వివాదం గురించి అడిగితే చిరంజీవి డైలాగ్ చెప్పాడు

దర్శకుడు వెంకీ కుడుములను హీరో నాగశౌర్య ఏకంగా నమ్మకద్రోహి అన్నాడు. అతడు తన ఫ్రెండే కాదన్నాడు. తనను మోసం చేసినా భరించేవాడినని, కానీ అమ్మను వెంకీ మోసం చేశాడని, అమ్మ ఇచ్చిన కారును కూడా వాడకుండా పడేశాడని చాలా పెద్దపెద్ద మాటలు మాట్లాడాడు. దీనిపై ఎట్టకేలకు వెంకీ కుడుముల రియాక్ట్ అయ్యాడు. శౌర్య చేసిన విమర్శల్ని చాలా లైట్ తీసుకున్నాడు.

"నాకు తెలిసింది ఒక్కటే. సినిమా చేసుకుంటూ వెళ్లిపోతాను. నా స్టయిల్ ఎవరికైనా నచ్చకపోతే నేనేం చేయలేను. ఫస్ట్ సినిమా తీశాను, బాగా వచ్చింది. ఇప్పుడు రెండో సినిమా తీశాను, బాగా ఆడాలి. నెక్ట్స్ మూడో సినిమాకు షిఫ్ట్ అయిపోతాను. అంతకుమించి ఇంకేం ఆలోచించను."

ఛలో టైమ్ లో నాగశౌర్య అమ్మ వెంకీకి ఓ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ కారును ప్రస్తుతం వెంకీ వాడడం లేదని, ఆ కారు ఏం చేశాడో కూడా తెలియదనేది నాగశౌర్య ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణను కూడా లైట్ తీసుకున్నాడు వెంకీ కుడుముల చిరంజీవి డైలాగ్ ఒకటి తనకు చాలా ఇష్టమంటూ ఈ వివాదానికి ఆ డైలాగ్ ను అన్వయించాడు.

"నేను చిరంజీవి డైహార్డ్ ఫ్యాన్. ఆయన ఓ డైలాగ్ చెప్పారు. మంచి మైక్ లో చెప్పమన్నారు, చెడు చెవిలో చెప్పమన్నారు. నేను అదే చేస్తాను. మనస్పర్థలు ఎవరికైనా ఉంటాయి. మన పర్సనల్ ఫీలింగ్స్, ఇంట్లో వ్యవహారాలపై బయట జనాలకు అంత ఇంట్రెస్ట్ ఉండదని వందశాతం నమ్ముతాను. అలాంటప్పుడు ఆ ఆరోపణలతో మనకెందుకు."

ఇలా నాగశౌర్య చేసిన ఆరోపణల్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు వెంకీ కుడుముల. భీష్మ రిలీజ్ సందర్భంగా శ్రీమణితో కలిసి గ్రేట్ ఆంధ్రకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఛలో తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు, మూడో సినిమాకు అంత గ్యాప్ ఇవ్వనంటున్నాడు.