ఇంగ్లిష్ మీడియంపై మరో ముందడుగు

మా పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు పంపిస్తాం.. పేద వాళ్లకి మాత్రం సర్కారు తెలుగు మీడియం బడులనే నడపాలి.. అని డిమాండ్ చేస్తూ, బడుగు బలహీనవర్గాల చేత తిట్లు తింటున్నవారికి చివరాఖరి ట్రీట్ మెంట్ ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టులో మీడియంపై కేసు కూడా నడుస్తున్న నేపథ్యంలో అత్యంత పగడ్బందీగా ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశ పెట్టడానికి విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 21నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించేందుకు సిద్ధమవుతోంది. 

తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ మీడియంలో చదువుకోవాలని కోరుకుంటున్నారు, వచ్చే ఏడాది వారిని ఏ మీడియంలో వేస్తారు అనే విషయాలని స్పష్టంగా పేర్కొంటూ, వారి సంతకంతో కూడిన దరఖాస్తుని స్కూల్ లో సమర్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్కూల్ కమిటీలన్నీ ఇంగ్లిష్ మీడియం మాత్రమే కావాలంటూ ఏకాభిప్రాయానికి వచ్చి నివేదికలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా.. క్షేత్ర స్థాయిలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రిపోర్ట్ తీసుకోబోతున్నారు. 

ఈనెల 23తో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అంటే ప్రజాభిప్రాయం ప్రకారమే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం పెట్టబోతున్నామని రేపు కోర్టుకు కూడా తెలిపే అవకాశం ఉంది. దీంతో ఇక తెలుగు మీడియం పేరుతో గోల చేసేవారి నోరు మూతపడబోతుందన్నమాట. 

వాస్తవానికి ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలను పంపే ఏ తల్లిదండ్రులూ తెలుగు మీడియం కావాలని కోరుకోవడం లేదు, ఓ మేథావి వర్గం మాత్రమే ఇంగ్లిష్ మీడియం వద్దంటోంది. అయితే ఈ మేథావి వర్గానికి ఇక్కడ అభిప్రాయాలు తెలిపే హక్కు లేదు, ఎందుకంటే వీరి పిల్లలు తెలుగు మీడియం చదవడంలేదు కాబట్టి. సో.. తెలుగు మీడియంలో పిల్లల్ని చదివించే తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం వచ్చే ఏడాది అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నారనమాట. 

అదే సమయంలో తెలుగు సబ్జెక్ట్ ని కూడా మరింత పటిష్టం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ విజయవంతం అయితే ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించేవారెవరూ ఉండరు. తల్లిదండ్రుల సంతకంతో కూడిన దరఖాస్తులన్నీ విద్యాశాఖ వద్ద ఉంటాయి కాబట్టి.. ఇక హైకోర్టు కూడా ఈ విషయంలో వేలు పెట్టదు. 

Show comments