ఎమ్బీయస్‌: వెంటాడి, వేధించే వార్త

కాలేజీ రోజుల్లో మనల్ని ఊరించే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. పైలట్‌, ఆర్మీ మేజర్‌, మెరీన్‌ ఇంజనియర్‌.. యిలాటివి. వీటిల్లో యిన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు పోస్టు కూడా ఉంటుంది. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టి, అందరి దృష్టిని యిటు మరల్చాలనే కోరిక ఉంటుంది. కానీ జర్నలిస్టు జీవితం అంత సుఖమయమేమీ కాదు. రాజకీయ నాయకుల అవినీతిని బయటపెట్టిన జర్నలిస్టును నడిరోడ్డుపై చంపడం మన తెలుగు సినిమాల్లో చాలాసార్లు చూపించారు. అలాటి కథ కాదు నేను మాట్లాడేది. ఒక వ్యక్తి సమస్యను హైలైట్‌ చేసి, తనకు మేలు చేద్దామని ప్రయత్నించి అవస్థ పడిన జర్నలిస్టు అనుభవం. కె రామచంద్రమూర్తి, కట్టా శేఖర్‌రెడ్డి గార్ల సంపాదకత్వంలో ‘‘వార్త వెనుక కథ’’ పేరుతో ఒక పుస్తకం 2007లో వచ్చింది. దానిలో ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు రాసిన స్వీయానుభవం ‘వెంటాడే వార్త’ గురించి చెపుతున్నాను.

దానికి ముందు యింకో విషయం చెప్తాను. సంతలో వస్తువు కొనుకున్నట్లు రాజస్థాన్‌లో ఢోల్‌పూర్‌ అనే చోట్ల పెళ్లికూతుళ్లను అమ్మానాన్నాయే అమ్మేవారు. ఎవడు డబ్బిస్తే వాడు వాళ్లను కొనుక్కుపోవచ్చు. ఈ దురాచారం గురించి ఎన్ని కథనాలు రాసినా ప్రభుత్వం, ప్రజలు చలించలేదు. అబ్బే, అలాటిది ఏమీ లేదు పొమ్మన్నారు. అప్పుడు అశ్విన్‌ శరీన్‌ అనే ‘‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’’ జర్నలిస్టు ఒక సాహసం చేశాడు. రూ.20 వేలు పెట్టి కమల అనే ఒక అమ్మాయిని కొనేసి, నగరానికి తీసుకుని వచ్చి ప్రెస్‌ మీట్‌ పెట్టి అందరికీ చెప్పాడు. ఇక ప్రభుత్వం దాన్ని కాదనలేక పోయింది. అంతా ఆ జర్నలిస్టు కొత్తతరహా ఐడియాకు జేజేలు పలికారు. అయితే విజయ్‌ టెండుల్కర్ అనే మరాఠీ రచయిత, నాటకకర్తకు ఆ సంఘటన ఆ జర్నలిస్టు జీవితాన్ని ఎలా మార్చి ఉంటుంది అనే ఊహ పోయి, దాన్ని 1981లో ‘‘కమల’’ అనే నాటకంగా మలిచారు.

జర్నలిస్టు అలా కొన్న అమ్మాయిని యింటికి తీసుకెళ్లాడు. అతను అప్పటికే వివాహితుడు. ఈ కమల వెళ్లి ఆమెను ‘‘నిన్ను ఎంతకు కొన్నాడు?’’ అని అడుగుతుంది. భర్త తన పబ్లిసిటీకి కమలను ఎలా ఉపయోగించుకుంటున్నాడో గమనిస్తుంది భార్య. కమల జీవితంతో తన జీవితాన్ని పోల్చుకుని చూసుకుని తనూ ఒక రకమైన బాధితురాలినే అనుకుంటుంది. భర్తపై తిరగబడుతుంది. ఇలా సాగుతుంది కథ. నాటకం మరాఠీ, హిందీల్లో  ప్రజాదరణ పొందింది. దాన్ని 1984లో హిందీలో ‘‘కమలా’’ పేరుతో సినిమాగా తీశారు. షబానా అజ్మీ, దీప్తి నావల్‌, మార్క్‌ జుబర్‌ వేశారు. ఒక సంఘటనతో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు జీవితం ఎలా మారిపోయిందో ఆ నాటకం, సినిమా చూపించాయి. 

మనం యిప్పుడు ప్రస్తావించే ఉమామహేశ్వరరావు (సౌలభ్యం కోసం ఉమా అందాం) ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు కారు. పబ్లిసిటీ కోరుకోలేదు. మానవతా దృక్పథంతో చేసిన ఒక పని ఎలా మెడకు చుట్టుకుందో దానిలో రాశారు. హైదరాబాదులో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంకు సంపాదకుడిగా పనిచేసే రోజుల్లో 1996 సెప్టెంబరులో ఆంధ్రజ్యోతి తిరుపతి యిన్‌చార్జి నుంచి ఒక రిక్వెస్టు వచ్చింది. ‘‘గీత అనే ఒకామె చిత్తూరు నుంచి తన గోడు చెప్పుకుంటూ ముఖ్యమంత్రి పేర ఉత్తరాలు రాసి, ఆయనకు ఎలా పంపాలో తెలియక మన ఆఫీసుకి పంపుతోంది. నేను మీకు పంపుతాను. మీరు సిఎం ఆఫీసుకి పంపండి పాపం.’’ అని. గీత ఉత్తరం చదివితే తెలిసిందేమిటంటే ఆమె అత్తింట్లో చాలా బాధలు పడుతోంది. తన్నులు, తిట్లు వగైరా. భర్త బెంగుళూరులో సినిమా తీస్తున్నాడు, ఆమె చెల్లెలితో సంబంధం పెట్టుకున్నాడు. పట్టించుకోడు. బాధలు భరించలేక కిరోసిన్‌ పోసుకుని తగలబెట్టుకుంది. గడ్డం కింద నుంచి శరీరమంతా కాలిన గాయాలు, గుండె, శ్వాసకోశాలు, గర్భకోశం అన్నీ బిగుసుకుపోయాయి. ఒంట్లో అన్ని భాగాల్లో రకరకాల నొప్పులు. కొడుకున్నాడు. వైద్యసహాయం చేయించండి చాలు అని ఆమె సిఎంను కోరుతోంది.

సిఎం ఆఫీసుకి పంపి చేతులు దులుపుకుంటే ఆమె దుస్థితి సిఎం దృష్టికి రాదని ఉమాకు తెలుసు. అందువలన తెగించి తను ఎడిట్‌ చేస్తున్న ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం 1996 నవంబరు 17 సంచికలో ఆమె కథను కవర్‌స్టోరీగా వేసేశాడు. అది వెంటనే సిఎం దృష్టికి వచ్చింది. ఆమెకు ఉచిత వైద్య సహాయం, జీవనానికి ఆర్థిక సహాయం, బిడ్డ చదువుకు భరోసా యిస్తూ సిఎం ఆఫీసు ఆ సాయంత్రమే ఒక ప్రకటన విడుదల చేసింది. అమ్మయ్య మన వలన ఒక మనిషి జీవితం బాగుపడిందని ఆనందించాడు ఉమా. కానీ ఆ తర్వాత అసలు కథ- అచ్చులో రాని కథ - ప్రారంభమౌతోందని తెలియదు పాపం. కుటుంబ విషయాలు రచ్చకెక్కాయని తెలియగానే అత్తమామలు, భర్త ఏం చేస్తారో అని భయపడిన గీత యిల్లు వదిలేసి బయటకు వచ్చేసింది. చేతిలో పైసా లేదు. చిత్తూరు బస్సు డిపోకి వెళ్లి ఆంధ్రజ్యోతి పేపరు చూపించి ముఖ్యమంత్రి గార్ని కలవాలి అంది. అది చదివి డిపో మేనేజర్‌ ఫ్రీ పాస్‌ రాసిచ్చి హైదరాబాదు బస్సెక్కించారు.

హైదరాబాదులో ఎటు వెళ్లాలో తెలియలేదు. అందరికీ ఆంధ్రజ్యోతి పేపరు చూపించడంతో ఒకరు ఆంధ్రజ్యోతి ఆఫీసు దగ్గర దింపేసి వెళ్లిపోయారు. ఆవిడ వచ్చి తన ఎదుట నిలబడడంతో ఉమాకు ఏం చేయాలో పాలుపోలేదు. నేను యింటికి వెళ్లను, చంపేస్తారు అంటోంది. అక్కడ పోలీసు రక్షణ కల్పించాంటే ముఖ్యమంత్రిని కలిసి చెప్పాలి. ఎడిటరుగారితో చెపితే ఆయన ‘ఎపాయింట్‌మెంట్‌ కోసం రేపు ప్రయత్నిద్దాం’ అన్నారు. అప్పటిదాకా యీవిణ్ని ఎక్కడ వుంచాలి. ఉమా బ్రహ్మచారి. మోతీ నగర్‌లో ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. అందుకని తన వద్దకు రాగానే ఆఫీసుకి దగ్గర్లో ఉన్న ఫ్రెండ్స్‌ యింటికి తీసుకెళ్లి దింపి, అక్కడ ఉంచుకోమన్నారు. ఒళ్లంతా కాలి వున్న ఆమెను చూడగానే అందరూ ఎవరీమె? అని అడగడంతో ఫ్రెండ్స్‌ యిబ్బంది పడ్డారు. దాంతో తన ఫిమేల్‌ కొలీగ్‌కి అప్పగించి ఆమెతో బాటు వర్కింగ్‌ విమెన్‌ హాస్టల్‌కు పంపాడు. అక్కడా అందరూ యిలాటి ప్రశ్నలే వేసి, యిలాటి ఆమె పక్కన పడుక్కుంటే నిద్ర పట్టదని చెప్పారు.

ఇక ఉమా మహిళా సంఘాల వారందరికీ ఫోన్‌ చేసి అడిగితే, ఎవరూ తమకు హాస్టల్‌ సౌకర్యం లేదని చెప్పారు తప్ప, ‘దానికేముంది, మా యింట్లో పెట్టుకుంటాం’ అని అనలేదు. చివరకు యిరుగుపొరుగు ఏమనుకుంటే అదే అనుకుంటారని ధైర్యం చేసి ఆ రాత్రి తన ఫ్లాట్‌కి బాగా పొద్దుపోయాక తీసుకెళ్లి తెల్లవారకుండా లేపేసి, సిఎం యింటి దగ్గర దింపేసి ‘ఏం కావాలో అది చెప్పుకోండి, అక్కణ్నుంచి చిత్తూరు వెళ్లిపోండి’ అని చెప్పేసి, బస్సు టిక్కెట్టుకి డబ్బులిచ్చి యింటికి వచ్చేశాడు. హమ్మయ్య అని కాస్సేపు రెస్టు తీసుకుని ప్రశాంతంగా ఆఫీసుకి వెళితే యీమె అక్కడ ప్రత్యక్షం. సిఎంగారు దయతో మాట్లాడారు. తన పేషీలోని కార్యదర్శికి ఆమె వివరాలు అప్పగించారు. సెక్రటేరియట్‌కు వెళ్లి కలవమన్నారు. ఈవిడ అటు వెళ్లకుండా యిక్కడకు వచ్చి కూర్చుంది. ఉమా తన ఫిమేల్‌ కొలీగ్‌ నిచ్చి సెక్రటేరియట్‌కు తోడు పంపాడు. సెక్రటేరియట్‌ నుంచి సిఎం కార్యదర్శి చిత్తూరు కలక్టరుతో మాట్లాడి, కుటుంబసభ్యులను హెచ్చరించమని చెప్పి, కర్నూలు ఆసుపత్రిలో వైద్యసహాయం కోసం సిఫారసు చేస్తూ ఉత్తరం యిచ్చారు.

కథ యిక్కడికి ముగిసినట్లే కదా! ఆమె కోరినవన్నీ దక్కాయి కదా. కానీ ఆమె చిత్తూరు పోను, మా వాళ్లు ఏం చేస్తారో అని కూర్చుంది. ఉమా ఆమెను బతిమాలి, బామాలి చిత్తూరు బస్సు ఎక్కించాడు. రెండు రోజు తర్వాత కర్నూలు నుంచి గీత ఫోను. ‘నేను చిత్తూరు పోలేదు. ఆపరేషన్‌ చేయించుకోవాలని కర్నూలు ఆసుపత్రిలో చేరాను. ఇక్కడ ఎవరూ పట్టించుకోవటం లేదు. వీళ్ల గురించి సిఎంకు చెప్పండి.’ అని ఫిర్యాదు. ఉమా కర్నూలులోని తన స్నేహితులకు చెప్పి వెళ్లి కాస్త చూసి రమ్మన్నాడు. వాళ్లు ఆపరేషన్‌ అయిన 2, 3 రోజులు ఆమెను చూసుకున్నారు. ఇంటి నుంచి భోజనం పట్టుకెళ్లారు. అయితే ఆమె ఆ తిండికి వంకలు పెట్టడంతో, వాళ్లని ప్రతీదానికీ దబాయించడంతో విసుగెత్తి, మా వల్ల కాదని చెప్పేశారు. ఆమె చిత్తూరు వెళ్లింది. పోలీసు వాళ్ల హెచ్చరిక వలన యింట్లో ఏ బాధా లేదు.

మూడు నెలలు గడిచాయి. ‘నాకు రెండో ఆపరేషన్‌ జరగాలి. కర్నూలులో బాగా లేదు. హైదరాబాదులో నిమ్స్‌లో చేయించుకుంటాను. ముఖ్యమంత్రి కార్యదర్శితో మాట్లాడండి’ అని ఉత్తరం. ఉమా ఆ ఏర్పాటు కూడా చేశాడు. ఎవరినైనా తోడు తెచ్చుకుని నిమ్స్‌లో చేరతానని ఫోన్‌ చేసింది. సరేలే అనుకుంటే ఓ రోజు నిమ్స్‌ నుంచి ఓ నర్స్‌ ఫోన్‌ చేసి ఉమాను చెడామడా తిట్టింది- ‘ఆడ మనిషిని ఆస్పత్రిలో చేర్పించి మీ పాటికి మీరు పోతారా, ఇప్పుడే ఆపరేషన్‌ అయింది. మీకు ఫోన్‌ చేయమని నెంబర్‌ రాసిచ్చింది.. వెంటనే రండి’ అని. తప్పదురా అనుకుని వెళ్లాడు. అక్కడ ఆమె తోడు తెచ్చుకున్న మనిషెవరూ లేరు. నర్సుకి ఉన్న విషయం అంతా చెపితే ‘నెంబరిస్తే మీరు బంధువనుకున్నా, సారీ’ అంది. ఎటెండెంటుగా ఎవరైనా ఆడమనిషి ఉండాలి. మందులకీ వాటికీ డబ్బు కావాలి అంది. మందు కొనిచ్చి 200 రూ.లు చేతిలో పెట్టి ఆ ఏర్పాట్లు మీరే చూడండి అన్నాడితను. ఓ రెండు రోజులు సాయంగా ఉండమని ఒక మిత్రురాలిని కోరాడు.

మూడో రోజుకి పేషంటు కోలుకుంది. గవర్నమెంటు నుంచి కాగితాలు రాలేదు, ఇక్కడ అర్జంటుగా 1200 రూ.లు కట్టమంటున్నారు అంది. ఉమాయే అక్కడా యిక్కడా అప్పు చేసి ఆ డబ్బు కట్టాడు. ఆ తర్వాత రెండేళ్ల పాటు ఆమె ఫోన్‌ ద్వారానో, ఉత్తరాల ద్వారానో ఫిర్యాదు చేస్తూనే ఉండేది. ప్రభుత్వం హామీ యిచ్చిన సాయం అందలేదనో, సరిపోలేదనో, ఉపాధి కావానో, సాయం కావానో.. ఏదో ఒకటి. ఎక్కడా దీనత్వం, పాతవాటికి కృతజ్ఞత కనబడదు. దబాయించి చేయించుకునేది. దబాయిస్తే మాత్రం యితనెందుకు లొంగాలి అనే ప్రశ్న మనకు కలుగుతుంది. ఈ ఉమా నాకు వ్యక్తిగతంగా తెలుసు. 1997-98లలో ఆంధ్రజ్యోతి ఆదివారంలో నా చేత చాలా కవర్‌స్టోరీలు రాయించాడు. మనిషి స్వతహాగా సౌమ్యుడు. మంచివాడు. చేయి తిరిగిన కథకుడు. పైన చెప్పిన ఉదంతాన్ని ఆ పుస్తకంలో మంచి రసవత్తరంగా వర్ణించాడు. తన ప్రవర్తనను తాను విశ్లేషించుకుంటూ చివర్లో చక్కని వాక్యాలు రాశాడు.

‘నాకేమిటి బంధం? ఎందుకు చెయ్యాలి? అని ఉక్రోషం కలిగేది. ముఖ్యమంత్రికి రాసుకున్న విన్నపాన్ని చదివి చలించి పత్రికలో ప్రచురించినందుకు నాకేం బాధ్యత? నాకేం బంధం? అవును, చదివిన ఆ కాయితాలు, కథనానికి ముందుమాటగా రాసిన నాలుగు వాక్యాలు, అచ్చేసిన ఆ అక్షరాలు నన్ను బందీని చేశాయి. అక్షరమంటే అచ్చేసి లోకం మీదకి వదలడమే కాదు, ఒక్కోసారి అది వెంటబడుతుంది, వెంటాడుతుంది. సామాజిక బాధ్యతకు బందీని చేస్తుంది, బద్ధుణ్ని చేస్తుంది.’

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2020)
mbsprasad@gmail.com

Show comments