత‌బోధ చేసిన ప‌వ‌న్‌....ఆ ప‌ని తానెందుకు చేయ‌లేక పోయాడు? ఎంత‌సేపూ ఇత‌రుల‌తో పొత్త పెట్టుకోవ‌డం, వారికి తానో లేదా త‌న‌కు ఆ పార్టీలో తోక‌లా ఉండ‌టం త‌ప్ప పోరాటం ఎందుకు చేయ‌లేక‌పోయారు?

భ‌గ‌త్‌సింగ్ స్ఫూర్తితో 2014లో పార్టీ పెట్టాన‌ని చెప్పుకుంటున్న ప‌వ‌న్‌, ఐదేళ్ల‌లో క‌నీసం తాను కూడా గెలిచే న‌మ్మ‌కాన్ని ప్ర‌జ‌ల్లో క‌లిగించ‌క‌పోవ‌డం ఏంటి? ఇదేనా భ‌గత్‌సింగ్ నుంచి తీసుకున్న స్ఫూర్తి? ఇదేనా చేగువేరా నుంచి నేర్చుకున్న పోరాట పాఠం?  మాట‌ల‌కు ప్ర‌జాభిమానం పొందే కాలం కాదు ఇది.

‘‘నేను అంతా పిడికెడు మట్టే కావచ్చు. కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది’’ అన్న ప్రముఖ కవి కవితా పంక్తులను పవన్ ఎంతో స్ఫూర్తిదాయ‌కంగా తీసుకుంటూ...ప‌దేప‌దే వ‌ల్లె వేస్తుంటాడు. మ‌రి ప‌వ‌న్ త‌ల ఎత్తేదెప్పుడు?  కేజ్రీవాల్‌లా త‌ల ఎత్తుకునే రాజ‌కీయాలు చేసెదెప్పుడు?  స‌మాజంలో మార్పు సంగ‌తేమో గానీ, ప‌వ‌న్ మాత్రం సంప్ర‌దాయ రాజ‌కీయ నేత‌గా మారిపోయాడ‌న్న‌ది వాస్త‌వం. ఇందుకు నిద‌ర్శ‌నం ఆయ‌న గ‌త ఐదేళ్ల‌లో టీడీపీ-బీజేపీ మిత్ర‌ప‌క్షానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం, ఆ త‌ర్వాత వామ‌ప‌క్షాల‌తో పొత్తు, తాజాగా బీజేపీతే పొత్తు పెట్టుకోవ‌డమే.

నా మీదనే దాడి చేయిస్తావా