వారంతా పవన్ చెవిలో చెప్పారేమో!

పవన్ కల్యాణ్ శనివారం నాడు అమరావతి ప్రాంత పల్లెల్లో పర్యటించారు. అక్కడ దీక్షలు చేస్తున్న వారికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని వెల్లడించారు. వారి తరఫున పోరాడుతానని కూడా చెప్పారు. అయితే ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార వికేంద్రీకరణ అనేది ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు కూడా ఇష్టం లేదని పవన్ సెలవిచ్చారు. తాను ఆ ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. అమరావతి రైతుల కన్నీళ్లపై రాజధాని వస్తే తమకేం ఆనందం ఉంటుందని వారంతా తనతో అన్నట్లుగా పవన్ కల్యాణ్ వెల్లడించారు..!

అవునా.. నిజమేనా? ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలంతా పవన్ కల్యాణ్ తో తమ ప్రాంతానికి రాజధాని వద్దని మొరపెట్టుకున్నారా? ఏదైనా అబద్ధం చెబితే కూడా.. కాస్తయినా నమ్మేట్టుగా ఉండాలి. అంతేతప్ప.. కామెడీగా అనిపించకూడదు. అధికార వికేంద్రీకరణ- అమరావతికి సంబంధించిన ఈ గొడవలు మొదలైన తర్వాత పవన్ కల్యాణ్ ఎక్కడెక్కడ పర్యటించాడు గనుక! ఆయన ఉత్తరాంధ్రలో ఎప్పుడు పర్యటించారు? కొన్ని రోజుల కిందట కర్నూలులో మాత్రం పర్యటించారు.

అయితే ఈ పర్యటనల్లో ప్రజలంతా ఆయనతో తమ ప్రాంతానికి రాజధాని వద్దని ఎక్కడ మొరపెట్టుకున్నారు. ఆ రకంగా ప్రజలు చెప్పినట్లు.. మీడియాలో ఎక్కడా రాలేదే! మరి ఆ రెండు ప్రాంతాల ప్రజలు వచ్చి.. ‘తమకు రాజధాని వద్దని.. అమరావతిలోనే ఉండాలని’ పవన్ కల్యాణ్ చెవిలో చెప్పారా ఏంటి? అని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.

కామెడీ ఏంటంటే.. అమరావతిలో ఉండాలని విపక్షాల వారు యాగీ చేయడం ఒక ఎత్తు. అయితే.. నలభయ్యేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబునాయుడుకు కూడా.. పవన్ చెప్పినంత ఈజీగా.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజలంతా అమరావతి కన్నీళ్లపై వచ్చే రాజధాని తమకు వద్దని అంటున్నారనే కామెడీ కామెంట్ చేయవచ్చుననే ఆలోచన రాలేదు. కనీసం అలాంటి మాటలు మాట్లాడితే నవ్వుల పాలైపోతామనే క్లారిటీ చంద్రబాబుకు ఉన్నట్లుంది. పవన్ కల్యాణ్ కు అలాంటి క్లారిటీ రావడానికి ఇంకా కొంతకాలం పడుతుంది.

Show comments