ఎమ్బీయస్‌: సిఏఏతో గాంధీగారి కోరిక నెరవేరిందా?

బజెట్‌ సమావేశం ప్రారంభిస్తూ రాష్ట్రపతి కోవింద్‌ ‘సిఏఏ బిల్లు ద్వారా గాంధీగారి కోరిక తీరింది’ అన్నారు. అది నిజమని ఎవరైనా అనగలరా?

విభజనానంతర కల్లోలాల తర్వాత శరణార్థులుగా వచ్చినవారికి ఆశ్రయం యిస్తే గాంధీగారు సంతోషించేవారు కానీ 70 ఏళ్ల తర్వాత అక్రమంగా చొరబడినవారికి ఆశ్రయమే కాదు, పౌరసత్వమే యిస్తానంటే హర్షించేవారా? పైగా వాళ్లను మతాలవారీగా విడగొట్టి ముస్లింలకు యివ్వనంటే గాంధీగారు ఎగిరి గంతేసేవారా? వెంటనే నిరాహారదీక్షకు కూర్చుని తన ప్రతిఘటన తెలిపేవారు కారా? తను చేసిన పనిని సమర్థించుకోవడానికి బిజెపి గాంధీగారి పేరు వాడేసుకుంటోందని స్పష్టంగా తెలుస్తోంది. సిఏఏలో ఉన్న అసంబద్ధత ఏమిటో దీనిలో చర్చిద్దాం.

సిఏఏ అన్నది బ్రహ్మపదార్థం అయిపోయింది కాబట్టి కాస్త విపులంగా, అనేక వ్యాసాల్లో చెప్పవలసి వస్తోంది.

‘ప్రజలు అనవసరంగా భయపడుతున్నారు, ప్రతిపక్షాలు ఆ భయాలను సొమ్ము చేసుకుంటున్నాయి, సిఏఏ నిరపాయకరమైనదని మా పార్టీ కార్యకర్తలు పౌరులకు నచ్చచెప్పడంలో విఫలమవుతున్నారు’ అని బిజెపి వారే వాపోతున్నారు.

కేరళకు చెందిన బిజెపి నాయకుడు ఒకరు టీవీ చర్చల్లో సిఏఏ గురించి చెపుతూ ‘అక్షరాస్యత అత్యధికంగా వున్న మా రాష్ట్రంలో కూడా సిఏఏ గురించి అయోమయం నెలకొని వుంది. అదేదో సంక్షేమ పథకం కాబోలు అనుకున్న కొందరు నన్ను కలిసి ‘మా కుటుంబానికి రెండైనా సిఏఏలు యిప్పించేట్లు చూడు బాబూ’ అని అడుగుతున్నారు అని చెప్పాడు.

2019 నాటి సిఏఏ ఏం చెపుతోంది? అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ల నుండి 2014 డిసెంబరు 31 లోపున భారత్‌లోకి ప్రవేశించిన హిందువులు, శిఖ్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు యీ దేశంలో ఐదేళ్ల పాటు నివసిస్తే వాళ్లు నేచురలైజేషన్‌ ద్వారా పౌరసత్వానికి అప్లయి చేసుకోవచ్చు. ఒక సెంట్రల్‌ ఏజన్సీ వారిని భౌతికంగా పరీక్షిస్తుంది. (ఫిజికల్‌ వెరిఫికేషన్‌ అని రాశారు) ఆరోగ్య కారణాల వలన సున్తీ చేయించుకున్నా ముస్లిములని సందేహిస్తారు కాబోలు. హోం ఎఫయిర్స్‌ మంత్రిత్వశాఖ డాక్యుమెంట్లను పరీక్షిస్తుంది. ఏ దేశంలో పుట్టారో, ఏ మతానికి చెందుతారో తెలిపే డాక్యుమెంట్లు యివ్వాలి అని రాశారు. తాము చెప్పేదానికి రుజువుగా ఏ రకమైన డాక్యుమెంట్లను యివ్వాలో స్పష్టంగా చెప్పలేదు.

మొదటగా వచ్చే సందేహం. 2014 డిసెంబరు 31 తేదీకి ఉన్న శాంక్టిటీ ఏమిటి? అప్పటివరకే ఆ దేశాలు మైనారిటీలను హింసించి ఆ తర్వాత మానేశాయా? లేక మానేస్తామని రాసి యిచ్చాయా? సరిగ్గా ఆ తారీకుకి రెండు, మూడు నెలల ముందు ఏదైనా పెద్ద మతకలహం ఆ మూడు దేశాల్లో జరిగిందా? ఒకవేళ ఎప్పుడో జరిగితే యిన్నాళ్లూ వాళ్లు అక్కడ ఎలా వుండగలిగారు? ఇక ఐదేళ్ల నివాసం అని ఎందుకు పెట్టారు? గతంలో అయితే నేచురలైజేషన్‌ కోసం 11 ఏళ్ల నివాసం తర్వాత అప్లయి చేస్తే ఒక ఏడాది తర్వాత యిస్తారు అనే నిబంధన ఉండేది. ఇప్పుడు దాన్ని 5కి తగ్గించవలసిన అవసరం ఏమొచ్చింది? 2014 డిసెంబరు 31 నుంచి ఐదేళ్లంటే 2020 జనవరి 1 నుంచి వాళ్లు పౌరసత్వం గురించి అప్లయి చేసుకోవచ్చు. దాన్ని పరీక్షించి, ఆమోదించే ప్రక్రియ ఏడాదో, ఏడాదిన్నరో పట్టిందనుకున్నా 2024 జనరల్‌ ఎన్నికల సమయానికల్లా వాళ్లు ఓటర్లుగా తయారవుతారు. తమకు పౌరసత్వం యిప్పించిన పార్టీకి విధేయత ప్రకటిస్తారు. ఇది కారణం కాదనుకుంటే యీ తేదీ లాజిక్‌ ఏమిటో ప్రభుత్వం వివరించాలి.

ఇక డాక్యుమెంట్ల గురించి- హింసకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దొంగతనంగా దేశం వదిలి పారిపోయి వచ్చేవాళ్లు దస్తావేజులు, కాగితాలు జాగ్రత్తగా తెచ్చుకుని ఉంటారా? అసలు వాళ్లు వచ్చేసి ఎన్నాళ్లయిందో? అప్పట్లో ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డు వంటి వ్యవస్థలు అక్కడ ఉన్నాయో లేదో! డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్‌, పాస్‌పోర్టు, టెలిఫోన్‌ బిల్లు వంటివి వుండాలంటే సమాజంలో ఒక స్థాయిలో ఉండాలి. వీళ్లకా స్థాయి వుందో లేదో! పోనీ ఏదో ఒకటి ఉన్నా అది పనికి వస్తుందో రాదో! హోటల్లో చెకిన్‌ అవ్వాలన్నా యిప్పుడు గుర్తింపు కార్డు ఉందా? అని అడుగుతున్నారు. ఓటరు కార్డు వుందంటే చాలదంటున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం ‘నాకు యీ కార్డు కాదు, మరోటి కావాలంటే వాళ్లు మళ్లీ వెనక్కి వెళ్లి పట్టుకుని వస్తారా?’ ఆ గుర్తింపు కార్డులో మతం ఉండాలని ఏముంది? పేరు బట్టి గెస్‌ చేస్తారా? అలా అయితే ఇక్బాల్‌ అనే పేరు హిందువుల్లో, శిఖ్కుల్లో, ముస్లిముల్లో ఉంటుంది. పక్కన ఖానో, సింగో ఉంటే తెలుస్తుంది. ..లేకపోతే?

ఇన్ని అడుగుతారు కానీ ఎందుకు పారిపోయి వచ్చావ్‌? నీకే కష్టం వచ్చింది? నిన్నెవరు హింసించారు? ఎందుకు హింసించారు? అని అడగరట. దానికి రుజువు చూపనక్కరలేదు. ముస్లిము కాకపోతే చాలు, వాళ్లు హింసకు గురైనట్లే అని వీళ్ల లెక్క. రా రండి, మా దేశానికి వచ్చి మాతో బాటు సకలసౌఖ్యాలు అనుభవించండి అని పిలిచే సిఏఏ బిల్లులో అన్ని మతాల వారిని చేర్చినపుడు ముస్లిములను కూడా చేరిస్తే ఏం పోయింది? అని బెంగాల్‌ బిజెపి ఉపాధ్యక్షుడు, సుభాష్‌ చంద్ర బోస్‌ కుటుంబీకుడు చంద్ర కుమార్‌ బోస్‌ అడిగారు. ‘‘ఆ దేశాల్లో ముస్లిములెవరూ వివక్షతకు గురి కావటం లేదని మీరంటున్నారు. అలాటప్పుడు వాళ్లు ఎలాగూ రారు. ఇంకేమిటి బాధ?’’ అని సబబైన ప్రశ్న అడిగారు. ‘‘ముస్లిములను కూడా చేర్చేస్తే బంగ్లాదేశ్‌లో సగం జనాభా మన దేశానికి వచ్చేస్తారు. మనం వాళ్లను భరించగలమా?’’ అని కిషన్‌ రెడ్డి అడుగుతున్నారు.

ఈ మూడు దేశాల మైనారిటీందరూ వచ్చిపడితే మాత్రం మనం భరించగలమా? ఆ దేశాల్లో మైనారిటీల సంఖ్య ఎంత ఉంటుందో తెలుసా? పాకిస్తాన్‌ జనాభా (2019 అంచనా) 2075 లక్షలు. దానిలో 3.72%, అంటే 77 లక్షలు. బంగ్లాదేశ్‌ జనాభా (2020 అంచనా) 1640 లక్షలు. దానిలో 10% అంటే 164 లక్షలు. అఫ్గనిస్తాన్‌ జనాభా (2017) 355 లక్షలు. దానిలో 1.4% అంటే 5 లక్షలు. మొత్తం 246 లక్షలు. అనగా 2.46 కోట్ల మంది. అబ్బే, వీళ్లందరూ కాదు, ఐదేళ్ల కితం దాకా వచ్చినవాళ్లు మాత్రమే అనవచ్చు మీరు. ఈ రూలు యింతటితో ఆగుతుందని నమ్మకం ఏమిటి? ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ కాలపరిమితి పెంచుతూ పోలేదా? ఇది కనక ఓట్లు రాల్చిందంటే బిజెపి వాళ్లే కాదు, తర్వాత వచ్చినవాళ్లూ పొడిగిస్తూ పోతారు. వీళ్ల రాజకీయలబ్ధి కోసం మన పౌరులందరం యింత భారం భరించాలా?

బిజెపి వాళ్లు చెపుతున్న అసత్యమేమిటంటే నెహ్రూ హయాంలో చేసిన 1950 నాటి చట్టం లాటిదే నేటి సిఏఏ చట్టం అని. తూర్పు పాకిస్తాన్‌ (ఇప్పటి బంగ్లాదేశ్‌) నుంచి అసాం లోకి చొరబడిన అక్రమ చొరబాటుదారులను బహిష్కరిస్తూ 1950లో చట్టం చేయడం జరిగింది. అయితే దానిలో మతప్రాతిపదికన విడగొట్టడం జరగలేదు. ఏదైనా హింసాత్మక ఘటన జరిగి భయంతో పారిపోయి వచ్చిన శరణార్థులను అనుమతించాలి, చొరబాటుదారులను పంపేయాలి అనే రాశారు. అంతకుముందు 1950 జనవరి 7న చేసిన ఆర్డినెన్సు స్థానంలో యీ చట్టం తెచ్చారు. ఈ చట్టం ఎవరికి వర్తించదో స్పష్టంగా రాశారు. ‘‘సివిల్‌ డిస్టర్బెన్స్‌ కారణంగా తమ ప్రాంతాలనుంచి వెళ్లగొట్టబడిన వాళ్లకు మాత్రమే’’ అని చెప్పారు. ఈ సిఏఏ చట్టంలో అలాటి క్లాజ్‌ ఏమీ లేదు. వాళ్లున్న ప్రాంతంలో అల్లరి జరిగిందా లేదా, దాని వలన వీళ్లు నివాసం కోల్పోయారా లేదా అని అడగనే అడగరు. ఆ దేశాల్లో మైనారిటీ అయితే చాలు, వాటేసుకుని పౌరసత్వం యిచ్చేస్తాం అంటున్నారు.

సిఏఏను చట్టంగా యిప్పుడు తెచ్చినా బిజెపి ప్రభుత్వం తను అధికారంలోకి రాగానే ముస్లిముల పట్ల వివక్షత ఎప్పుడో మొదలుపెట్టేసింది. ఎవరి దృష్టికీ రాకుండా జీవోల ద్వారా వారిని వేరుగా చూస్తోంది. 2019 నవంబరులో బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ సయీఫ్‌ హసన్‌ కలకత్తాలో ఓ టెస్ట్‌ సీరీస్‌ అడి, వెనక్కి వెళ్లిపోదామనుకున్నాడు. చూసుకుంటే వీసా గడువు ముగిసి రెండు రోజులైంది. ఎగ్జిట్‌ క్లియరెన్సు కావాంటే పెనాల్టీ కట్టాలి అన్నారు. ఎంత అని అడిగితే ‘నువ్వు హిందూ వగైరా వైతే రూ.100తో పోయేది, ముస్లిమువి కాబట్టి రూ.21,600 కట్టాలి. భారత ప్రభుత్వం 2019 జనవరిలో తెచ్చిన మార్పు యిది.’ అని అధికారులు చెప్పారు. ముస్లిము కాకపోతే చాలు, గడువు దాటి యీ దేశంలో వుండిపోయినా వంద రూపాయల జరిమానాతో సరిపెట్టేస్తున్నారు. ముస్లిముల కైతే నడ్డి విరుస్తున్నారు.

లాంగ్‌ టెర్మ్‌ వీసాలో భారత్‌లో నివాసముంటున్న పాకిస్తాన్‌ ముస్లిమేతరులు స్థిరాస్తులు కొనడానికి, బ్యాంకు ఖాతాలు తెరవడానికి, పాన్‌, ఆధార్‌లు పొందడానికి 2016 ఏప్రిల్‌లోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. పౌరులుగా రిజిస్టర్‌ చేసుకునేందుకు ఫీజును రూ. 15 వేల నుంచి రూ. 100 కి తగ్గించారు. దీన్ని 2018 మార్చిలో అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ వర్గాలకు కూడా విస్తరించారు. 2018 నవంబరులో ఈ వర్గాలకు ఎన్‌ఆర్‌ఓ ఖాతా తెరవడానికి కూడా అనుమతించారు. మొదట ఆర్నెల్లకు తెరిచి, తర్వాత ప్రతీ ఆర్నెల్లకు రెన్యూ చేస్తూ పోవచ్చు. 

అసలు యిప్పటిదాకా చట్టాల ద్వారా మనకు పౌరసత్వం ఎలా లభిస్తోంది? 1987 జులై 1 వరకు తలిదండ్రులు ఏ జాతీయులైనా సరే యిక్కడ పుడితే చాలు. 2) 1987 జులై 1 నుంచి 2004 డిసెంబరు 2 మధ్య పుట్టినవాళ్లలో తలిదండ్రుల్లో ఎవరో ఒకరు మనం పుట్టేసమయానికి భారతపౌరులై ఉండాలి. (తక్కినవారు అక్రమ చొరబాటుదారు ఐనా ఫర్వాలేదు) 3) 2004 డిసెంబరు 3 తర్వాత పుట్టినవారిలో తలిదండ్రుల్లో ఎవరో ఒకరు మనం పుట్టే సమయానికి భారతపౌరులై వుండి, తక్కినవారు అక్రమ చొరబాటుదారులు కాకూడదు. ఇలా పౌరసత్వాన్ని కుదించుకుంటూ అక్రమ చొరబాటుదారుల పిల్లలకు స్థానం కల్పించకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా మతం పేరిట, అక్రమ చొరబాటుదారులకు, వారి సంతానానికి కూడా పౌరసత్వం కట్టబెడుతున్నారు. ఇది ఘోరం!

విదేశంలో పుట్టినవారికి వారసత్వం ద్వారా భారత పౌరసత్వం ఎలా వస్తుందంటే - 1950 జనవరి 26 తర్వాత పుట్టినవారికి తండ్రి భారతపౌరుడైతే అతనికి యిస్తారు. 2) 1992 డిసెంబరు 10 - 2004 డిసెంబరు 3 మధ్య పుట్టినవాళ్లలో తలిదండ్రుల్లో ఎవరో ఒకరు మనం పుట్టేసమయానికి భారతపౌరులై ఉండాలి. (తక్కినవారు అక్రమ చొరబాటుదారు ఐనా ఫర్వాలేదు) 3) 2004 డిసెంబరు 3 తర్వాత పుట్టినవారి విషయంలో అతనికి వేరే ఏ దేశపు పాస్‌పోర్టు లేదనీ తలితండ్రులు ధృవీకరించాలి. అంతేకాదు, పుట్టిన ఏడాదిలో ఆ దేశపు ఇండియన్‌ ఎంబసీలో జననం రిజిస్టర్‌ కాబడి వుండాలి.

ఇక రిజిస్ట్రేషన్‌ ద్వారా పౌరసత్వం పొందడానికి ఉండే షరతు - భారతసంతతి (ఇండియన్‌ ఆరిజన్‌)కి చెంది ఇండియాలో ఏడేళ్లు ఉండాలి. 2) భారతసంతతికి చెంది అవిభక్త భారతదేశానికి వెలుపల ఉన్న దేశాల్లో నివాసముంటూ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 3) వేరే దేశానికి చెందినా భారత పౌరులను పెళ్లాడి, యీ దేశంలో 7 ఏళ్ల పాటు నివాసం ఉంటే అప్లయి చేసుకోవచ్చు. 4) భారతపౌరుల మైనరు పిల్లలు కూడా అప్లయి చేసుకోవచ్చు. నేచురలైజేషన్‌ ద్వారా పౌరసత్వం ఎలా లభిస్తుందంటే 12 ఏళ్ల పాటు వాళ్లు యీ దేశంలో నివాసముండాలి. అంటే 11 ఏళ్ల నివాసం తర్వాత అప్లయి చేసుకుంటే అన్నీ పరీక్షించి యివ్వడానికి ఏడాది పడుతుంది. అప్పటికి 12 ఏళ్లు అవుతుంది.

గత ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భాల్లో విదేశీయులకు పౌరసత్వం యిచ్చివున్నాయి. 1964-2008 మధ్య శ్రీలంక నుంచి వచ్చిన 4,61,000 మంది తమిళులకు పౌరసత్వం యిచ్చారు. ఇప్పుడీ బిల్లులో శ్రీలంకను ఎందుకు చేర్చలేదని తమిళనాడు పార్టీలు అడుగుతున్నాయి. వారు మతపరమైన వివక్షతను ఎదుర్కోవటం లేదు, అది జాతిపరమైన వివక్షత మాత్రమే అని బిజెపి వాదిస్తోంది. సింహళ జాతీయవాదం, బౌద్ధం రెండూ పెనవేసుకుని వున్నాయని ఎవర్నడిగినా చెప్తారు. ఏది ఏమైనా ఆ తమిళనాడులో బిజెపికి బలం లేదు, యిప్పట్లో రాదు. అందువలన వాళ్లకు యివ్వాల్సిన అవసరం బిజెపికి తోచటం లేదు. అలాగ మయన్మార్‌లో హిందువులను ఎందువలన ఎందుకు పట్టించుకోలేదని అడిగితే దానికీ సమాధానం లేదు. ఇప్పటికీ అక్కడ హిందువులు, శిఖ్కులు ఉన్నారు. అక్కడి బౌద్ధులు ఇవాళ ముస్లిములను బాధించినట్లే రేపు వీళ్లను బాధించరన్న గ్యారంటీ ఏది?

ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పటం లేదు. పౌరులు కారని తేలినవారిని ఏం చేస్తారన్న అతి ప్రధానమైన ప్రశ్నకు సమాధానం చెప్పే నాధుడు లేడు. దాని గురించి మరోసారి. (సశేషం)

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2020)
mbsprasad@gmail.com

Show comments