అది సాధిస్తే.. జగన్‌ని ‘దేవుడు’ అనాల్సిందే.!

వైద్యో నారాయణో హరి.. అంటారు పెద్దలు. అది నిజం కూడా. ప్రాణం పోసేవాడు దేవుడు.. ప్రాణాల్ని నిలబెట్టేవాడు వైద్యుడు.! దురదృష్టవశాత్తూ వైద్యం ఈ రోజుల్లో అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. పేదోడికి అనారోగ్యమొస్తే అంతే సంగతులు. ఈ పరిస్థితి నుంచి సామాన్యుడికి ఊరటనిచ్చేందుకోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆరోగ్య శ్రీ’ పథకాన్ని తెరపైకి తెచ్చారు.

ఉమ్మడి రాష్ట్రంలో అదొక సంచలనం. ఆ పథకాన్ని ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి.అయితే, అరోగ్యశ్రీపై ఓ అపవాదు వుంది. అదే, ఆరోగ్యశ్రీ కారణంగా ప్రైవేటు ఆసుపత్రులు బాగుపడుతున్నాయి.. అదే సమయంలో ప్రభుత్వాసుపత్రులు నిర్వీర్యమైపోతున్నాయన్న అపవాదు. ఇది ఉత్త అపవాదు మాత్రమే కాదు, ఇందులో నిజం లేకపోలేదు. 

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఆరోగ్యశ్రీలో కీలక మార్పులు తీసుకొచ్చారు. మరిన్ని రోగాలకు ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించారు.. అంతే కాదు, వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చుని దృష్టిలో పెట్టుకుని.. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచిన విషయం విదితమే. పొరుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో కూడా వైద్య చికిత్స పొందేందుకు వీలు కల్పించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

ఇంతకీ, ప్రభుత్వ ఆసుపత్రుల మాటేమిటి.? ఆ విషయమై వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం మూడేళ్ళలో ప్రస్తుత ప్రభుత్వాసుపత్రుల దశ మార్చేస్తామని ప్రకటించారు. కర్నూలు జిల్లా పర్యటనలో వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. మూడేళ్ళలో ప్రభుత్వాసుపత్రుల దశ మారిపోతుందా.? అది సాధ్యమేనా.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

అయితే, ఇదేమీ అసాధ్యమైన వ్యవహారం కాదు. కావాల్సింది కేవలం చిత్తశుద్ధి మాత్రమే. ఆ చిత్తశుద్ధి తమ ప్రభుత్వానికి వుందంటోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఒకవేళ వైఎస్‌ జగన్‌ చెప్పిన మాటకు కట్టుబడి మూడేళ్ళు.. లేదా నాలుగేళ్ళలో అయినా ప్రభుత్వాసుపత్రుల దశ మారి, కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ఎదిగితే.. అప్పుడిక ఆరోగ్యశ్రీ అవసరమే వుండదు. అదే జరిగితే, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని నిజంగానే ‘దేవుడు’ అనేయొచ్చు.

వీళ్ళ మెదడులు కుళ్లిపోయాయ్