ప్ర‌శ్నించే హ‌క్కు మీరెందుకు కోల్పోయారు ప‌వ‌న్?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆదివారం మంగ‌ళ‌గిరిలో త‌న పార్టీ కార్యాల‌యంలో ప్ర‌జ‌లు ఓటుకు డ‌బ్బు తీసుకుని ప్ర‌శ్నించే హ‌క్కు కోల్పోయార‌ని కీల‌క కామెంట్స్ చేశారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు కామ‌న్ మ్యాన్ కొన్ని ప్ర‌శ్న‌లు సంధిస్తూ బ‌హిరంగ లేఖ రాశాడు. ఆ లేఖే ఇది.

ప‌వ‌న్‌కల్యాణ్ గారికి న‌మ‌స్కారం.
అన్నా, మంగ‌ళ‌గిరిలో నిన్న మీరు మాట్లాడిన మాట‌లు ప్ర‌జ‌ల్ని హ‌ర్ట్ చేసేలా ఉన్నాయి. చేసేలా ఏమిటి....చేశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌ద‌న్న‌. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీ‌నివాస్ ఇంట్లో ఐటీ సోదాల్లో రూ.2వేల కోట్ల అక్ర‌మ లావాదేవీల గురించి మీరు స్పందించాల‌ని  వైసీపీ నేత‌లు రెండ్రోజులుగా డిమాండ్ చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయినా నాకు తెలియ‌క అడుగుతున్నా...ఎవ‌రో డిమాండ్ చేయ‌డం ఏంట‌న్నా...ప్ర‌శ్నించ‌డానికి పార్టీ పెట్టిన ఆంధ్రా చెగువేరా అయిన మీరు ఒక‌రితో డిమాండ్ చేయించుకోవ‌డం ఏంటి?

స‌రే ప్ర‌త్య‌ర్థి పార్టీ వైసీపీ డిమాండ్‌పై మీరు ఎట్ట‌కేల‌కు నోరు తెర‌వ‌డం మంచిదే. మ‌రి మీరేం మాట్లాడారు...గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వ అవినీతిని ఇదే మంగ‌ళ‌గిరి నుంచి నిల‌దీశాన‌ని, ప్ర‌శ్నించాన‌ని చెప్పుకొచ్చారు. అప్ప‌ట్లో దొంగ‌ల‌ప‌డ్డ ఆరు నెల‌ల‌కు కుక్క అరిచిన‌ట్టు....బాబు మూడున్న‌రేళ్ల పాల‌న త‌ర్వాత మీరు ప్ర‌శ్నించ‌డం సంతోష‌క‌ర‌మే. అవినీతికి మీరు వ్య‌తిరేక‌మ‌ని చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంచ‌కపోవ‌డం వ‌ల్ల న‌ష్ట‌పోతామ‌ని కూడా తెలుస‌న్నారు. సీఎం జ‌గ‌న్‌కు ఉన్న‌ట్టు మీకు మైన్స్‌, వ్యాపారాలు లేవ‌ని చెప్పుకొచ్చారు.

ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంచ‌కూడ‌ద‌నే ఫిలాస‌ఫీ మీద‌ని చెప్పారు. కానీ ప్ర‌జ‌లంతా ఓటుకు రూ.2వేలు నోటు తీసుకున్న‌ప్పుడు రాజ‌కీయ నేత‌ల అవినీతిపై ప్ర‌శ్నించే హ‌క్కును కోల్పోతార‌న్నారు. అంతేకాదు చంద్ర‌బాబు మాజీ పీఎస్ ఇంటిలో ఐటీ సోదాల గురించి ప్ర‌జ‌లేం ప్ర‌శ్నిస్తార‌ని, వారు ఆ హ‌క్కును కోల్పోయార‌ని మాట్లాడారు. చంద్ర‌బాబును ప్ర‌శ్నించే నైతిక‌, సామాజిక హ‌క్కును ప్ర‌జ‌లు కోల్పోయార‌ని మాట్లాడ‌టం ఏంట‌న్నా?

ఓటుకు రూ2వేల నోటు తీసుకున్న మాలాంటి వాళ్ల‌కు చంద్ర‌బాబును ప్ర‌శ్నించే నైతిక, సామాజిక హ‌క్కుకోల్పోయాం అనుకుందాం. కానీ ప్ర‌శ్నించడానికే పార్టీ పెట్టిన మీరెందుకు చంద్ర‌బాబు అవినీతిపై ప్ర‌శ్నించే హ‌క్కు కోల్పోయారో చెప్పండి. మీ ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తున్న‌ట్టు మీరు చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ప్యాకేజీ తీసుకోవ‌డం వ‌ల్లే నోటికి తాళం వేసుకోవాల్సి వ‌చ్చిందా?

బాబును ప్ర‌శ్నించే వాళ్ల నైతిక‌త‌ను ప్ర‌శ్నించే బాధ్య‌త‌ను భుజాన వేసుకుని...మాజీ ముఖ్య‌మంత్రికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డి ప్యాకేజీ రుణం తీర్చుకుంటున్నారా? ఓటుకు రూ.2వేలు తీసుకునే స్థాయికి దిగ‌జార్చిన రాజ‌కీయ నేత‌ల‌ను నిందించాల్సింది పోయి...సామాన్యులను ప్ర‌శ్నిస్తారా? చ‌ంద్ర‌బాబు ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి మీ ప్ర‌శ్న సామాన్యుల‌పైకి సంధిస్తారా? ఓటుకు రూ.2 వేలు చొప్పున తీసుకుంటున్న ఓట‌రెక్క‌డ‌...రూ.2వేల కోట్ల దోపిడీ ఎక్క‌డ‌?

ఓటుకు నోటు తీసుకునే ప‌రిస్థితులను ప్ర‌శ్నించ‌కుండా....నైతిక‌త‌, సామాజికం అంటూ పెద్ద‌పెద్ద మాట‌లు మాట్లాడ‌డం న్యాయ‌మేనా ప‌వ‌న‌న్నా? ఓటుకు నోటు తీసుకోవ‌ద్ద‌నే సామాజిక చైత‌న్యాన్ని పెంపొందించాల్సిన బాధ్య‌త మీపై లేదా?  మీ బాధ్య‌త‌ని విస్మ‌రించి...బాబు అవినీతిపై ప్ర‌శ్నించ‌మ‌ని అడిగినందుకు, ప్ర‌జ‌ల్ని నిందించ‌డం భావ్య‌మా? మ‌రోసారి పున‌రాలోచించి...ప్ర‌జ‌లపై మీరు చేసిన అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్‌ని వెన‌క్కి తీసుకుంటే మీకు గౌర‌వం మిగులుతుంద‌ని తెలియ‌జేస్తూ...

ఇట్లు
కామ‌న్ మ్యాన్‌

Show comments